Zee Telugu
-
ఓటీటీకి 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు భయ్యా!
అయితే సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం కోసం ఓటీటీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై దాదాపుగా నెల రోజులు కావొస్తోంది. దీంతో సినీ ప్రియులంతా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఆడియన్స్‌కు బిగ్ ట్విస్టే ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అదేంటో చూసేయండిట్విస్ట్ ఇచ్చిన మేకర్స్..అయితే ఓటీటీ రిలీజ్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటి వరకైతే ఎలాంటి ప్రకటన రాలేదు. ఫిబ్రవరి రెండో వారంలోనైనా ఓటీటీకి వస్తుందేమోనని సినీ ప్రేక్షకులు భావించారు. కానీ స్ట్రీమింగ్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో కాస్తా నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఆడియన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్..త్వరలోనే సంక్రాంతి వస్తున్నాం మీ ముందుకు వస్తుందని జీ తెలుగు ట్విటర్ ద్వారా వెల్లడించింది. మళ్లీ సంక్రాంతికి వైబ్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఫస్ట్ టీవీలో వస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఓటీటీ కంటే ముందుగా టీవీలోనే వెంకీమామ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ప్రేక్షకులు చూసే అవకాశం దక్కింది. అయితే ఓటీటీ విడుదలపై మాత్రం ఎలాంటి తేదీని రివీల్ చేయలేదు. ఈ లెక్కను చూస్తే ఈ వారంలోనే టీవీల్లో సంక్రాంతికి వస్తున్నాం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025 -
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
సరికొత్త బాణీలే.. భవిష్యత్తుకు బాటలు!
సాక్షి, సిటీబ్యూరో: సంగీత పరిశ్రమలో సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ షో సరిగమప 16వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు.ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని, ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్ఛమైన, సహజమైన సంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందని అన్నారు. ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు ఎంపిక చేసిన మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా తీర్చిదిద్దేలా సానబెడతామని తెలిపారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఆయన చెప్పారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: అతడేమి పాపం చేశాడు.. ఒక్క కారణం చెప్పండి? సెలక్టర్లపై ఫైర్ -
సరిగమప 16వ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్
సంగీత పరిశ్రమలో ముద్రపడిపోయిన ట్రెండ్లను అనుకరించడం కన్నా సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్లను సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పోందిన ప్రముఖ షో సరిగమప 16 వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటీ మాట్లాడుతూ., దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని., ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్చమైన, సహజమైన నంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందన్నారు.ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహారించనున్నారు. మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా వెలుగొందేలా సానబెడతామన్నారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని శ్యామ్ అన్నారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుధీప్ తదితరులు పాల్గొన్నారు. -
జీ తెలుగు ‘స రే గ మ ప - సీజన్ 16’ .. త్వరలో
తెలుగు నాట సంగీతానికి సంబంధించిన రియాల్టీ షోలు బుల్లితెరపై బహుళ ఆదరణ సంపాదించాయి. అలాంటి వాటిల్లో ఒకటి జీ తెలుగు సమర్పించిన సరిగమప. ఈ కార్యక్రమం ద్వారా గత 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇపుడిక ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ త్వరలో రాబోతోంది. ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహంచింది. కొత్త గాయకులను పరిచయం చేసే ఈ పోటీలో 15-30 సంవత్సరాల వయస్సుగల , గాయనీ గాయకులు పాల్గొనేందుకు అర్హులు. విజేతగా నిలిచిన గాయని లేదా గాయకుడు ‘సరిగమప సీజన్ 16–ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ గెల్చుకుంటారు. -
తెలుగు షోలో సన్నీ లియోన్.. ఇదెక్కడి ట్విస్టురా మావ!
బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు టాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఆమె తొలిసారిగా తెలుగు బుల్లితెరపై కనిపించబోతోంది. ఆమె జీ తెలుగు కోసం 'తెలుగు మీడియం స్కూల్' అనే కొత్త రియాల్టీ షోకి గెస్టుగా వచ్చింది. దీంతో ఈ షో పై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోను ఛానెల్ విడుదల చేసింది. జీ తెలుగు మునుపెన్నడూ చూడని రియాల్టీ షోగా 'తెలుగు మీడియం స్కూల్'ని పరిచయం చేసింది. ఈ ప్రోమోలో సన్నీ లియోన్‌తో పాటు ప్రముఖ గాయకుడు మనో, యాంకర్ రవి కూడా ఉన్నారు. (ఇదీ చదవండి: దు:ఖంలోనూ చిన్న కూతురితో ప్రమోషన్లకు వచ్చిన విజయ్ ఆంటోనీ) ఇందులో టీవీ, టాలీవుడ్ హాస్యనటులు కూడా ఉన్నారు. ఈ ప్రోమో విడుదల అయిన వెంటనే సూపర్, అద్భుతం అంటూ సన్నీ లియోన్‌పై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో కనకాల సుమ,రష్మి,అనసూయ,శ్రీముఖి వంటి వారు యాంకరింగ్‌లో తనదైన ముద్ర వేశారు. మరీ గెస్టుగా వచ్చిన ఈ బ్యూటీ వీరిలో ఎవరినైనా మెప్పించేలా యాంకరింగ్ చేస్తుందా అనేది చూడాలి? ఈ షో కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా నిర్వహకాలు వెల్లడించలేదు. ఈ ప్రోమోలో సన్నీ తెలుగులో మాట్లాడుతూ తనకు ప్రాణం పోసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ మాట్లాడింది. అలాగే, ప్రోమో చాక్బోర్డ్పై షో టైటిల్ కనిపించడంతో ముగుస్తుంది, ఆ తర్వాత చీరలో సన్నీ లియోన్ ఉల్లాసమైన చిరునవ్వుతో ఉంటుంది. సన్నీలియోన్ 11 ఏళ్ల కిందటే 'జిస్మ్ 2'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, ఆమె 'కరెంట్ తేగ, గరుడ వేగ,జిన్నా' వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించింది. -
ప్రపోజల్స్‌పై ‘జీ సరిగమప’ విన్నర్ శ్రుతిక ఆసక్తిర వ్యాఖ్యలు
జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్ షో తన గాత్రంతో ఎంతోమందిని ఆకట్టుకుని విజేతగా నిలిచింది శ్రుతిక సముద్రాల. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు జీ సరిగమప షో విజేతగా నిలిచిన శ్రుతిక ఇటీవల సాక్షితో ముచ్చటిందచింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తను చిన్నప్పటి నుంచి దివంగత లెజెండరి గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగర్స్ చిత్ర, సుశీల గారిని ఫాలో అయ్యానని, అయితే తన ఫేవరేట్ సింగర్స్ మాత్రం చిత్రమ్మ, శ్రేయా ఘోషల్ అని చెప్పంది. ఇక చిత్రగారు పాడిన పాటల్లో ముంబైలోని ‘కన్నాను లే కళయికలు ఏడాడు ఆగవులే..’ అంటూ అచ్చం చిత్రగారిలా పాడి వినిపించింది. అనంతరం ఇక తనకు వచ్చిన మెసేజ్‌లో ప్రపోజల్స్ కూడా వస్తుంటాయి కదా.. అలా మీకు ఏమైన వచ్చాయా? అని యాంకర్ అడగ్గా.. శ్రుతిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: ది ఘోస్ట్‌లో నాగార్జున వాడిన ‘తమ హగనే’ అర్థమేంటో తెలుసా? ‘‘ఏంటో కానీ నాకు ఎక్కువగా అక్క అక్క అక్క అనే వస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రపోజల్స్ రాలేదు. నేను చూసిన మెసేజ్‌లో అన్ని అక్క అనే ఉన్నాయి. ‘వీ సపోర్ట్ యూ అక్క’ అని మెసేజ్ పెడుతున్నారు. అవి చూసి నాకు షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే అందరు నన్న అంత పెద్దదాన్ని అనుకుంటున్నారా? ఏంటి.. అంత పెద్దదానిలా కనిపిస్తున్నానా? అని అనిపిస్తోంది’ అంటూ శ్రుతిక చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె తన గురించి పంచుకున్న మరిన్ని విశేషాలను ఇక్కడ చూడండి. -
'జీ సరిగమప' విన్నర్ శృతిక సముద్రాల ఆసక్తికర వ్యాఖ్యలు
Zee Saregamapa Winner Shruthika Samudrala Interesting Comments: శృతిక సముద్రాల.. 20 ఏళ్లకే 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్ టైటిల్ పొందింది. ఆరేళ్లకే సంగీతంలో అడుగు పెట్టిన శ్రుతిక సముద్రాల 'జీ సరిగమప- ది సింగింగ్ సూపర్ స్టార్స్' ఫినాలే కార్యక్రమంలో 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో అదరగొట్టింది. అంతేకాకుండా విన్నర్ కాకముందే పలు బహుమతులను కూడా గెలుచుకుంది. ఫినాలేకు 8 మంది ఫైనలిస్ట్‌లు చేరగా, అందులో అత్యత్భుదమైన ప్రదర్శన కనబరిచి టైటిల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే తను ఈ పోటీలో గెలవడానికి వాళ్ల అమ్మ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. శ్రుతిక వాళ్ల అమ్మ ఉద్యోగం వదిలేసి మరీ తనకు అండగా నిలిచిందని తెలిపింది. అలాగే తన అభిమానులు కవిత, పాట, ఆటో వంటి బహుమతులు ఇచ్చారని, తనకు లవ్ ప్రపోజల్స్ రావడం కంటే తనను అందరూ అక్క అని పిలుస్తున్నారని పేర్కొంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఈ కింది వీడియోను వీక్షించండి. చదవండి: 'జీ సరిగమప'లో శృతిక గెలుచుకున్న ఖరీదైన బహుమతులు ఇవే.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కట్టుకున్న ఈ చీర ధర ఎంతంటే? -
'జీ సరిగమప-ది సింగింగ్ సూపర్ స్టార్స్' విన్నర్‌గా శృతిక సముద్రాల
సుమారు 26 వారాలపాటు నాన్-స్టాప్ వినోదాన్ని పంచి, ఎంతోమంది అద్భుతమైన సింగర్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసి వారి అభిమానాన్ని చూరగొన్న 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' కార్యక్రమం ముగిసింది. ఫినాలేలో అదరగొట్టే ప్రదర్శనలతో హైదరాబాద్‌కి చెందిన శృతిక సముద్రాల (20) టైటిల్ విజేతగా నిలిచింది. అలాగే తనకు గట్టి పోటీ ఇచ్చి వెంకట సుధాన్షు రన్నరప్‌గా నిలిచాడు. ప్రెస్టీజియస్ 'జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్' ట్రోఫీతో పాటు, శృతిక రూ. లక్ష నగదు, మారుతి సుజుకి వాగన్-ఆర్ కారుని బహుమానంగా అందుకుంది. ఇక రన్నరప్‌గా నిలిచిన వెంకట సుధాన్షు రూ. 5 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. 'ఏమాయె నా కవిత', 'మెరిసేటి పువ్వా', 'సంకురాత్రి కోడి', 'కొంచెం నీరు', 'ఆనతినీయరా' వంటి పాటలతో ఫినాలే లో జడ్జెస్ ని మెప్పించి, టైటిల్ గెలుచుకున్న శృతిక, బీఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో డిగ్రీ పూర్తిచేసింది. 6 సంవత్సరాల వయస్సులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన శృతిక, కర్నాటిక్ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఈ సందర్భంగా, శృతిక మాట్లాడుతూ... "జీ సరిగమప - ది సింగింగ్ సూపర్ స్టార్స్ విన్నర్ గా నిలవడం ఒక డ్రీం-కం-ట్రూ మూమెంట్. ఇది నా లైఫ్ లోనే బెస్ట్ మూమెంట్, ఎప్పటికి మరిచిపోలేనిది. ఈ ట్రోఫీని నా కష్టానికి దక్కిన ప్రతిఫలంగా భావిస్తాను. నాతో పాటు, నా తోటి ఫైనలిస్ట్స్ కూడా అద్భుతంగా పాడారు. కాబట్టి వారికి కూడా సమానమైన గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. ఈ సరిగమప జర్నీలో వారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. అదేవిధంగా, ఈ జర్నీలో నాకు సహకరించిన జీ సరిగమప టీం, ముఖ్యంగా మెంటర్స్, జడ్జెస్, వాయిస్ ట్రైనర్లకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే, నేను సింగర్ గా ఎదగడానికి ఎంతో సపోర్ట్ చేస్తూ వస్తున్న మా నాన్న శశికాంత్, అమ్మ రూప, అక్క శరణ్యకి, అలాగే సంగీతంలో ఓనమాలు నేర్పిన నా గురువులు శ్రీ రామాచారి కొమండూరి గారికి, శ్రీ నిహాల్ కొండూరి గారికి, వసుమతి మాధవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపింది. ఆగష్టు 14 న ప్రసారమైన ఫినాలే ఎపిసోడ్లో లెజెండరీ సింగర్ పి. సుశీల, శృతి హాసన్, నితిన్, కృతి శెట్టి సమక్షంలో 8 మంది ఫైనలిస్ట్స్ అద్భుతమైన ప్రదర్శనలతో మైమరిపించారు. ఈ ఫినాలే స్టేజ్ వేదికగా పి. సుశీల తాను సంగీత ప్రపంచానికి చేసిన సేవలను గుర్తిస్తూ నిర్వహించిన సన్మానం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవగా, 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' వేడుకల్లో భాగంగా మాజీ సైనికులకు చేసిన సన్మానం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. -
'సరిగమప' : శ్రీముఖి కోసం చరణ్.. డేనియల్‌పై పార్వతి సెటైర్లు
బుల్లితెరపై జీ తెలుగు ఛానెల్లో ప్రసారమవుతున్న 'సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్' ప్రారంభమైన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. టీఆర్పీ రేటింగ్‌లోనూ దుమ్మురేపుతున్న ఈ షో ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. సరిగమప గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం 8మంది సింగర్స్ ప్రణవ్, పార్వతి, అభినవ్, శృతిక, సుదాన్షు, డేనియల్, చరణ్, శివాణి టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. ఇక ఈ సందర్భంగా సరిగమప ది సింగింగ్ సూపర్ స్టార్ ఫైనలిస్టులతో సాక్షి టీవీ సరదాగా ముచ్చటించింది. షోకి సంబంధించిన విషయాలతో పాటు సరదా కబుర్లతో ఈ చిట్‌చాట్ సాగింది. ముఖ్యంగా డేనియల్‌పై పార్వతి వేసే పంచులు కడుపుబ్బా నవ్వు తెప్పిస్తున్నాయి. ఇక శ్రీముఖి కోసం చరణ్ ఓ లవ్లీ సాంగ్‌ను డెడికేట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ సింగర్స్ సరదా మూమెంట్స్ చూసేయండి. -
బుల్లితెరపై నటుడిగా అలరించబోతున్న సింగర్ మనో, ఏ సీరియల్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: అమ్మతనంలోని గొప్పతనాన్ని ఏ కళ కూడా పూర్తిగా ప్రతిబింభించలేదని ప్రముఖ సీరియల్ నటి హారిత తెలిపారు. నటిగా తనకు తల్లి, అత్త క్యారెక్టర్లే మంచి గుర్తింపునిచ్చాయని పేర్కొన్నది. జీ తెలుగు వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ ధారావాహిక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నటి హారిత మాట్లాడుతూ.. కలవారి కోడలు, ముద్దమందారంతో జీ తెలుగులో మంచి అభిమానం పొందిన రెండేళ్ల తర్వాత కళ్యాణం కమనీయంలో అమ్మగా మళ్లీ వస్తుండటం సంతోషంగా ఉందని, జీ తెలుగుకు తోబుట్టువులా మారానని తెలిపింది. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. మొదటిసారి ఒక సీరియల్లో సింగర్ మనో నటిస్తున్నారని అన్నారు. ఈ ధారావాహికలో ముఖ్యతారాగణంగా మేఘన లోకేశ్, రాక్‌స్టార్‌గా మధు విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారని అన్నారు. ఒక సినిమాకుండే విలువలతో ఈ సీరియల్ రూపొందించారని నటీ మేఘన తెలిపింది. గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న డ్రీమ్ రోల్ కళ్యాణం కమనీయంలో దొరికిందని మధు అన్నారు. -
ప్రతిభ ఉన్న బాల నటులకు చక్కని వేదిక: ఎస్వీకృష్ణారెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం టాలీవుడ్లో న్యూ టాలెంట్‌కు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, అలాగే మంచి ప్రతిభ కలిగిన నటులను పరిచయం చేసేందుకు చక్కని వేదికలు కూడా అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం (ఏప్రిల్ 11, 2021) నుంచి ప్రారంభం కానున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్ ది నెక్ట్స్ సూపర్‌స్టార్ 5వ ఎడిషన్‌కు ఆయన న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంటూ...గత కొన్ని ఎడిషన్ల ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైన బాల నటులు ప్రస్తుతం మంచి కెరీర్‌ను అందుకుంటూ నటనలో రాణిస్తున్నారని చెప్పారు. మరింత మంది ప్రతిభావంతుల అభినయాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో సహా తానూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. జడ్జిల ప్యానెల్లో రేణూ దేశాయ్, సునీత... ఇటీవలే తన పెళ్లి ద్వారా టాక్ ఆఫ్ ద మీడియా గా మారిన ప్రముఖ గాయని సునీత డ్రామా జూనియర్స్‌లో మరో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే సినీనటి, నిర్మాత రేణూదేశాయ్ సైతం జడ్జిల ప్యానెల్లో ఉన్నారు. ఈ కార్యోక్రమం ప్రతి ఆదివారం రాత్రి 8గంటల నుంచి ప్రసారం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభినయ కౌశల్యాన్ని ప్రదర్శించనున్నారు. ( చదవండి: కంగనాకి అక్షయ్ కుమార్ సీక్రెట్ కాల్! ) -
హోలీగా..జాలీగా..నితిన్ బర్త్‌డే వేడుక
ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు హోలీ పండుగ సంబరాలను వినూత్నంగా నిర్వహిస్తోంది. హ్యాపీ మూడ్‌లో ఉండే వీక్షకుల ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తోంది. దీనిలో భాగంగా రంగ్ దే ప్రేమ పేరుతో సాయంత్రం 6గంటలకు ప్రసారం చేసే హోలీ ఈవెంట్లో హీరో నితిన్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. అదే సమయంలో ఆయన తన పుట్టినరోజు వేడుకలు కాస్త ముందస్తుగా (మార్చి 30) నిర్వహిస్తుండడం విశేషం. అంతేకాకుండా హోలీ సందడికి ఊపునిస్తూ ‘తెల్లవారితే గురువారం’ సినిమా నటీ నటులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఇక జీ కుటుంబంలో హిట్ పెయిర్‌గా పేరొందిన జంటలు... అషికా–చందు, అనుష–ప్రతాప్, కల్కి–పూజ, సిద్ధార్ధ–మేఘన, ఆకర్ష్–భూమి...లు తమదైన నత్యాలతో అలరించనున్నారు. కుటుంబ విలువలను వాటి ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందిన కొత్త ఫిక్షన్ షో కూడా హోలీ రోజునే ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2.30గంటలకు మిఠాయి కొట్టు చిట్టమ్మ పేరుతో పిక్షన్ షో లాంచ్ అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయ పురంకు చెందిన చిట్టెమ్మ అనే మహిళ జీవిత కధ చుట్టూ ఈ షో తిరుగుతుంది. చదవండి : హీరోయిన్ కీర్తి వల్ల బతుకు బస్టాండ్ అయ్యింది : నితిన్ ‘రంగ్‌దే’ మూవీ రివ్యూ -
జీ సరిగమప ఫైనల్స్‌లో రానా దగ్గుబాటి,సిథ్ శ్రీరామ్
ప్రాంతీయ భాషల్లో ఔత్సాహిక గాయనీ గాయకులను యువ కళాకారులను వెలుగులోకి తెచ్చే జీ సరిగమప పాటల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 5గురు యువ గాయనీ గాయకులు ఈ పోటీల్లో టైటిల్ కోసం తలపడనున్నారు. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ పోటీలో తుది పోటీలకు మిగిలిన ఈ 5గురి ప్రతిభా పాటవాలకు జీ తెలుగులో 21న జరుగనున్న పోటీ అద్దం పట్టనుంది. సాయంత్రం 6గంటలకు పోటీ ప్రసారం కానుంది. గత కొన్ని వారాలుగా వీక్షకుల ఆదరణతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో తుది అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఔత్సాహిక గాయనీ గాయకులు భరత్ రాజ్, ప్రజ్ఞా నయిని, పవన్ కళ్యాణ్,వెంకట చైతన్య, యశస్వి కొండేపూడిలలో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలుగు వీక్షకుల ఆదరణ పొందిన ఈ కార్యక్రమం ఫైనల్స్ ని మరింత ఆకర్షణీయంగా అందించనున్నారు. కార్యక్రమం ఆసాంతం టాలీవుడ్ టాలెంట్‌తో కళకళలాడనుంది. ముఖ్యంగా తాజా యువ గాన సంచలనం సిద్ శ్రీరామ్ ప్రత్యేక ఆకర్షణగా హాజరుకానున్నారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, గాయని సునీత, గాయని కల్పన, గాయకులు బాబా సెహగల్, జోయా హుస్సేన్‌లు సైతం వీక్షకులను ఉర్రూతలూగించనున్నారు. గాయని గీతామాధురి, రమ్య బెహ్రా, కృష్ణ చైతన్య లు మెంటార్స్‌గా వ్యవహరిస్తున్న ఈ పోటీలో సంగీత దర్శకులు కోటి, ఎస్పీ శైలజ, చంద్రబోస్‌లు న్యాయ నిర్ణేతలు. -
వంటలక్కను ఢీ కొట్టనున్న కృష్ణ తులసి!
టాలీవుడ్ సినీ దిగ్గజం, అగ్రదర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. దాదాపుగా అందరు అగ్రహీరోలతోనూ బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన ఆయన గత కొంత కాలంగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో టాప్‌లో వెలిగిన దర్శకేంద్రుడు తాజాగా ఓ తెలుగు టీవీ సీరియల్‌కు దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్లో ప్రసారం కానున్న 'కృష్ణ తులసి' సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు. సీరియల్లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని, ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్ జీ తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ సీరియల్‌కు దండిగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాఘవేంద్రరావు బరిలో దిగారంటే వంటలక్క సీరియల్‌కు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే కృష్ణ తులసి సీరియల్ టీఆర్పీలో కార్తీక దీపాన్ని దాటేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా చేశారు -
ఓటీటీలో హిట్...టీవీలో ఎంట్రీ...
కరోనా అనంతర పరిస్థితులు ఇంటింటి వినోదాన్ని అమాంతం మార్చేసిన వైనం తెలిసిందే. థియేటర్లు మూత పడడంతో సినీ అభిమానులకు చిన్నితెరే ఏకైక వినోద సాధనంగా మారింది. ఈ పరిస్థితుల్లో పలు చిన్న చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై ప్రేక్షకుల సినిమా ఆకాంక్షల్ని కొంత మేరకు తీర్చాయి. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, జీ ఫైవ్ వంటి పలు ఓటీటీ వేదికలు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. ఈ నేపధ్యంలో ఓటీటీ వేదికలపై విజయం సాధించిన వాటిలో కొన్నింటిని మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తుండగా... మరికొన్ని చిన్నితెరలోనే మరో వినోద సాధనమైన టీవీ తెరపై ప్రత్యక్షమవుతుండడం విశేషం. ఈ విశేషానికి శ్రీకారం చుడుతోంది మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా జీ ఫైవ్ వేదికగా ఈ సినిమా ఇప్పటికే మంచి హిట్టయింది. ఇప్పుడీ సినిమాని జీ తెలుగు చానెల్లో ప్రసారం చేస్తున్నారు. ప్రేమికుల రోజైన వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఈ సినిమాని మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో అందిస్తున్నట్టు చానెల్ ప్రతినిధులు తెలిపారు. చదవండి : (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి) (హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్) -
జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం
దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న షణ్ముఖ ప్రియ కొంతకాలం పాటు టీవీషోలకు దూరంగా ఉంది. ఇప్పుడు వర్ధమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12 లో గోల్డెన్మైక్ సాధించి థియేటర్ రౌండ్‌కు చేరుకుంది. అంతర్జాతీయ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆమెను ‘జాజ్ స్టార్ ఆఫ్ ఇండియా’ అని ప్రశంసించారంటే ఆమె గాత్ర మాధుర్యాన్ని. అందులోని విలక్షణతను అర్థం చేసుకోవచ్చు. నవంబర్ 28వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ప్రసారం అవుతున్న 12వ సీజన్ లో ఇప్పటికే సోనీ టీవీ తన ప్రచార మాధ్యమాల ద్వారా ఈమె పాడిన పాటను ప్రోమోగా విడుదల చేసింది. ఈ వీడియోకు లక్షలాది మంది ప్రేక్షకాదరణ లభించింది. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పుట్టి, శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పెరిగి, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న పాటల ప్రియ జాతీయ స్థాయిలో తన గాత్ర మాధుర్యాన్ని అందరికీ రుచి చూపిస్తున్న షణ్ముఖ ప్రియను 12వ సీజన్ ఆడిషన్లో భాగంగా కలిసిన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్12లో పాడతానని ఊహించారా ? షణ్ముఖప్రియ : చిన్నప్పటి నుంచి ఇండియన్ ఐడల్ షోలో పాల్గొనాలని కోరిక ఉండేది. అనుకున్నట్టుగానే ఎంపికయ్యాను. ఈ సీజన్ 12 సెలక్షన్లకు ఆన్లైన్ ద్వారా కొన్ని వేల మంది హాజరయ్యారు.వారిలో 350మంది ఎంపిక చేసి పరిక్షించగా టాప్ 14లో నేను చోటు సంపాదించాను. సాక్షి: ఇండియన్ ఐడల్ సీజన్లో గెలుపొందగలరని విశ్వాసం ఉందా? తప్పనిసరిగా... నాకు ఆ నమ్మకం ఉంది. న్యాయ నిర్ణేతల మెప్పు పొంది ముందుకెళ్తాను. ఇండియన్ ఐడల్‌లో ప్రముఖ గాయకుడు కిశోర్ కుమార్ ఆలపించిన జోమ్రు యూడిలింగ్ పాటను ఆలపించాను. అంతేకాకుండా మధ్యలో ఒక ఆడిషన్‌ను జంప్ చేసి థియేటర్ ఆడిషన్‌కు నేరుగా నన్ను పంపించారు. సాక్షి: మీకు స్ఫూర్తి ఎవరు? తల్లిదండ్రులే నాకు స్పూర్తి. మా తల్లిదండ్రులు శాస్త్రీయ సంగీతంలో ఎం.ఎ. పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు. బాలసుబ్రహ్మణ్యంతో, జానకితో... సాక్షి: మీ విజయం వెనక మీ తలిదండ్రుల కృషి ఏమైనా? మూడేళ్ల వయస్సులో నా ఆసక్తిని గుర్తించారు. అప్పటినుంచి నాకోసం మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. వారి వద్దనే సంగీతం నేర్చుకున్నాను. ఎన్నో వ్యయప్రయాసలు భరించి మరీ నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. సాక్షి: గాయనిగా సాధించిన విజయాలు..? కర్ణాటక, కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన ‘సూపర్‌స్టార్ సింగర్’ పోటీలో టైటిల్ పొందాను. జీ తెలుగు సరిగమ లిటిల్ ఛాంప్స్ 2008 విజేతగా నిలిచాను. మా టీవీ సూపర్ సింగర్ 2009లో ఫైనల్‌కు చేరుకున్నాను. స్టార్ విజయ్ తమిళ జూనియర్ సూపర్ స్టార్స్ 2010పోటీల్లో విన్నర్‌గా నిలిచాను. 2013లో ఈటీవీ పాడుతా తీయగా పోటీలో ఫైనల్‌కు వచ్చాను. 2015లో మాటీవీ సూపర్ సింగర్ పోటీల్లో విజేతగా నిలబడ్డాను. జీ టీవీ హిందీ సరిగమప లిటిల్ ఛాంప్స్ 2017లో రన్నర్‌గా నిలిచాను. తమిళ సూపర్ సింగర్ జూనియర్ 3, స్టార్ ఆఫ్ ఏపీ, సరిగమప నువ్వానేనా పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాను. సాక్షి: మీకు గుర్తింపు ఇచ్చిన పాటలేంటి? తమిళంలో ఇంజీఖరుపడగా... (సన్న జాజీ..), ఇందమిసీమినిక్ (ఈ ఎర్ర గులాబీ), కాదళ్ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో ‘గోపమ్మ చేతిలో గోరుముద్ద...’ ‘నిదురపోరా తమ్ముడు...’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’ తదితర పాటలతో పాటు గులాం అలీ గజల్స్ ఉన్నాయి. ‘చాంగురే బంగారు రాజా...’ వంటి జానపద గీతాలు కూడా అప్పట్లో నాకు మంచి పేరు తెచ్చాయి. తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌కుమార్‌తో షణ్ముఖప్రియ సాక్షి: ప్రముఖుల ప్రశంసలు షణ్ముఖప్రియ: ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాను. నా పాటను మెచ్చి జాజ్ స్టార్‌గా ఎదుగుతావని మెచ్చుకున్నారు. మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు దర్శకరత్న దాసరి నారాయణరావుతో పాటు చాలా మంది ప్రముఖులు అభినందించారు. ప్రముఖ గాయకులు ఆశాబోస్లే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకీ, చిత్ర, మాల్గాడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్ తదితరులు ఆశీర్వదించారు.ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ముందు ‘పాడుతా తీయగా’లో ‘వీణ వేణువైన..’ పాటతో ప్రస్థానం ప్రారంభించాను. ఆయనెన్నో సలహాలు ఇచ్చారు. ఇప్పుడాయన ఉంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించేవారు. మరాఠీలో సోను నిగమ్‌తో కలిసి డ్యూయట్ పాడాను. సాక్షి: మీ లక్ష్యమేంటి? అటు చదువులోనూ, ఇటు గాయనిగానూ ఎదగాలనుకుంటున్నాను. నేపథ్యగాయని కావడడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం నా ముందున్న లక్ష్యం. సాక్షి: గాయనిగా వచ్చిన గుర్తింపు మీకు ఏవిధంగా తోడ్పడుతోంది? వర్థమాన గాయనిగా రాణిస్తూనే, మరోవైపు చదువులో మంచి మార్కులు సాధించుకుని లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగిపోతున్నాను. ఇంటర్ మొదటి సంవత్పరంలో 9.1, రెండో సంవత్సరంలో 9.7మార్కులు సాధించాను. బీఎస్సీ గణితం చదువుతూ ముందుకు సాగాలని ఆలోచిస్తున్నాను. నా ప్రతిభను గుర్తించిన శ్రీ చైతన్య యాజమాన్యం నాకు ఉచితంగా చదువు చెబుతోంది. ఈ వయసులో అంతకన్నా మించి నాకు ఏం కావాలంటారు? సాక్షి: ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంది? ఏ రియాలటీ షోలో పాల్గొన్నా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. నువ్వు బాగా పాడితే చాలు– మిగతాది మేము చూసుకుంటామంటూ వందల సంఖ్యలో సందేశాలు వస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి కూడా ప్రోత్సాహం లభిస్తోంది. అభినందనలు అందుతున్నాయి. అందరికీ సాక్షి వేదికగా నా ధన్యవాదాలు. – కందుల శివశంకర్, సాక్షి, శ్రీకాకుళం -
కోవిడ్ సేవల్లో ఏపీ నంబర్ వన్
మంగళగిరి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న పటిష్ట చర్యలతోనే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్‌లో ఉన్న ఏపీఐఐసీ కార్యాలయంలో జీ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ ఆధ్వర్యంలో పది అంబులెన్స్‌లు, నాలుగు వేల పీపీఈ కిట్లను మంగళవారం అందజేశారు. ఆర్కే రోజా అంబులెన్స్ నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సీఈవో మల్లికార్జున, అడిషనల్ సీఈవో రాజశేఖర్‌రెడ్డి, 108 రాష్ట్ర ఆపరేషన్స్ హెడ్ సురేష్ కాంబ్లి, జీ టీవీ ప్రతినిధులు అనురాధ గూడూరు, సాయిప్రకాష్, శ్రీధర్ ములగద, ఉమాకాంత్ ముదిగొండ, వెంకటరావు పాల్గొన్నారు. -
పునః ప్రారంభ సంబరం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చిత్రీకరిస్తున్నట్లు ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. గత కొంత కాలంగా నిలిచిపోయిన తమ కార్యక్రమాల ప్రసారం సోమవారం నుంచి పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ పునః ప్రారంభ సంబరంలో రేణూదేశాయ్, ప్రియదర్శి తదితర సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. -
సారథిలో ‘నంబర్ వన్ కోడలు’ షూటింగ్
సాక్షి, హైదరాబాద్: కరోనా మార్గదర్శకాలు, లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లు కొనసాగించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల తర్వాత హైదరాబాద్‌లో షూటింగ్‌ల హడావుడి మొదలైంది. ప్రభుత్వం సూచించిన కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ నటీనటులు, సిబ్బంది షూటింగ్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో సారథి స్టూడియోలో ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ షూటింగ్ ప్రారంభమైంది. షూటింగ్ ప్రారంభానికి ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్, మెడికల్ చెకప్‌లు చేశారు. కాగా షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన తొలి సీరియల్‌గా ‘నంబర్ వన్ కోడలు’ నిలవడం విశేషం. దీంతో సీరియల్ బృందం సంతోషం వ్యక్తం చేసింది. తొలుత భయంగానే షూటింగ్ ప్రారంభించామని అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటుండటంతో ఆ భయం పోయిందని నటీనటులు పేర్కొంటున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో ‘జీ తెలుగు’ ప్రేక్షకులను చాలా మిస్సయ్యానని బుల్లితెర హీరో ధనుష్ అన్నాడు. షూటింగ్ ప్రారంభమైందని ప్రేక్షకులను కనువిందు చేయడానికి త్వరలోనే బుల్లితెరపైకి వస్తామన్నాడు. త్వరలోనే ‘జీ తెలుగు’ ఛానల్లో రాత్రి 8 గంటలకు ‘నంబర్ వన్ కోడలు’ సీరియల్ ప్రసారం అవుతుందని ధనుష్ తెలిపాడు. -
కరోనాపై పోరాటానికి నేడు ’ఏక్ దేశ్ ఏక్ రాగ్’
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ ప్రైవేటు వినోద చానెల్ జీ తెలుగు కరోనాపై పోరాటంలో దేశవాసుల ఐక్య స్ఫూర్తిని ప్రేరేపించేలా ‘ఏక్ దేశ్ ఏక్ రాగ్’ పేరిట ఒక వినూత్న సంగీత కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. జీ సరిగమపలో భాగంగా 25 గంటల ఈ మ్యూజికల్ లైవ్–థాన్‌ను శనివారం నిర్వహించనున్నామన్నారు. కోవిడ్‌పై పోరులో ప్రజల్ని ఐక్యం చేసేందుకు సంగీతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నామన్నారు. ఇది పూర్తిగా డిజిటల్ కన్సర్ట్‌గా సాగుతుందని, దేశవ్యాప్తంగా పేరొందిన గాయకులు తమ తమ ఇళ్ల నుంచే జీ ఫేస్బుక్ పేజెస్ ద్వారా 350 రకాల ప్రదర్శనలు ఇస్తారని వారు వివరించారు. -
బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం
సాక్షి, హైదరాబాద్: ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ వినోద చానెల్ జీ తెలుగు ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సంబరాల సందర్భంగా పూర్ణాలు, పూతరేకులు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఉలవచారు, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, చల్ల మిర్చి...వంటి అచ్చ తెలుగు వంటకాల విశిష్టతకు అద్దం పడతూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. హీరోయిన్ అనుష్క ప్రధాన ఆకర్షణగా.. నటుడు నాగబాబు, ఆయన కుమార్తె నీహారిక, యాంకర్స్ అనసూయ భరద్వాజ్, ప్రదీప్ మాచిరాజు, రవి, పలువురు డ్యాన్స్ మాస్టర్స్... పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా తమ నటనతో అదరగొట్టారు. నీహారిక ... ‘ఓ మై డాడీ’ అంటూ మైక్ పట్టి పాట పడితే... అనసూయ... ‘మహానటి’ గా అభినయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. -
రాధమ్మ అల్లుడు
‘నటుడిగా నిరూపించుకోవాలనే ఆకాంక్ష ఉండాలే గాని అవకాశాలు ఏదో రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అది హీరోనా, విలనా.. అనే సందేహాలు పెట్టుకొని ఆగిపోవద్దు’ అంటారు బుల్లితెర నటుడు గోకుల్. తమిళ ఇంటి కుర్రాడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘జీ’ టీవీలో వచ్చే ‘రాధమ్మ కూతురు’లో లీడ్ రోల్ పోషిస్తున్న గోకుల్ మోడలింగ్ వైపు వెళ్లి, నటుడిగా ఎదుగుతున్న విధం గురించి ఇలా వివరించాడు... తమిళంలో విలన్ ‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు ఉమామహేశ్వరన్. ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేస్తున్నారు. అమ్మ జయప్రభ గృహిణి. మా బ్రదర్ సింగర్, కంపోజర్. నేను బి.టెక్ పూర్తి చేశాను. కాలేజీ తర్వాత మోడలింగ్‌లో చేరాను. ఆక్కణ్ణుంచే సీరియల్లో అవకాశం వస్తే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నా గడ్డం మీసాలు చూసి విలన్‌గా అయితే బాగుంటుందని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అలా విలన్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యాను. ఆ సమయంలోనే తెలుగు బుల్లితెర నుంచి ‘జ్యోతి’ సీరియల్లో లీడ్ రోల్‌కి ఆఫర్ వచ్చింది. వెంటపడితే చదివాను.. బి.టెక్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నటుడిని అవ్వాలని. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కనీసం డిగ్రీ అయినా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా బిటెక్‌లో ఐటీ చేశాను. కానీ, జాబ్వైపుకు వెళ్లాలనిపించలేదు. ముందు అమ్మనాన్న కాస్త మౌనం వహించారు. కానీ, ఇప్పుడు నాకు వస్తున్న గుర్తింపు, హంగామా చూసి వాళ్లూ సంతోషిస్తుంటారు. నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గర్వంగా ఫీలవుతారు. రాధమ్మ కూతురు ఇప్పుడు ‘జీ టీవీ’లో వచ్చే రాధమ్మ కూతురులో హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి ముందు జ్యోతి సీరియల్లో రీప్లేస్ క్యారెక్టర్ చేశాను. ఈ సీరియల్ పూర్తవుతుండగా రాధమ్మ కూతురు టీమ్ నుంచి ఆడిషన్స్‌కు పిలిచారు. ఊళ్లో అప్పులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసే బుజ్జమ్మ కొడుకు అరవింద్ క్యారెక్టర్ నాది. వడ్డీ వసూలుకు అరవింద్‌ను పింపిస్తుంటుంది బుజ్జమ్మ. తోడుగా ఓ ఐదారుగురు రౌడీలు ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు హీరోయిన్ అక్షరను చూస్తాడు అరవింద్. అక్షరకు బుజ్జమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని, నేను బుజ్జమ్మ కొడుకుగా కాకుండా చిన్నాగా అక్షర ను పరిచయం చేసుకుంటాను. అబద్దం చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఒకరోజు నేనే బుజ్జమ్మ కొడుకును అనే విషయం తెలుస్తుంది. దీంతో నా మీద పగ పెంచుకుంటుంది. ఇలా ప్రేమ – పగలతో సీరియల్ నడుస్తుంటుంది. తెలుగు నేర్చుకున్నాను తెలుగు బుల్లితెరకు వచ్చి ఆరునెలలు అయ్యింది. ఈ ఆరునెలల్లో చాలా నేర్చుకున్నాను. అందరి మాటలు వింటూ, నేను మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ముందు నెల రోజులయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ భాషలో నటుడిగా కొనసాగాలనుకుంటున్నామో ఆ భాష నేర్చుకుంటే ముందు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాను. సినిమా నటుడిని కావాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రెండు సంక్రాంతులు టీవీ షో కోసం మొన్ననే ఓ సంక్రాంతి వేడుకలో పాల్గొన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. పండక్కి చెన్నై వెళుతున్నాను. ఇక్కడ సంక్రాంతి అంటే తమిళ్లో పొంగల్ అంటారు. భోగి, పొంగల్, మట్టు(కౌ)పొంగల్ అని మూడు రోజులూ పండగ చేస్తాం. ఇంట్లో అమ్మ చేసే చక్రపొంగల్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఏడాది ఒకే పండగను వారం రోజుల్లో రెండు సార్లు జరుపుకోవడం హ్యాపీగా ఉంది. క్యారెక్టర్ని బట్టి.. క్యాస్టూమ్స్! ముందే టీమ్ సజేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్‌కు ఎలాంటి క్యాస్టూమ్స్ బాగుండాలో డిస్కషన్స్ జరుగుతాయి. నా పాత్రకు తగ్గట్టు రెంగ్యులర్ పాయింట్ షర్ట్ లేదా కుర్తా పైజామా కాకుండా జీన్స్ ప్యాంట్ మీద షార్ట్ కుర్తా వేసుకుని ఉంటాను. ఈ గెటప్ నాకు బాగా నచ్చింది. చాలా మంది ఇండోవెస్ట్రన్ స్టైల్ బాగుందంటూ మెచ్చుకుంటూ ఉంటారు. సంగీతం అంటే ప్రాణం ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్ వింటుంటాను. చిన్నప్పటి నుంచి ఇండోవెస్ట్రన్ మ్యూజిక్‌ని బాగా ఇష్టపడతాను. సినిమాలు కూడా బాగా చూస్తాను. ఒంటరిగానైనా సరే సినిమాలు చూస్తూనే ఉంటాను. రోజూ కంపల్సరీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతాను. అలాగే బైక్ మీద లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం చాలా ఇష్టం. అవకాశాలు వస్తున్నంత కాలం సీరియల్ నటుడిగా కొనసాగుతుంటాను. నటనలో మెళకువలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతీసారీ కొత్తగానే భావించి, క్యారెక్టర్లో లీనమైనప్పుడే మంచి పేరు వస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – నిర్మలారెడ్డి -
బుల్లితెర పెద్దబాబు
ఘట్టమనేని దేవేంద్రగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు పవన్‌సాయి. ‘జీ తెలుగు’లో వచ్చే ‘ముద్దమందారం’ సీరియల్లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు. వరుస సీరియల్స్‌తో పలకరిస్తున్న పవన్‌సాయి తన జర్నీ గురించి ఆనందంగా వివరించాడు. ‘పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెల్లు. అందరికీ మంచి చదువులు చెప్పించారు అమ్మనాన్న. అన్నయ్య ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ ఫీల్డ్ అన్నప్పుడు మా వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. ‘నీ ఇష్టమే మా ఇష్టం’ అన్నారు. ఏం చేసినా టాప్‌లో! అనుకోకుండా ఈ రంగం వైపు వచ్చాను. టెన్త్ క్లాస్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఓ రోజు నా స్నేహితుడితో కలిసి ఈవెనింగ్ వాక్‌కి వెళ్లాను. మేం వెళ్లేదారిలో ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య డ్యాన్స్ క్లాస్ ఉంది. అన్నయ్యను కలవాలని తనతో పాటు నన్నూ తీసుకెళ్లాడు నా ఫ్రెండ్. అక్కడికి వెళితే కొంతమంది గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లని చూసి ‘నేనూ డ్యాన్స్ నేర్చుకుంటాను’ అన్నాను. మా ఫ్రెండ్ అన్నయ్య ‘డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ కూడా నేర్పిస్తా’ అన్నాడు. ముందు డ్యాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్‌గా డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లేవాడిని. ముందుగా వెళ్లిన రోజు యాక్టింగ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చూసి నేనూ నేర్చుకునేవాడిని. అలా కాలేజీ రోజులూ గడిచిపోయాయి. ఏ పని చేసినా టాప్‌లో ఉండాలనేది నా తపన. అక్కణ్ణుంచి ఫొటోస్ దిగడం, ప్రతీ ఒక్క సినిమా, సీరియల్స్ ప్రొడక్షన్ ఆఫీసులకు ఇవ్వడం చేస్తుండేవాడిని. ఈ ప్రయాణంలో చాలా మంది సహాయపడ్డారు. డ్యాన్స్ నేర్చుకున్న నాటి నుంచి అన్ని ఆఫీసులకు వేల ఫోటోలు ఇచ్చి ఉంటాను. ప్రొడక్షన్ మేనేజర్లకు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకునేవాడిని. ఫస్ట్‌టైమ్ కామెడీ రోల్ ఉన్న హ్యాపీడేస్ సీరియల్లో ‘బ్లూటూత్’ అనే క్యారెక్టర్‌కి అవకాశం వచ్చింది. హ్యాపీగా జర్నీ హ్యాపీడేస్ టైమ్‌లోనే గుర్తింపు వచ్చిన మరో సీరియల్ మొగలిరేకులు. ఇది చేస్తుండగానే ముద్దుబిడ్డ సీరియల్‌కు అవకాశం. ముగింపులో ‘శ్రావణసమీరాలు’. ఆ తర్వాత ఏడాదికి ‘ముద్దమందారం’ స్టార్ట్ అయ్యింది. ముద్దమందారం.. పెద్ద కొడుకు ఒక సీరియల్ తర్వాత మరో సీరియల్ అంటూ ఒక నియమం పెట్టుకున్నాను. దీని వల్ల ఆ వర్క్‌లో, ఆ క్యారెక్టర్లో లీనమై నటించే అవకాశం ఉంటుందని నమ్ముతాను. అలా ఐదేళ్లుగా ముద్దమందారం సీరియల్లో నటించాను. టీమ్ అందరితోనూ ఒక మానసికమైన బంధం ఏర్పడింది. టీమ్ అంతా బయట కూడా నన్ను పెద్ద కొడుకులా చూసుకున్నారు. హరితమ్మ, తనూజ, సురేశ్.. అంతా ఇంట్లో పెద్దబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారో అలా చూసేవారు. ఈ జర్నీ చాలా అద్భుతం. ఆటలంటే పిచ్చి నటన తర్వాత పిచ్చి ప్రేమ ఆటలమీదనే. చాలా స్పోర్టీ పర్సన్‌ని. క్రికెట్ కోసం ఎక్కడెక్కడో గ్రౌండ్స్ వెతికేవాడిని. ఇదొక్కటే కాదు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, షటిల్, వీడియోగేమ్స్.. అన్నీ ఇష్టమే. ఇంట్లో ఉన్నానంటే టీవీకే అంకితం. సమయం అంతా టీవీ చూడ్డంతోనే అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి టీవీ చూడ్డం హాబీయే కారణం అనుకుంటాను.’ – నిర్మలారెడ్డి -
అంత ఈజీగా ఏమీ సిద్ధించలేదు
‘చిన్నప్పుడు క్రికెట్ ఆడుకొని ఇంటికి వచ్చాక టీవీ చూద్దామంటే ఇంట్లో అమ్మ, అక్కవాళ్లు సీరియల్స్ చూస్తుండేవాళ్లు. సినిమా పెట్టమంటే నన్ను బయటకు వెళ్లమని తిట్టేవారు. ఇప్పుడు నేను సీరియల్స్‌లో చేస్తూ మా అమ్మవాళ్లని చూడమని రిక్వెస్ట్ చేస్తుంటాను’ అని నవ్వుతూ తన నట ప్రయాణాన్ని పంచుకున్నారు సిద్దార్ధ. జీ తెలుగులో వచ్చే గంగ–మంగ సీరియల్లో ‘సిద్ధు’గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సిద్ధార్ధ పంచుకున్న కబుర్లివి. ఐదేళ్లు అయ్యింది ఈ ఫీల్డ్కి వచ్చి. సినిమా అవకాశాల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆదాయం ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో మా కజిన్ నన్ను బాగా చూసుకున్నాడు. బుల్లితెర ప్రయాణం హైదరాబాద్‌లో ఉన్న మా బ్రదర్ తప్ప అంతకుమించి ఎవ్వరూ తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉండేవాణ్ణి. ఆరునెలల పాటు అందరి వెనకాల తిరిగాను. అందరూ చేద్దాం, చూద్దాం అంటున్నారు. ఇక ఇలా లాభం లేదని సీరియస్‌గా ట్రై చేద్దామని ఒక సీరియల్ మేనేజర్‌కి కాల్ చేశాను. లొకేషన్‌కి రమ్మనడంతో వెళ్లి మాట్లాడాను. వారం తర్వాత వాళ్లే ఫోన్ చేశారు ఆడిషన్స్‌కి రమ్మని. అలా ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో నా టీవీ జర్నీ మొదలయ్యింది. అటు తర్వాత ‘కథలో రాజకుమారి‘, ‘మనసు మమత’ సీరియల్స్ చేశాను. ఇప్పుడు ‘గంగ మంగ’ సీరియల్ చేస్తున్నాను. రేపు ఎలా ఉంటుందో ఇక్కడ గ్యారంటీ ఏమీ లేదు. అవకాశాలు వస్తుంటాయి. వాటిని చేసుకుంటూ వెళ్లడమే. గ్యాప్‌లో సినిమా ఖాళీ దొరికితే చేసే పని సినిమాలు చూడ్డం. ఒకేసారి వరసబెట్టి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. చూస్తూ ఉంటాను. లేదంటే జిమ్‌లో ఉంటాను. ఇంకాస్త టైమ్ ఉంటే ప్రొడక్షన్ ఆఫీసుల వారిని కలుస్తుంటాను. ఒక సీరియల్ చేస్తూ మిగతా 15 రోజులు సినిమాలకు ట్రై చేస్తున్నాను. సినిమా, టీవీ రెండింటిలోనూ రాణించాలన్నది నా కల. ఒకప్పుడు మా ఊళ్లో చుట్టుపక్కల వాళ్లు ‘చదువుకొని కూడా మీ అబ్బాయి ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడు’ అని అనేవారు. ఇప్పుడు మీ వాడు సూపర్ అంటుంటారు. ఈ మాటలు అమ్మానాన్నలు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన పొజిషన్‌ను బట్టి బయటి వాళ్ల మాటలు ఉంటాయి. వారికేది అనిపిస్తే అది మాట్లాడుతుంటారు. గైడ్‌గా నళినమ్మ! సీరియల్ టీమ్ ఒక మంచి కుటుంబంలా కలిసిపోయింది. మాకందరికీ పెద్ద దిక్కు అంటే నళినమ్మ. చాలా మంచావిడ. లొకేషన్‌కి ఉదయం ఏడు గంటలకే రకరకాల వంటకాలు చేసుకొని మరీ మా కోసం తీసుకువస్తారు. ఒక కుటుంబంలా కలిసిపోయాం. నటనలో సలహాలు, సినిమా విశేషాలు ఒకప్పటి హీరోయిన్గా రాణించిన నళినమ్మే చెబుతుంటారు. అవన్నీ నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. షూటింగ్లో చిన్న గ్యాప్ దొరికినా నళినమ్మ చుట్టూతా కూర్చుంటాం. తను చూసొచ్చిన ఇండస్ట్రీ గురించి విషయాలు చెప్పమని అడుగుతుంటాం. అల్లరి చేస్తూ ఉంటాం. షార్ట్ ఫిల్మ్ ప్లాన్ బీటెక్ చేశాను. అమ్మానాన్న వైజాగ్‌లోనే ఉంటారు. పదవ తరగతి పూర్తయినప్పటì æనుంచే షార్ట్‌ఫిల్మ్ తీయాలనే ప్లాన్‌లో ఉండేది మా స్నేహబృందం. హర్రర్, సస్పెన్స్ షార్ట్ ఫిల్మ్స్‌కి ట్రై చేసేవాణ్ణి. దీంతో కెమెరా, షూట్స్, స్క్రిప్ట్.. ఈ హంగామా అంతా బాగా ఆకట్టుకుంది. ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు. చదువయ్యాక చిన్న మూవీ చేశాను. కానీ రిలీజ్ అవలేదు. ఇలా అయితే టైమ్ వేస్ట్ అవుతుందని హైదరాబాద్ వచ్చేశాను. గంగ – మంగ జీ తెలుగులో వచ్చే గంగ మంగ సీరియల్ కథనం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతం సీరియల్లో గంగకి, సిద్దుకి పెళ్లవదు. గంగ తనే తాళి కట్టేసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాళ్ల ఆలోచన. మధ్యలో అడ్డంకులు వస్తుంటాయి. -
అదృష్టాన్ని నిలబెట్టుకోవడమే విజయం
చిన్నప్పుడు సరదాగా ఆడిన ఆటైనా, ఇష్టంతో నేర్చుకున్న పనైనా.. ప్రతీది జీవితంలో ఉపయోగపడటం అనేది ఒక అదృష్టం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన ప్రయత్నమే. ఆ రెండింటినీ సిన్సియర్‌గా అందిపుచ్చుకున్న సీరియల్ నటుడు నందకిశోర్. ‘జీ తెలుగు’లో వచ్చే ‘రామసక్కని సీత’ సీరియల్లో రామరాజుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న నందకిశోర్ చెబుతున్న ముచ్చట్లివి. ‘మా అమ్మానాన్నలు శారద, వెంకటరమణ. నాన్న రైల్వేలో జాబ్ చేసేవారు. ముగ్గురు అన్నదమ్ములలో నేను చివరి వాడిని. మా నాన్నగారే నా మొదటి గురువు. చిన్నప్పుడు ఆయనే నా ముఖానికి మేకప్ వేశారు. భూమికా థియేటర్ గ్రూప్‌ను నిర్వహించే గరికపాటి ఉదయభాను గారి దగ్గర పదవతరగతి నుంచి నాటకరంగంలో పాల్గొనేవాడిని. కెరియర్ దీర్ఘకాలం కొనసాగాలంటే నాటక రంగం బాగా ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు అలా నా మూలాలు నాటకరంగంలో పడ్డాయి. అన్నదమ్ముల అనుబంధం ఇంట్లో చిన్నవాyì ని అయినా మా అన్నయ్యల సపోర్ట్ నాకు బాగా ఉండేది. అన్నదమ్ములం అయినా మంచి స్నేహితులుగా ఉంటాం. ఒకమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఇంట్లో చిన్నవాడినైనా మా అన్నయ్యలిద్దరూ నాకు ముందు పెళ్లి జరిపించారు. ఇప్పటికీ నాకు వారు అండగా ఉంటారు. నా సతీమణి పేరు లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం అయితే ఈ ఫీల్డ్‌లో ఉన్న నన్ను అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం. మాకు ముగ్గురు కూతుళ్లు. విలన్ నుంచి హీరోగా! 2005 సంవత్సరం నుంచి నా కెరియర్ మొదలైంది అని చెప్పవచ్చు. అంతకుముందు నాలుగైదేళ్లు ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ టైమ్‌లో ఈ రంగంలో పోటీ ఎక్కువ ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు అవకాశాలు తక్కువ. పదిహేనేళ్ల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన ‘వెలుగు నీడలు’ సీరియల్లో విలన్‌గా చేశాను. అక్కణ్ణుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చెన్నై ఇండస్ట్రీకి వెళ్లాను. అక్కడ అంకురం సీరియల్లో సైడ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ర్యాడాన్ ప్రొడక్షన్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇక్కడ ‘స్రవంతి’ సీరియల్లో అవకాశం వచ్చింది. ఐదేళ్ల పాటు వచ్చిన ఆ సీరియల్ వల్ల నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఈ సీరియల్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేక, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్ చేసుకుంటూ వస్తున్నాను. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశాను. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడొక సినిమా కూడా చేస్తున్నాను. సీరియల్ వల్ల నటనలోనూ, ప్రొడక్షన్లోనూ మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. రామసక్కని సీత రియల్ లైఫ్‌లో మా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిని. ‘రామసక్కని సీత’ సీరియల్లో నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడిని. ఇది పూర్తిగా కుటుంబ నేపథ్యం ఉన్న కథనం. నాది రామరాజు పాత్ర. అన్నదమ్ముల సఖ్యత, భార్యా–భర్తల అనురాగం, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. ఇలా ఏ దశలో ఎలా ఉండాలో బంధాల ద్వారా చూపుతుంది ఈ సీరియల్. అనుకోని పరిస్థితుల్లో సీత రామరాజు భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది. అమ్మలా చూసే సీత ప్రవర్తనతో తమ్ముళ్లు మారుతారు. మంచి ప్రేక్షకాదరణతో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నటనే జీవితం నటన మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే నా జీవితమైంది. దీంట్లోనే కొనసాగుతాను. నటుడిగా కొనసాగాలంటే ఆరోగ్యం, ఫిట్నెస్, ముఖకాంతి.. ఇవన్నీ తప్పనిసరి. అందుకే ఎన్ని పనులున్నా రోజూ ఉదయం 5:30గంటలకు లేస్తాను. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తాను. షూటింగ్ లేకపోతే సినిమాలు చూడ్డం, స్టోరీ డిస్కషన్స్, కాన్సెప్ట్స్ డెవలప్ చేయడం వంటి వాటిల్లో పాల్గొంటుంటాను. మిగతా టైమ్ నా కుటుంబంతో గడుపుతాను. పూర్తి శాకాహారిని. వంట వచ్చు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కొత్త వంటకాలను ట్రై చేస్తుంటాను. వాటి టేస్ట్‌ను ఇంట్లో వారికి దగ్గరుండి మరీ వడ్డిస్తాను.’ – నిర్మలారెడ్డి ఆల్‌రౌండర్‌గా! చిన్నప్పటి నుంచి ఆటలు, పాటలు, చదువు.. అన్నింటిలోనూ చురుకుగా ఉండేవాడిని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆటల్లో క్రి కెట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు సినిమా వాళ్లతో కలిసి పాల్గొన్నాను. టీవీ కేటగిరీ నుంచి నా క్రికెట్ స్కిల్స్ చూసి వాళ్ల టీమ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. చిన్నప్పుడు ఏదైతే ఇష్టంతో నేర్చుకున్నానో అవన్నీ నా జీవితంలో ఉపయోగపడుతూ వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, ప్లేయర్‌గా.. ఇలా అన్నింటా ఉన్నాను. డ్యాన్సర్‌గా జల్సా, నర్తనశాల, రగడ.. వంటి టీవీ డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. స్టేజ్ షోలోనూ ప్రదర్శనలు ఇచ్చాను. అయితే, అప్పటి కష్టానికి ఇప్పటిలా మార్కెట్లేదు. ఇప్పుడు ప్రతీది అప్డేటెడ్గా ఉండాలి. -
సూర్యవంశం అంజలి
‘మనల్ని మనం నిరూపించుకోవాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మొదట్లో అవకాశాల కోసం చాలా తపన పడ్డాను. విలన్ రోల్స్నీ వదులుకోలేదు. తర్వాత నే కోరుకున్న పాజిటివ్ రోల్స్ వరించాయి’ అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టిన అంజలి అసలు పేరు మైథిలీ. తెలుగింటి అమ్మాయి మైథిలీ బుల్లితెరపైన రాణించడానికి పడిన తపనను ఈ విధంగా వివరించింది. ‘తెలుగింట పుట్టి తెలుగువారికి టీవీ ద్వారా చేరువకావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నా మొట్టమొదటి సీరియల్ ‘ఆడదే ఆధారం’, ఆ తర్వాత మూడుముళ్ల బంధం. దాదాపు మొదట్లో నాకు వచ్చిన పాత్రలన్నీ విలన్ క్యారెక్టర్లే. దీంతో కొంచెం భయమేసేది అన్నీ నెగిటివ్ క్యారెక్టర్లేనా అని. అష్టాచెమ్మా సీరియల్ తర్వాత మరో అవకాశం కోసం ఎదురుచూస్తూనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఏడాదిన్నర క్రితం జీ తెలుగులో వచ్చే ‘సూర్యవంశం’ సీరియల్లో ‘అంజలి’ పాత్ర నన్ను వరించింది. ఇలాంటి పాత్రకోసం చాలాకాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు అంజలిగా చాలా మందికి చేరువయ్యాను. ఇందులో అంజలి చాలా జోవియల్‌గా, కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అంజలి – కార్తీక్లది మంచి జంట. వీరిద్దరి మధ్య ఉండే బంధం చాలా అందంగా ఉంటుంది. ఈ సీరియల్ నుంచి ఇప్పుడు తమిళ్లో మరో అవకాశం వచ్చింది. ఆ పాత్ర డ్యాన్స్ కమ్ పాజిటివ్ రోల్. ‘అష్టాచెమ్మా’ లో మధుర పాత్ర నెగిటివ్ రోల్ అయినా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూర్యవంశంలో అంజలి రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ రెండు రోల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కూచిపూడి డ్యాన్సర్ కూచిపూడిలో నాకు సర్టిఫికెట్ కూడా ఉంది. ఆర్టిస్టు అవకాశాలు రాకపోతే కూచిపూడి డ్యాన్సర్‌గా స్థిరపడేదాన్ని. స్కూల్ డేస్‌లో నందనవనం, ధన, పాండురంగడు.. మొదలైన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా నా ఫొటోలు పంపేదాన్ని. ‘అందమైన భామలు’ టీవీ ప్రోగ్రామ్‌లో టాప్ ఫైవ్ లిస్ట్‌లో ఉన్నాను. అయితే, పోటీలో గెలవలేదు. దీంతో చాలా ఏడ్చాను. చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. అమ్మ నన్ను చాలా మార్చింది. సినిమాల్లో చేయాలని ఉండేది. కానీ, అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. సినిమా ఆఫీస్‌లకు వెళ్లి నా ప్రొఫైల్, ఫొటోలు ఇచ్చి వచ్చేదాన్ని. ఆ తర్వాత ఫోన్ వస్తుందని చాలా ఎదురుచూసేదాన్ని. రాకపోవడంతో డీల్ పడేదాన్ని. సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో హ్యాపీగా ఉన్నాను. నటిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మాది గుంటూరు. అమ్మానాన్నలకు నేను , అన్నయ్య సంతానం. అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా సపోర్ట్. నేను డ్యాన్సర్‌గా రాణించడం కోసం చదువులో వెనకబడకూడదని అన్నయ్య క్లాస్‌లోనే నన్నూ జాయిన్ చేశారు. నేను మిస్ అయిన క్లాసులు అన్నయ్య చెప్పేవాడు. నాకు నోట్స్ రాసిపెట్టేవాడు. మా నాన్నగారు మల్లికార్జునరావు స్కూల్ హెడ్మాస్టర్. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో తరచూ ట్రాన్స్ఫర్లు ఉండేవి. మా అమ్మ లలిత నా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంది. తను క్లాసికల్ డ్యాన్సర్. కానీ, తన కలను నెరవేర్చుకోలేకపోయానని నాకు కళ పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. అమ్మ వల్ల నేను కూచిపూడి డ్యాన్సర్‌ని అయ్యాను. అంతేకాదు, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్.. ప్రతీ ఆర్ట్‌లోనూ ప్రవేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అమ్మ. నాన్నగారు మా బాధ్యత అమ్మకే అప్పజెప్పేవారు. ‘పిల్లలు వాళ్లనుకున్న ఫీల్డ్‌లో ఎదిగేలా జాగ్రత్తలు తీసుకో. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అనేవారు. మేం కూడా అవకాశాలను వదులుకోలేదు. ఇప్పటికీ నా ప్రొఫెషన్లో అమ్మ సపోర్ట్ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చాలా తక్కువ. మా అమ్మనే నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు బాధనిపించినా, సంతోషమేసినా అమ్మతోనే షేర్ చేసుకుంటాను. – నిర్మలారెడ్డి బిజీ బిజీగా ఉండటం ఇష్టం నన్ను ‘సూర్యవంశం’ అంజలిగా చాలా మంది గుర్తుపడతారు. నా పాత్రను, నటనను మెచ్చుకుంటుంటారు. వచ్చిన అవకాశానికి, చేస్తున్న కృషికి చాలా ఆనందపడుతుంటాను. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండటం నాకు ఇష్టం. నెలలో రెండు మూడు సీరియల్స్‌లో యాక్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. సీరియల్స్ షెడ్యూల్ లేని టైమ్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేసుకుంటాను. నెలలో కనీసం 2–3 డ్యాన్స్ షోలైనా ఉంటాయి. పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టి డ్యాన్స్ ఇన్స్ట్యూట్ పెట్టాలి. ఇలా యాక్టింగ్‌లోనే కొనసాగాలి. ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలి.’ -
తెలుగువారు మెచ్చిన గుండమ్మ
తనకు చెడు చేసేవారికైనామంచే జరగాలని కోరుకునే అందమైన మనసున్న గీతను జీ తెలుగులో వచ్చే ‘గుండమ్మ కథ’ సీరియల్లో చూడాలి. బొద్దుగా ఉంటే అవకాశాలు రావేమోననేనెగిటివ్ ఆలోచనలను ఆమడ దూరం పెట్టేసినఆత్మస్థైర్యాన్ని పరిచయం చేసుకోవాలంటే గుండమ్మ ఉరఫ్ పూజామూర్తి చెప్పే మాటలు వినాలి. ‘‘గుండమ్మ కథ సీరియల్లో నా పేరు గీత. చాలా మంచి అమ్మాయి తను. డౌన్ టు ఎర్త్ గర్ల్. ఎవరైనా తనకు చెడు తలపెట్టినా సరే వారికి మంచే జరగాలి అనుకుంటుంది. గీతకు వదిన ఉంటుంది. టార్చర్ చేయడమే తన పని. గీత తనలో తానే బాధపడుతుంది కానీ వదినను ఒక్కమాట కూడా అనదు. తండ్రి స్నేహితుడి కొడుకుతో గీతకు పెళ్లవుతుంది. లావుగా ఉందన్న కారణంగా.. నచ్చని పెళ్లి చేసుకున్న భర్త గీతను సరిగ్గా చూసుకోడు. చెల్లెలితో సహా ఇంట్లో అంతా ఆమెను బాధపెట్టేవారే. అయినా, మనో నిబ్బరం కోల్పోకుండా అందరికీ సపోర్టివ్‌గా ఉంటూ తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ఉంటుంది. నచ్చని జీవితాన్ని నచ్చేలా మార్చుకుంటూ ముందుకు సాగే ఒక అమ్మాయి విజయగాథ ఇది. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఏడాది క్రితం వరకు బరువు పెరిగి అవకాశాలు లేక ఉద్యోగం చేసుకుంటున్న నాకు ఈ సీరియల్ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది. అమ్మాయిలు లావు అయితే ఇక వారి పని అంతే.. అనుకోవడానికి లేదు. అందుకు నేనే ఓ ఉదాహరణ. కన్నడ అమ్మాయిని అమ్మ కళావతి ఉద్యోగి. నాన్న శ్రీనివాసమూర్తి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అమ్మ తరపు వాళ్లు తెలంగాణలోని కోదాడలో బంధువులు ఉన్నారు. మేం ఉండేది బెంగుళూరులో. నా స్నేహితుల జాబితాలోనూ, మా ఇంటి చుట్టుపక్కల తెలుగు, తమిళ్ వాళ్లు ఎక్కువే. అలా నాకు తెలుగు, తమిళ భాషలు వచ్చు. చిన్నప్పటి నుంచి స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. నా ఆసక్తి గమనించి నాన్న కూడా ఏ ఒక్క షో మిస్సవనిచ్చేవారు కాదు. హైస్కూల్‌కి వచ్చాక మాత్రం స్టేజ్ షోలు తగ్గించి డిగ్రీ వరకు చదువు మీదే కాన్సంట్రేట్ చేశాను. ఫైనల్ ఇయర్లో ఉండగా కన్నడ సీరియల్లో మా ఫ్రెండ్స్ వల్ల అవకాశం వచ్చింది. సీరియల్ పూర్తయ్యాక చిన్ననాటి నుంచి శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నాను. అయితే కన్నడలో సీరియల్స్ చేసేటప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని రోజూ చేయడం కుదరక మానుకున్నాను. దీంతో మెల్లమెల్లగా బరువు పెరగడం మొదలుపెట్టాను. హెరిడిటరీ కూడా దీనికి ఓ కారణం అయ్యింది. వేరే వాళ్లను ఇంప్రెస్ చేయడానికి నన్ను నేను క్షోభ పెట్టుకోవద్దని బలంగా అనుకున్నాను. ఆ తర్వాత సీరియల్స్ అవకాశాలు లేక ఇంటి దగ్గర నెల రోజులు ఖాళీగా ఉన్నాను. అలాగని నేనెప్పుడూ డిప్రెస్ అవలేదు. ఇది కాకపోతే మరోటి అనుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ జాబ్‌కి అప్లై చేశాను. అది నైట్ షిప్ట్. రెండేళ్లు ఆ జాబ్‌లో ఉన్నాను. దీంతో బరువు పెరగడంలో ఇంకా తేడా వచ్చింది. అయితే, గాడ్ గిఫ్ట్ ఏంటంటే అధిక బరువు ఎప్పుడూ నా ప్రతిభకు అడ్డంకి కాలేదు. జీవితం పట్ల హోప్ పోగొట్టుకోలేదు. రీమేక్‌తో ఎంట్రీ ‘బ్రహ్మగంటు’ అనే కన్నడ సీరియల్ తెలుగు రీమేక్ కోసం యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇది కూడా నా స్నేహితురాలి ద్వారా. ‘నేను ఇప్పుడు మీ సీరియల్ చేయలేను. అందుకు సన్నగా ఉండాలి కదా!’ అని చెప్పాను. కానీ, ఈ క్యారెక్టర్‌కి ఇలాగే ఉండాలి. ఆడిషన్స్‌కి రండి అన్నారు. అలా తెలుగు సీరియల్ ‘గుండమ్మకథ’లో లీడ్ రోల్ నన్ను వరించింది. అమ్మ నాన్న నేను ఒక్కదాన్నే కూతురుని అమ్మనాన్నలకు. ఎల్కేజీ నుంచి నాకు యాక్టింగ్‌లో ఉన్న ఆసక్తి వాళ్లకు తెలుసు. వాళ్లూ ఎక్కడా నాకు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు వారం రోజులు అమ్మనాన్నల దగ్గర, వారం రోజులు షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఇప్పుడు నా జీవితం చాలా బాగుంది. సీరియల్స్‌లో అవకాశాలు ఉన్నన్నాళ్లూ ఇలా ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను. కాలం ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తుందని బలంగా నమ్ముతాను. కన్నడ సీరియల్స్ చేసినప్పుడు ‘చింతన’గా అక్కడ చాలామందికి పరిచయం. ఇప్పుడు గుండమ్మ కథ ద్వారా ఇటు తెలుగులోనూ, బెంగుళూరులోను గుండమ్మ, గీత.. అని అందరూ గుర్తిస్తున్నారు. అలాగే పలకరిస్తున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది.’ నిర్మలారెడ్డి -
తెలుగింటి ముగ్గు
ముత్యాల ముగ్గు భూమిగా యామిని తెలుగింటి వారికి సుపరిచితమే. ఇతర భాషా హీరోయిన్స్ మన తెలుగు సీరియల్స్‌ను ఏలేస్తున్నా యామిని మాత్రం తన అందం, అభినయంతో వారికి గట్టిపోటీ ఇస్తూ సీరియల్స్‌లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ‘కళ్లతో అన్నీ కనిపిస్తాయి కానీ కొన్ని మాత్రం మనసుతోనే చూడాలి’ అంటూ జీ తెలుగు సీరియల్లో ప్రసారమయ్యే మీనాక్షి సీరియల్ ద్వారా మరోసారి ఆకట్టుకోనుంది యామిని. ‘మొదటిసారి తెలుగు సీరియల్లో అనుకోకుండా ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. చాలా ప్రయాసమీద అమ్మానాన్నలను ఒప్పించి మరీ చేశాను. జీ తెలుగు మంచి ప్రాజెక్ట్స్‌తో నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. భూమిగా ముత్యాలముగ్గు సీరియల్లో చాలా మంచి పేరొచ్చింది. నేను పుట్టి పెరిగింది వరంగల్‌లోనే. తెలుగమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను ఇండస్ట్రీలో. డిగ్రీ పూర్తి చేశాను. స్కూల్లో ఉన్నప్పుడు కల్చరల్ ఈవెంట్స్‌లో చురుగ్గా పాల్గొనేదాన్ని. డ్యాన్స్ అంటే ఉండే ఇష్టం వల్ల ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా సందడి చేసేదాన్ని. ఈవెంట్స్ ఆర్గనైజర్ ద్వారా సీరియల్ అవకాశం వచ్చింది. ముత్యాల ముగ్గు సీరియల్ ఇప్పటికి మూడేళ్లు అవుతోంది. దీనికి ముందు చిన్నకోడలు, పుట్టింటిపట్టుచీర.. వంటి సీరియల్స్ చేశాను. ఒక్కో సీరియల్‌కి ఒక్కో ప్రాధాన్యత ఉంది. మనసున్న మీనాక్షి పల్లెటూరి అమ్మాయిగా, పెద్దింట్లో కోడలుగా చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు అయితే అంధురాలిగా యాక్ట్ చేసే పాత్ర ఒక సవాల్. మీనాక్షి సీరియల్ నాకా అవకాశం ఇచ్చింది. ఆడిషన్స్ టెస్ట్ చేసిన డైరెక్టర్ నేనే ఆ పాత్రకు సూటబుల్ అవుతాను అన్నారు. బ్లైండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి అని భయంతో ముందు వద్దనుకున్నాను. అలాగే రెండు సీరియల్స్ ఒకే టైమ్‌లో ఎలా చేయడం అని సందేహించాను. కానీ, నా టీమ్ ఇలాంటి అవకాశాలు కావాలనుకున్నా దొరకవు అన్నారు. అప్పుడే ఇదొక ఛాలెంజ్‌గా ఎంచుకున్నాను. మీనాక్షి పాత్ర చాలా జోవియల్‌గా అంతకుమించి ధైరస్తురాలిగా ఉంటుంది. ముత్యాల ముగ్గు సీరియల్లో భూమి క్యారెక్టర్‌కు నాకు చాలా దగ్గర పోలిక ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ కూచిని... నాకు మా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అమ్మను నాతోపాటే ఉండమని కోరాను. మా అమ్మ రోజుమొత్తం నాతోనే ఉంటుంది. తనకు చాలా సహనం ఎక్కువ. తన సపోర్ట్ లేకపోతే నేను లేను. నెలలో ఇరవై రోజులు షూటింగ్లో పాల్గొంటే మిగతా రోజులు ఇల్లు వదిలి బయటకి రాను. ఇంట్లో ఉంటే టీవీ చూస్తూ గడిపేస్తాను. పాత సినిమా అయినా సరే మళ్లీ మళ్లీ చూస్తాను. ఇతర భాషల కథానాయికలు ఇక్కడ తెలుగమ్మాయిలకూ మంచి స్కోప్ ఉంది. అయితే, ఇతర భాషల అమ్మాయిలు ఎక్కువ కనిపించడానికి కారణం వాళ్లు ఈ వాతావరణంలో త్వరగా అడ్జెస్ట్ అవుతారని, ఫ్యామిలీ దూరంగా ఉన్నా భయపడరు, బాధపడరు అని. ఈ ఇండస్ట్రీ గురించి వారికి ఎక్కువ అవగాహన ఉంది. మన దగ్గరా ఈ రంగం పట్ల ఆసక్తి చూపేవారున్నారు. టర్నింగ్ పాయింట్స్ మాది పెద్ద కుటుంబం. మంచి జాబ్ ఉండాలి. ట్యాగ్వేసుకొని సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయాలి అనుకున్నదాన్నే. కానీ, లైఫ్‌లో చాలా టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. వాటిని నేర్పుగా మలచుకోవాలని నా జీవితం నుంచే నేను నేర్చుకున్నాను. నా ఫెర్ఫార్మెన్స్ పట్ల మాత్రమే నేను శ్రద్ధ పెడతాను. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోను. చాలా మంది సినీనటి సౌందర్య లాగా అనిపిస్తారు అని అంటుంటారు. నాకు ఆ మాట చాలా ఆనందాన్నిస్తుంది. వారి మాటలకోసమైనా ఆమెలా నటించేందుకు ప్రయత్నిస్తుంటాను. నా కోసం తెలుగులో అవకాశాలు ఉన్నంతవరకు ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను’. – నిర్మలారెడ్డి -
అక్క.. చెల్లెలు.. చైత్ర
ఒకే ఇంటికి చెందిన ఒకేలా ఉన్న ఇద్దరు కవల పిల్లల కథే అక్కాచెల్లెళ్లు. ఈ ఇద్దరూ ఒకే అత్తారింటికి చేరుతారు. ‘జీ తెలుగు’లో వచ్చే ఈ సీరియల్లో శ్రావణిగా, భరణిగా తానే నటిస్తోంది చైత్రారాయ్. ‘ద్విపాత్రాభినయం అనేది ఓ పెద్ద ఛాలెంజ్’ అంటూ తన మనసులోని మాటలు ఇలా చెప్పుకొచ్చింది చైత్ర. అష్టాచమ్మా, మనసున మనసై సీరియల్స్ ద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన చైత్ర పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కన్నడ సీరియల్స్‌తో ఆకట్టుకున్న నటన ఆమెను తెలుగు బుల్లితెరకు పరిచయం చేసింది. రొటీన్‌కి భిన్నంగా.. ఒకప్పుడు వేరే ఆర్టిస్టులు ద్విపాత్రాభినయం చేస్తున్నప్పుడు అలాంటి రోల్ ఒకటి నాకూ వస్తే బాగుండనే ఆశ ఉండేది. ఇన్నాళ్లకి రెండు పాత్రల్లోనూ నేనే లీడ్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ అనగానే పాజిటివ్‌గానూ, కొంచెం రొటీన్‌గానూ ఉంటుంది. దీనికి భిన్నమైన ఆపోజిట్ క్యారెక్టర్ చాలా ఛాలెంజ్డ్గా ఉంది. ఇలా రెండు పాత్రలు ఒకేసారి చేయడంతో చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతున్నాను. అయితే, ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఇద్దరమ్మాయిల లుకింగ్‌లో చాలా డిఫరెన్స్ చూపించాలి. క్యాస్ట్యూమ్స్లోనూ, అలాగే యాక్టింగ్‌లోనూ ఇద్దరికీ ఏ మాత్రం పోలిక లేకుండా చూపించాలి. కానీ, కష్టపడితేనే మంచి పేరొస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడు నాకొచ్చింది అని సంతోషంగా ఉంది. కన్నడ అమ్మాయిని తెలుగులో నా మొదటి సీరియల్ ‘అష్టాచెమ్మా.’ అంతకు ముందు కన్నడ సీరియల్స్ చేసేదాన్ని. ఉంటున్నది బెంగుళూరులోనే. షూటింగ్స్ సమయంలో హైదరాబాద్ వస్తుంటాను. కానీ చాలా మంది నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటారు. అంతగా ఇక్కడివారు నాతో కలిసిపోయారు. మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు భయపడ్డాను. భాష రాదు, ఎవరేం మాట్లాడినా నాకు అర్థమయ్యేది కాదు. నన్ను ఇక్కడి నుంచి రిజెక్ట్ చేస్తున్నారేమో లేదంటే నా గురించి ఏమనుకుంటున్నారో అని ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు నేనుగా చెబితే తప్ప ఎవరూ నేను కన్నడ అమ్మాయినని అనుకోరు. కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ షాట్‌గ్యాప్‌లో ‘అష్టాచమ్మా’ సీరియల్‌కి ఆడిషన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో నా చేత కన్నడలోనే రెండు డైలాగ్స్ చెప్పమన్నారు. అలా నేను సెలక్ట్ అయ్యి, తెలుగులోకి ఎంటర్ అయ్యాను. ఈ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లయ్యింది. కానీ, నా జర్నీ హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉందనిపిస్తుంది. ఇక్కడే మంచి మంచి సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనే లేదు హోటల్ మేనేజ్మెంట్కోర్స్ చేసేటప్పుడు అక్కడికి సీరియల్ టీమ్ వచ్చారు షూటింగ్‌కి. సీరియల్స్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ ఉందా అని అడిగారు. కానీ, నేనేమీ చెప్పలేదు. డైరెక్ట్‌గా మా అమ్మను కలిసి విషయం చెప్పారు. అమ్మ ఓకే చేయడం, నేను సీరియల్స్‌లో యాక్ట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. పదవతరగతి అయిపోయాక ఇంటర్ చేయాలి, ఆ తర్వాత డిగ్రీ చేయాలని మాత్రమే అనుకునేదాన్ని. ఒకసారి మాత్రం టీచర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ, ఇలాగే నా లైఫ్ ఉండాలనే ఆలోచన అయితే లేదు. ఈ సీరియల్లో డ్యుయెల్ రోల్లో యాక్ట్ చేస్తునప్పుడు నాకూ ఒక చెల్లి ఉంటే ఇద్దరమూ స్క్రీన్‌ని షేర్ చేసుకునేవాళ్లం కదా అనిపిస్తుంది. ఆ వెంటనే నవ్వుకుంటాను. నాకు చెల్లెలు లేదు కానీ ఓ తమ్ముడు ఉన్నాడు. వాడి చదువు పూర్తయ్యింది. ఈ ఫీల్డ్ అంటే వాడికీ ఇంట్రస్ట్ ఉంది. అక్కగా నా ఎక్స్‌పీరియెన్స్ వాడితో షేర్ చేసుకుంటుంటాను. నా నటనకు సంబంధించిన మొదటి క్రిటిక్ కూడా మా తమ్ముడే. మంచి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. – నిర్మలారెడ్డి -
నా జీవితం అమ్మకే అంకితం
అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి’... అమ్మ రుణం జన్మజన్మలకూ తీర్చుకోలేనిది. అమ్మపాలనలోనే మనం నిజమైన మనుషులుగా సమాజంలో సుస్థిర స్థానం సంపాదించుకోగలుగుతాం. ఈ ఆధునిక యుగంలో చాలామంది... అమ్మకు దూరంగా బతుకుతున్నారు. అది ఒక రకంగా శాపమనే చెప్పాలి. మా అమ్మ నాకు నేర్పించిన ఎన్నో మంచి విషయాలు కొండంత అండగా నిలిచాయి. అందుకే నేను షూటింగ్ లొకేషన్స్‌లో కానీ మరే ఇతర ప్రాంతాలకు వెళ్లినా... అక్కడికి వచ్చిన అందరినీ నా వాళ్లుగా, నా పిల్లలుగా భావిస్తాను. అలాంటి క్షణాలన్నీ నాకు మా అమ్మను గుర్తు చేస్తాయి. జీ తెలుగులో మే 22వ తేదీ మధ్యాహ్నం ప్రసారం కాబోతున్న మెగా సీరియల్ ‘గృహ ప్రవేశం’లో కూడా పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి కటువుగా ఉండే అమ్మగా కనిపించబోతున్నాను. ఆద్యంతం మానవ సంబంధాలను అందంగా ఆవిష్కరించే ‘గృహ ప్రవేశం’ మెగా సీరియల్‌ను చూసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. -
అప్సర... అదరహో!
-
న్యాయనిర్ణేతగా మాస్ మహారాణి
అందాల రాణి రంభ సిల్వర్ స్క్రీన్ మీద చిందులేసినంత కాలం కురక్రారు కంటి మీద కునుకు లేదు. ఆమె అందానికి అందరూ దాసోహమన్నారు. స్టెప్పుల్లో, స్పీడ్‌లో రంభ స్టైలే వేరు. హీరోరుున్‌గానే కాకుండా డ్యాన్స లోనూ కొత్త ఒరవడి సృష్టించిన రంభ... ఇప్పుడు తమ టాలెంట్‌ను నిరూపించుకోవాలనుకొనే వారికి వేదిక కాబోతున్న ‘ఏబీసీడీ’ ప్రోగ్రామ్‌కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్లు జీ తెలుగు ప్రతినిధి గురు వారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా అవకాశాలు తగ్గింతే చాలామంది నటీమణులు బుల్లితెరకు షిప్ట్ అవుతున్న విషయం తెలిసిందే. సీరియల్స్ లో నటించడంతో పాటు, డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు కూడా. 'జయం' చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అయిన సదా...'ఢీ' జోడీ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉన్న రంభ తాజాగా 'ఏబీసీడీ' కి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. -
అమ్మాయిల ప్రేమ: టీవీ షో తీరుపై ఆగ్రహం!
నటి గీతపై మండిపడుతున్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఒక ప్రైవేటు తెలుగు చానెల్లో ప్రసారమయ్యే టీవీషోలో ఇద్దరు అమ్మాయిల జంటపై ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రముఖ నటి గీత తీరుపై విమర్శలు వస్తున్నాయి. నటి గీత తీరును స్వలింగసంపర్కులకు చెందిన ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ తీవ్రంగా తప్పుబడుతున్నది. గత నెల 31న ప్రసారమైన 'బతుకు జట్కాబండి' షోలో 20 ఏళ్ల అమ్మాయి, 23 ఏళ్ల లింగమార్పిడి చేసుకున్న అమ్మాయి (ట్రాన్స్ మ్యాన్) జంట వచ్చింది. అయితే, విడిపోయిన దంపతులను, జంటలను న్యాయ పరిష్కార విధానాలు, కౌన్సెలింగ్ ద్వారా ఏకం చేసే సామాజిక కార్యక్రమంగా పేరొందిన ఈ షోలో ఈ జంటపై వ్యాఖ్యాత అయిన గీత తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం ఏమిటని తప్పుబట్టింది. 'ఆమె నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు.. నువ్వు ఎలా అంగీకరించావు' అని గీత లింగమార్పిడి చేసుకున్న వ్యక్తిని ప్రశ్నించింది. అమ్మాయిలు-అమ్మాయిలు, అబ్బాయిలు-అబ్బాయిలు పెళ్లిచేసుకోవడం గురించి తనకు తెలుసునని, కానీ, ఇది వాస్తవంలో ఆచరణ సాధ్యమేనా? అని గీత వారిని ప్రశ్నించింది. ఇలాంటి అనుబంధాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని, వీటిని భారతదేశంలో పాటించకూడదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి తన లైంగిక అభిరుచులు భిన్నంగా ఉండేవని ట్రాన్స్ మ్యాన్ చెప్పినా.. నువ్వెందుకు పురుషుల హెయిర్‌స్టైల్, దుస్తులను అనుసరిస్తున్నావని ప్రశ్నించింది. మీ ఇద్దరు కలిసి ఇలా సినిమాలకు, పార్కులకు వెళ్లడం జుగుప్సకరం. మగవాడిలా డ్రెస్ వేసుకున్నంతమాత్రాన సరిపోదు అని వ్యాఖ్యలు చేసింది. ‘ఒక అమ్మాయితో కలిసి తిరుగడానికి నీకు సిగ్గులేదా? ఇలా చేస్తే నీ కాళ్లు విరగ్గొడతా’ అంటూ గీత బెదిరింపులకు దిగిందని ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తమది భిన్నమైన సమూహమని, తమ గురించి తెలుసుకోకుండా ఈ విధంగా బెదిరింపులకు దిగడం సరికాదని, దీనిపై సదరు చానెల్, షో నిర్వాహకులు వివరణ ఇవ్వాలని తెలుగురాష్ట్రాల్లోని ఎల్జీబీటీ కమ్యూనిటీ డిమాండ్ చేస్తున్నది. -
త్వరలో బుల్లితెరపై దేవిశ్రీ ఆట.. పాట
ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల యూఎస్ఏ (అమెరికా)లో నిర్వహించిన ‘డీఎస్పీ యూఎస్ఏ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’ ని తమ చానల్లో త్వరలో ప్రసారం చేయనున్నట్లు జీ తెలుగు టీవీ ప్రతినిధి తెలిపారు. అమెరికాలోని పలు ప్రాంతాల్లో విభిన్నమైన సంగీతం, విలక్షణమైన ప్రదర్శనలతో జరిగిన ఈ మెగా ఈవెంట్‌ని ‘డోల్బీ అట్మాస్’ సిస్టమ్‌లో ఈ శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ కార్యక్రమంలో దేవిశ్రీ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన విజేత లకు దేవిశ్రీని కలుసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. -
బొబ్బిలిలో ‘మంగమ్మగారి మనవరాలు’
బొబ్బిలి : బొబ్బిలిలో ‘మంగమ్మగారి మనువరాలు’ సీరియల్ చిత్రీకరణ ఆదివారం జరిగింది. ‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ఈ సీరియల్లో రాను న్న సీతారామకల్యాణం సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. స్థానిక సంస్థా నం హైస్కూలు మైదానంలో కల్యాణానికి సంబంధించిన భారీ సెట్టింగ్‌లు వేశారు. ఆదివారం రాత్రి స్థానిక సూర్య రెసిడెన్సీ నుంచి సీతారాముల విగ్రహాల ను పట్టణంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. నటీనటులను, షూటింగ్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో పట్టణ వాసులు తరలివచ్చారు. -
వెరైటీ మిస్సవుతోంది వరూధినీ!
ఆనాడు ‘మనుచరిత్ర’లో ప్రవరాఖ్యుడి ప్రేమ కోసం పరి పరి విధాల ప్రయత్నించింది వరూధిని. భర్త ఆదరణను, నమ్మకాన్ని చూరగొనడం కోసం పడరాని పాట్లు పడుతోంది నేటి వరూధిని. అదేనండీ... బుల్లితెర వరూధిని. జీ తెలుగులో ప్రసారమవుతోన్న ‘వరూధినీ పరిణయం’లో హీరోయిన్. అమ్మాయిలంటే ఏమాత్రం ఇష్టపడని హీరోకి భార్య అవుతుంది హీరోయిన్. మొదట్లో పిల్లీ ఎలుకల్లా పోట్లాడుకున్నా, మెల్లగా ఇద్దరి మనసులూ కలుస్తాయి ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలూ పెరుగుతాయి. హమ్మయ్య, అంతా బాగుంది అనుకునేలోపే రకరకాల సమస్యలు. చెప్పలేనని కష్టాలు. మళ్లీ ఇరువురి మధ్యా దూరం. దానికి తోడు ఆమె క్యారెక్టర్‌నే వేలెత్తి చూపించే అపనిందలు. అబ్బబ్బబ్బ... ఒక్కటి కాదు, వంద కష్టాలు వరూధినికి. కాకపోతే సమస్య ఏమిటంటే... ఈ కష్టాలన్నీ ఆల్రెడీ చాలా సీరియళ్లలో, సినిమాల్లో హీరోయిన్లు పడినవే కావడం. మొదట్లో సరికొత్త పాయింట్‌తో చక్కగా మొదలైన ఈ సీరియల్... ఉండేకొద్దీ పాత మూసలోకి మారిపోయింది. ఓ మామూలు సీరియల్ తరహాలోనే సాగిపోతోంది. ఆ విషయాన్ని గమనించి దర్శకుడు కాస్త ఆసక్తి కరమైన మలుపులు సృష్టిస్తే మంచిదేమో! -
జీ తెలుగు గేమ్ షో ‘రేస్’
సిటీబ్యూరో: మజాతో మనీని కూడా కలిపి జీ తెలుగు అందిస్తున్న గేమ్ షో ‘రేస్’. నటి రోజా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఆలోచింపజేసే ప్రశ్నలతో, సెలబ్రిటీస్ సరదాలతో, ఆట పాటలతో ‘హంగామా’గా ఈ రేస్ కార్యక్రమం ఉండబోతోందని జీ తెలుగు చానల్ ప్రతినిధి తెలిపారు. సీనియర్ యాంకర్స్ ఝాన్సీ, శిల్పా చక్రవర్తిలతోపాటు నటుడు మధునందన్, చంద్ర తొలి ఎపిసోడ్లో పాల్గొని వినోదాన్ని పంచనున్నారనీ, రానున్న ఎపిసోడ్స్‌లో ఎందరో సెలబ్రిటీస్ ఈ కార్యక్రమంలో అలరించనున్నారనీ వారు చెప్పారు. ఈ నెల 29 (రేపు) నుంచి ప్రతి శనివారం రాత్రి 9 గం. 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. బహుమతిగా ముద్దమందారం.. జీ తెలుగులో ఇటీవలే ప్రారంభమై విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ధారావాహిక ‘ముద్దమందారం’. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ ధారావాహిక ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోందనీ, ఈ కథ విన్న నాగార్జున... ప్రియమైన వారికి విలువైన బహుమతుల బదులుగా ముద్దమందారం మొక్కని ఇవ్వాలని పిలుపునిచ్చారనీ జీ తెలుగు చానల్ ప్రతినిధి తెలిపారు. తనూజ, హరిత, పవన్‌సాయి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకూ రాత్రి 7 .30 గంటలకు ప్రసారమవుతుంది. -
పాపం... సీత కష్టాలు!
టీవీక్షణం: ప్రేమించే భర్త దొరికితే ఆడ పిల్లకి అంతకన్నా అదృష్టం మరొ కటి ఉండదంటారు. మీనాక్షికి ప్రేమించే భర్తే దొరికాడు. కానీ ఆ ప్రేమను భరించడం ఆమె వల్ల కాలేదు. ప్రేమ పేరుతో భర్త పెట్టే హింసను భరించలేక కుమిలిపో తుందామె. అలాంటప్పుడే ఓ రోజు ప్రమాదవశాత్తూ నదిలో పడిపోతుంది. తర్వాత వేరే చోటికి చేరుతుంది. మరి ఆమె మళ్లీ తనకోసం వెతుకుతోన్న భర్తకి దొరుకుతుందా? కష్టాల్లో పడుతుందా? తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ‘రామా.. సీత..’ సీరియల్ చూడాలి. మొదట ‘రామా... సీతెక్కడ’ అన్న టైటిల్ పెట్టినా, కొన్ని సమస్యల కారణంగా ‘రామా.. సీత’గా మార్చారు. పాత కథే అయినా కథనం ఆసక్తికరంగానే ఉంది. మీనాక్షిగా హీరోయిన్ నటన బాగుంది. కానీ శాడిస్టు భర్తగా హీరో నటన అంతంత మాత్రం. హావభావాలు ఎప్పుడూ ఒకేలా ఉండటమే కాక, డైలాగ్ డెలివరీ కూడా అంత బాగా లేదు. సీరియస్‌గా కనిపించే ప్రయత్నంలో బిగుసుకుపోతు న్నట్టుగా కనిపిస్తున్నాడు. అదొక్కటే సీరియల్‌కి మైనస్! -
అన్నాచెల్లెళ్ల అనుబంధంతో మీనా
అమ్మానాన్నా అన్నీ తానై చెల్లెల్ని పెంచే ఓ అన్న, తనకు తోడునీడగా ఉండే అన్న ప్రేమను ఆస్వాదించే ఓ చెల్లి.. ఈ ఇద్దరి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో సాగే ధారావాహిక ‘మీనా’. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి నిదర్శనంగా నిలిచే ఈ సీరియల్ ఓ ప్రముఖ జాతీయ చానల్లో ‘వీరా’గా జనాదరణ పొందడం విశేషమని, తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని జీ తెలుగు ప్రతినిధి తెలిపారు. రేపట్నుంచీ జీ తెలుగులో ఈ ధారావాహిక సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది. -
జీ తెలుగులో 29 నుంచి... ‘చోటా ఛాంపియన్’
ఐదేళ్లలోపు చిన్నారులు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. అలాంటిది ఈ చిన్నారులు తమ అమ్మానాన్నల్ని ఆటాడిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది! ఈ ఆలోచనకు కార్యరూపమే జీ తెలుగు ‘చోటా ఛాంపియన్’. ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్‌లోనూ నలుగురు చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొంటారు. ఒక సెట్లో తల్లిగానీ, తండ్రి గానీ ఉంటే, మరో సెట్లో చిన్నారితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరు ఉంటారు. మొదటి రౌండ్ విజేత ముందు ఐదు కుండలు ఆకర్షణీయమైన బొమ్మలతో బోర్లించి ఉంటాయి. విజేత రెండుఅవకాశాలను వినియోగించుకుని కుండలను పగలగొట్టాలి. పగలగొట్టిన కుండకింద డబ్బు ఎంత ఉందో సూచిస్తూ ఒక సంఖ్య ఉంటుంది. అంత డబ్బూ చిన్నారిదే. ఆ డబ్బు చిన్నారి చదువుకు వినియోగించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. పిల్లలను, పెద్దలను ఆకర్షించే ‘చోటా ఛాంపియన్’ డిసెంబర్ 29న ప్రారంభం కానుంది. ప్రతి ఆదివారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధి వెల్లడించారు. -
ఆ పెద్దావిడ నన్ను పెళ్లాడతానంది! : ప్రదీప్
టీవీక్షణం యాంకరంటే అమ్మాయే, యాంకరింగ్ చేస్తే అమ్మాయిలే చేయాలి అన్న ఆలోచనకు కాలం చెల్లింది. కొందరు అబ్బాయిలు కూడా యాంకర్లుగా అదరగొడుతున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవాడు... ప్రదీప్. కాస్త అల్లరి, ఇంకాస్త కామెడీ, మరికాస్త సందడి కలిపితే ప్రదీప్! తనదైన శైలితో మేల్ యాంకర్స్ రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించిన ఈ తుంటరి పిల్లాడు ఫన్‌డేతో చెప్పిన కబుర్లు... మీరు మొదట ఆర్జే కదా? ఆర్జే ఆవ్వాలని ఎందుకనిపించింది? చిన్నప్పట్నుంచీ మాట్లాడ్డం మొదలెడితే ఆపేవాడిని కాదు. ఇంజినీరింగ్ చేసేటప్పుడు అందరూ ఏడిపించేవారు... డబ్బాలో కంకరరాళ్లు వేసినట్టు వాగుతుంటానని. ఆర్జేకి ఇంతకన్నా గొప్ప క్వాలిటీ ఇంకే కావాలి? అందుకే రేడియో మిర్చిలో ఆడిషన్ జరుగుతోందని తెలిసి వెళ్లాను. సెలెక్టయ్యాను. ఆ ఫీల్డ్‌లో ఉండే పాజిటివ్, నెగిటివ్ అంశాలు చెప్పగలరా? అదో అద్భుతమైన మీడియమ్. ఏ విషయం మీదయినా మాట్లాడవచ్చు. హద్దులు ఉండవు. ఎంటర్టైన్మెంట్తో పాటే ఎన్నో మంచి విషయాలను చెప్పేందుకు అది మంచి వేదిక. తక్కువ టైములో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి పాజిటివ్ అంశాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి నెగిటివ్ అంశాలేమీ లేవందులో. మరి అలాంటి ఫీల్డ్‌ని వదిలి టీవీకెందుకు వచ్చారు? నాకు ఎప్పుడూ ఏదైనా కొత్తగా చేయడం ఇష్టం. కొత్త కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావడం ఇష్టం. రేడియోలోనూ ఆ సౌలభ్యం ఉంది. కానీ టీవీ ద్వారా అయితే ఇంకా ఆస్కారం ఎక్కువ. పెద్ద పెద్ద బ్యానర్లలో మంచి మంచి షోలు చేస్తున్నాను. అయామ్ హ్యాపీ. కానీ ఓ లేడీస్ షో చేయడం... ఇబ్బంది అనిపించలేదా? అసలు ‘గడసరి అత్త సొగసరి కోడలు’ చేయమని అడిగినప్పుడే షాకయ్యా. సుమ, ఝాన్సీ లాంటి వారు అలాంటి షోలకు ఓ సిగ్నేచర్ ఇచ్చారు. నేను వాళ్లలాగా చేయగలనా అని భయపడ్డాను. కానీ ఆ షో నా లైఫ్‌ని మార్చేస్తుందని నేనూహించలేదు. ఆ షో నాకు బెస్ట్ యాంకర్‌గా నంది అవార్డును తెచ్చిపెట్టింది. రేడియోకీ, టీవీకి తేడాలేంటి? ఏది ఎక్కువ నచ్చింది? రెండూ ఒకటే. రెండూ సమానమే. రేడియోలో ఎవరికీ కనిపించకుండా, మన వాయిస్‌తోనే ఇంప్రెస్ చేయాలి. టీవీలో ఆడియోతో పాటు వీడియో కూడా ఉంటుంది. అంతే తేడా! ఓ యాంకర్‌కి అతి కష్టమైనది ఏంటి? గంటో గంటన్నరో వచ్చే షోని మేం నాలుగయిదు గంటలు షూట్ చేస్తాం. ఓసారి మొదలెట్టాక పూర్తయ్యేవరకూ చేయాల్సిందే. పదింటికి వచ్చే షోని మేము తెల్లారుజామున ఏ నాలుగింటికో షూట్ చేయాల్సి రావచ్చు. అంతసేపూ ఆ ఎనర్జీని క్యారీ చేయాలి. మనం డౌన్ అయితే షో డౌన్ అవుతుంది. అది చాలా కష్టం! మర్చిపోలేని ప్రశంస? అత్తారింటికి దారేది షూటింగప్పుడు పవన్ కళ్యాణ్‌గారు ‘నీ షో ఎలా నడుస్తోంది’ అని అడిగారు. బాగా చేస్తున్నావ్ అని మెచ్చుకున్నారు. నా ఆనందం అంతా ఇంతా కాదు. కోట శ్రీనివాసరావుగారు, భరణి గారు, మెహర్ రమేష్, ఇంకా చాలామంది సెలెబ్రిటీలు నా షో చూస్తారట. అయామ్ గ్లాడ్! బాధపెట్టిన విమర్శలేమైనా ఉన్నాయా? లేదు. ఎందుకంటే నాకేదైతే చూసేందుకు నచ్చదో, దాన్ని నేను చేయను. అందరూ ఆస్వాదించగలిగేవే చేస్తాను. ఓసారి ఓ తొంభయ్యేళ్ల ముసలావిడ... ‘నేను లేట్‌గా పుట్టినా, నువ్వు ముందు పుట్టినా, నేను నిన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని’ అంది. అమెరికాలో ఉండే ఇద్దరు డాక్టర్లు, ‘ఎప్పుడూ రక్తం, శవాలను చూసి డిప్రెస్ అయ్యే మాకు, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తోంది నీ షో’ అన్నారు. ఇవన్నీ విన్నప్పుడు నేను వెళ్తోన్న రూట్ కరెక్టేననిపిస్తుంది. మీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువే అనుకుంటా? (నవ్వుతూ) కాస్త ఎక్కువే. మీకెలాంటి అమ్మాయిలు నచ్చుతారు? మా ఇంట్లో కలర్, క్యాస్ట్, స్టేటస్ వంటి వాటి గురించి మాట్లాడే అలవాటు లేదు. నా ఫ్రెండ్స్‌లో కొందరి క్యాస్ట్ ఏమిటో కూడా నాకు తెలియదంటే, అది మా అమ్మానాన్నలు నేర్పిన సంస్కారం. పైగా హైదరా బాద్లోనే పుట్టి పెరిగాను కాబట్టి అలాంటి భావాలు ఒంట బట్ట లేదు. అందుకే నాకు కొలమానాలు లేవు. భవిష్యత్ ప్రణాళికలేంటి? ముందే ప్లాన్ చేసుకునే అలవాటు లేదు. ఇంజినీరింగ్ చేసి ఆర్జే అయ్యా. అనుకోకుండా టీవీ కొచ్చా. ఊహించకుండా సినిమాల్లోకి వెళ్లా. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఏం జరిగినా మన మంచికే. -సమీర నేలపూడి ప్రదీప్ జులాయి ఆడిషన్‌కి వెళ్లినప్పుడు ... త్రివిక్రమ్‌గారిని ఎలా ఫేస్ చేయాలి, ఎలా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ వెళ్లాను. తీరా వెళ్లాక ఆయనే కూర్చున్నవారు లేచి వచ్చి మరీ నన్ను ఆప్యాయంగా పలకరించారు. నేను నీ ఫ్యాన్‌ని అన్నారు. వల్గారిటీకి, కామెడీకి మధ్య ఉన్న గీతను నువ్వెప్పుడూ దాటవు అంటూ మెచ్చుకున్నారు. ఇంతకంటే పెద్ద ప్రశంసను జీవితంలో అందుకోగలనా!