భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్‌లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం.
చిత్తూరు నాగయ్య
ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్‌ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్‌డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్‌డమ్‌కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్‌కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది.
కె.వి.రెడ్డి
తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్‌బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు.
అక్కినేని నాగేశ్వరరావు
ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్‌తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి.
జమున
దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్‌స్టార్‌గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్‌స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్.
రాజబాబు
చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్‌మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్‌మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే.
సూర్యకాంతం
ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక.
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్‌లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్‌కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది.
వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు.
Comments
Please login to add a commentAdd a comment