జమునకు జీవితసాఫల్య పురస్కారం | Actoress Jamuna selected for Lifetime Achievement Award of AFA | Sakshi
Sakshi News home page

జమునకు జీవితసాఫల్య పురస్కారం

Published Wed, Sep 19 2018 12:05 PM | Last Updated on Wed, Sep 19 2018 12:12 PM

Actoress Jamuna selected for Lifetime Achievement Award of AFA - Sakshi

డల్లాస్‌, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా డల్లాస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్‌ఏ) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఏఎఫ్‌ఏ ప్రస్తుత అధ్యక్షులు రావు కల్వల మాట్లాడుతూ..1992, 2012 లో అక్కినేని నాగేశ్వరరావును డల్లాస్‌కు ఆహ్వానించి తీసుకువచ్చిన డా. ప్రసాద్ తోటకూర నాయకత్వంలోనే 2014 లో ఏఎఫ్‌ఏ సంస్థను ఏర్పాటు చేశామని  తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు నాలుగు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 22న సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు కరీంనగర్ లో ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఐదవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసిందిగా ఆహ్వానం పలికారు.

వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా గుర్తించి, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా గడిపిన కొంతమంది మిత్రులం కలిసి అమెరికాలో  “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా”  అనే సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని కృష్ణా జిల్లాలో, ఒక కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించినా కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టి లాంటి లక్షణాలతో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ లక్షణాలు అందరికి ఆదర్శనీయం కావాలనే ఉద్దేశ్యంతోనే  ప్రతి సంవత్సరం తెలుగుగడ్డ పై అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏఎఫ్‌ఏ సంస్థకు డా. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు) , రావు కల్వల (అధ్యక్షులు), శారద అకునూరి (ఉపాధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట ( కార్యదర్శి), ధామా భక్తవత్సలు (కోశాధికారి), డా. సి.ఆర్. రావు, రవి కొండబోలు, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు.

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 పురస్కార గ్రహీతలు :

జీవిత సాఫల్య పురస్కారం : అనేక సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అద్వితీయమైన పాత్రలను పోషించి అందరి అభిమానాన్ని చూరగొన్న కథానాయకి, పూర్వ లోకసభ సభ్యురాలు, ‘కళాభారతి’  జమున. 

విద్యా రత్న:  ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు,  పూర్వ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత రాజకీయాలపై తన నిష్పక్షపాత వైఖరితో కూడిన రాజకీయ విశ్లేషణ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్.

సినీ రత్న: సినీ రంగంలో అద్భుతమైన గీతాలు రాస్తూ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత గా పురస్కారం అందుకున్న డా. సుద్దాల అశోక్ తేజ.
 
విశిష్ట వ్యాపార రత్న: పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పవర్ రంగంలో ‘పవర్ మెక్’ కంపెనీ ద్వార అద్భుత విజయాలు సాధించి, తన ప్రగతిని కేవలం లాభాల్లోనే లేక్కవేసుకోకుండా సామాజిక స్పృహతో విద్యా, వైద్య రంగాల్లో తనవంతు సహాయం చేస్తున్న పారిశ్రామికవేత్త సజ్జా కిషోర్ బాబు.
 
రంగస్థల రత్న : ఆదిభట్ల నారాయణదాసు శిష్య పరంపరలో హరికథల్లో శిక్షణ తీసుకుని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వి. సంగీత, నృత్య కళాశాలలో హరికథా విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తూ, హరికథా రంగంలో అగ్రగణ్యులైన డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి.
 
వైద్య రత్న : కరీంనగర్ లోని ‘ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)’ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న బి. శ్రీనివాసరావు.

సేవా రత్న: ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే నినాదంతో తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటుతున్న వనజీవి పద్మశ్రీ ‘దారిపెల్లి జానకి రామయ్య’. 

వినూత్న రత్న: తన అద్భుతమైన కళాదృష్టితో వ్యర్ధ పదార్దాల నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను తయారుజేసి తన ఇంటినే మ్యుజియం గా మార్చిన చిత్రకారిణి డా. కమలా ప్రసాద రావు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement