Suryakantham
-
ఎన్ని తరాలు చూసినా కొత్తగా అనిపించే కల్ట్ క్లాసిక్ 'గుండమ్మ కథ'
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.గుండమ్మగా ఆమే కరెక్ట్సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.గార్డెన్స్‌లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్‌లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.ఇద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.ఫొటోలతో టైటిల్స్ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్‌పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.‘గుండమ్మ కథ’ రీమేక్?ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.– అలిపిరి సురేష్ -
ఆ కారణం వల్లే అమ్మ చనిపోయింది: సూర్యకాంతం కుమారుడు
గయ్యాళి అత్త అనగానే అందరికీ సూర్యకాంతమే గుర్తొస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఇప్పటివరకు ఆమె పేరు చెక్కుచెదరలేదు. అయితే తెరపై గయ్యాళిగా కనిపించినా ఆమె మనసు వెన్న. సూర్యకాంతానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆమె కుమారుడు, వైద్యుడు అనంత పద్మనాభ మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.గయ్యాలి కాదుమా అమ్మ గయ్యాళి కాదు. అనురాగ దేవత. నా భార్యను సొంత కూతురిలా చూసుకునేది. పనిమనిషి ఉన్నప్పటికీ తనే వంట చేసి వడ్డించేది. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. చదువుకునే సమయంలో చదువు, ఖాళీ సమయంలోనే ఆటలు అని చెప్పేది. నాన్న అడ్వకేట్. అమ్మకు ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. సావిత్రి అంటే అమ్మకు చాలా ఇష్టం. తనకు చాలా సహాయం చేసింది. అమ్మ చేతిలో దెబ్బలు తినని ఏకైక హీరోయిన్ జమునగారే! తనెప్పుడూ ఆమెకు కూతురిగానే నటించేది. గొప్ప నటీమణులందరూ ఆమె చేతిలో దెబ్బలు తిన్నవారే!కిడ్నీ ఫెయిల్అమ్మ చనిపోయిన ఏడాది పిచ్చిపట్టినట్లయింది. తను డయాబెటిక్. కిడ్నీ ఫెయిలవడం వల్లే చనిపోయింది. ఇంకా కొన్నాళ్లు బతికుండాల్సింది. అమ్మకు నెయ్యి ఇష్టం. అలాగే ఫ్రై చేసిన పదార్థాలు ఇష్టం. ఆహారం దగ్గర ఎటువంటి నియంత్రణ పాటించలేదు. డయాబెటిస్ రావడంతో డయాలసిస్ కూడా చేయించుకుంది. అప్పుడు గుండె సమస్య కూడా రావడంతో ఐసీయూలో చేర్చారు. దాదాపు పన్నెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది చివరకు పరమపదించింది.మర్చిపోలేకపోయా..తనను చివరిసారి చూసేందుకు వచ్చిన అప్పటి తమిళనాడు సీఎం జయలలిత.. అమ్మ పరిస్థితి నాకెందుకు చెప్పలేదు. ఇంకా మంచి వైద్యం ఇప్పించేదాన్ని కదా అంది. ఆ మాట చాలాకాలం మర్చిపోలేకపోయాను. అంత్యక్రియలకు ఎంతోమంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడున్న మహిళలు ధైర్యంగా ఎలా మాట్లాడాలి? ఎలా పోరాడాలి? అన్న విషయాలను అమ్మ సినిమాల ద్వారా నేర్పించింది' అని పద్మనాభమూర్తి చెప్పుకొచ్చాడు.చదవండి: త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి -
గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!
కోడలిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలి? భర్త నోరు ఎలా మూయించాలి? కూతుర్ని అల్లారు ముద్దుగా ఎలా పెంచుకోవాలి? ఇంటి అల్లుడ్ని ఎలా ఆడుకోవాలి?... ఇవన్నీ తెలుసుకోవాలంటే సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే చాలు. ఇంతకు మించి ఎవరూ గయ్యాళితనాన్ని చూపించలేరేమో అన్నంతగా నటించారామె. అందుకే తమ కూతుళ్లకు ఆమె పేరు పెట్టే సాహసం చేయరు తల్లి దండ్రులు. కానీ వ్యక్తిగతంగా ఆమె మనసు సున్నితం. తనది కాని స్వభావాన్ని వెండితెరపై అద్భుతంగా అభినయించిన ఈ అద్భుత నటి శత జయంతి నేడు (అక్టోబర్ 28) ఆరంభం. ఈ సందర్భంగా సూర్యకాంతంని గుర్తు చేసుకుందాం... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’... వెండితెరపై గయ్యాళి అత్తగా విజృంభించిన సూర్యకాంతం నోటి నుంచి వచ్చిన మాటలివి. నటిగా గయ్యాళితనాన్ని కనబర్చిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్కురాలే. నిజానికి కథానాయికగా వెండితెరపై అందంగా, సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కల. ఆ కల నెరవేర్చుకునే చాన్స్ వచ్చినప్పటికీ, ఒక హీరోయిన్ చేజారిన అవకాశాన్ని తాను అంది పుచ్చుకుని ఆనందపడటానికి ఇష్టపడక... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’ అని తిరస్కరించారు. అది హిందీ సినిమా. అయినా వదులుకున్నారంటే వ్యక్తిగతంగా సూర్యకాంతానిది ఎంత మంచి మనసో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండితెరపై ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా ఆమె డైలాగ్ చెప్పే తీరులో కనిపించిన గయ్యాళితనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా ఎడమ చేయి తిప్పే అలవాటు సూర్యకాంతానికి చిన్నప్పుడే ఉంది. చిన్నారి సూర్యకాంతం బాల్యంలోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు. సూర్యం... భలే చలాకీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న పోన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మలకు జన్మించారు సూర్యకాంతం. మగపిల్లాడి దుస్తులు వేసుకుని, బెత్తం పట్టుకుని భలే చలాకీగా ఉండేదట చిన్నారి సూర్యకాంతం. తల్లిదండ్రులు సూర్యం అని పిలిచేవారట. ‘సూర్యం అటు వెళ్లకు.. బూచీ ఉంది’ అంటే... ఎడమ చేయి ఊపుతూ ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అనేదట సూర్యం. ఆ చేయి కదలిక, మాట తీరు అందర్నీ నవ్వించేవట. ఇక సినిమాల్లోకి వచ్చాక ఎడమ చేయి తిప్పుతూ సూర్యకాంతం డైలాగులు పలికిన తీరు ఆకట్టుకున్నాయి. ఎడమ చేయి తిప్పడం అనేది చిన్న వయసులోనే ఆమెకు అలవాటైంది. ఆరేళ్ల వయసులోనే పాటలు పాడటం, డ్యాన్స్ నేర్చుకుంది సూర్యం. ఈ చిన్నదాన్ని హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించాయి. కాగా సూర్యంకి ఎనిమిదేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికే ఆమె తోబుట్టువులకు పెళ్లయి, అత్తవారింటికి వెళ్లిపోయారు. సూర్యం, ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఓ డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంత్రపు ప్రభాకర రావు. నటించాలనే ఆసక్తి ఉన్నా అవకాశం అడగడానికి సూర్యం ఇష్టపడలేదు. అయితే ఓ అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకు చలాకీ సూర్యంని తీసుకున్నారు ప్రభాకర రావు. తల్లి వెంకటరత్నం కూడా కూతురి ప్రతిభకు అడ్డుకట్ట వేయదలచుకోలేదు. అలా ‘సతీ సక్కుబాయి’ నాటకంలో మగపిల్లవాడి వేషం వేసింది సూర్యం. ఆ తర్వాత కూడా అబ్బాయి పాత్రలు చాలానే చేసి, రంగస్థలంపై నిరూపించుకుంది. హనుమాన్ డ్రామా కంపెనీలోని నాటకాల్లోనూ నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులోనూ నాటకాలు వేస్తుండటంతో కూతురితో సహా సూర్యం తల్లి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20. ఇక సినిమాల్లో నటిస్తానంటే తల్లి ఓకే చెప్పేశారు. హిట్ గయ్యాళి జెమినీ స్టూడియో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డ్యాన్సర్‌గా అవకాశం ఇచ్చి, నెలకు రూ. 60 జీతం అంటే ఒప్పుకోలేదామె. దాంతో రూ. 75 ఇవ్వడానికి అంగీకరించారు. అయితే కొంత కాలం తర్వాత జెమినీ స్టూడియో నుంచి ఆమె బయటకు వచ్చేశారు. నటిగా సూర్యకాంతం తొలి చిత్రం ‘నారద నారది’ (1946). ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన సూర్యకాంతంకి ‘సౌదామిని’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోలుకున్నాక ‘సంసారం’ (1950) చిత్రంలో గయ్యాళి అత్త పాత్రకు అవకాశం వస్తే, కాదనుకుండా ఒప్పుకున్నారు సూర్యకాంతం. గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 40 ఏళ్ల పాటు దాదాపు 700 చిత్రాల్లో నటించారామె. టైటిల్ రోల్లో... సూర్యకాంతం కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (1962) ముందు ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాళితనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర పేరు వచ్చేట్లు ‘గుండమ్మ కథ’ టైటిల్ పెట్టారు ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ నమ్మకాన్ని నిజం చేశారు సూర్యకాంతం. ఇంకా ఆమె చేసిన చిత్రాల్లో ‘చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, కులగోత్రాలు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు–కొత్తకోడలు, దసరా బుల్లోడు, వియ్యాలవారి కయ్యాలు’ వంటివి ఉన్నాయి. ‘మాయాబజార్’లోని హిడింబి పాత్ర ఒకటి. వంటల పుస్తక రచయిత అప్పట్లో సినిమా స్టార్ కనబడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. కానీ, నటిగా గయ్యాళి ముద్రపడ్డ సూర్యకాంతం కనబడితే దగ్గరికి వెళ్లడానికి భయపడేవారట. ఇక షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్లి, యూనిట్లో అందరికీ పెట్టడం, లొకేషన్లోనే వండటం చేసేవారట సూర్యకాంతం. ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారామె. నమ్మినవాళ్లే... సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. అలాగే సులువుగా ఎవర్నీ నమ్మేవారు కాదట. చివరికి కారు పాడైతే, మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ల ముందే బాగు చేయాలట. సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారట. ఎంత తెలివిగలవాళ్లయినా ఎక్కడో చోట బోల్తా పడతారన్నట్లు.. నమ్మినవాళ్లే ఆమెను మోసం చేశారట. సూర్యకాంతం మరణానికి ఆ మానసిక వేదన ఓ కారణం అంటుంటారు. నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్లారామె. వెండితెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాళి అత్త రాలేదు... ఎప్పటికీ రాదు కూడా. గయ్యాళి అత్తగా తొలి చిత్రం ‘సంసారం’ (1950) ఒప్పుకున్న ఏడాదే మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేరు. అక్క కొడుకు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం. 1978లో చలపతిరావు చనిపోయారు. 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె భౌతికకాయాన్ని సందర్శించడానికి ఓ పది మంది సినీ ప్రముఖులు కూడా వెళ్లలేదు. సూర్యకాంతం సేవా కార్యక్రమాలు చేశారు. కాకినాడ, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో సత్రాలు ఏర్పాటు చేసి, అనాధలను చేరదీశారట. అలాగే పలువురు వితంతువులకు ఒకే వేదికపై పునర్వివాహాలు చేశారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసేవారు. ‘మంచి మనసులు’లో లాయర్ ఎస్వీ రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి ఆడపిల్ల సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. దాంతో సూర్యకాంతం శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తతో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఆయన ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’ అంటాడు. ఆజానుబాహుడు ఎస్వీఆర్ సైతం తెరపై సూర్యకాంతం ముందు నోరు తెరవ లేదు. ‘గుండమ్మ కథ’ కథారచయిత డీవీ నరసరాజు స్క్రిప్ట్ రాసేటప్పుడు సవితి కూతురు సావిత్రిని గుండమ్మ బాధలు పెట్టాలి కాబట్టి.. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయనా?’ అని నిర్మాత చక్రపాణిని అడిగారు. ‘గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం... సూర్యకాంతం అంటేనే గయ్యాళి. ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారాయన. పని గట్టుకుని సీన్లు రాయకపోయినా గయ్యాళితనాన్ని పండించారు సూర్యకాంతం. ‘శాంతి నివాసం’లో ఇల్లరికం అల్లుడు నర సింహాలు (రేలంగి)ని ‘గొడ్డు సింహాలు’ అంటూ అవమానిస్తుంటుంది అత్త (సూర్యకాంతం). అప్పుడు మామగారి (చిత్తూరు నాగయ్య) దగ్గరికెళ్లి, ‘చూశారా మావగారు.. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు నరసింహాలు. దానికి మామగారు ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. భార్యంటే ఆ భర్తకు అంత భయం. -
Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర
బాలాజీచెరువు(కాకినాడ సిటీ): తెలుగు చలనచిత్ర రంగంలో ‘సహజనటి’గా పేరుగాంచిన డాక్టర్ సూర్యకాంతం పేరున తపాలాశాఖ ప్రత్యేక కవరు విడుదల చేయనుంది. ఈ నెల 18న దీనిని ఆవిష్కరించనున్నట్టు కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ డీఎస్‌యూ నాగేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమె కాకినాడకు చెందిన వారు. తెలుగు వెండితెరపై గయ్యాళి అత్తయ్యగా పేరుపొందిన ఈ నటీమణి పేరున కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని సత్కళావాహినిలో ‘ప్రత్యేక తపాలా చంద్రిక ఆవిష్కరణ’ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి, మేయర్ సుంకర శివప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం. వెంకటేశ్వర్లు హాజరవనున్నారు. సూర్యకాంతం ప్రస్తానం 1924 అక్టోబరు 28న కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో జన్మించిన సూర్యకాంతం చిన్నప్పటి నుంచే అల్లరి అమ్మాయిగా ముద్ర పడిపోయారు. కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో నాటకాలు వెయ్యడం ద్వారా అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు లాంటి ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. అదే ఆమెకు వెండితెరపై ఆసక్తిని పెంచింది. తొలి రోజుల్లో చిన్న చిన్న గుర్తింపు లేని పాత్రలకే సూర్యకాంతం పరిమితమయ్యారు. వరద గోదావరిలా సంభాషణలు వల్లించగల సామర్థ్యం ఉన్న ఆమె ‘ధర్మాంగత’ చిత్రంలో మూగపాత్ర ధరిచారు. అయితే హీరోయిన్గా నటించినా మాటలు లేకపోవడంతో ఓ మంచి అవకాశం అలా జారిపోయింది. 1950లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా సూర్యకాంతం కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఆ చిత్రం కయ్యాలమారిగా..గయ్యాళి గంపగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా, రెండో ఎన్నో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె కోసమే పాత్రల్ని.. సంభాషణలు చిత్రీకరించేవారంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ నటులిద్దరు హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే ‘గుండమ్మ కథ’ తీశారంటే సూర్యకాంతం స్థాయి అర్థం చేసుకోవచ్చు. తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమె గొప్ప లక్షణాలని సూర్యకాంతం గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. సినిమాలో ‘అత్తరికాన్ని’ చెలాయించి ప్రేక్షకుల గుండెలపై చెరగని ముద్ర వేసుకున్న ఈ మహానటి 1994 డిసెంబరు 18న కన్నుమూశారు. ఎన్ని తరాలు మారినా తెలుగుతనం ఉన్నంతవరకూ గుర్తుండిపోయే అతి తక్కువ సహజ నటుల్లో సూర్యకాంతం ఒకరు. ఇంతటి మహానటి మన జిల్లాకు చెందిన వారు కావడం గర్వకారణం. -
నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే
ఆమె పెత్తనానికి తల వొంచని కోడలు లేదు. ఆమె దాష్టికానికి బాధలు పడని సవతి కూతురు లేదు. ఆమె నోటికి జడవని భర్త లేడు. ఆమె తగాదాకు బెదిరి పారిపోని ఇరుగింటి పొరుగింటివారు లేరు. అసలు ఆమె పేరు పెట్టుకోవాలంటేనే గడగడలాడే తెలుగువారున్నారు. అయినా ఆమెను ఇష్టపడని వారంటూ లేరు. ఎందుకంటే తెర మీద ఆమె చేసిన చెడ్డలన్నీ మంచికే దారి తీశాయి. కష్టాలు ఎదుర్కొన్నవాడే మనిషి.సూర్యకాంతంను ఎదుర్కొన్నావారే హీరో... హీరోయిన్. నేడు ఆమె 95వ జయంతి. ‘గుండమ్మ కథ’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. రచయిత డి.వి.నరసరాజు. సవితి కూతురైన సావిత్రిని కథ ప్రకారం గుండమ్మ బాధలు పెట్టాలి. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయమంటారా?’ అని అడిగారు నరసరాజు. ‘ఎందుకండీ దండగ. గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం. సూర్యకాంతం అంటేనే గయ్యాళి. మళ్లీ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారు చక్రపాణి. నిజంగానే సినిమాలో గుండమ్మ సావిత్రిని బాధించే సీన్లు ఉండవు. కాని ప్రేక్షకులు మాత్రం ఆమె సావిత్రిని బాధిస్తున్నదనే మానసికంగా అనుకుంటారు. సూర్యకాంతం సృష్టించుకున్న ఇమేజ్ అలాంటిది. ‘శాంతి నివాసం’లో సూర్యకాంతం అత్తగారిలా నానా రాద్ధాంతం చేస్తూ ఉంటుంది. కొడుకైన కాంతారావు, కోడలైన దేవిక గదిలో ఉన్నా సహించలేదు. పైగా కూతురైన బాల సరస్వతిని అత్తారింటికి పంపక అల్లుడైన రేలంగిని కాల్చుకు తింటుంటుంది. రేలంగి పేరు నరసింహాలు. కాని ‘గొడ్డు సింహాలు’ అని పిలుస్తూ అవమానిస్తూ ఉంటుంది. రేలంగి నోరు బాదుకుంటూ మావగారైన చిత్తూరు నాగయ్య దగ్గరకు వెళ్లి ‘చూశారా మావగారు. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు. దానికి నాగయ్య ఆకాశం వైపు చూస్తూ విభూతి ముఖంతో ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. సూర్యకాంతం ఇంట్లో ఉన్నాక భర్త సాక్షాత్తూ చిత్తూరు నాగయ్య అయినా నిమిత్తమాత్రుడే. ‘మంచి మనసులు’లో లాయరైన ఎస్.వి.రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి అల్లరి ఆడపిల్లైన సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని సరదాకు దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. అది చూసి నమ్మిన సూర్యకాంతం మంచి శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తయిన ఎస్.వి.ఆర్తో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఎస్.వి.ఆర్ జవాబు– ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’. ఎస్.వి.ఆర్ తెర మీద కూడా పులే. కాని భార్య సూర్యకాంతం అయినప్పుడు పిల్లి. సూర్యకాంతం చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు. ఆమె నటించిన గొప్ప సినిమాలు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు. అయినా సరే తెలుగువారు తమ పలుకుబడిలో ఆమె పేరు మరువలేదు. తీసేయలేదు. ఇది మగ ప్రపంచం. వాడు తనకు నచ్చనివి ఎదురుపడితే కొడతాడు, తిడతాడు, అమి తుమి తేల్చుకుంటాడు. కాని స్త్రీ అలా చేయలేదు. తన కోపం, అక్కసు, నిస్సహాయత, అసంతృప్తి అన్నీ ఎదుటివాళ్ల మీద నిరపాయంగా తీర్చుకోవాల్సిందే. దానికి నోటిని ఆయుధంగా చేసుకుంటుంది. తద్వారా గయ్యాళిగా పేరు తెచ్చుకుంటుంది. ఇదొక వ్యక్తిత్వ లక్షణం. మానసిక అవస్థ. ఇలాంటి అవస్థలో ఉన్నవారు గతించిపోరు. వారు ఉన్నంత కాలం ప్రజల మధ్య సూర్యకాంతం అనే పేరు మాసిపోదు. ఎందుకంటే ఆమె ఆ మాత్రకు నిలువెత్తు నమూనాగా నిలిచింది కాబట్టి. తెలుగువారు తెలుగు సినిమాలు మొదలెట్టినప్పుడు సమాజానికి అనుగుణంగా కుటుంబ కథలే ఎంచుకున్నారు. కుటుంబంలో విలన్లకు చోటు లేదు. విధికి తప్ప. ఆ విధి పాత్రను సూర్యకాంతం పోషించింది. కథలు మలుపు తిప్పింది. మంచివారికి పుట్టెడు కష్టాలు వచ్చేలా చేసింది. పరీక్షలు పెట్టింది. చివరికి వాటిలో పాస్ చేయించి, తాను చెడ్డ పేరును మూటగట్టుకుని, వారికి మంచి పేరు వచ్చేలా చేసింది. కాకినాడలో బాల్యంలో దూకుడుగా పెరిగిన సూర్యకాంతం ఆ వ్యక్తిత్వాన్నే తన పాత్రలో ప్రవేశపెట్టింది. ‘సంతానం’ (1950) ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా. అందులో 26 ఏళ్ల వయసులో రేలంగికి తల్లిగా నటించి తెర మీద డైలాగులను చెరిగేసిందామె. ఆ తర్వాత ఆగలేదు. ‘మాయాబజార్’, ‘తోడి కోడళ్ళు’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘వెలుగు నీడలు’, ‘భార్యాభర్తలు’, ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘కులగోత్రాలు’, ‘రక్త సంబంధం’... ఎన్నో. ‘దసరా బుల్లోడు’ సినిమాలో ఆమె పెట్టే కష్టాలకు ఆమెను ఏం చేసినా పాపం లేదన్నంతగా సగటు ప్రేక్షకులు కోపం తెచ్చుకునే స్థాయికి ఆమె పాత్రను రక్తి కట్టించింది. రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్.వి.రంగారావు వంటి ఉద్దండులు ఆమెకు భర్తగా నటించి కథలను పండించారు. పద్మనాభం ఆమెకు పర్మినెంట్ కొడుకు. ఒకే పాత్ర.. కాని ప్రతి సినిమాలో భిన్నంగా పోషించిందామె. ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా డైలాగ్ చెప్పే పద్ధతి మరొకరికి రాలేదు. రాబోదు కూడా. ఆమె ఎంతో కపటిగా నటించింది. ఎంతో అమాయకురాలిగా కూడా నటించింది. ఎంతో గయ్యాళిగా కోపం తెప్పించి ఎంతో చాదస్తంతో నవ్వులు కూడా పూయించింది. ఇన్నీ చేసింది ఒక్కతే సూర్యకాంతం. తెర మీద గయ్యాళిగా ఉన్న సూర్యకాంతం నిజ జీవితంలో స్నేహశీలి. దాత. నటీనటులకు ఆత్మీయురాలు. భక్తురాలు. వారికి ఏదైనా ఆపద వస్తే వారి తరుఫున తాను మొక్కులు మొక్కుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. షూటింగ్‌కి రకరకాల పదార్థాలు వండి తెచ్చి పంచి పెట్టేదామె. మంచి వంటకత్తె. తెలుగునాట వంటల పుస్తకం వెలువరించిన తొలి రచయితల్లో ఆమె ఒకరు. ఆమె చేసిన పులిహోర వంటిది మళ్లీ జీవితంలో ఎరగనని నటుడు గుమ్మడి చెప్పుకున్నారు. సంతానం కలగకపోతే అక్క కొడుకును దత్తత తీసుకుని అతడినే తన కుమారుడిగా చూసుకున్నారు. చదువుకోవాలని ఎంతో ఉన్నా చదువుకోలేకపోయిన సూర్యకాంతం చివరి రోజుల్లో తిరుపతి మహిళా యూనివర్సిటీ వారు ‘డాక్టరేట్’తో సత్కరించడాన్ని ఎంతో గొప్పగా భావించింది. ‘నా పేరు కాంతమ్మ’ అని ఆమె అంటే ఎస్.వి.ఆర్ ‘సూర్యకాంతమ్మ’ అని అందిస్తాడు ఒక సినిమాలో. ఆ పేరు అలా నిలిచి ఉంది మరి. 1994 డిసెంబర్ 18న ఆమె చెన్నైలో కన్నుమూస్తే తెలుగు పరిశ్రమ నుంచి పట్టుమని పదిమంది హాజరయ్యారు. తెర మీద ఎంతో గయ్యాళితనం ప్రదర్శించిన ఆ గొప్ప నటి పట్ల తెలుగు వారు ప్రదర్శించిన సిసలైన గయ్యాళితనం అది. - కె -
50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది..
గళ్ల లుంగీ, బుగ్గ మీద గాటు ఉన్న రౌడీని చూసిన దాని కంటే సూర్యకాంతమ్మను చూస్తే ప్రేక్షకులకు దడుపు ఎక్కువ.ఎవరిని ఏం బాధలు పెడుతుందో. ఎవరిని రాచిరంపాన పెడుతుందో.ఆమె తలుచుకుంటే ఎవరి జీవితమైనా నాశనం అయిపోతుంది.అందుకే తెలుగువారు తమ ఆడ పిల్లలకు‘సూర్యకాంతం’ అనే పేరే పెట్టడం మానేశారు.తెరమీద ఇంతగా నమ్మించగలిగిందంటేఆమె ఎంత గొప్ప నటి అయ్యుండాలి. ఎంతో సౌమ్యురాలు, అమాయకురాలు, స్నేహశీలి అయినసూర్యకాంతం గురించి ఆమె కుమారుడు పద్మనాభమూర్తి పంచుకున్న జ్ఞాపకాలివి. అమ్మకు ఆరేళ్ల వయస్సులోనే మా తాతయ్య చనిపోవడంతో వాళ్ల పెద్దక్క, బావల దగ్గర పెరిగింది. అమ్మ అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు పెద్దగా ఒంట పట్టలేదు. సినిమాల మీద మక్కువ కలిగింది. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి, పృథ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రాలు చూసేదట. సినిమాల మీద వ్యామోహంతో, పెద్దక్క ఒప్పుకోకపోయినా అమ్మమ్మతో కలిసి మద్రాసు వచ్చేసిందట. నారదనారది (1946) అమ్మ మొదటి చిత్రం. మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకుందట. కాని ఒకసారి అమ్మ పడిపోవటంతో, మ¬క్కు మీద మచ్చ పడిందట. క్లోజప్‌లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక నాయిక పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిందట. 1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ చిత్రంతో అమ్మ గయ్యాళి పాత్రలకు చిరునామాగా మారిపోయింది. ఒక్కసారి డైలాగ్ వింటే చాలు వెంటనే వచ్చేసేది. ఒకే టేక్‌లో ఓకే అయిపోయేదట. డైలాగ్ పలకడంలో విచిత్రమైన మాట విరుపు, ఎడమ చేతివాటం...ఈ రెండు ప్రత్యేకతలూ అమ్మను గొప్ప నటిని చేశాయి. పది భాషలు వచ్చు.. అమ్మ స్కూల్ చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే గానీ పది భాషలు అవలీలగా మాట్లాడగలదు. మద్రాసు వచ్చాక ఇంగ్లిషు, 50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది. బెంగాలీ అంటే అమ్మకు చాలా ఇష్టం. దిన పత్రికలు, పుస్తకాలు, నవలలు, పురాణేతిహాసాలు బాగా చదివేది. ఆంధ్రపత్రిక పేపరు ఆలస్యం అయితే చాలు పేపరు బాయ్‌ను నిలదీసేది. క్రమశిక్షణతో ఉండేది.. తెల్లవారుజామునే నిద్రలేవడం, పూజ చేసుకోవడం, వంట పూర్తిచేసి, మాకు క్యారేజీలు పెట్టి, తన కోసం సిద్ధం చేసుకున్న క్యారేజీలతో షూటింగ్‌కు వెళ్లడం ఆవిడ దినచర్య. ఇంటికి వచ్చే బంధువుల కోసం నిమిషాల్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసేది. అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో కూడా అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చేది.ఉన్నంతలో దానధర్మాలు చేసింది. చిన్న చిన్నపత్రికలకు ఆర్థికంగా సహాయపడింది. పద్మనాభ మూర్తి చిన్నతనంలోనే.. మా అమ్మ (సూర్యకాంతం) నాకు స్వయానా పిన్ని. నేను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తతు తీసుకుని మద్రాసులోనే బారసాల చేసిందట.కాకినాడ సమీపంలో ఉన్న వెంకటరాయపురం అమ్మ పుట్టిల్లు. మా తాతయ్యను నాలో చూసుకునేందుకే నాకు అనంత పద్మనాభమూర్తి అనే పేరు పెట్టి, నన్ను ‘నాన్నా’ ‘నానీ’ అని పిలిచేది. నాన్నగారు పెద్దిభొట్ల వెంకట చలపతిరావు. నన్ను కన్న తల్లి (సత్యవతి) ఇంటి పేరును నిలపడం కోసం ‘దిట్టకవి’ ఇంటి పేరునే కొనసాగించింది. నేను స్కూల్‌కి ప్రతిరోజూ కారులోనే వెళ్లేవాడిని. డ్రైవర్ రాకపోతే ఇంట్లో పనివాళ్లు సైకిల్ మీద స్కూల్లో దింపేవారు. ఆ స్కూల్లో ఒక ల్యాబ్ కట్టడానికి అమ్మ పదిహేను వేల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. నేను ఎం. కామ్ చదువుకున్నాను. చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాని దూరమని పంపలేదు. ఆ తరవాత చెన్నై మైలాపూర్ ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దగ్గరగా ఉండటంతో అమ్మఅనుమతితో చేరాను. శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని ఆదరించి అన్నం పెట్టేది. లైట్ కలర్స్ బాగా ఇష్టపడేది. నలుపు రంగంటే అస్సలు ఇష్టం లేదు అమ్మకు. ఒకసారి లైట్ బ్లూ కలర్ కారు బుక్ చేస్తే వాళ్లు బ్లాక్ కలర్ ఇచ్చారు. అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది అమ్మ. అమ్మే స్వయంగా కారు డ్రైవ్ చేసేది. 1994లో అమ్మ కన్నుమూసింది. అమ్మ కాలం చేసి పాతికేళ్లు దాటినా సూర్యకాంతం గారి అబ్బాయిగా నేను పొందే ప్రేమాభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు ఎవ్వరూ అపహరించేందుకు వీలులేని తరగని ఆస్తి. అమ్మను పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా, తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తిప్రతిష్టలతో ఆమెను వారి గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. భయస్తురాలు.. అమ్మ ఎవరిని ఏ వరసలో పిలిస్తే, నేనూ అలాగే పిలిచేవాడిని. అమ్మ వాళ్ల అక్కయ్యలను.. దొడ్డమ్మ అనకుండా దొడ్డక్క అని పిలిచేవాడిని. అమ్మ ఎక్కడకు వెళ్లినా తన వెంటే నన్ను తీసుకువెళ్లేది. నాకు ఒంట్లో బాగా లేకపోతే ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కేది. దేవాలయాలకు వెళ్లినప్పుడు హుండీలో నా చేత డబ్బులు వేయించేది, నా పేరున అర్చనలు చేయించేది. అమ్మ దయ వల్ల చాలా బాగా ఉన్నాను. అమ్మకి ఎవరి మీద అభిమానం, గౌరవం ఉండేవో వాళ్లకి ఏదైనా అవుతుందేమోనని భయం ఎక్కువగా ఉండేది. జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది అమ్మ. ఆయనకు తగ్గాక అందరికీ భోజనాలు పెట్టింది. ఎవరికి ఒంట్లో బావుండకపోయినా, వాళ్ల తరపున అర్చనలు చేయించేది, మొక్కులు తీర్చేది. మా పుట్టినరోజు నాడు గుడికి తీసుకెళ్లి, పూజలు చేయించి, ఇంటికి వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టేది. కేక్ కట్ చేయటం అమ్మకు ఇష్టం లేదు. నెయ్యి అంటే చాలా ఇష్టం.. అందరం కలిసి అన్నం తినాలనేది అమ్మ. ఒక్కోసారి అమ్మ వండుకున్న కూర అమ్మకే నచ్చేది కాదు. వెంటనే ‘నాన్నా! నెయ్యి వేసి మాగాయి అన్నం కలిపి పెట్టరా’ అనేది నాతో. అమ్మకు నెయ్యి – మాగాయి, నెయ్యి – ఆవకాయ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కరోజు కూడా నెయ్యి లేకుండా అన్నం తినేది కాదు. ఎన్ని మానేసినా, నెయ్యి మాత్రం మానలేదు అమ్మ. అన్నీ అమ్మే చూసింది.. నా వివాహం అమ్మే కుదిర్చి చేసింది. నా భార్య పేరు ఈశ్వరిరాణి. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సూర్య సత్య వెంకట బాల సుబ్రహ్మణ్యం చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అమ్మాయి జయలక్ష్మి ఎంబిఏ చదివి, గీతమ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తోంది. మా ఇంటి మొత్తానికి ఒక్క గదిలోనే ఏసీ ఉండేది. అందరం ఆ గదిలో చేరి కబుర్లు చెప్పుకునేవాళ్లం. అమ్మ చేతి వంట... నోరూరేనంట.. అమ్మ చేతి వంట అమృతంలా ఉండేదనుకునేవారు సినిమా వారంతా. అమ్మకు బయట తిండి తినే అలవాటు లేదు. అందుకే షూటింగులకు వెళ్లేటప్పుడు తనకు మాత్రమే కాకుండా, షూటింగ్లో ఉన్న మిగతా వాళ్ల కోసమూ వంట చేసి తీసుకెళ్లేది. అమ్మ రాక కోసం అందరూ ఎదురు చూసేవారు. ఎన్టిఆర్ ‘అక్కయ్యగారూ! ఏం తెచ్చారు?’ అని అడిగి మరీ తినేవారు. పెరుగన్నమే.. టిఫిన్ లేదు.. పొద్దున్నపూట టిఫిన్ కాకుండా పెరుగన్నమే తినాలి. నేను పదవీ విరమణ చేసేవరకూ ఉదయం పెరుగన్నమే తిన్నాను. ఇంటికి ఎవరు వచ్చినా ‘మజ్జిగ తాగుతారా! అన్నం తింటారా!’ అని అడిగేది. కాఫీ టిఫిన్లు ఇచ్చేది కాదు. ఆవిడ చాలా సింపుల్. జనసమ్మర్దంలోకి వెళ్లాలంటే అమ్మకి చాలా భయం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవాలయాలకు, బీచ్‌లకు రద్దీ లేని సమయంలో నన్ను తీసుకుని వెళ్లేది. అమ్మ చాలా రిజర్వ్డ్. అప్పట్లో సినిమా వారంతా టి నగర్లో ఉంటే, మేం మాత్రం సిఐటీ కాలనీలో ఉండేవాళ్లం. అన్నీ చదివి వినిపించాలి.. అమ్మ నాకు తెలుగు నేర్పించింది. అన్ని రకాల పుస్తకాలు కొని తను చదివాక, నా చేత చదివించేది. నేను మూస ధోరణిలో చదువుతుంటే, ‘ఆడ మగ గొంతు మార్చి చదివితేనే బాగుంటుంది, అప్పుడే అర్థమవుతుంది’ అనేది. ఆవిడ మరణించాక అర్థమైంది పుస్తకాలు చదవటం వల్ల లోకజ్ఞానం వస్తుంది కాబట్టే చదివించిందని. అమ్మను ఎన్నటికీ మరువలేను.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై – వైజయంతి పురాణపండ -
సూర్యకాంతం మొగుడు
‘ముత్యాల ముగు’్గ సీరియల్ చూసిన వారికి విరాట్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సీరియల్ నటుడు ప్రజ్వల్. ఇప్పుడు ‘జీ తెలుగు’ లో ప్రసారమయ్యే ‘సూర్యకాంతం’ సీరియల్లో చైతన్యగా తన నటనతో మెప్పిస్తున్నాడు. కన్నడ సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న విధానాన్ని ఈ విధంగా వివరించారు. ‘‘ఇంటర్మీడియెట్ తర్వాత కన్నడలోని ఓ సీరియల్లో కృష్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పటికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండటం వల్ల ఆ పాత్రకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పునర్ వివాహ్’ సీరియల్లో ప్రధాన పాత్ర పోషించాను. నటుడిగా మారకముందు నేను డాన్సర్‌ని. తొమ్మిదేళ్ల వయసు నుంచి నేను పుట్టకముందు అమ్మ సాగరసంగమం సినిమాలో కమల్‌హాసన్ గారిని చూసి అబ్బాయి పుడితే భరతనాట్యం నేర్పించాలనుకున్నారట. అలా నాకు భరతనాట్యం, కథక్ నేర్పించారు. ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అక్కడకు తీసుకెళ్లేవారు అమ్మనాన్నలు. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉత్తర, దక్షిణ భారతదేశాలు ముఖ్యంగా కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, హైదరాబాద్‌లలోనూ వేదికల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. చిన్నప్పుడు అమ్మనే నాకు మేకప్ చేసేవారు. ఇప్పటికీ ఎక్కడ నా నృత్య ప్రదర్శన ఉన్నా మేకప్‌లో ఫినిషింగ్ టచ్ అమ్మనే ఇవ్వాలి. కళ్లకు కాజల్, నుదటన తిలకం అమ్మ దిద్దితేనే నాకూ ఆ నృత్యం సంపూర్ణం అనిపిస్తుంది. బేసిక్‌గా సైన్స్ స్టూడెంట్‌ని. ఇంటర్మీయెట్ తర్వాత ఇంజనీరింగ్ చదివాలా.. డాన్సర్‌గా నా కలను సంపూర్ణం చేసుకోవాలా అనే సందిగ్దం వచ్చింది. రెండోదానికే నా ఆలోచన మళ్ళింది. దీంతో కామర్స్ తీసుకొని, ఆర్ట్ ఫీల్డ్కి వచ్చాను. సూర్యకాంతం సీరియల్లో సన్నివేశం నృత్యం వల్ల మెరుగు రామాయణ, భారత కథలు, పురాణ పురుషులను నృత్యం ద్వారా చూపించాల్సి ఉంటుంది. దీనికి పురాణ, ఇతిహాసాలను క్షుణ్ణంగా ఔపోసన పడతాం. దీని వల్ల మానవ ప్రవృత్తి అర్ధమవుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే నాడు ఇలాంటి సందర్భంలో వారు ఎలా ప్రవర్తించారో గుర్తుకువచ్చి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం. భవిష్యత్తు ప్రణాళికలు సీరియల్స్‌లో చేరక ముందు నృత్యప్రదర్శనలు ఇస్తూనే డ్యాన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. భవిష్యత్తులో అకాడమీ ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం సీరియల్స్ వల్ల రెగ్యులర్ క్లాసులు తీసుకోవడం లేదు. ‘సూర్యకాంతం’లో... ‘జీ తెలుగు’లో వచ్చే ‘సూర్యకాంతం’ సీరియల్లో హీరో చైతన్య పాత్ర పోషిస్తున్నాను. చైతన్యకు కుటంబమే ప్రపంచం. అక్కలు, బావలు.. తప్ప మరొకటి తెలియదు. లోకజ్ఞానం అస్సలు లేదు. అలాంటి అతనికి పూర్తి అపోజిట్ క్యారేక్టర్ సూర్యకాంతంది. చదువు రాని అమ్మాయితోనూ, ఆమె కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ ఆమె కలలకు భరోసాగా నిలుస్తుంటాడు. తన కుటుంబాన్నీ–సూర్యకాంతం కుటుంబాన్నీ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది ఇందులో ప్రధానంగా నడుస్తుంటుంది. అన్న చెబితే ఓకే! రియల్ లైఫ్ మా కుటుంబంలో మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్.‘నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా అంకితమై ఉండాలి’ అని చెబుతారు. ‘మంచి జరిగిందా ఓకే. లేదంటే దానిని వదిలేసి మరోటి ఎంపిక చేసుకో’ అని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ, బయట నాకు సపోర్ట్ చేసేవారే దొరకడం నా అదృష్టం అనుకుంటాను. నా జీవిత భాగస్వామి కూడా నా సంతోషాన్ని, ఆసక్తిని పంచుకుని ప్రోత్సహించేలా రావాలని కోరుకుంటున్నాను. సినిమా, సీరియల్ ఏదైనా సైన్స్ ఫిక్షన్ స్టోరీలో లీడ్ రోల్లో నటించాలని ఉంది.’– నిర్మలారెడ్డి -
నటనలో ఆమెకు ఆమే సాటి
ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే ఆమె గయ్యాళి అత్త పాత్రకు పెట్టింది పేరయ్యారు. అది ఎంతగా అంటే ఆమె పేరు పెట్టుకోవడానికి తెలుగువారు భయపడేంత. ఆమె ఎవరో కాదు.. సూర్యకాంతం. తూర్పు గోదావరి జిల్లా వాసే.. అక్టోబర్ 28న ఆమె జయంతి సందర్భంగా ఆమెకు ‘సాక్షి’ స్మృత్యాంజలి సాక్షి, మధురపూడి (రాజానగరం): వీధుల్లో, కుళాయిల వద్ద ఎక్కడైనా మహిళలకు తగాదాలొచ్చినా, అత్తగారి నుంచి కోడలికి వేధింపులు జరిగినా వినబడే పేరు సూర్యకాంతం. నటనలోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె పేరు చిరంజీవిగా నిలిచిపోయింది. గయ్యాళి అత్తగా, గడ సరి మహిళగా ఆమె మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ ఆ పేరు వరి్థల్లుతోంది. సుమారు 780 సినిమాల్లో ఆమె నటించారు. జిల్లాలో చిత్రీకరించిన అనేక సినిమాల్లో నటించారు. కోరుకొండ మండలం దోసకాయలపల్లి, నిడిగట్ల, బూరుగుపూడిల్లో, రాజానగరం మండలం నరేంద్రపురం తదితర గ్రామాల్లో జరిగిన షూటింగ్‌ల్లో పాల్గొన్నారు. జిల్లాలో చిత్రీకరించిన సినిమాల్లో ఆమెకు మంచి పేరు తెచ్చినవి ఎనీ్టఆర్ బడిపంతులు, ఏఎన్నార్ అందాలరాముడు, మూగమనసులు. ‘‘మంచి మనసులు’లో ఎస్వీఆర్, సూర్యకాంతం ఆమె సెట్లోకి వస్తే అలెర్ట్ సూర్యకాంతం సినిమా షూటింగ్ సెట్లోకి వస్తే అంతా అలర్ట్ అవుతారనే నానుడి ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె నటించినా హీరోలు సైతం అలెర్ట్ కావల్సిందే. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలైనప్పటికీ గుండమ్మ అక్క పాత్రకే ప్లస్ మార్కులను ప్రేక్షకులిచ్చారు. నటనలో ఆమెకు ఆమే సాటి నటనలో సూర్యకాంతాన్ని ఓవర్టేక్ చేయగలవారు రాలేదు. గుండమ్మ కథను నేటి ప్రముఖ యువ హీరోలతో తీయడానికి నిర్మాతలు ఉన్నా ఆ పాత్రలో నటించగల నటి లేకపోవడంతో ఆ చిత్రం మళ్లీ రూపుదిద్దుకోలేదు. జీవన ప్రస్థానం సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28వ తేదీన పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నం దంపతులకు 14వ సంతానంగా జన్మించారు. కాకినాడ మెక్లారిన్ స్కూల్లో చదువుకున్నారు. నాట్యం, నటనలో ఆసక్తిగల ఆమె కాకినాడలోని యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో చేరి మరింత ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. సినిమాలపై మక్కువతో మద్రాసు వెళ్లి జెమినీ సంస్థలో ఉద్యోగిగా చేరారు. ఆమె తొలి చిత్రం ‘చంద్రలేఖ’. అందులో ఆమె డ్యాన్సర్‌గా నటించారు. హీరోయిన్గా ‘సౌదామి’ని చిత్రంలో అవకాశం వచ్చినప్పటికీ కారు ప్రమాదంలో ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం తప్పిపోయింది. దాంతో హీరోయిన్గా నటిద్దామనుకున్న ఆమె కల తీరనే లేదు. ఏఎన్నార్ నటించిన ‘సంసారం’ చిత్రంలో ఆమె గయ్యాళి అత్త పాత్రను తొలిసారిగా చేశారు. తరువాత ఆమె ఇక తిరిగి చూడనక్కర్లేకపోయింది. 1950లో పెద్దిబొట్ల చలపతిరావుతో ఆమెకు వివాహమయ్యింది. ఆమె చివరి సినిమా ‘వన్ బై టూ’ (1993). సూర్యకాంతం 1996 డిసెంబర్ 17న కన్నుమూశారు. -
‘సూర్యకాంతం’ మూవీ రివ్యూ
టైటిల్ : సూర్యకాంతం జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పర్లీన్, శివాజీ రాజా, సుహాసిని తదితరులు సంగీతం :మార్క్ కె.రాబిన్ దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి నిర్మాత : రాజ్ నిహార్ మెగా డాటర్‌గా బుల్లితెరపై సందడి చేసిన నిహారిక కొణిదెల.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు చిత్రంతో తెరకు పరిచయమై.. గతేడాది హ్యాపీ వెడ్డింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అయినా నిహారికకు అనుకున్న విజయం మాత్రం లభించలేదు. తనకు మంచి పేరు తీసుకువచ్చిన ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడితో కలిసి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టేందుకు ‘సూర్యకాంతం’గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిహారిక. మరి ఈ మూవీతో అయినా.. ఇంతకాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిహారికకు మంచి ఫలితాన్ని ఇచ్చిందా? లేదా అనేది ఓ సారి చూద్దాం. కథ ఓ విచిత్ర స్వభావం గల అమ్మాయి సూర్యకాంతం(నిహారిక). ప్రేమా పెళ్లిపై అంతగా నమ్మకం లేని కాంతాన్ని అభి ఇష్టపడతాడు. అభిని కూడా కాంతం ఇష్టపడుతుంది. అయితే కాంతం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో.. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలా ఓసారి బయటకి వెళ్లిన కాంతం ఓ ఏడాది పాటు కనపడకుండా వెళ్తుంది. అయితే కాంతం ఎక్కడికి వెళ్లిందో తెలియని అభి పిచ్చివాడిలా.. తన కోసం ఎదురుచూస్తుంటారు. అభికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అభికి పూజా(పర్లిన్)తో పెళ్లి ఫిక్స్ అయ్యే సమయానికి కాంతం తిరిగి వస్తుంది. అప్పుడు కాంతం ఏం చేసింది? ఆ పరిస్థితిలో అభి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కాంతం.. పూజాలో అభి ఎవరినీ పెళ్లి చేసుకున్నాడన్నదే మిగతా కథ. నటీనటులు సూర్యకాంతం పాత్ర లో నిహారిక బాగానే నటించింది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో.. ఎలా ఉంటుందో తెలియని అమ్మాయి పాత్రలో నిహారిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హోమ్లీగా కనిపించిన నిహారిక.. ఈ సినిమాలో హీరోను అల్లరి పెట్టే పాత్రలో బాగానే ఆకట్టుకుంది. ఇక అభి పాత్రలో రాహుల్ పర్వలేదనిపించాడు. సెకండ్ హీరోయిన్ అయిన పూజ లుక్స్‌తో పాటు యాక్టింగ్‌తోనూ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో సుహాసిని.. శివాజీ రాజా.. సత్య తమ పరిధి మేరకు పర్వలేదనిపించారు. విశ్లేషణ సినిమా ప్రారంభం నుంచి అలా స్లోగా వెళ్తూ.. నిహారిక ఎంటర్ అయ్యే వరకు తెరపై సందడే కనిపించదు. అయితే ఇంత సందడిగా ఉండే కాంతం పాత్రను సెకండ్ హాఫ్‌లో బోర్ కొట్టించేలా మలిచాడు దర్శకుడు. కాంతం కారెక్టర్ డిజైన్‌లో వచ్చిన లోపమే ఏమో తెలియదు కాని.. ఏదో తెలియని చిరాకు అసహనం పెరిగి పోతూ ఉంటుంది ద్వితీయార్థంలో. ప్రేక్షకుడిని కూడా తికమక పెట్టి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా.. స్లో నెరేషన్‌తో దర్శకుడు తెగ ఇబ్బందిపెట్టేసాడు. సినిమాకి అసలు కథ ఏంటో కూడా అర్థం కాకుండా అలా గడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కాంతం పాత్రతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన డైరెక్టర్ .. సెకండ్ హాఫ్‌లో దాన్ని మిస్ చేయడమే కాకుండా.. ఆ పాత్ర ఏం చేస్తుందో తెలియకుండా చిరాకు వచ్చేలా చేసాడు. ఇక కథ కథనాలు గురించి వదిలిస్తే.. మార్క్ అందించిన సంగీతం పర్వలేదనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ ను అందంగా ప్రెసెంట్ చేసాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ప్రథమార్థం నిహారిక నటన మైనస్ పాయింట్స్ ద్వితీయార్థం స్లోనెరేషన్ బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్ -
అప్పుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను
‘‘ఒక సినిమా హిట్ కానంత మాత్రాన డిప్రెషన్లోకి వెళ్లిపోవాలా? హిట్ అయితే విజయం తలకెక్కాలా? అలా ఏం లేదు. నా గత రెండు చిత్రాలు (ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్) ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యాయని అనుకుంటున్నాను. యాక్టింగ్ కావొచ్చు. ప్రొడక్షన్ కావొచ్చు. సోషల్ వర్క్ కావొచ్చు. నేను ఏ పని చేసినా వంద శాతం కష్టపడతాను. సగం సగం చేయడం, ఎమోషన్స్ దాచుకోవడం నాకు ఇష్టం ఉండదు’’ అని నిహారిక కొణిదెల అన్నారు. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో రాహుల్ విజయ్, నిహారిక, పెర్లెన్ భేసానియా ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో సందీప్ ఎర్రం రెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిహారిక పంచుకున్న విశేషాలు... ► సూర్యకాంతంగారంటే సినిమాల్లో ఎక్కువగా ఆమె చేసిన గయ్యాళి పాత్రలే గుర్తుకు వస్తాయి. కానీ అవే సినిమాల్లో ఆమెకు నచ్చిన పాత్రలకు భలే సపోర్ట్‌గా మాట్లాడతారు. ఆ సూర్యకాంతాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ సినిమాలో మాత్రం నా క్యారెక్టర్ సూర్యకాంతమే పెద్ద సమస్య. ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత మనం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేయవచ్చేమో అనిపించింది. సీనియర్ నటి సుహాసినిగారితో నటించడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆమె ఇన్పుట్స్ భవిష్యత్‌లో నాకు ఉపయోగపడతాయి. ► టైటిల్ ఐడియా డైరెక్టర్ ప్రణీత్‌దే.‘నాన్నకూచి’ వెబ్ సిరీస్‌ను ప్రణీత్ చేసినప్పుడు ఓ సీన్లో భాగంగా నా కూతురు సూర్యకాంతం అన్నారు మా నాన్నగారు. అవును... ఆయన నన్ను చూసి భయపడతారు (నవ్వుతూ). అందుకే అలా అన్నారేమో. ప్రణీత్ ఆ విషయాన్నే గుర్తు పెట్టుకుని ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాడనిపిస్తోంది. విజయ్ మంచి కోస్టార్. ఈ సినిమా తర్వాత యాక్టర్‌గా అతనికి మంచిపేరు వస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి అన్నయ్య వరుణ్‌కి చెబితే, బాగుందని సమర్పకుడిగా ఉంటానని అన్నారు. మాతో పాటు కొన్ని సినిమాలు విడుదలవుతున్నప్పటికీ మాది డిఫరెంట్ జానర్. మంచి ఎంటర్టైనింగ్ మూవీ. ఎలక్షన్ బిజీలో ఉన్నవారు మా సినిమాకు వస్తే రెండు గంటలు హాయిగా నవ్వుకోవచ్చు. ► నా రెండు సినిమాలు ఆడనంత మాత్రాన పెద్దగా బాధపడాల్సింది ఏమీ లేదు. నిహారిక సరిగా యాక్ట్ చేయడం లేదనే మాటలు నా వరకు అయితే రాలేదు. బాగా నటించడానికి ప్రయత్నించిందనే మాటలు వినిపించాయి. పెదనాన్న చిరంజీవిగారి కెరీర్లో కూడా కొన్ని సినిమాలు ఆడలేదు. యాక్టింగ్ లోపం మాత్రం కాదు. సినిమాలు ఆడకపోవడానికి డైరెక్షన్, ప్రొడక్షన్, ఎగ్జిక్యూషన్, సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడం.. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. పెదనాన్న చిరంజీవిగారిని మైండ్‌లో పెట్టకుని ముందుకు వెళ్తున్నాను. ‘సైరా’ చిత్రంలో నా వంతు షూటింగ్ పూర్తయింది. చిరంజీవిగారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. కానీ డైలాగ్స్ లేవు. ► నాకు ప్రొడక్షన్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు, అరవింద్‌గారిని చూస్తూ పెరిగాను. డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్‌లు ప్రొడ్యూస్ చేస్తాను. ప్లాన్స్ జరుగుతున్నాయి. నా దగ్గర ఉన్న కంటెంట్ సినిమాకు పనికొస్తుందని అనిపిస్తే చేస్తాను. కానీ సినిమా నా అల్టిమేట్ గోల్ కాదు. ► చివరిసారిగా కోడిరామకృష్ణగారితో మాట్లాడినప్పుడు ‘కర్తవ్యం’ లాంటి సినిమా నేను చేయాలనే చర్చ జరిగింది. పరుచూరి బ్రదర్స్ కూడా ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు ఇదేవిషయం నాకు గుర్తుకు వచ్చింది. నా కోసం పాత్రలు రాయించుకునేటంత పరిచయాలు అయితే ఇండస్ట్రీలో నాకు లేవు. ఆ పాత్రలు నేను చేయగలని నమ్మినప్పుడు దర్శక–నిర్మాతలు వారే వస్తారు. ఒక యాక్టర్‌తో చేయాలి. మరో యాక్టర్‌తో చేయకూడదు అనే నియమాలు పెట్టుకోలేదు. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవారితోనే నటించాను. ఏదైనా సినిమాకు సైన్ చేసేప్పుడు ముందు స్క్రిప్ట్ ఆ తర్వాత నా పాత్ర గురించి తెలుసుకుంటాను. ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో తొలిసారి విజయ్ దేవరకొండను చూశాను. మా ఇద్దరి (విజయ్‌దేవరకొండ, నిహారిక లవ్‌లో ఉన్నారనే వార్త) గురించి వచ్చిన రూమర్‌కు ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో క్లారిటీ ఇచ్చాం. నా యాక్టింగ్ కెరీర్ పట్ల నేను సీరియస్‌గానే ఉన్నాను. ఏదో వస్తున్నాయి కదా అని సినిమాలు చేయాలనుకోవడం లేదు. మా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టేది ఇండస్ట్రీ. నిజంగా నాకు సినిమాల పట్ల ఆసక్తి లేకపోతే ఇండస్ట్రీకి వచ్చేదాన్ని కాదు. ‘ఇంద్ర’ సినిమాకు థియేటర్స్‌లో నేను పిచ్చి పిచ్చిగా అరచిన రోజులు గుర్తు ఉన్నాయి. పెదనాన్న చిరంజీవిగారు పడ్డ కష్టాలను దగ్గరగా చూశాను. అలాంటి నేను ఇండస్ట్రీని లైట్‌గా తీసుకోను. ఒకవేళ తీసుకున్నానని నాకు అనిపించిన రోజు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతాను. -
ఆమెతో స్క్రీన్ పంచుకోవడం హ్యాపీ
‘‘నాది బాంబే. లా స్టూడెంట్‌ని. నటనపై ఇష్టంతో సినిమా రంగంలోకి వచ్చాను. కొన్ని యాడ్స్‌తో పాటు, ఫ్రెండ్స్ కోసం షార్ట్ ఫిల్మ్స్‌లో నటించా. అంతకుమించి నటనలో అనుభవం లేదు. నా తొలి సినిమా ‘సూర్యకాంతం’’ అని పెర్లెన్ భేసానియా అన్నారు. రాహుల్ విజయ్ హీరోగా, నిహారిక కొణిదెల, పెర్లెన్ భేసానియా హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూర్యకాంతం’. వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పెర్లెన్ భేసానియా మాట్లాడుతూ– ‘‘బాంబేలో నేను మోడలింగ్ చేస్తుండగా మేనేజర్ద్వారా ‘సూర్యకాంతం’ టీమ్‌ను కలిశాను. ప్రణీత్గారు చెప్పిన స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆడిషన్స్ చేశారు. వాళ్లు అనుకున్న పూజ పాత్రకి నేను సరిపోతానని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలో పూజ అనే సెన్సిటివ్ గర్ల్ పాత్రలో కనిపిస్తా. తను ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులపై ఆధారపడుతుంటుంది. నా నిజ జీవితానికీ, పూజ పాత్రకి చాలా వ్యత్యాసం ఉంది. రియల్ లైఫ్‌లో ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఈ సినిమాలో నిహారిక, నా పాత్రలు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవద్దు. కథలో భాగంగా మా పాత్రల మధ్య వచ్చే డ్రామాకి సంబంధించిన కథే. ఒక పర్సన్‌గా, ఓ యాక్టర్‌గా నిహారిక చాలా జెన్యూన్. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీ. రాహుల్ కూడా బాగా ఎంకరేజ్ చేశాడు. ప్రస్తుతం మరికొన్ని íసినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. ‘సూర్యకాంతం’ విడుదల తర్వాతే ఓ క్లారిటీ వస్తుంది. నటిగా నాకిది మొదటి సినిమా. షూటింగ్ ఎక్స్పీరియన్స్ అద్భుతం. తెలుగు రాకపోయినా టీమ్ సహకారంతో మేనేజ్ చేయగలిగాను. యాడ్స్, షార్ట్ ఫిల్మ్స్ చిత్రీకరణకన్నా సినిమా షూటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఏదైనా బాగా ఎఫర్ట్ పెట్టాలి’’ అన్నారు. -
నాకు ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. యెదవా!
గతేడాది హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో పలకరించి మెగా డాటర్ నిహారిక కొణిదెలకు ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే మరోసారి సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ.. రాహుల్ విజయ్‌తో కలిసి ‘సూర్యకాంతం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆహ్వానించి మంచి బజ్‌ను సొంతం చేసుకుంది ‘సూర్యకాంతం’. కాసేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దగ్గుబాటి రానా చేతుల మీదుగా ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయించింది చిత్రబృందం. ఇద్దరి మధ్యలో నలిగే యువకుడిగా రాహుల్ విజయ్.. భిన్నమైన స్వభావం ఉండే ఓ క్యారెక్టర్లో నిహారిక నటిస్తున్నారు. ‘నాకు ఇన్‌డైరెక్ట్‌గా ప్రపోజ్ చేశావ్.. యెదవా!’, లాంటి డైలాగ్‌లతో ఉన్న ఈ ట్రైలర్లో నిహారిక ఆకట్టుకున్నారు. మార్క్ కె రూబిన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుక
-
పవన్ పాటకు నిహారిక, సుహాసిని స్టెప్పులు
మెగా హీరోయిన్ నిహారిక, రాహుల్ విజయ్‌లు నటించిన ‘సూర్యకాంతం’ చిత్రం ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా సూర్యకాంతం షూటింగ్ సమయంలో జరిగిన ఓ సన్నివేశాన్ని.. చిత్ర బృందం ప్రమోషన్లో భాగంగా వాడుకుంది. నిహారిక తన బాబాయి.. పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాలోని పాటకు డ్యాన్స్ చేశారు. అంతేకాకుండా సుహాసిని చేత కూడా డ్యాన్స్ చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్వాణ సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసినిలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: వరుణ్ తేజ్, నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోల్, రామ్ నరేశ్. సాహిత్యం: కృష్ణకాంత్. #Suryakantam dancing for @PawanKalyan garu song. Some behind the scenes fun, while shooting the movie. #SuryakantamOnMarch29#PawanKalyan @IAmVarunTej @IamPranithB @IamNiharikaK #SuhasiniManiratnam @ActorRahulVijay #PerleneBhesania @NirvanaCinemas @markkrobin @LahariMusic pic.twitter.com/bVsU74xPkF — Nirvana Cinemas (@NirvanaCinemas) March 9, 2019 -
మోడర్న్ సూర్యకాంతం
‘సూర్యకాంతం’ పేరు వినగానే గయ్యాళి పాత్రలు గుర్తొస్తాయి. ప్రస్తుతం అదే టైటిల్‌తో నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ఓ సినిమాలో నటించారు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్‌సిరీస్ ఫేమ్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకుడు. నిర్వాణ సినిమాస్ సంస్థ నిర్మించించి. ఈ చిత్రం టీజర్‌ను వరుణ్‌తేజ్ రిలీజ్ చేశారు. గయ్యాళి గాళ్‌ఫ్రెండ్‌గా నిహారికా కనిపించారు. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. టీజర్ ఫీల్ గుడ్ అంటున్నారు. ఈ చిత్రంలో శివాజీరాజా, సుహాసిని ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. మార్చి 29న చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: వరుణ్ తేజ్, నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోల్, రామ్ నరేశ్. సాహిత్యం: కృష్ణకాంత్. -
తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌కి బర్గరా!
మెగా డాటర్ నిహారికా కొణిదెల, ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సూర్యకాంతం’. సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ’ డైరెక్టర్ ప్రణీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా మెగా హీరో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ సూర్యకాంతం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. పేరు తెలుసుకుని ఏం చేస్తాం.. నిహారిక ఎంట్రీతో మొదలైన టీజర్లో... ‘ నీ గురించి చెప్పు.. అయినా పేరు కన్నా ఎక్కువ తెలుసుకుని ఏం చేస్తా.... తినడానికి పుణుగుల్లేవు గానీ బెగ్గర్‌కి బర్గర్‌కి తినిపిస్తా అన్నాడట’ అంటూ నిహారిక బబ్లీగా చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో .. ‘ పెళ్లి ఒప్పుకోకపోతే చెయ్యి కోసుకుంటా’ అంటూ సుహాసిని బెదిరించడం.. ఆ వెంటనే నిహారిక ఐదంకెలు లెక్కబెట్టి కోసుకో అని చెప్పిన డైలాగ్స్‌తో క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అయ్యిందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టీజర్‌పై ఓ లుక్కేయండి మరి. -
నేడు ‘సూర్యకాంతం’ టీజర్
మెగా డాటర్ నిహారికకు సరైన టైమ్ రావడం లేదు. బుల్లితెర మీద రాణించిన నిహారిక.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు, హ్యాపి వెడ్డింగ్ చిత్రాలతో అభిమానులను పలకరించినా.. ఆశించినంత విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. ఈ సారి ‘సూర్యకాంతం’ అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యారు. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్‌విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సూర్యకాంతం చిత్రంలో నిహారికి విభిన్న పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నేడు(జనవరి 25) ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ మూవీ టీజర్‌ను వరుణ్ తేజ్ ఈ రోజు సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు. సందీప్ ఎర్రమ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీని మార్చిలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది. A girl who turns your world upside down. A girl you can’t ignore. A girl you’ve fallen for. Always a mystery!! Teaser out tomorrow at 5 P.M. Stay tuned!#SuryakantamTeaser #CountdownToSuryakantam@IamNiharikaK @ActorRahulVijay @IamPranithB pic.twitter.com/ykjtM17xwU — Varun Tej Konidela (@IAmVarunTej) January 24, 2019 -
ప్రేమ.. గొడవ
సూర్యకాంతం... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ పేరు చెప్పగానే గయ్యాళి అత్త పాత్రలు చేసిన సూర్యకాంతం గుర్తొస్తారు. వెండితెరపై సూర్యకాంతం చేసిన గయ్యాళి పాత్రలు ఎంత ప్రభావం చూపాయంటే నిజ జీవితంలో ఆవిడ పేరు పెట్టుకునే సాహసం ఎవరూ చేయరు. తాజాగా ‘సూర్యకాంతం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కడంతో ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ యెర్రం రెడ్డి, సృజన్ యెర్రబాబు, రామ్ నరేష్ నిర్మించారు. మంగళవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర సమర్పకుడు, హీరో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ‘సూర్యకాంతం’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మరోవైపు గొడవ పడుతున్న నిహారిక, రాహుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. పెర్లేనె భెసానియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: నిర్వాణ సినిమాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్, కెమెరా: హర్జీ ప్రసాద్, సంగీతం: మార్క్ కె.రాబిన్. -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సూర్యకాంతం
-
గడసరి గుండమ్మ
నేడు గయ్యాళి అత్త సూర్యకాంతం 93వ జయంతి l కాకినాడ నుంచి చిత్రపరిశ్రమకు... గయ్యాళి భార్యగా, రాచిరంపాన పెట్టే అత్తగా, చాడీలు చెప్పే ఆడపడుచులా, చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే పొరుగింటావిడిలా ఎవరైనా కనిపిస్తే చాలు.. ఎవరికైనా ఆమె పేరే ఠక్కున గుర్తొస్తుంది. బొద్దుగా ఉంటూ.. పెద్దగా అరుస్తూ ఎదుటి వారిపై విరుచుకుపడాలన్నా.. మానసికంగా వేధించాలన్నా వెండి తెరపై ఆమెకే సాధ్యమైంది. గయ్యాళి పాత్రల్లో ఆమె అంతగా ఒదిగిపోయింది. ఆమే తెలుగువారి గుండమ్మ.. సూర్యకాంతం. నేడు ఆమె 93వ జయంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – కంబాలచెరువు(రాజమహేంద్రవరం) చిన్ననాటి నుంచి నాటకాలు వేస్తూ.. జిల్లాలోని కాకినాడ సమీపాన వెంకటకృష్ణాపురానికి చెందిన సూర్యకాంతం ఆమె తల్లిదండ్రులకు 14వ సంతానం. చిన్ననాటి నుంచే అల్లరిపిల్లగా ముద్రపడిన ఆమె ఏం మాట్లాడినా సూటిగా సుత్తితో మేకును దిగ్గొట్టినట్టే ఉండేది. కాకినాడలోని యంగ్మె¯Œ్స హ్యపీక్లబ్లో నాటకాలు వేసేది. ఆ సమయంలో నటులు అంజలి, ఆదినారాయణరావు, ఎస్వీ రంగారావు, రేలంగి వారు అక్కడకు వచ్చేవారు. ఆ క్రమంలో వీరితో సూర్యకాంతానికి పరిచయం ఏర్పడింది. వారి మాటల ద్వారా ఆమెకు వెండితెరపై ఆసక్తి కలిగింది. అయితే తొలుత చాలా సినిమాల్లో నృత్య సన్నివేశాల్లో గుంపులో కనిపించడం, కథానాయిక పక్కన చెలికత్తెగా నటించింది. ఆమె హీరోయి¯ŒS అవుదామనున్న కల తీరడంలేదు. అదే సమయంలో ’ధర్మంగద’ అనే చిత్రంలో మూగపాత్ర లభించింది. ఆ తర్వాత మరో సినిమాలో హీరోయి¯ŒS పాత్ర వేసే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఆమె బిరుదులు గయ్యాళి అత్త, సహాజనట కళాశిరోమణి, హాస్యనట శిరోమణి, బహుముఖ నటన ప్రవీణ, రంగస్థల శిరోమణి, అరుంగలై మామణి(తమిళ్) అవార్డులు : మహానటి సావిత్రి మోమోరియల్ అవార్డు, పద్మావతి మహిళా యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కారం గయ్యాళి పాత్రలతో.. సాధన సంస్థ వారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు హీరోలుగా తీసిన ’సంసారం’(1950) కయ్యాలమారి పాత్ర. అంతే ఆ సినిమాతో గయ్యాళి గంప పాత్రలకు పేరుగా సూర్యకాంతం నిలిచింది. అదే ఏడాదిలో హైకోర్టు జడ్డి పెద్దిబొట్ల చలపతిరావును వివాహం చేసుకున్నారు ఆమె. సంసారం సినిమాలో పాత్రతో అప్పటి నుంచి ఇక ఆమెకు గయ్యాళి భార్యగా, రాచిరంపాన పెట్టే అత్తగా, చాడీలు చెప్పే ఆడపడుచులా, చిచ్చులు పెట్టి రెచ్చగొట్టే పొరుగింటావిడి వంటి పాత్రలే ఆమెను వరించాయి. మహానటుల సినిమాకు ఆమె పాత్రపేరుతో.. ఎన్టీర్, ఏఎన్నార్‌తో తీసిన హిట్ సినిమా ’గుండమ్మక£ýథ’. ఆ సినిమాలో నటదిగ్గజాలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు నటించినా.. సూర్యకాంతం టైటిల్రోల్తో గుండమ్మ పేరుపెట్టి ఆ చిత్రాన్ని నిర్మించారంటే ఆమె స్థానం ఏమిటో ఊహించుకోవచ్చు. అటువంటి ఆ మహానటి సావిత్రి బిరుదాంకితురాలు షుగర్ వ్యాధితో 18 డిసెంబర్ 1994 మృతి చెందింది. ఆమె నటించిన చివరి చిత్రం ఎస్పీ పరశురామ్. -
అందమైన సూర్యకాంతం....
వ్యాంప్ నాస్టాల్జియా సూర్యకాంతం ఎప్పుడూ నాజుగ్గా ఉండాలనుకోలేదు. గయ్యాళితనానికి ఆ పాటి శరీర పుష్టి ఉండాలనుకొని ఉండొచ్చు. కాని నాదిరా అలా కాదు. చివరి వరకూ గ్లామర్ మెయింటెయిన్ చేసింది. గయ్యాళి పాత్రలు చేస్తే ఏమి? అందగత్తెలు గయ్యాళులు కాకూడదా? నాదిరా అనగానే అందరికీ శ్రీ 420లో ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ పాట గుర్తుకు వస్తుంది. తొలి సినిమా మహబూబ్ ఖాన్ ‘ఆన్’ అయితే ఆ తర్వాత ‘వారిస్’, ‘దిల్ అప్నా ప్రీత్ పరాయ్’ వంటి సినిమాలో ఆమె ప్రేక్షకులు గట్టిగా జ్ఞాపకం ఉంచుకునే పాత్రలు చేసింది. ఆంగ్లో ఇండియన్స్ మీద మన తెలుగు నిర్మాత బి.నాగిరెడ్డి నిర్మించిన హిట్ చిత్రం ‘జూలీ’లో నాదిరా పోషించిన తల్లి పాత్ర ఎవరూ మర్చిపోలేరు. దయా కనికరం లేనట్టుగా కనిపించే ముఖం, మాటలతో నాదిరా పాత్రలను రక్తి కట్టించేది. అయితే ఆమె నటించాల్సినన్ని సినిమాల్లో నటించలేదనే చెప్పాలి. తెర మీద కనిపించినట్టుగానే తెర వెనుక కూడా ఆమె చాలా డైనమిక్‌గా ఉండేది. పార్టీలు... స్నేహితులు... ప్రతి రోజూ ఒక ఉత్సవమే. బాగ్దాద్‌కు చెందిన యూదుల కుటుంబంలో పుట్టిన నాదిరా (అసలు పేరు ఫ్లోరెన్స్ నజకిల్ నాదిరా) ముంబై ఇండస్ట్రీనే తన కుటుంబం అనుకుంది. ఇద్దరు సోదరులు ఉండేవారని, వాళ్లు ఇజ్రాయిల్లోనో అమెరికాలోనో స్థిరపడ్డారని అంటారు. ‘మహల్’ సినిమాలో ‘ఆయేగా ఆయేగా ఆనేవాలా ఆయేగా’... వంటి సూపర్‌హిట్ పాటలు రాసిన ‘నక్షబ్’ అనే కవిని ఆమె పెళ్లాడింది. అయితే కాపురం రెండేళ్లే. విడాకులు తీసుకున్నాక అతడు పాకిస్తాన్ వెళ్లిపోయి చిన్న వయసులోనే మరణించారు. ఇంకెవరో ముక్కూముఖం తెలియనివాణ్ణి రెండో పెళ్లి చేసుకుని వారం రోజుల్లోనే తరిమి కొట్టింది. ఆమె టాలెంట్, స్క్రీన్ మీద ఇతరులు డామినేట్ చేసే సామర్థ్యమే ఆమె పాలిట శత్రువులయ్యాయేమో తెలియదు. నాదిరాకు గొప్ప సాహితీ పరిజ్ఞానం ఉంది. రాజకీయాలు కొట్టిన పిండి. మూడు నాలుగు భాషల్లో అద్భుత పాండిత్యం ఉంది. ఇంత ఉన్నా సాయంత్రమైతే పిలవని బాలీవుడ్ పార్టీలకు కూడా వెళ్లి తాగుతూ కూచునేది. కొన్నాళ్లు దీనిని పరిశ్రమ భరించినా ఆ తర్వాత విసుక్కోవడం ప్రారంభించింది. ముంబై మహలక్ష్మి టెంపుల్ సమీపంలోని చిన్న ఫ్లాట్‌లో ఒక్కత్తే జీవించిన నాదిరా చివరి రోజుల్లో సయాటికా వల్ల ఒకటి రెండేళ్లు మంచానికే పరిమితమైంది. దీప్తి నావెల్ వంటి ఒకరిద్దరు తప్ప ఆమెకు స్నేహితులు మిగల్లేదు. దిలీప్ కుమార్, రాజ్‌కపూర్ వంటి నటులతో ఢీ అంటే ఢీ అన్నట్టు నటించిన ఆ ప్రతిభావంతమైన నటి 2006లో తన 73వ ఏట మరణించింది. -
భావోద్వేగాలతో...కబడ్డీ కబడ్డీ
గయ్యాళి తల్లి సూర్యకాంతం వర్సెస్ సవతి కూతురు సావిత్రి! గారాబాల చెల్లెలు జమున వర్సెస్ పనిమనిషి లాంటి సావిత్రి! రోడ్ రోలర్ లాంటి సూర్యకాంతం వర్సెస్ ఆర్మీ ట్యాంక్ లాంటి ఛాయాదేవి! స్మార్ట్ లవర్ బాయ్ అక్కినేని వర్సెస్ ఇన్నోసెంట్ ప్రేమికుడు ఎన్టీవోడు! పెళ్లి చెడగొట్టే డర్టీ ఫెలో రమణారెడ్డి వర్సెస్ కథ నడిపించే పెద్దమనిషి ఎస్వీ రంగారావు! ఇన్ని ఎమోషన్స్‌తో కబడ్డీ... కబడ్డీ...! గుండెలను కరిగించే కథ! పరివర్తన తెచ్చే కథ! కుటుంబాలను కలిపే కథ! ఇప్పటికీ నచ్చే కథ! మళ్లీ చూడండి రామ్, ఎడిటర్, ఫీచర్స్ ఒక రాక్షసుడు ఉండేవాడు. బండెడు అన్నం, రోజుకో మనిషి వాడి డైట్. అదీ సరిపోయేది కాదు. నిద్రపట్టక దొర్లేవాడు. అర్ధాకలి మరి! మళ్లీ ఎప్పుడు వేళవుతుందా... ఎప్పుడు బండెడు అన్నం తిందమా అని ఎదురు చూసేవాడు. రోజుకొక మనిషన్నది కూడా ఆ రాక్షసుడి నియమం కాదు. అది మనుషులు పెట్టిన రేషనింగ్. లేకపోతే ఊరి మీద పడి దొరికినవాళ్లని దొరికినట్టు నోట్లో వేసుకుని చప్పరించేస్తాడు కదా. అంత స్టామినా వాడిది. సూర్యకాంతం నటనలో అంతకు రెండింతల స్టామినా ఉంటుంది. స్టామినా కాదు, రాక్షసత్వం. రోల్ ఏదైనా రోస్ట్ చేసేస్తుంది. కారాలు మిరియాలు అద్దుకుని మరీ కరకర న మిలేస్తుంది. కళ్లమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. అమెక్కాదు. ఆమె దబాయించే మనిషికి. అంతటి మనిషిని ‘గుండమ్మ కథ’లో పస్తులుంచేశారు చక్రపాణి! అందులో సూర్యకాంతం గయ్యాళి. ఈ గయ్యాళి పాత్రను ఆయన షేక్స్పియర్ నవల ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత, కన్నడ సినిమా ‘మనె తుంబిద హెణ్ణు’ నుంచి కొంత తీసుకుని శిల్పంలా చెక్కారు. అయితే సావిత్రిపై విసుక్కోవడం, చికాకు పడడం తప్ప సూర్యకాంతంలో వేరే గయ్యాళితనం కనిపించదు గుండమ్మ కథలో. ‘బాబోయ్... గుండమ్మా!’ అని తక్కిన పాత్రలు మాత్రం బెదిరిపోయి పారిపోవడం తప్ప. ఎన్టీఆర్, ఏఎన్నార్... అప్పటికే సూపర్స్టార్లు. ఒకరిని మించిన వారొకరు. ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు. ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. రోల్ ఏదైనా వాళ్లు హీరోల్లానే కనిపించాలి. మరోలా కనిపిస్తే బాక్సులు కాకుండా వేరే ఏవైనా బద్దలైపోతాయి. అలాంటిది.. కథ కోసమే అయినా, కామెడీ కోసమే అయినా ఎన్టీఆర్‌ని పనిమనిషి అంజిగాడిగా, ఏయన్నార్‌ని కొంటె కోణంగిగా చూపించడం పెద్ద సాహసం. పెపైచ్చు సినిమా టైటిల్ కూడా వారిని ఇండికేట్ చేసేలా లేదు. కథా వాళ్లిద్దరి చుట్టూ అల్లింది కాదు. అయినా అంత పెద్ద సాహసాన్ని అలవోకగా చేసేశారు చక్రపాణి-నాగిరెడ్డి... విత్ ది హెల్ప్ ఆఫ్ కమలాకర కామేశ్వరరావు. గుండమ్మ కథ మొత్తం ఇలాగే ఉంటుంది. వైవిధ్యంగా! రమణారెడ్డి ఉంటాడు. డేంజరస్ విలన్! పెళ్లిళ్లు చెడగొట్టడాన్ని మించిన డేంజరస్ విలనీ ఏముంటుంది చెప్పండి!! కానీ అంత డేంజరస్‌గా అనిపించడు. తెరపై కనిపించినప్పుడల్లా నవ్వించి పోతుంటాడు. పోయి, మళ్లీ నవ్వించడానికే వస్తున్నట్లు ఉంటాడు. ఈ మధ్యలో చేసే పనంతా చేస్తుంటాడు. ఇక గుండమ్మ సొంత కూతురు జమున పెంకి పిల్ల. సినిమాలో మరీ అంత పెంకితనం ఏమీ కనిపించదు. సవతి కూతురు సావిత్రి తెల్లారకుండానే లేచి ఇంటిపనులు మొదలు పెడితే, ఈ అమ్మాయికి ఎప్పటికో గానీ తెల్లారదు. బారెడు పొద్దెక్కాక ఒళ్లు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి ‘అమ్మా... కాఫీ’ అని అడుగుతుంటుంది. అతి గారాబం. ఇక్కడికి ఈ వైపు క్యారెక్టర్లు అయిపోయాయి. సూర్యకాంతం, సావిత్రి, జమున, కొడుకు హరనాథ్, వాళ్లింటికి వచ్చిపోతుండే రమణారెడ్డి. అటువైపు ఎస్వీరంగారావు. ఆయన పెద్దకొడుకు ఎన్టీఆర్, చిన్న కొడుకు ఏఎన్నార్. వీళ్లతోపాటు కథ అవసరాన్ని బట్టి ఛాయాదేవి (హరనాథ్ ప్రేమించిన ఎల్.విజయలక్ష్మి మేనత్త), రమణారెడ్డి కొడుకు రాజనాల ఎంట్రీ ఇచ్చి వెళుతుంటారు. వీళ్లంతా పాత్రకు తగ్గ ఎమోషన్స్‌ని పలికిస్తుంటారు కానీ, ఆ పాత్రల స్వభావాలను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు పదే పదే సినిమాలో కనిపించవు. సూర్యకాంతం ఏమిటో చెప్పడానికి ఆమె ఫేస్‌వ్యాల్యూ ఒక్కటి చాలదా! చక్రపాణి కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి ఆమెను అలా వదిలేశారు సహజసిద్ధంగా. ఆమెను దారిలో పెట్టడానికి అంతే ఫేస్‌వ్యాల్యూ ఉన్న ఛాయాదేవిని బాణంలా వదిలారు. ఇక ఆ తర్వాతి సీన్లు ఎలా నడవాలన్నది వాళ్లిద్దరి ఇష్టం. సూర్యకాంతం, ఛాయాదేవి కలిస్తే ఇంకేముందీ.. డెరైక్టర్ని కూడా మధ్యలోకి రానివ్వరు. గుండమ్మ కథలోనూ అలాగే జరిగింది. సినిమా హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అయిందంటే మాత్రం ఒక పేరు చెప్పలేం. సినిమా చూడాల్సిందే. గుండమ్మ కథలోని ప్రతి ఆర్టిస్టూ సినిమా చూపించారు. సంప్రదాయ నటనకు భిన్నంగా (ప్రోగ్రెసివ్ అనాలేమో) నటుల చేత యాక్ట్ చేయించి, కథను నడిపించిన చక్రపాణిని కూడా ఇందులోని హిట్ క్యారెక్టర్‌గానే చెప్పుకోవాలి. కథేమిటి? సూర్యకాంతం వితంతువు. కూతుళ్లు సావిత్రి, జమున. కొడుకు హరనాథ్. సంపన్న కుటుంబం. ఎస్వీరంగారావుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎన్టీఆర్, చిన్నవాడు ఏఎన్నార్. అది మరీ సంపన్న కుటుంబం. కొడుకులిద్దరికి మంచి సంబంధాల కోసం వెదుకుతుంటాడు ఎస్వీరంగారావు. ఇక్కడ సూర్యకాంతానికీ అదే పని. అయితే సొంత కూతురికి మాత్రమే సంబంధాలు చూస్తుంటుంది. సావిత్రిని ఎవడో తలమాసిన వాడికి ఇచ్చేస్తే సరిపోతుందని ఆమె ఉద్దేశం. ఎస్వీఆర్ గురించి సూర్యకాంతానికి తెలుస్తుంది. మధ్యవర్తిని పంపి జమున విషయం చెప్పిస్తుంది. ఈ సూర్యకాంతం ఎవరో కాదు, చనిపోయిన తన స్నేహితుడి భార్యేనని ఎస్వీఆర్‌కి తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్లకు... సావిత్రి, జమునల్ని ఇచ్చి చేస్తే స్నేహితుడి ఆత్మ శాంతిస్తుందని భావిస్తాడు. అలాగే గయ్యాళి సూర్యకాంతంలో, ఆమె పెంకి కూతురు జమునలో మార్పుతేవాలని అనుకుంటాడు. ఆ సంగతిని కొడుకులిద్దరికీ చెప్పి చిన్న నాటకం ఆడమంటాడు. ఎన్టీఆర్ పనిమనిషిలా సూర్యకాంతం ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మొదట ఆమెను బుట్టలో వేసుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత సావిత్రి హృద యాన్ని గెలుచుకుంటాడు. ఇక ఏఎన్నార్. జమునను వలలో వేసుకుని ఆమె ప్రేమను పొందుతాడు. సంపన్నుడైన ఎస్వీరంగారావు కొడుగ్గానే పరిచయం చేసుకుంటాడు. అలా ఇటు ఎన్టీఆర్, అటు ఏయన్నార్... సూర్యకాంతం కుటుంబానికి బాగా దగ్గరవుతారు. మొదట ఎన్టీఆర్, సావిత్రిల పెళ్లి జరుగుతుంది. తర్వాత చిన్న అవరోధంతో ఏయన్నార్, జమునలు దంపతులవుతారు. అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది. ఎన్టీఆర్ సావిత్రిని తన ఇంటికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. ఏయన్నార్ మరోలా సర్ప్రైజ్ చేసి (తను ఎస్వీఆర్ కొడుకును కాదన్న అబద్ధంతో) జమునను తనతో పాటు తీసుకెళ్లి అష్టకష్టాలు పడనిచ్చి చివర్లో అసలు విషయం చెప్తాడు. సూర్యకాంతం కూడా ఎస్వీఆర్ ఇంటికి వచ్చేస్తుంది. కథ సుఖాంతం. ఈ మధ్యలో కొన్ని మలుపులు, కొన్ని మెరుపులు... కథలో బలం ఉన్నప్పుడు పాత్రల స్వభావాలను పట్టిపట్టి ఎలివేట్ చేయల్సిన పనిలేదని నిరూపించిన చిత్రం... గుండమ్మ కథ. నిరూపించిన నిర్మాత చక్రపాణి. మళ్లీ చూడవలసిన సినిమా. మన పిల్లలకూ చూపించవలసిన సినిమా. మోడర్న్ అమ్మలకీ, నాన్నలకీ కథలు రావు. ఏంత రాకున్నా ఒక కథ మాత్రం వారు చెప్పగలరు. అదే... ఏడు చేపల కథ. అందుకే ఆ కథ ప్రతి తరానికీ అందుతోంది. సరిగ్గా అలాంటి కథే గుండమ్మ కథ. మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన కథ. - సాక్షి ఫ్యామిలీ కొన్ని విశేషాలు - ఎన్టీఆర్‌కిది 100వ సినిమా. ఏయన్నార్‌కు 99వ చిత్రం. - గుండమ్మకథకు మూడేళ్ల ముందు ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో జమునకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఆ మూడేళ్లు వాళ్ల పక్కన జమున నటించలేదు. ఈ సినిమా కోసం నాగిరెడ్డి-చక్రపాణి గట్టిగా జోక్యం చేసుకుని ముగ్గురినీ కలిపారు. - ఈ సినిమాలో అందరూ బిజీ ఆర్టిస్టులే కావడంతో ఎవరి డేట్స్ దొరికితే వాళ్లతో సీన్లు తీసేశారు. ‘కోలో కోలో యన్న కోలో’ పాటలో ఎన్టీఆర్, సావిత్రి, ఏయన్నార్, జమున కలిసి పాడతారు కదా. నిజానికి షూటింగ్లో నలుగురూ కలిసిందే లేదు. ఇద్దరొకసారి, మరో ఇద్దరు ఇంకోసారి పాట పూర్తి చేసి నలుగురూ కలిసి పాడారన్న ఎఫెక్ట్ తీసుకొచ్చారు. - మరో ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డికి ఈ కథ నచ్చలేదు. హిట్టయిన తర్వాత కూడా ఇది ఎందుకు అంత పెద్ద విజయం సాధించిందో తనకు అర్థం కాలేదని అన్నారట! లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం మౌనముగా నీ మనసు పాడిన కనులు మూసినా నీవాయే... కోలోకోలోయన్న కోలో నా సామి ఎంత హాయి ఈ రేయి వేషము మార్చెను, భాషను మార్చెను అలిగిన వేళనే చూడాలి ప్రేమయాత్రలకు బృందావనము -
తెలుగుతెరపై ఆమెకు ప్రత్యామ్నాయం లేదు
సూర్యకాంతం జయంతి ‘సూర్యకాంతం’... తమ పిల్లలకు ఈ పేరు పెట్టాలంటే తల్లిదండ్రులందరూ తటపటాయిస్తారు. అంటే... ఆ పేరు ప్రభావం తెలుగునేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఆడకూతురైనా కాస్త గొంతు పెంచి అరిస్తే చాలు... ‘సూర్యకాంతంరా బాబూ’ అనేస్తాడు తెలుగోడు. రీల్ లైఫ్‌లో పోషించిన పాత్రలు ఇంతటి ప్రభావాన్ని చూపడం అనేది బహుశా... ఒక్క సూర్యకాంతం విషయంలోనే జరిగిందేమో! నిజజీవితంలో కూడా సూర్యకాంతం టపాసుల సూరేకారమే అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ.. అందులో నిజంలేదు. రియల్ లైఫ్‌లో సూర్యకాంతం చూరుకింద కాంత మాత్రమే. కాకినాడ సమీపాన గల వెంకటక్రిష్ణరాయపురంలో సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారామె. మంచితనానికీ అల్లరితనానికీ తెగువకు పసివయసులోనే కేరాఫ్ అడ్రస్ అయ్యారు సూర్యకాంతం. సైకిళ్లు కొత్తగా అడుగుపెడుతున్న రోజుల్లోనే మగాళ్లకు దీటుగా సైకిళ్లు తొక్కేయడం, ఊళ్లోని మామిడి, జామ, సపోటా చెట్లను దులపరించేయడం, ‘ఏయ్ ఆగక్కడ’ అన్నవాళ్లను వెక్కిరించి మరీ సైకిల్‌పై ఉడాయించడం... ఇలా చిన్నవయసులో సూర్యకాంతం చేసిన ఆగడాలు అన్నీయిన్నీ కావు. ఊళ్లోని బజార్లన్నీ ఒకప్పుడు సూర్యకాంతానివేనట. ఊరిజనం ఆమెకు ‘సైకిల్ రాణి’ అని పేరు కూడా పెట్టేశారట. తర్వాత రోజుల్లో సూర్యకాంతం మహానటిగా ఎదగడానికి ఆ జోరు, ఆ హుషారే కారణమయ్యాయని చెప్పక తప్పదు. ఆడపిల్లలు గడపదాటడమే పెద్ద నేరం అనుకునే రోజుల్లో ‘నేను సినిమాల్లోకి వెళుతున్నాను. నన్ను ఎవరూ వెతకొద్దు’ అని లెటర్ పెట్టి మరీ మద్రాసు రెలైక్కేశారు సూర్యకాంతం. జెమినీ స్టూడియో ముందు గూర్ఖా అడ్డుకుంటే... వాడికి చిన్న ఝలక్ ఇచ్చి మరీ లోపలికి ప్రవేశించారు. తెలుగుతెరను దశాబ్దాల తరబడి ఏలబోతున్న ఓ వెండితెర సామ్రాజ్ఞిని తాను ఆపానని ఆ క్షణాన బహుశా ఆ గూర్ఖా అనుకొని ఉండడు పాపం. ‘నారదనారది’(1946)లో తొలి అవకాశం దక్కినా... ఆ సినిమా తర్వాత కూడా అలా కనిపించి, ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారామె. సూర్యకాంతం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా మాత్రం ‘సంసారం’(1950) చిత్రమే. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రేలంగి తల్లిగా గయ్యాళి పాత్రలో సూర్యకాంతం నటనకు తెలుగునేల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెరపై ఆ గయ్యాళి తనాన్ని చూసి తిట్టని వారు లేరు. ఆ తిట్లన్నీ ఆ మహానటికి దీవెనలే అయ్యాయి. తెలుగు తెరపై ప్రత్యామ్నాయం లేని నటిగా ఎదగడానికి బాటలు వేశాయి. బ్రతుకుదెరువు, చక్రపాణి, దొంగరాముడు, భాగ్యరేఖ, తోడికోడళ్లు, మంచి మనసుకు మంచి రోజులు, మాంగల్యబలం, కలసివుంటే కలదు సుఖం, శభాష్‌రాజా, వాగ్దానం, గుండమ్మకథ, కులగోత్రాలు, రక్తసంబంధం, రాముడు-భీముడు, వెలుగునీడలు, దసరా బుల్లోడు ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకాంతం సృష్టించిన అద్భుతాలు ఎన్నో. సూర్యకాంతంలో ప్రేక్షకులకు నచ్చింది గయ్యాళితనం మాత్రమే కాదు. అ గయ్యాళితనంలో అంతర్లీనంగా దాగున్న అమాయకత్వం. అందుకు గుండమ్మకథ, వెలుగునీడలు, శాంతినివాసం లాంటి సినిమాలే ఉదాహరణ. అలాగే కారుణ్యం అనేది తెలియని కటిక రాకాసి పాత్రల్లో కూడా శభాష్ అనిపించారామె. ‘రక్తసంబంధం’ సినిమాలోని ‘కాంతమ్మ’ పాత్రే అందుకు నిదర్శనం. ‘మాయాబజార్’లో ఘటోత్కచుని తల్లి హిడింబగా ‘అలమలం సుపుత్రా అలమలం’ అంటూ చిత్రమైన శారీరకభాషతో కనిపించే సూర్యకాంతాన్ని ఎవరైనా మరిచిపోగలరా? అభిమానులు కూడా సూర్యకాంతాన్ని దూరం నుంచి చూడ్డమే తప్ప దగ్గరికొచ్చే సాహసం మాత్రం చేసేవారు కాదట. ఓ సారి ఆమె స్వయంగా... ‘రండీ... అలా దూరంగా నిలబడ్డారే’ అన్నారట. ఆ గుంపులో ఉన్న ఓ కుర్రాడు... ‘మీరు ఎడమచేయి విసురుతారేమో అని భయం’ అన్నాట్ట. ‘సినిమాల్లో అంటే... వాళ్లు డబ్బులిస్తున్నారు కాబట్టి విసురుతాను... నువ్వేమిస్తావ్ నాకు’ అన్నారట తనదైన శైలిలో ఎడమచేయి తిప్పుతూ సూర్యకాంతం. అంతే... ఇక అక్కడంతా నవ్వులే నవ్వులు. ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. సూర్యకాంతంపై ఓ కీలక సన్నివేశాన్ని తీస్తున్నారు ప్రత్యగాత్మ. పాత్రను సొంతం చేసేసుకొని నటించడం సూర్యకాంతం స్పెషాలిటీ. అందులో భాగంగానే... స్క్రిప్టులో ఉన్న డైలాగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో సొంతంగా అనేస్తున్నారట. ప్రత్యగాత్మ కూడా కట్ చెప్పకుండా... సెలైంట్‌గా ఉండిపోయారట. ఇంతలోనే టక్మని ఆపేసి, ‘ఏంటి నాయనా కట్ చెప్పవేం’ అన్నారట సూర్యకాంతం. ‘బాగుంది కదమ్మా... అందుకే...’ అన్నారట ఆయన. ‘అవునా... ఎగస్ట్రా డైలాగులు చెప్పాను కదా.. మరి ఎగస్ట్రా పేమెంటేదైనా ఇప్పిస్తావా’ అన్నారట తడుముకోకుండా. ఇంకేముంది... లొకేషన్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. సూర్యకాంతం లొకేషన్లో ఉంటే సందడే సందడి. ఇంట్లో వండుకున్న పిండివంటలన్నీ తెచ్చి లొకేషన్లో అందరికీ పెట్టేవారట ఆమె. ఓ రోజు సూర్యకాంతం, ఛాయాదేవి ఇద్దరూ ఇంటిలో వండుకున్న పిండివంటలు తెచ్చుకొని లొకేషన్లో తింటున్నారట. అది చూసిన రేలంగివారు ఓ విధంగా మొహం పెట్టి.. ‘ఏం తింటున్నార్రా బాబూ’ అన్నారట . ‘మేం మా ఇంట్లోవే తింటున్నాం. రీళ్లు తినడంలా...’ అన్నారట ఠపీమని సూర్యకాంతం. అంతే... రేలంగి గతుక్కుమన్నారట. సూర్యకాంతం మనసు చాలా సున్నితం. పాత్రలో భాగంగా చిత్తూరు నాగయ్యగారిని తిట్టాలి. దర్శకుడు ‘యాక్షన్’ అని కేకపెట్టగానే... తనదైన స్టైల్లో నాగయ్యగారిని చెడామడా తిట్టేసి, దర్శకుడు కట్ చెప్పగానే... ఆయన కాళ్లమీద పడి భోరున ఏడ్చారట. ‘పాపిష్టిదాన్ని... అనరాని మాటలన్నాను. క్షమించండి నాన్నగారు..’ అని ఆమె విలపిస్తుంటే... ‘ఊరుకోమ్మా... నన్ను కాదు కదమ్మా నువ్వు తిట్టిందీ.. నా పాత్రను’ అని నాగయ్య ఊరడించారట. సూర్యకాంతం తెరపై కనిపించిన చివరి సినిమా ‘ఎస్పీ పరశురాం’(1994). అదే ఏడాది డిసెంబర్ 18న ఆమె సినీలోకాన్ని వదిలి స్వర్గలోకంలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతం ఎప్పుడూ నటించలేదు. బిహేవ్ చేసేవారు. అందుకే ఆమె సహజనటనకు చిరునామా. నేడు ఆ మహానటి జయంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆమె తెరపై వెలిగించిన వెలుగు రేఖలు దేదీప్యమానంగా విరాజిల్లుతూనే ఉంటాయి.