బాలభారతం... ఓ వినూత్న ప్రయోగం | bala bharatham movie is a different experiment | Sakshi
Sakshi News home page

బాలభారతం... ఓ వినూత్న ప్రయోగం

Published Mon, Nov 18 2013 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM

బాలభారతం... ఓ వినూత్న ప్రయోగం

బాలభారతం... ఓ వినూత్న ప్రయోగం

కమలాకర కామేశ్వరరావు అనగానే పాండురంగ మహత్మ్యం, నర్తనశాల, పాండవవనవాసం, గుండమ్మ కథ చిత్రాలే ఎక్కువశాతం గుర్తొస్తాయి. కానీ ఆయన చేసిన అపూర్వ ప్రయోగం ఒకటుంది. ఆదే ‘బాలభారతం’(1972). పిల్లలే కురుపాండవులుగా... కామేశ్వరరావు చేసిన ఈ వినూత్న ప్రయోగం ఆ రోజుల్లో సంచలనం. దాదాపు 80మంది పిల్లలు ఈ సినిమాలో నటించారు. మహాభారతాన్ని పిల్లల నేపథ్యంలో చూపించాలనే ఉద్దేశంతో కథలో చిన్న చిన్న మార్పులు చేశారు రచయిత సముద్రాల జూనియర్. కర్ణ, దుర్యోధన మైత్రి... వారు యుక్తవయస్కులుగా ఉన్నప్పుడు మొదలైనట్ల్లు అప్పటివరకూ సినిమాల్లో చూపించారు. కానీ ‘బాలభారతం’లో బాల్యంలోనే వారి మైత్రి కుదిరినట్లు చూపించేశారు కామేశ్వరరావు. చిరు ప్రాయంలోనే కర్ణుణ్ణి అంగరాజుని చేసేశారాయన.
 
 ఇంకా భీముడికి కౌరవులు విషాహారం పెట్టి పాతాళలోకంలో పడేయడం, నాగేంద్రుని వరంతో భీముడు నాగాయుధ బలసంపన్నుడవడం, భీముడు ఇంద్రలోకం వెళ్లి ఐరావతం తెచ్చి మరీ తల్లితో ఐరావత వ్రతం చేయించడం.. తదితర  ఘట్టాలతో, బాలబాలికల అపూర్వ నటనాచాతుర్యంతో ఆసక్తికరంగా సాగుతుందీ సినిమా. ఈ చిత్రంలో కురుపాండవులుగా పిల్లలు నటించగా, కురువృద్ధులు, గురువృద్ధులుగా మేటి నటులు నటించారు. భీష్ముడిగా ఎస్వీరంగారావు, పాండురాజుగా కాంతారావు, కుంతిదేవిగా అంజలీదేవి, గాంధారిగా ఎస్.వరలక్ష్మి, నారదునిగా హరనాథ్, ద్రోణునిగా మిక్కిలినేని, శకునిగా ధూళిపాళ అసమాన నటనాపటిమను కనబరిచారు.
 
 దుర్యోధనునిగా నటించిన మాస్టర్ ప్రభాకర్ నటన ఈ చిత్రానికి హైలైట్. శ్రీదేవి ఇందులో బాలనటి. సుయోధనుని చెల్లెలుగా నటించారామె. రసాలూరు సాలూరివారి ఒక్కో పాట ఈ సినిమాకు ఒక్కో ఆభరణం. ముఖ్యంగా భీముడు నిచ్చెనెక్కి స్వర్గలోకానికి వెళ్లే ఘట్టంలో ఘంటసాల ఆలపించిన ‘మానవుడే... మహనీయుడు... శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు’ పాట నేటికీ ఎవరూ మరచిపోలేదు. మహిజ ప్రకాశరావు నిర్మించిన ఈ చిత్రం ఆ రోజుల్లో విశేష ప్రజాదరణ చూరగొంది. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం జరుగుతున్న సందర్భంలో ఈ ‘బాలభారతం’ చిత్రాన్ని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement