
అమ్మ హంసవాణితో...
‘ముత్యాల ముగు’్గ సీరియల్ చూసిన వారికి విరాట్‌గా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సీరియల్ నటుడు ప్రజ్వల్. ఇప్పుడు ‘జీ తెలుగు’ లో ప్రసారమయ్యే ‘సూర్యకాంతం’ సీరియల్‌లో చైతన్యగా తన నటనతో మెప్పిస్తున్నాడు. కన్నడ సీరియల్ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రజ్వల్ తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్న విధానాన్ని ఈ విధంగా వివరించారు.
‘‘ఇంటర్మీడియెట్ తర్వాత కన్నడలోని ఓ సీరియల్‌లో కృష్ణుడి పాత్ర కోసం నన్ను అడిగారు. అప్పటికి శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండటం వల్ల ఆ పాత్రకు అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘పునర్ వివాహ్’ సీరియల్‌లో ప్రధాన పాత్ర పోషించాను. నటుడిగా మారకముందు నేను డాన్సర్‌ని.
తొమ్మిదేళ్ల వయసు నుంచి
నేను పుట్టకముందు అమ్మ సాగరసంగమం సినిమాలో కమల్‌హాసన్ గారిని చూసి అబ్బాయి పుడితే భరతనాట్యం నేర్పించాలనుకున్నారట. అలా నాకు భరతనాట్యం, కథక్ నేర్పించారు. ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా అక్కడకు తీసుకెళ్లేవారు అమ్మనాన్నలు. తొమ్మిదేళ్ల వయసు నుంచే ఉత్తర, దక్షిణ భారతదేశాలు ముఖ్యంగా కాశీ, రామేశ్వరం, ఢిల్లీ, హైదరాబాద్‌లలోనూ వేదికల మీద నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. చిన్నప్పుడు అమ్మనే నాకు మేకప్ చేసేవారు. ఇప్పటికీ ఎక్కడ నా నృత్య ప్రదర్శన ఉన్నా మేకప్‌లో ఫినిషింగ్ టచ్ అమ్మనే ఇవ్వాలి. కళ్లకు కాజల్, నుదటన తిలకం అమ్మ దిద్దితేనే నాకూ ఆ నృత్యం సంపూర్ణం అనిపిస్తుంది. బేసిక్‌గా సైన్స్ స్టూడెంట్‌ని. ఇంటర్మీయెట్ తర్వాత ఇంజనీరింగ్ చదివాలా.. డాన్సర్‌గా నా కలను సంపూర్ణం చేసుకోవాలా అనే సందిగ్దం వచ్చింది. రెండోదానికే నా ఆలోచన మళ్ళింది. దీంతో కామర్స్ తీసుకొని, ఆర్ట్ ఫీల్డ్‌కి వచ్చాను.
సూర్యకాంతం సీరియల్‌లో సన్నివేశం
నృత్యం వల్ల మెరుగు
రామాయణ, భారత కథలు, పురాణ పురుషులను నృత్యం ద్వారా చూపించాల్సి ఉంటుంది. దీనికి పురాణ, ఇతిహాసాలను క్షుణ్ణంగా ఔపోసన పడతాం. దీని వల్ల మానవ ప్రవృత్తి అర్ధమవుతుంది. జీవితంలో ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే నాడు ఇలాంటి సందర్భంలో వారు ఎలా ప్రవర్తించారో గుర్తుకువచ్చి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటాం.
భవిష్యత్తు ప్రణాళికలు
సీరియల్స్‌లో చేరక ముందు నృత్యప్రదర్శనలు ఇస్తూనే డ్యాన్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. భవిష్యత్తులో అకాడమీ ఏర్పాటు చేయాలని ఉంది. ప్రస్తుతం సీరియల్స్ వల్ల రెగ్యులర్ క్లాసులు తీసుకోవడం లేదు.
‘సూర్యకాంతం’లో...
‘జీ తెలుగు’లో వచ్చే ‘సూర్యకాంతం’ సీరియల్‌లో హీరో చైతన్య పాత్ర పోషిస్తున్నాను. చైతన్యకు కుటంబమే ప్రపంచం. అక్కలు, బావలు.. తప్ప మరొకటి తెలియదు.
లోకజ్ఞానం అస్సలు లేదు. అలాంటి అతనికి పూర్తి అపోజిట్ క్యారేక్టర్ సూర్యకాంతంది. చదువు రాని అమ్మాయితోనూ, ఆమె కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ ఆమె కలలకు భరోసాగా నిలుస్తుంటాడు. తన కుటుంబాన్నీ–సూర్యకాంతం కుటుంబాన్నీ ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అనేది ఇందులో ప్రధానంగా నడుస్తుంటుంది.
అన్న చెబితే ఓకే!
రియల్ లైఫ్ మా కుటుంబంలో మా అన్నయ్య నాకు చాలా సపోర్ట్.‘నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి పూర్తిగా అంకితమై ఉండాలి’ అని చెబుతారు. ‘మంచి జరిగిందా ఓకే. లేదంటే దానిని వదిలేసి మరోటి ఎంపిక చేసుకో’ అని చెబుతారు. చిన్నప్పటి నుంచి ఇంట్లోనూ, బయట నాకు సపోర్ట్ చేసేవారే దొరకడం నా అదృష్టం అనుకుంటాను. నా జీవిత భాగస్వామి కూడా నా సంతోషాన్ని, ఆసక్తిని పంచుకుని ప్రోత్సహించేలా రావాలని కోరుకుంటున్నాను. సినిమా, సీరియల్ ఏదైనా సైన్స్ ఫిక్షన్ స్టోరీలో లీడ్ రోల్‌లో నటించాలని ఉంది.’– నిర్మలారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment