Gundamma Katha
-
ఎన్ని తరాలు చూసినా కొత్తగా అనిపించే కల్ట్ క్లాసిక్ 'గుండమ్మ కథ'
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.గుండమ్మగా ఆమే కరెక్ట్సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.గార్డెన్స్‌లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్‌లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.ఇద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.ఫొటోలతో టైటిల్స్ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్‌పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.‘గుండమ్మ కథ’ రీమేక్?ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.– అలిపిరి సురేష్ -
Harshala: ఘనంగా గుండమ్మ కథ సీరియల్ నటి వివాహం (ఫోటోలు)
-
‘గుండమ్మ కథ’కు షష్టిపూర్తి: అలనాటి నటి జమునకు సత్కారం
సాక్షి, బంజారాహిల్స్: తెలుగు సినిమా రంగంలో 60వ దశకంలో చరిత్ర సృష్టించిన గుండమ్మ కథ చిత్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయిక అలనాటి అందాల నటి జమునకు అభినందన, ఆత్మీయ సత్కారం బుధవారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జరిగింది. ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి ఆకృతి సుధాకర్‌తో కలిసి జమునను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గుండమ్మ కథ’ వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఇంటిల్లిపాది టీవీల్లో ఈ చిత్రాన్ని ఉత్సాహంగా చూస్తున్నారన్నారు. అగ్రనటుల కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిందన్నారు. ఇందులో నటించి జీవించి ఉన్న ఒకరిద్దరిలో జమున ఒకరన్నారు. ఆమె చిరకాలం సంతోషంగా జీవించాలని వీలైయితే సినిమాల్లో నటించి తనలాంటి అభిమానులను అలరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జమున మాట్లాడుతూ.. అప్పటి నటుల మధ్య ఆత్మీయ భావాలు ఉండేవన్నారు. గయ్యాళిగా కనిపించే ‘గుండమ్మ’ పాత్రధారి సూర్యకాంతం ఎంతో మంచివారని, షూటింగ్ సమయంలో క్యారేజీలు తెచ్చి నటీనటులందరికీ తానే వడ్డించేవారన్నారు. కార్యక్రమంలో జమున కూతురు కళాకారిణి స్రవంతి పాల్గొన్నారు. చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తెరకెక్కిన చిత్రం ‘గుండమ్మ కథ’. ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మించిన ఈ సినిమాలోని ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే మొదటి పాటని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ తదితర అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. సతీష్ సాధన్ చక్కటి పాటలు అందించారు. ‘రింగ్ ట్రింగ్..’ అంటూ సాగే ఈ పాటను వేగ్నేశ్న శ్రీ విజయ రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే మా చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘గెటప్’ శ్రీను, భాష నటించిన ఈ చిత్రానికి కెమెరా: మోనీష్ భూపతి, దర్శకత్వం: లక్ష్మీ శ్రీవాత్సవ, కృష్ణంరాజు. -
మోడ్రన్ గుండమ్మ
ఆదిత్య, ప్రణవ్య జంటగా కృష్ణంరాజు– లక్ష్మీ శ్రీవాత్సవ దర్శక ద్వయం తెరకెక్కించిన చిత్రం ‘గుండమ్మకథ’ (2020). ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘అలనాటి ‘గుండమ్మకథ’ చిత్రం తరతరాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఆ స్ఫూర్తితో ఈ మోడ్రన్ గుండమ్మకథను రెడీ చేశాం. లవ్, కామెడీ, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. లాక్డౌన్ ముగిసిన వెంటనే సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.ఈ సినిమాకు ఒక నిర్మాతగా ఉన్న లక్ష్మీ శ్రీవాత్సవ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ‘గెటప్’ శ్రీను, భాష తదితరులు నటించిన ఈ సినిమాకు మోనీష్ భూపతి సంగీతం అందించారు. -
నటనలో ఆమెకు ఆమే సాటి
ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే ఆమె గయ్యాళి అత్త పాత్రకు పెట్టింది పేరయ్యారు. అది ఎంతగా అంటే ఆమె పేరు పెట్టుకోవడానికి తెలుగువారు భయపడేంత. ఆమె ఎవరో కాదు.. సూర్యకాంతం. తూర్పు గోదావరి జిల్లా వాసే.. అక్టోబర్ 28న ఆమె జయంతి సందర్భంగా ఆమెకు ‘సాక్షి’ స్మృత్యాంజలి సాక్షి, మధురపూడి (రాజానగరం): వీధుల్లో, కుళాయిల వద్ద ఎక్కడైనా మహిళలకు తగాదాలొచ్చినా, అత్తగారి నుంచి కోడలికి వేధింపులు జరిగినా వినబడే పేరు సూర్యకాంతం. నటనలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె పేరు చిరంజీవిగా నిలిచిపోయింది. గయ్యాళి అత్తగా, గడ సరి మహిళగా ఆమె మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆ పేరు వరి్థల్లుతోంది. సుమారు 780 సినిమాల్లో ఆమె నటించారు. జిల్లాలో చిత్రీకరించిన అనేక సినిమాల్లో నటించారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి, నిడిగట్ల, బూరుగుపూడిల్లో, రాజానగరం మండలం నరేంద్రపురం తదితర గ్రామాల్లో జరిగిన షూటింగ్‌ల్లో పాల్గొన్నారు. జిల్లాలో చిత్రీకరించిన సినిమాల్లో ఆమెకు మంచి పేరు తెచ్చినవి ఎనీ్టఆర్ బడిపంతులు, ఏఎన్నార్ అందాలరాముడు, మూగమనసులు. ‘‘మంచి మనసులు’లో ఎస్వీఆర్, సూర్యకాంతం ఆమె సెట్లోకి వస్తే అలెర్ట్ సూర్యకాంతం సినిమా షూటింగ్ సెట్లోకి వస్తే అంతా అలర్ట్ అవుతారనే నానుడి ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె నటించినా హీరోలు సైతం అలెర్ట్ కావల్సిందే. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలైనప్పటికీ గుండమ్మ అక్క పాత్రకే ప్లస్ మార్కులను ప్రేక్షకులిచ్చారు. నటనలో ఆమెకు ఆమే సాటి నటనలో సూర్యకాంతాన్ని ఓవర్టేక్ చేయగలవారు రాలేదు. గుండమ్మ కథను నేటి ప్రముఖ యువ హీరోలతో తీయడానికి నిర్మాతలు ఉన్నా ఆ పాత్రలో నటించగల నటి లేకపోవడంతో ఆ చిత్రం మళ్లీ రూపుదిద్దుకోలేదు. జీవన ప్రస్థానం సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28వ తేదీన పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నం దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. కాకినాడ మెక్లారిన్ స్కూల్లో చదువుకున్నారు. నాట్యం, నటనలో ఆసక్తిగల ఆమె కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి మరింత ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లి జెమినీ సంస్థలో ఉద్యోగిగా చేరారు. ఆమె తొలి చిత్రం ‘చంద్రలేఖ’. అందులో ఆమె డ్యాన్సర్‌గా నటించారు. హీరోయిన్గా ‘సౌదామి’ని చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ కారు ప్రమాదంలో ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. దాంతో హీరోయిన్గా నటిద్దామనుకున్న ఆమె కల తీరనే లేదు. ఏఎన్నార్ నటించిన ‘సంసారం’ చిత్రంలో ఆమె గయ్యాళి అత్త పాత్రను తొలిసారిగా చేశారు. తరువాత ఆమె ఇక తిరిగి చూడనక్కర్లేకపోయింది. 1950లో పెద్దిబొట్ల చలపతిరావుతో ఆమెకు వివాహమయ్యింది. ఆమె చివరి సినిమా ‘వన్ బై టూ’ (1993). సూర్యకాంతం 1996 డిసెంబర్ 17న కన్నుమూశారు. -
తెలుగువారు మెచ్చిన గుండమ్మ
తనకు చెడు చేసేవారికైనామంచే జరగాలని కోరుకునే అందమైన మనసున్న గీతను జీ తెలుగులో వచ్చే ‘గుండమ్మ కథ’ సీరియల్లో చూడాలి. బొద్దుగా ఉంటే అవకాశాలు రావేమోననేనెగిటివ్ ఆలోచనలను ఆమడ దూరం పెట్టేసినఆత్మస్థైర్యాన్ని పరిచయం చేసుకోవాలంటే గుండమ్మ ఉరఫ్ పూజామూర్తి చెప్పే మాటలు వినాలి. ‘‘గుండమ్మ కథ సీరియల్లో నా పేరు గీత. చాలా మంచి అమ్మాయి తను. డౌన్ టు ఎర్త్ గర్ల్. ఎవరైనా తనకు చెడు తలపెట్టినా సరే వారికి మంచే జరగాలి అనుకుంటుంది. గీతకు వదిన ఉంటుంది. టార్చర్ చేయడమే తన పని. గీత తనలో తానే బాధపడుతుంది కానీ వదినను ఒక్కమాట కూడా అనదు. తండ్రి స్నేహితుడి కొడుకుతో గీతకు పెళ్లవుతుంది. లావుగా ఉందన్న కారణంగా.. నచ్చని పెళ్లి చేసుకున్న భర్త గీతను సరిగ్గా చూసుకోడు. చెల్లెలితో సహా ఇంట్లో అంతా ఆమెను బాధపెట్టేవారే. అయినా, మనో నిబ్బరం కోల్పోకుండా అందరికీ సపోర్టివ్‌గా ఉంటూ తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ఉంటుంది. నచ్చని జీవితాన్ని నచ్చేలా మార్చుకుంటూ ముందుకు సాగే ఒక అమ్మాయి విజయగాథ ఇది. ఈ కథ నాకు బాగా నచ్చింది. ఏడాది క్రితం వరకు బరువు పెరిగి అవకాశాలు లేక ఉద్యోగం చేసుకుంటున్న నాకు ఈ సీరియల్ ఒక ప్లాట్‌ఫామ్ ఇచ్చింది. అమ్మాయిలు లావు అయితే ఇక వారి పని అంతే.. అనుకోవడానికి లేదు. అందుకు నేనే ఓ ఉదాహరణ. కన్నడ అమ్మాయిని అమ్మ కళావతి ఉద్యోగి. నాన్న శ్రీనివాసమూర్తి సివిల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. అమ్మ తరపు వాళ్లు తెలంగాణలోని కోదాడలో బంధువులు ఉన్నారు. మేం ఉండేది బెంగుళూరులో. నా స్నేహితుల జాబితాలోనూ, మా ఇంటి చుట్టుపక్కల తెలుగు, తమిళ్ వాళ్లు ఎక్కువే. అలా నాకు తెలుగు, తమిళ భాషలు వచ్చు. చిన్నప్పటి నుంచి స్టేజ్ షోలలో చురుగ్గా పాల్గొనేదాన్ని. నా ఆసక్తి గమనించి నాన్న కూడా ఏ ఒక్క షో మిస్సవనిచ్చేవారు కాదు. హైస్కూల్‌కి వచ్చాక మాత్రం స్టేజ్ షోలు తగ్గించి డిగ్రీ వరకు చదువు మీదే కాన్సంట్రేట్ చేశాను. ఫైనల్ ఇయర్లో ఉండగా కన్నడ సీరియల్లో మా ఫ్రెండ్స్ వల్ల అవకాశం వచ్చింది. సీరియల్ పూర్తయ్యాక చిన్ననాటి నుంచి శాస్త్రీయ నృత్యం కూడా నేర్చుకున్నాను. అయితే కన్నడలో సీరియల్స్ చేసేటప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని రోజూ చేయడం కుదరక మానుకున్నాను. దీంతో మెల్లమెల్లగా బరువు పెరగడం మొదలుపెట్టాను. హెరిడిటరీ కూడా దీనికి ఓ కారణం అయ్యింది. వేరే వాళ్లను ఇంప్రెస్ చేయడానికి నన్ను నేను క్షోభ పెట్టుకోవద్దని బలంగా అనుకున్నాను. ఆ తర్వాత సీరియల్స్ అవకాశాలు లేక ఇంటి దగ్గర నెల రోజులు ఖాళీగా ఉన్నాను. అలాగని నేనెప్పుడూ డిప్రెస్ అవలేదు. ఇది కాకపోతే మరోటి అనుకున్నాను. ఒక సాఫ్ట్వేర్ జాబ్‌కి అప్లై చేశాను. అది నైట్ షిప్ట్. రెండేళ్లు ఆ జాబ్‌లో ఉన్నాను. దీంతో బరువు పెరగడంలో ఇంకా తేడా వచ్చింది. అయితే, గాడ్ గిఫ్ట్ ఏంటంటే అధిక బరువు ఎప్పుడూ నా ప్రతిభకు అడ్డంకి కాలేదు. జీవితం పట్ల హోప్ పోగొట్టుకోలేదు. రీమేక్‌తో ఎంట్రీ ‘బ్రహ్మగంటు’ అనే కన్నడ సీరియల్ తెలుగు రీమేక్ కోసం యూనిట్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇది కూడా నా స్నేహితురాలి ద్వారా. ‘నేను ఇప్పుడు మీ సీరియల్ చేయలేను. అందుకు సన్నగా ఉండాలి కదా!’ అని చెప్పాను. కానీ, ఈ క్యారెక్టర్‌కి ఇలాగే ఉండాలి. ఆడిషన్స్‌కి రండి అన్నారు. అలా తెలుగు సీరియల్ ‘గుండమ్మకథ’లో లీడ్ రోల్ నన్ను వరించింది. అమ్మ నాన్న నేను ఒక్కదాన్నే కూతురుని అమ్మనాన్నలకు. ఎల్కేజీ నుంచి నాకు యాక్టింగ్‌లో ఉన్న ఆసక్తి వాళ్లకు తెలుసు. వాళ్లూ ఎక్కడా నాకు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు వారం రోజులు అమ్మనాన్నల దగ్గర, వారం రోజులు షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాను. ఇప్పుడు నా జీవితం చాలా బాగుంది. సీరియల్స్‌లో అవకాశాలు ఉన్నన్నాళ్లూ ఇలా ఈ ఫీల్డ్‌లో కొనసాగుతాను. కాలం ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తుందని బలంగా నమ్ముతాను. కన్నడ సీరియల్స్ చేసినప్పుడు ‘చింతన’గా అక్కడ చాలామందికి పరిచయం. ఇప్పుడు గుండమ్మ కథ ద్వారా ఇటు తెలుగులోనూ, బెంగుళూరులోను గుండమ్మ, గీత.. అని అందరూ గుర్తిస్తున్నారు. అలాగే పలకరిస్తున్నారు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది.’ నిర్మలారెడ్డి -
'వాళ్లిద్దరి'తో గుండమ్మ కథ రీమేక్!
