ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.
ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.
కథేంటంటే...
ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.
‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...
‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్‌మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్‌స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.
గుండమ్మగా ఆమే కరెక్ట్
సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్‌లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.
గార్డెన్స్‌లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...
సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్‌లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.
ఇద్దరికీ నూరవ చిత్రమే
హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్‌లతో రీమేక్ చేశారు.
ఫొటోలతో టైటిల్స్
ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్‌పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.
‘గుండమ్మ కథ’ రీమేక్?
ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.
– అలిపిరి సురేష్
Comments
Please login to add a commentAdd a comment