అమ్మాయిల ప్రేమ: టీవీ షో తీరుపై ఆగ్రహం!
- నటి గీతపై మండిపడుతున్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ
ఒక ప్రైవేటు తెలుగు చానెల్‌లో ప్రసారమయ్యే టీవీషోలో ఇద్దరు అమ్మాయిల జంటపై ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రముఖ నటి గీత తీరుపై విమర్శలు వస్తున్నాయి. నటి గీత తీరును స్వలింగసంపర్కులకు చెందిన ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ తీవ్రంగా తప్పుబడుతున్నది.
గత నెల 31న ప్రసారమైన 'బతుకు జట్కాబండి' షోలో 20 ఏళ్ల అమ్మాయి, 23 ఏళ్ల లింగమార్పిడి చేసుకున్న అమ్మాయి (ట్రాన్స్ మ్యాన్) జంట వచ్చింది. అయితే, విడిపోయిన దంపతులను, జంటలను న్యాయ పరిష్కార విధానాలు, కౌన్సెలింగ్ ద్వారా ఏకం చేసే సామాజిక కార్యక్రమంగా పేరొందిన ఈ షోలో ఈ జంటపై వ్యాఖ్యాత అయిన గీత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం ఏమిటని తప్పుబట్టింది. 'ఆమె నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు.. నువ్వు ఎలా అంగీకరించావు' అని గీత లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రశ్నించింది. అమ్మాయిలు-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిలు పెళ్లిచేసుకోవడం గురించి తనకు తెలుసునని, కానీ, ఇది వాస్తవంలో ఆచరణ సాధ్యమేనా? అని గీత వారిని ప్రశ్నించింది.
ఇలాంటి అనుబంధాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని, వీటిని భారతదేశంలో పాటించకూడదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి తన లైంగిక అభిరుచులు భిన్నంగా ఉండేవని ట్రాన్స్ మ్యాన్ చెప్పినా.. నువ్వెందుకు పురుషుల హెయిర్‌స్టైల్, దుస్తులను అనుసరిస్తున్నావని ప్రశ్నించింది. మీ ఇద్దరు కలిసి ఇలా సినిమాలకు, పార్కులకు వెళ్లడం జుగుప్సకరం. మగవాడిలా డ్రెస్ వేసుకున్నంతమాత్రాన సరిపోదు అని వ్యాఖ్యలు చేసింది. ‘ఒక అమ్మాయితో కలిసి తిరుగడానికి నీకు సిగ్గులేదా? ఇలా చేస్తే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ గీత బెదిరింపులకు దిగిందని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమది భిన్నమైన సమూహమని, తమ గురించి తెలుసుకోకుండా ఈ విధంగా బెదిరింపులకు దిగడం సరికాదని, దీనిపై సదరు చానెల్, షో నిర్వాహకులు వివరణ ఇవ్వాలని తెలుగురాష్ట్రాల్లోని ఎల్జీబీటీ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్నది.