అలనాటి క్లాసిక్ హిట్ 'గుండమ్మ కథ'ను రీమేక్ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్టారు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ లు కలిసి నటించిన 'ఈడో రకం ఆడో రకం' సక్సెస్ మీట్ లో మోహన్ బాబు మాట్లాడుతూ.. 1962 క్లాసిక్ సినిమా గుండమ్మ కథను విష్ణు, రాజ్ తరుణ్ లను ప్రధాన పాత్రలుగా పెట్టి రీమేక్ చేయాలని ఉందని వెల్లడించారు. అయితే ప్రస్తుతం తన వద్ద ఆ సినిమా రీమేక్ హక్కులు లేవని, సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నప్పుడు హక్కులను కొనుగోలు చేస్తానని అన్నారు. గుండమ్మ కథ రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని పలువురు ప్రముఖులు చెప్పడం అడపాదడపా వార్తల్లో వింటూనే ఉన్నాం. దివంగత నిర్మాత డా.డి.రామానాయుడు కూడా ఆ సినిమాను రీమేక్ చేయాలని ఆకాంక్షించారు. గుండమ్మ కథలో అన్నదమ్ములుగా అఖిలాంధ్ర ప్రేక్షకులను మెప్పించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల స్థానంలో వారి వారసులు జూ.ఎన్టీఆర్, నాగ చైతన్యలను రీమేక్ సినిమాలో చూడాలని పలువురు అభిమానులతోపాటు సినీ ప్రముఖుల కోరిక. తాజాగా ఈ సినిమాపై మోహన్ బాబు కూడా మనసు పారేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి ఆధ్వర్యంలో ఈ క్లాసికల్ మూవీ తెరకెక్కుతుందో చూడాలి మరి. -
బాలభారతం... ఓ వినూత్న ప్రయోగం
కమలాకర కామేశ్వరరావు అనగానే పాండురంగ మహత్మ్యం, నర్తనశాల, పాండవవనవాసం, గుండమ్మ కథ చిత్రాలే ఎక్కువశాతం గుర్తొస్తాయి. కానీ ఆయన చేసిన అపూర్వ ప్రయోగం ఒకటుంది. ఆదే ‘బాలభారతం’(1972). పిల్లలే కురుపాండవులుగా... కామేశ్వరరావు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఆ రోజుల్లో సంచలనం. దాదాపు 80మంది పిల్లలు ఈ సినిమాలో నటించారు. మహాభారతాన్ని పిల్లల నేపథ్యంలో చూపించాలనే ఉద్దేశంతో కథలో చిన్న చిన్న మార్పులు చేశారు రచయిత సముద్రాల జూనియర్. కర్ణ, దుర్యోధన మైత్రి... వారు యుక్తవయస్కులుగా ఉన్నప్పుడు మొదలైనట్ల్లు అప్పటివరకూ సినిమాల్లో చూపించారు. కానీ ‘బాలభారతం’లో బాల్యంలోనే వారి మైత్రి కుదిరినట్లు చూపించేశారు కామేశ్వరరావు. చిరు ప్రాయంలోనే కర్ణుణ్ణి అంగరాజుని చేసేశారాయన. ఇంకా భీముడికి కౌరవులు విషాహారం పెట్టి పాతాళలోకంలో పడేయడం, నాగేంద్రుని వరంతో భీముడు నాగాయుధ బలసంపన్నుడవడం, భీముడు ఇంద్రలోకం వెళ్లి ఐరావతం తెచ్చి మరీ తల్లితో ఐరావత వ్రతం చేయించడం.. తదితర ఘట్టాలతో, బాలబాలికల అపూర్వ నటనాచాతుర్యంతో ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. ఈ చిత్రంలో కురుపాండవులుగా పిల్లలు నటించగా, కురువృద్ధులు, గురువృద్ధులుగా మేటి నటులు నటించారు. భీష్ముడిగా ఎస్వీరంగారావు, పాండురాజుగా కాంతారావు, కుంతిదేవిగా అంజలీదేవి, గాంధారిగా ఎస్.వరలక్ష్మి, నారదునిగా హరనాథ్, ద్రోణునిగా మిక్కిలినేని, శకునిగా ధూళిపాళ అసమాన నటనాపటిమను కనబరిచారు. దుర్యోధనునిగా నటించిన మాస్టర్ ప్రభాకర్ నటన ఈ చిత్రానికి హైలైట్. శ్రీదేవి ఇందులో బాలనటి. సుయోధనుని చెల్లెలుగా నటించారామె. రసాలూరు సాలూరివారి ఒక్కో పాట ఈ సినిమాకు ఒక్కో ఆభరణం. ముఖ్యంగా భీముడు నిచ్చెనెక్కి స్వర్గలోకానికి వెళ్లే ఘట్టంలో ఘంటసాల ఆలపించిన ‘మానవుడే... మహనీయుడు... శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు’ పాట నేటికీ ఎవరూ మరచిపోలేదు. మహిజ ప్రకాశరావు నిర్మించిన ఈ చిత్రం ఆ రోజుల్లో విశేష ప్రజాదరణ చూరగొంది. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ ‘బాలభారతం’ చిత్రాన్ని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.