తెలుగువారు మెచ్చిన గుండమ్మ | Gundamma Story serial In Zee Telugu | Sakshi
Sakshi News home page

తెలుగువారు మెచ్చిన గుండమ్మ

Published Wed, Apr 17 2019 2:02 AM | Last Updated on Wed, Apr 17 2019 2:02 AM

Gundamma Story serial In Zee Telugu  - Sakshi

తనకు చెడు చేసేవారికైనామంచే జరగాలని కోరుకునే అందమైన మనసున్న గీతను జీ తెలుగులో వచ్చే ‘గుండమ్మ కథ’ సీరియల్‌లో చూడాలి. బొద్దుగా ఉంటే అవకాశాలు రావేమోననేనెగిటివ్‌ ఆలోచనలను ఆమడ దూరం పెట్టేసినఆత్మస్థైర్యాన్ని పరిచయం చేసుకోవాలంటే గుండమ్మ ఉరఫ్‌ పూజామూర్తి చెప్పే మాటలు వినాలి. 

‘‘గుండమ్మ కథ సీరియల్‌లో నా పేరు గీత. చాలా మంచి అమ్మాయి తను. డౌన్‌ టు ఎర్త్‌ గర్ల్‌. ఎవరైనా తనకు చెడు తలపెట్టినా సరే వారికి మంచే జరగాలి అనుకుంటుంది. గీతకు వదిన ఉంటుంది. టార్చర్‌ చేయడమే తన పని. గీత తనలో తానే బాధపడుతుంది కానీ వదినను ఒక్కమాట కూడా అనదు. తండ్రి స్నేహితుడి కొడుకుతో గీతకు పెళ్లవుతుంది. లావుగా ఉందన్న కారణంగా.. నచ్చని పెళ్లి చేసుకున్న భర్త గీతను సరిగ్గా చూసుకోడు.

చెల్లెలితో సహా ఇంట్లో అంతా ఆమెను బాధపెట్టేవారే. అయినా, మనో నిబ్బరం కోల్పోకుండా అందరికీ సపోర్టివ్‌గా ఉంటూ తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ఉంటుంది. నచ్చని జీవితాన్ని నచ్చేలా మార్చుకుంటూ ముందుకు సాగే ఒక అమ్మాయి విజయగాథ ఇది. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఏడాది క్రితం వరకు బరువు పెరిగి అవకాశాలు లేక ఉద్యోగం చేసుకుంటున్న నాకు ఈ సీరియల్‌ ఒక ప్లాట్‌ఫామ్‌ ఇచ్చింది. అమ్మాయిలు లావు అయితే ఇక వారి పని అంతే.. అనుకోవడానికి లేదు. అందుకు నేనే ఓ ఉదాహరణ. 

కన్నడ అమ్మాయిని
అమ్మ కళావతి ఉద్యోగి. నాన్న శ్రీనివాసమూర్తి సివిల్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌. అమ్మ తరపు వాళ్లు తెలంగాణలోని కోదాడలో బంధువులు ఉన్నారు. మేం ఉండేది బెంగుళూరులో. నా స్నేహితుల జాబితాలోనూ, మా ఇంటి చుట్టుపక్కల తెలుగు, తమిళ్‌ వాళ్లు ఎక్కువే. అలా నాకు తెలుగు, తమిళ భాషలు వచ్చు. చిన్నప్పటి నుంచి స్టేజ్‌ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. నా ఆసక్తి గమనించి నాన్న కూడా ఏ ఒక్క షో మిస్సవనిచ్చేవారు కాదు. హైస్కూల్‌కి వచ్చాక మాత్రం స్టేజ్‌ షోలు తగ్గించి డిగ్రీ వరకు చదువు మీదే కాన్‌సంట్రేట్‌ చేశాను. ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా కన్నడ సీరియల్‌లో మా ఫ్రెండ్స్‌ వల్ల అవకాశం వచ్చింది. 

సీరియల్‌ పూర్తయ్యాక
చిన్ననాటి నుంచి శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నాను. అయితే కన్నడలో సీరియల్స్‌ చేసేటప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని రోజూ చేయడం కుదరక మానుకున్నాను. దీంతో మెల్లమెల్లగా బరువు పెరగడం మొదలుపెట్టాను. హెరిడిటరీ కూడా దీనికి ఓ కారణం అయ్యింది. వేరే వాళ్లను ఇంప్రెస్‌ చేయడానికి నన్ను నేను క్షోభ పెట్టుకోవద్దని బలంగా అనుకున్నాను. ఆ తర్వాత సీరియల్స్‌ అవకాశాలు లేక ఇంటి దగ్గర నెల రోజులు ఖాళీగా ఉన్నాను. అలాగని నేనెప్పుడూ డిప్రెస్‌ అవలేదు. ఇది కాకపోతే మరోటి అనుకున్నాను. ఒక సాఫ్ట్‌వేర్‌ జాబ్‌కి అప్లై చేశాను. అది నైట్‌ షిప్ట్‌. రెండేళ్లు ఆ జాబ్‌లో ఉన్నాను. దీంతో బరువు పెరగడంలో ఇంకా తేడా వచ్చింది. అయితే, గాడ్‌ గిఫ్ట్‌ ఏంటంటే అధిక బరువు ఎప్పుడూ నా ప్రతిభకు అడ్డంకి కాలేదు. జీవితం పట్ల హోప్‌ పోగొట్టుకోలేదు.

రీమేక్‌తో ఎంట్రీ
‘బ్రహ్మగంటు’ అనే కన్నడ సీరియల్‌ తెలుగు రీమేక్‌ కోసం యూనిట్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఇది కూడా నా స్నేహితురాలి ద్వారా. ‘నేను ఇప్పుడు మీ సీరియల్‌ చేయలేను. అందుకు సన్నగా ఉండాలి కదా!’ అని చెప్పాను. కానీ, ఈ క్యారెక్టర్‌కి ఇలాగే ఉండాలి. ఆడిషన్స్‌కి రండి అన్నారు. అలా తెలుగు సీరియల్‌ ‘గుండమ్మకథ’లో లీడ్‌ రోల్‌ నన్ను వరించింది. 

అమ్మ నాన్న నేను
ఒక్కదాన్నే కూతురుని అమ్మనాన్నలకు. ఎల్‌కేజీ నుంచి నాకు యాక్టింగ్‌లో ఉన్న ఆసక్తి వాళ్లకు తెలుసు. వాళ్లూ ఎక్కడా నాకు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు వారం రోజులు అమ్మనాన్నల దగ్గర, వారం రోజులు షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఇప్పుడు నా జీవితం చాలా బాగుంది. సీరియల్స్‌లో అవకాశాలు ఉన్నన్నాళ్లూ ఇలా ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను. కాలం ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తుందని బలంగా నమ్ముతాను. కన్నడ సీరియల్స్‌ చేసినప్పుడు ‘చింతన’గా అక్కడ చాలామందికి పరిచయం. ఇప్పుడు గుండమ్మ కథ ద్వారా ఇటు తెలుగులోనూ, బెంగుళూరులోను గుండమ్మ, గీత.. అని అందరూ గుర్తిస్తున్నారు. అలాగే పలకరిస్తున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది.’

నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement