akkineni nagesewar rao
-
ఆ ఇద్దరూ నాకు దైవసమానులు: చిరంజీవి
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నాకు దైవసమానులు, వారితో కలిసి పని చేయడం అదృష్టం అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విశాపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి, సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేష సాయి, వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నో మంచి సలహాలిచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, అందరినీ ఆకట్టుకునే తత్వం తనదని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీపరిశ్రమకు రెండు కళ్లువంటి వారని వీరిద్దరూ తనకు జీవితంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ.. 'యండమూరి వీరేంద్రనాథ్ నవలల వల్ల యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ సాహిత్య సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడం సంతోషం. సాహిత్య కారులతో పులకించిన నేల ఉత్తరాంధ్ర.. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, ఏఎన్నార్' అని చెప్పుకొచ్చారు. నిజమైన వారసుడు చిరంజీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 'లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు నిజమైన వారసుడు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో పేరు ప్రఖ్యతలు తెచ్చారు. చిరంజీవి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు' అని వ్యాఖ్యానించారు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
నాగార్జున వేసుకున్న ఈ షర్ట్‌కి ఓ స్పెషల్ ఉంది.. గుర్తుపట్టారా?
సాధారణంగా సెలబ్రిటీలు అనగానే వారు ధరించే బట్టల దగ్గర్నుంచి చెప్పులు వరకు ప్రతీది కాస్ట్లీగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈవెంట్ ఏదైనా డిజైనర్ వేర్ కాస్ట్యూమ్ ఉండాల్సిందే అనేంతలా ఆకట్టుకుంటారు. వాళ్లు ధరించే వాచ్‌లు, మేకప్, హ్యాండ్‌బ్యాగ్స్, ఫోన్స్,కాస్ట్యూమ్స్.. ఇలా ఒకటేమిటి ప్రతీదాంట్లో యూనిక్‌నెస్ కోరుకుంటారు. ఇక టాలీవుడ్ మన్మథుడు నాగార్జున స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా పర్ఫెక్ట్గా సూటైపోతుంది. 64ఏళ్లు పైబడినా సరే ఇప్పటికీ నాగార్జున గ్రీకువీరుడిలానే అట్రాక్ట్ చేస్తారు. సిక్స్టీ ప్లస్‌లో ఉన్నా, యంగ్ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకల్లో నాగార్జున వేసుకున్న షర్ట్ ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ షర్ట్ రెండేళ్ల క్రితం నాటిది. 2021లో బిగ్‌బాస్ సీజన్5లో ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఈ షర్ట్ వేసుకున్నారు. ఎట్రో పైస్లీ బ్రాండ్‌కు చెందిన లెమన్ ఎల్లో సిల్క్ షర్ట్‌లో భలే అట్రాక్ట్ లుక్‌లో కనిపించారు. దీని ధర దాదాపు $1310 డాలర్లు. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 83,908 రూపాయలు అన్నమాట. అప్పట్లోనే ఈ షర్ట్ ధర గురించి సోషల్ మీడియాలో గట్టిగానే టాక్ వినిపించింది. అయితే మళ్లీ రెండేళ్లకు ఇప్పుడు నాగార్జున సేమ్ షర్ట్‌లో కనిపించడం విశేషం. ఎంత కాస్ట్లీ బట్టలైనా ఒకసారి వేసుకున్న కాస్ట్యూమ్స్‌ను స్పెషల్ ఈవెంట్స్‌లలో రిపీట్ చేయడానికి మామూలుగానే సెలబ్రిటీలు ఇష్టపడరు. కానీ నాగార్జున ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో ఇలా సింపుల్‌గా కనిపించడం నిజంగానే మెచ్చుకోవాల్సిన విషయమంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
జయసుధ ఫోన్ లాక్కున్న మోహన్ బాబు.. స్పీచ్ వైరల్
విలక్షణ నటుడు మోహన్‌బాబు క్రమశిక్షణకు మారుపేరు. తను మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవారు కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు. బుధవారం (సెప్టెంబర్ 20) నాడు తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలకు మోహన్‌బాబు హాజరయ్యారు. ఈ క్రమంలో తన పక్కనే కూర్చున్న జయసుధ అతిథులు మాట్లాడుతున్న ప్రసంగం వినకుండా ఫోన్ చూస్తూ ఉంది. ఫోన్‌తో జయసుధ ఆటలు దీంతో మోహన్‌బాబు ఈ సమయంలో ఫోన్ చూడటమేంటి? అన్నట్లుగా దాన్ని లాగేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన జయసుధ నవ్వుతూ ఫోన్ చూడటం ఆపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏఎన్నార్ గురించి మాట్లాడేటప్పుడు ఫోన్ వంక చూడటం కరెక్ట్ కాదు కదా.. మోహన్‌బాబు చేసింది కరెక్టేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చొక్కా చించుకుని వెళ్లా ఇక అక్కినేని నాగేశ్వరరావు గురించి మోహన్ బాబు ప్రసంగిస్తూ.. 'ఏఎన్నార్ గురించి మాట్లాడాలంటే పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఆయన సినిమా 100 రోజుల ఫంక్షన్ జరుగుతుందంటే చొక్కా చించుకుని మరీ వెళ్లేవాడిని. మళ్లీ ఆ చొక్కా కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అటువంటిది ఆయన నటించిన మరపురాని మనిషి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇది భగవంతుని ఆశీర్వాదం. ఆ తర్వాత ఆయన బ్యానర్లో ఎన్నో సినిమాల్లో నటించాను. ఓసారి నాగేశ్వరరావు- అన్నపూర్ణమ్మ పక్కపక్కనే కూర్చున్నప్పుడు నేను వెళ్లాను. ఆమె నన్ను చూసి ఫలానా సినిమాలో బాగా నటించావని ఆశీర్వదించిస్తే ఆయన కసురుకున్నారు. నా కోరిక తీర్చారు వాడేమైనా గొప్ప నటుడని ఫీలవుతున్నావా? వాడికి ముందే పొగరు. ఎందుకు? వాడి గురించి పొగుడుతున్నావని ఆమెపై కోప్పడ్డారు. తర్వాతి రోజు నేను సెట్‌కు ఆలస్యంగా వెళ్లాను. అప్పుడో విషయం చెప్పాను.. నాకు ఓ కోరికుంది సార్.. ప్రతిసారి మీరొస్తే మేము నిలబడటమేనా? నేను వచ్చినప్పుడు మీరు లేచి నిలబడాలని కోరుకుంటున్నా అన్నాను. నా కోరిక విని ఆయన ఆశ్చర్యపోయారు. తర్వాతి రోజు సెట్‌కు వెళ్తే దాసరి, ఏఎన్నార్.. ఇద్దరూ నా కోరిక తీర్చేందుకు లేచి నిలబడ్డారు. ఇలా ఆయనతో ఎన్నో సరదా సంఘటనల అనుభూతులున్నాయి. ఏఎన్నార్ ఒక గ్రంథం, ఒక పాఠ్య పుస్తకం. అటువంటి గొప్ప వ్యక్తితో నాకు అనుబంధం ఉండటం చాలా సంతోషం' అని చెప్పుకొచ్చారు. ఫోన్ పట్టుకొని కూర్చున్న జయసుధ ఫోన్ లాగేసిన మోహన్ బాబు. #ANRLivesOn #CelebratingANR100 pic.twitter.com/IcsDTT5RJe — Actual India (@ActualIndia) September 20, 2023 చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
అక్కినేనిపై బాలయ్య వ్యాఖ్యలు.. మంత్రి రోజా రియాక్షన్ ఇదే
సాక్షి, తిరుపతి: అక్కినేనిపై బాలకృష్ణ వ్యాఖ్యలను మంత్రి ఆర్కే రోజా ఖండించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ‘ఏఎన్ఆర్పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదు. చాలా తప్పు. చాలా సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందో బాలకృష్ణ ఆలోచించాలి’’ అని మంత్రి రోజా అన్నారు. కాగా, నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. చదవండి: బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్! -
కృష్ణ సినిమాల్లోకి రావడానికి ఆ హీరోనే కారణం!
మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా రాణించారాయన. గతంలో ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమని మాట్లాడారో ఓసారి చూద్దాం.. 'పౌరాణికం, జానపదం, సాంఘికం, హారర్, విప్లవం.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశాను. అందుకు సంతృప్తిగా ఉంది. అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి సినిమాల్లో పోషించిన పాత్రలు నాకెంతో ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తి. నిజానికి నేను నందమూరి తారకరామారావు అభిమానిని. కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. అయితే నాగేశ్వరరావును మాత్రం నాలుగుసార్లు చూశాను. అప్పుడు సినిమా ఆర్టిస్టులకున్న క్రేజ్ చూసి నేనూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నా! అలా మొదటిసారి తేనె మనసులు చిత్రంలో నటించా. ఏడు సంవత్సరాలలోనే వంద సినిమాలు చేశాను' అని చెప్పుకొచ్చారు కృష్ణ. చదవండి: కృష్ణ చివరి చిత్రం ఏంటో తెలుసా? ఆయన లేరన్న వార్త విని గుండె పగలింది: రామ్‌చరణ్ -
250 థియేటర్లో రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’(1982) చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. విష్ణుప్రియ సినీకంబైన్స్ బేనర్‌పై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతిబింబాలు’ సినిమాని అనేక కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయాను. కానీ, ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని జోడించి, సరికొత్త హంగులతో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గత సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని మా వాణి వెంకటరమణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్. ఈ చిత్రానికి సమర్పణ: రాజేశ్వరన్ రాచర్ల, నిర్వహణ: జాగర్లమూడి సురేశ్ బాబు. -
ANR Birthday Special: మహానటుడు, రికార్డుల రారాజు
-
ఆగిపోయిన అక్కినేని సినిమా.. 39 ఏళ్ల తర్వాత విడుదల
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, జయసుధ, తులసి హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ప్రతిబింబాలు’. కె.ఎస్. ప్రకాష్ రావు, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ‘వియ్యాలవారి కయ్యాలు, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు, వినాయక విజయం’ వంటి చిత్రాలను నిర్మించిన జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమా 39 ఏళ్ల అనంతరం ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతుండటం విశేషం. రాధాకృష్ణ మూర్తి మాట్లాడుతూ – ‘‘1982 సెప్టెంబర్ 4న ‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని ప్రారంభించినప్పటి నుంచి నిర్మాణానికి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో కొత్తగా ఉందనిపించి, ఈ చిత్రకథని ఎన్నుకున్నాం. అయితే ఇప్పటికీ అలాంటి కథతో ఒక్క సినిమా కూడా రాలేదు. ఏయన్నార్ ఫ్యాన్స్‌నే కాకుండా ప్రతి ఒక్కర్నీ ఈ చిత్రం అలరిస్తుంది. మేలో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్. -
తారలు తరించిన కూడలి
సినీతారలు దర్శనమిచ్చినప్పుడు అభిమానులు ఎలా తరించి పోతారో.. నవరాత్రులకు రాజమండ్రి దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు సినీతారలు అలా తరించిపోయేవారట! అంతటి వైభవం ఉన్న ఆ వేడుకలకు ఇప్పటికీ స్థాయి,‘తార’స్థాయీ తగ్గలేదు. దసరా నవరాత్రులు వస్తున్నాయంటే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న దేవీచౌక్ మిలమిలలాడే నక్షత్ర కాంతులతో తళతళలాడుతుంటుంది. భక్తులు ధరించే ఎర్రని వస్త్రాలతో ఆ ఆరుబయలు ప్రాంగణమంతా అరుణవర్ణ శోభితం అవుతుంది. నుదుటన ధరించిన కుంకుమ ప్రతి భక్తుని ముఖాన సూర్యుడు ఉదయించిన భావనను కలిగిస్తుంది. తొమ్మిది రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు రాజమహేంద్రవరం మణిద్వీపంలా భాసిస్తుంది. ఎనభై ఐదేళ్ల వైభవం! కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీచౌక్ వేడుక. ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేలమంది దర్శించుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 నుంచి (నేటి నుంచి) దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.గోదావరి సాంస్కృతిక వైభవానికి, కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం ఖ్యాతికి ఈ వేడుకలు ఆనవాలుగా నిలుస్తాయి. తెల్లవారే వరకు పౌరాణిక నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. నాడు మూడు లాంతర్ల సెంటర్ ఏళ్ల క్రితం దేవీచౌక్‌ను మూడు లాంతర్ల సెంటరు అని పిలిచేవారు. కరెంటు లేని రోజుల్లో వీధి దీపాలుగా ఈ సెంటరులో గుత్తిగా ఉండే మూడు లాంతర్లలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని అలా పిలిచేవారు. ఆ రోజుల్లో మొట్టమొదటగా దసరా ఉత్సవాలను 200 రూపాయలతో ప్రారంభించారు. 1934లో రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల మల్లికార్జునరావు, మునెయ్య సోదరులు ఉత్సవాల రూపురేఖలను మార్చి వేశారు. ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి. 1963లో కలకత్తా నుంచి పాలరాతితో రూపొందిన బాలాత్రిపురసుందరి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి మూడు లాంతర్ల జంక్షన్ దేవీచౌక్‌గా మారిపోయింది. దసరా తొమ్మిది రోజులూ ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమపూజలు జరుగుతాయి. ఆ తరువాత ప్రారంభమయ్యే పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాల ప్రదర్శనలతో తెల్లవారిపోతుంది. ఒక దశలో మూడు వేదికలను ఏర్పాటు చేసి, ఒక వేదికపై నాటకాలు, రెండో వేదికపై హరికథలు, బుర్రకథలు, మరో వేదిక మీద భోగంమేళం సాగేవని ఆ తరానికి చెందిన పెద్దలు ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఒకే వేదికపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి రాజమహేంద్రవరం కల్చరల్ ఫొటోలు : గరగ ప్రసాద్ ఒక్క ఛాన్స్ వస్తే చాలు రాజమండ్రి దేవీ చౌక్‌లో జరిగే దసరా ఉత్సవాలలో కనీసం ఒక్కసారైనా వేషం వేయగలిగితే చాలునని పెద్ద పెద్ద కళాకారులే ఉవ్విళ్లూరేవారు. సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, జి.వరలక్ష్మి, గిరిజ వంటి ఎందరో నటులను ఈ వేదిక మీద సత్కరించారు. దినారాయణరావు–అంజలీదేవి, రాజసులోచన–సి.ఎస్.రావు, సావిత్రి–జెమినీగణేశ్లను కూడా ఇక్కడ సత్కరించారు. 1969 దసరా ఉత్సవాలలో నాటి మేటినటి రాజసులోచన దేవీచౌక్ వేదికపై నాట్యం చేస్తూ పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆమె తిరిగి ఇక్కడకు వచ్చి, మళ్లీ నాట్యం చేశారు. దేవీచౌక్ ఉత్సవాలను కళాకారులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారో ఈ సంఘటన చెబుతుంది. నేటి అర్ధరాత్రి శ్రీకారం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించడంతో 86వ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. గత వైభవ దీప్తులకు పరంపరగా ఈ ఉత్సవాలు గోదావరి చరిత్రలో నిలిచిపోనున్నాయి. -
ఎవర్గ్రీన్ ‘దేవదాసు’
తెలుగు సినీ చరిత్రలో ఆయనో శిఖరం.. తెలుగు సినిమాకి మొట్టమెదటి లవర్‌బాయ్, ఎవర్గ్రీన్ అనే పదానికి నిర్వచనం అక్కినేని నాగేశ్వరరావు. ఏ పాత్రకైనా న్యాయం చేయగల సత్తా ఉందని తన నటనతో నిరూపించారు ఏఎన్ఆర్. సినీ ప్రపంచంలో ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోకు దక్కని గౌరవం అక్కినేనికే దక్కింది. అవేంటో తెలియాలంటే కింది వీడియోని క్లిక్చేయండి. -
జమునకు జీవితసాఫల్య పురస్కారం
డల్లాస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా డల్లాస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఏఎఫ్ఏ ప్రస్తుత అధ్యక్షులు రావు కల్వల మాట్లాడుతూ..1992, 2012 లో అక్కినేని నాగేశ్వరరావును డల్లాస్‌కు ఆహ్వానించి తీసుకువచ్చిన డా. ప్రసాద్ తోటకూర నాయకత్వంలోనే 2014 లో ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు నాలుగు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 22న సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు కరీంనగర్ లో ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఐదవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసిందిగా ఆహ్వానం పలికారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా గుర్తించి, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా గడిపిన కొంతమంది మిత్రులం కలిసి అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” అనే సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని కృష్ణా జిల్లాలో, ఒక కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించినా కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టి లాంటి లక్షణాలతో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ లక్షణాలు అందరికి ఆదర్శనీయం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరం తెలుగుగడ్డ పై అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏఎఫ్ఏ సంస్థకు డా. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు) , రావు కల్వల (అధ్యక్షులు), శారద అకునూరి (ఉపాధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట ( కార్యదర్శి), ధామా భక్తవత్సలు (కోశాధికారి), డా. సి.ఆర్. రావు, రవి కొండబోలు, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 పురస్కార గ్రహీతలు : జీవిత సాఫల్య పురస్కారం : అనేక సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అద్వితీయమైన పాత్రలను పోషించి అందరి అభిమానాన్ని చూరగొన్న కథానాయకి, పూర్వ లోకసభ సభ్యురాలు, ‘కళాభారతి’ జమున. విద్యా రత్న: ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, పూర్వ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత రాజకీయాలపై తన నిష్పక్షపాత వైఖరితో కూడిన రాజకీయ విశ్లేషణ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. సినీ రత్న: సినీ రంగంలో అద్భుతమైన గీతాలు రాస్తూ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత గా పురస్కారం అందుకున్న డా. సుద్దాల అశోక్ తేజ. విశిష్ట వ్యాపార రత్న: పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పవర్ రంగంలో ‘పవర్ మెక్’ కంపెనీ ద్వార అద్భుత విజయాలు సాధించి, తన ప్రగతిని కేవలం లాభాల్లోనే లేక్కవేసుకోకుండా సామాజిక స్పృహతో విద్యా, వైద్య రంగాల్లో తనవంతు సహాయం చేస్తున్న పారిశ్రామికవేత్త సజ్జా కిషోర్ బాబు. రంగస్థల రత్న : ఆదిభట్ల నారాయణదాసు శిష్య పరంపరలో హరికథల్లో శిక్షణ తీసుకుని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వి. సంగీత, నృత్య కళాశాలలో హరికథా విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తూ, హరికథా రంగంలో అగ్రగణ్యులైన డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి. వైద్య రత్న : కరీంనగర్ లోని ‘ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)’ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న బి. శ్రీనివాసరావు. సేవా రత్న: ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే నినాదంతో తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటుతున్న వనజీవి పద్మశ్రీ ‘దారిపెల్లి జానకి రామయ్య’. వినూత్న రత్న: తన అద్భుతమైన కళాదృష్టితో వ్యర్ధ పదార్దాల నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను తయారుజేసి తన ఇంటినే మ్యుజియం గా మార్చిన చిత్రకారిణి డా. కమలా ప్రసాద రావు -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
తాతలా మనవడు
‘మహానటి’ సినిమాలో ఏయన్నార్ పాత్రను ఆయన మనవడు నాగ చైతన్య పోషించి, అభిమానులను అలరించారు. ఇప్పుడు మరో మనవడు సుమంత్, తాత పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నట్లు సుమంత్ కన్ఫర్మ్ చేశారు. ‘‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో జాయిన్ అవ్వడం ఎగై్జటింగ్‌గా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ కానుంది. -
తెలుగు సినిమాకు దిశా నిర్దేశం చేసిన అక్కినేని
నాంపల్లి, న్యూస్‌లైన్: చలనచిత్రరంగాన్ని గౌరవప్రదంగా మార్చిన ఘనత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి రవీంద్రభారతి ప్రధాన వేదికపై ఆకృతి ఆధ్వర్యంలో నవీన్ సుభాష్‌రెడ్డి సారధ్యంలో ‘వంద ఏళ్ల సినిమాకు సంగీత వందనం... అక్కినేని అమరస్మృతికి అంకితం’ పేరిట సినీ సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈసభ ఎంతో విశిష్టమైందని తెలిపారు. మహోన్నతమైనవ్యక్తి కాలం చేస్తే సంతాప సభలు జరుపుకుంటారని.. కాలం చేసి ప్రజల హృదయాల్లో నిలిచినవ్యక్తి పేరిట ఉత్సవ సభను జరుపుకుంటారని వెల్లడించారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో జరిగే అంకితం సభ ఉత్సవం లాంటిదని పేర్కొన్నారు. వందేళ్లు బ్రతుకుతానని ఉత్సాహంగా ఉండేవారు.. ఉన్నట్లుండి వెళ్లిపోవడం ఎంతో బాధాకరమన్నారు. తెలుగు సినిమాకు దిశా -నిర్దేశం చేసిన వ్యక్తి అక్కినేని అని అభివర్ణించారు. దేవదాసు చిత్రం ఎన్నోభాషల్లో వచ్చిందని, ఆ సినిమాకు అక్కినేనే తలమానికం కావడం ఆయన చేసుకున్న అదృష్టమన్నారు. గాయని రావు బాలసరస్వతి మాట్లాడుతూ అక్కినేని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తాను పాటలు పాడేందుకు కారణం అక్కినేనే అని గుర్తుచేసుకున్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ కష్టపడిపైకి వచ్చే వారికి అక్కినేని స్ఫూర్తి దాయకమన్నారు. భాషా కార్యక్రమాల కోసం ఏది తలపెట్టినా సహకరిస్తానన్న వ్యక్తి కళ్లముందు లేకుండా పోవడం విచారకరమన్నారు. అనంతరం సినీ గాయనీగాయకులు ఆలపించిన సంగీత విభావరి అలరింపజేసింది. -
దర్శకుల హీరో అక్కినేని
సినీయానం ‘అతడనేక యుద్ధములందారితేరిన వృద్ధమూర్తి’ అనే మాటలు అక్కినేనికి సరిగ్గా వర్తిస్తాయి. చిరకాలంగా తెలుగు సినీ అభిమానుల హృదయ పీఠాలనధిష్టించిన నటసమ్రాట్టు - దర్శకుల నటుడు అక్కినేని. దర్శకుల పట్ల ఆయనకు గల గౌరవ భావాన్ని అవలోకిస్తే, అనేక విషయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకంగా కనిపిస్తాయి. కొంతకాలం క్రితం ‘ఫన్డే’ రెండవ వార్షికోత్సవం సందర్భంగా-‘తప్పక చూడాల్సిన 100 తెలుగు సినిమాలు’ జాబితా ప్రచురితమైంది. వాటిలో ఇరవైకి పైగా అక్కినేని నటించిన చిత్రాలే ఉన్నాయి. అవి చూడదగ్గవి మాత్రమే కాదు. ప్రజాదరణ పొందినవి ‘కూడా’! ఈ ‘కూడా’ ఎందుకంటే, విమర్శకులు చూడదగినవని చెబితే, అవి సాధారణంగా జనాదరణ పొంద(లే)ని చిత్రాలుగానే ఉంటాయని! కానీ ‘క్వాలిటీ’ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని ఈ ఎంపిక నిరూపించింది. డెరైక్టర్స్ యాక్టర్ అక్కినేనిని దర్శకుల నటుడిగా మనం ఎందుకు శ్లాఘించాలి? అక్కినేనికి తనలోని ‘మైనస్ పాయింట్స్’ ఏమిటో తెలుసు. ‘‘నాదేమీ ఆకర్షణీయమైన పెర్సనాలిటీ కాదు. పైగా నావి గుంట కళ్లు’’ అంటూ తనలోని ‘లోపాలను’ చెప్పేవారు. అవి ‘ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్’తో అనే మాటలు కావు. శిలను అందమైన శిల్పంగా తీర్చిదిద్దుకోగలిగే గొప్పతనం చిత్ర పరిశ్రమకు ఉందని ఆయన దృఢ నమ్మకం. ‘శ్రీ సీతారామ జననం’లో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్ర ధరించే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ‘బాలరాజు’ వంటి సూపర్ హిట్ చిత్రంతో అక్కినేనికి చిత్ర రంగంలో సుస్థిరమైన పునాదిని ఏర్పరచిన దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య. దగ్గరుండి పెళ్లి కూడా జరిపించి, ఓ తండ్రిలా భవిష్యత్తుకు రూపురేఖలు దిద్దిన శ్రేయోభిలాషి. ‘‘ఒక నటుడిగా ఎలా ‘మౌల్డ్’ అవ్వాలి? తక్కినవారితో ఎలా మెలగాలి? వంటి పాఠాలన్నీ బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో నేర్చుకున్నవే’’ అని స్నేహితులకు చెప్పేవారు అక్కినేని. ఆ తర్వాత ఆయనకు గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘మాయాలోకం’లో నటించే అవకాశం లభ్యమైంది. అందులో అక్కినేనిది శరాబందిరాజు పాత్ర. అందులో ఆయన కంటే వయసులో పెద్దవాడైన శాంతకుమారి, ఎం.వి.రాజమ్మ - భార్యలుగా నటించారు. అక్కినేని సంభాషణల్ని లాగినట్లుగా చెబుతూ ఉంటే, ‘‘ఏమిట్రా నాయనా, నాటకం ఫక్కీలో చెబుతున్నావు. మామూలుగా చెప్పు’’ అని రామబ్రహ్మం సరిదిద్దేవారట. ‘‘చిత్ర దర్శకుడికీ నటుడికీ మధ్య కావలసింది ఆత్మీయత. దర్శకుడు, నటుడు నాణానికి ఒకవైపు అయితే, రెండోవైపు ఉండాల్సింది ఆత్మీయత. ఆ రెండూ కలిసినప్పుడే, అది చెల్లుబడి అయ్యే నాణెంలా కనిపిస్తుంది’’ అంటారు అక్కినేని. ఆయన మొదటిసారి వేషం వేసింది పి.పుల్లయ్య తీసిన ‘ధర్మపత్ని (1943)’లో. పది మంది పిల్లల్లో ఒకడిగా! ఆ తర్వాత పి.పుల్లయ్య దర్శకత్వంలో అర్ధాంగి, జయభేరి, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి చిత్రాల్లో నటించారు. ఆయన చిత్రాల్లో నటించడమంటే హాయిగా ఉంటుందని, ఆయన చూపే ఆత్మీయతే అందుకు కారణమంటారు ఏయన్నార్. వరుసగా జానపదాలు, పౌరాణికాలు అన్నీ ఓ పద్నాలుగయ్యాయి. ‘జానపద కథానాయకుడు’ అనే ముద్ర శాశ్వతంగా పడిపోతే ఎలా?’ అనే సంఘర్షణ మొదలైంది. అప్పటికే కొందరు సాంఘికాలకు అక్కినేని పనికిరాడని తేల్చేశారు. సరిగ్గా అప్పుడే ‘సంసారం (1950)’లో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. అందుకోసం పారితోషికాన్ని తగ్గించుకున్నారు(దర్శకుడు ఎల్.వి.ప్రసాద్). ‘సంసారం’ విజయవంతం కావటంతో - సాంఘికాల్లోనూ అక్కినేని రాణించగలడని రుజువైంది. ‘‘ప్రేక్షకుల నాడి తెలిసిన దర్శకుడు ఎల్.వి.ప్రసాద్’’ అంటారాయన. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ‘దేవదాసు’గా అక్కినేని నటిస్తున్నారన్నప్పుడు చాలామంది సందేహాలను వ్యక్తం చేయగా, అదో ‘ఛాలెంజ్’గా తీసుకున్నారు. తనపై ‘ట్రాజెడీ హీరో’ ముద్ర పడకూడదని, విజయా ప్రొడక్షన్స్ ‘మిస్సమ్మ’(దర్శకుడు ఎల్వీ ప్రసాద్) తీస్తున్నప్పుడు, హాస్య ప్రధానమైన పాత్రను తనే పోషించడానికి ముందుకొచ్చారు. ఓ ‘బ్రాండ్’ పడకుండా నటుడు ఎలా శ్రద్ధ తీసుకోవాలో, ఎలాంటి ‘అహం’ లేకుండా దర్శక నిర్మాతల వద్దకు వెళ్లి సరైన అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో - ఇటువంటి ఉదాహరణలను బట్టి అర్థం చేసుకోవాలి. అక్కినేని విశేషంగా గౌరవించే దర్శకుల్లో కె.వి.రెడ్డి ఒకరు. ఆయన ‘క్వాలిటీ’ విషయంలో రాజీపడరని, దేని గురించైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారన్నది తెలిసిన విషయమే. అందుకే ‘దేవదాసు’ విడుదలైన తర్వాత కె.వి.ని కలుసుకున్నారు అక్కినేని. ‘‘నన్ను మీరు యాక్టర్‌గా అంగీకరిస్తారా?’’ అని ఆయనను డెరైక్టుగా అడిగేశారు. అప్పటికే ఆయన పలు విజయాలు సాధించిన హీరో. అయినా కె.వి. దృష్టిలో తన స్థానం ఏమిటో తెలుసుకోవాలన్నది ఆయన తపన. ‘‘యూ ఆర్ ఏ వండర్ఫుల్ స్టార్’’ అన్నారు కె.వి. (అప్పుడు కూడా ఆయన ‘స్టార్’ అన్నారే కాని, ‘యాక్టర్’ అనలేదు). అలా అనడమే గొప్ప కాంప్లిమెంట్. కొన్నాళ్లకు ‘దొంగరాముడు’ ఆ ఇద్దరినీ కలిపింది. మరెన్నో విజయవంతమైన చిత్రాలు వెలువడటానికి నాంది పలికింది. ‘మల్లీశ్వరి’ వంటి కళాఖండాలంటే, అక్కినేనికి చాలా ఇష్టం. బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో ‘పూజాఫలం’లో నటించారు. ఉత్తమ స్థాయి చిత్రాల కళా విలువల గురించి ఎన్నో విషయాలు ఆయన వద్ద నుంచి తెలుసుకుంటూ ఉండేవారు అక్కినేని - వీలున్నప్పుడల్లా ఆయనను కలుసుకుంటూ. ‘లైలా మజ్ను’, ‘విప్రనారాయణ’, ‘బాటసారి’ చిత్రాలు ఆణిముత్యాల్లాంటివనీ, వాటికి దర్శకత్వం వహించిన పి.ఎస్.రామకృష్ణ - తనలో మనోధైర్యాన్ని పెంపొందింపజేశారనీ చెప్పేవారు అక్కినేని. కమలాకర కామేశ్వరరావు ‘కాళిదాసు’, ‘గుండమ్మ కథ’ - అక్కినేని చలనచిత్ర జీవితంలో ముఖ్యమైన చిత్రాలే. అలాగే కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో వచ్చిన ‘కన్నతల్లి’, ‘ప్రేమనగర్’, ‘సెక్రెటరీ’ చిత్రాలూ! ‘టేకింగ్’లో కొత్త పుంతలు తొక్కిన ఆదుర్తి సుబ్బారావు - అక్కినేనిని విశేషంగా ఆకట్టుకున్న దర్శకుల్లో ఒకరు. వినోదమే కాదు... సమాజాన్ని కదిలించే చిత్రాలను విభిన్న ధోరణిలో తీయాలని ఆదుర్తి సంకల్పించినప్పుడు, తనూ భాగస్వామినవుతానని ముందుకొచ్చారు. దాని ఫలితమే - ‘సుడిగుండాలు’, ‘మరో ప్రపంచం’ చిత్రాలు. అక్కినేనితో అత్యధిక సంఖ్యలో చిత్రాలు రూపొందించిన దర్శకులు వి.మధుసూదనరావు, దాసరి నారాయణరావు. అక్కినేని 200వ చిత్రంగా దాసరి ‘మేఘసందేశం’ రూపొందించి, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ‘దసరా బుల్లోడు, కె.విశ్వనాథ్ ‘ఆత్మగౌరవం’, బాపు ‘బుద్ధిమంతుడు’- అక్కినేని తీపి జ్ఞాపకాల్లో కొన్ని. అక్కినేని నుంచి ఓ కొత్త నటుణ్ని ఆవిష్కరించిన ఖ్యాతి ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్ని డెరైక్టు చేసిన క్రాంతికుమార్‌కు దక్కుతుంది. దర్శకులను ఎవరైనా విమర్శిస్తే, ఆయనకు వెంటనే కోపం వస్తుంది. ఒకసారి ఓ గీత రచయిత - ‘తాను ‘డబుల్ మీనింగ్ పాటలు రాయడానికి సదరు దర్శకుడికి ‘టేస్ట్’ లేకపోవడమే కారణ’మని సభాముఖంగా చెబితే, అధ్యక్ష స్థానంలో ఉన్న అక్కినేని - ఆ రచయితను సభా ముఖంగానే చివాట్లు పెట్టారు. ‘అవకాశాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న చిత్ర పరిశ్రమను, దర్శకులను ఎద్దేవా చేయడం భావ్యం కాద’న్నారు. దర్శకులంటే ఆయనకు అంత భక్తి! - బి.కె.ఈశ్వర్ -
అక్కినేని మహోన్నత నటుడు
బెంగళూరు, న్యూస్‌లైన్ : దివంగత అక్కినేని నాగేశ్వరరావు మహోన్నత నటుడని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించడమే నిజమైన నివాళి అని మాజీ స్పీకర్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని తెలుగు విజ్ఞాన సమితి అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవారాయ కళా మందిరంలో మంగళవారం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు చూపిన బాటలో అందరూ నడవాలన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధకృష్ణరాజు మాట్లాడుతూ అక్కినేనితో తనకు 43 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం అందితే తప్పకుండా హాజరయ్యేవారన్నారు. మూడు తరాల ప్రెక్షకులను రంజీంప చేసిన మహా నటుడు డాక్టర్ అక్కినేని ఒక్కరే అని అన్నారు. నటి వీ.సరోజిని దేవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వర రావు మరణంతో తెలుగు పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. కన్నడ నటి తార మాట్లాడుతూ మాహ నటుడు అక్కినేని మన ముందు లేక పోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ సజీవంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి జయచంద్రారెడ్డి, కోశాధికారి సి.వి.శ్రీనివాసయ్య, మాజీ అధ్యక్షుడు జెఎస్. రెడ్డి, మాజీ కార్యదర్శి కే.గంగరాజు, బహుభాష నటి హేమాచౌదరి, ఏఆర్.రాజు, కర్ణాటక సినిపరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు గంగరాజు, బాబునాయుడు, రంగస్వామినాయడు పాల్గొన్నారు. -
నిర్మాతలకు అండాదండ ఏఎన్నార్
ఏఎన్నార్ ఘాట్ నిర్మించాలి అక్కినేని సంస్మరణ సభలో కోరిన వక్తలు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: తనలాంటి చాలా మంది నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ప్రము ఖ నిర్మాత రామానాయుడు అన్నారు. శు క్రవారం ఫిలిం ఛాంబర్ ఆడిటోరియం లో అక్కినేని నాగేశ్వర్రావు సంస్మరణ స భ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రామానాయుడు మాట్లాడుతూ ప్రేమ్‌నగర్ వల్లే తాను నిర్మాతగా పరిశ్రమలో నిలబడ్డాడని చెప్పారు. క్రమశిక్షణకు మా రుపేరు నాగేశ్వర్రావు అని కొనియాడా రు. ఎన్టీఆర్‌లా ఏఎన్నార్‌కు కూడా స్మార క ఘాట్ నిర్మించాలని తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. అక్కినేని తెరిచిన ఓ పుస్తకమని చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినీ పరిశ్రమకు భీష్ముల్లాంటి వారని పరుచూరి వెంకటేశ్వర్రావు అన్నారు. దైవభక్తి ఉన్న ఎన్టీఆర్‌ను అంతగా నమ్మని ఏఎన్నార్‌ను దేవుడు సమానంగా చూశాడని ఆయన పేర్కొన్నారు. అక్కినేని వ్యక్తి కాదు మహా సంస్థ అని ఆదిశేషగిరిరావు అన్నారు. అక్కినేనితో తన అనుబంధాన్ని నిర్మాత రాఘవ గుర్తుచేసుకున్నారు. తాను నాగేశ్వర్రావుకు వీరాభిమానినని దర్శకుడు కోడిరామకృష్ణ స్ప ష్టం చేశారు. అక్కినేని ఎప్పటికి అమరుడేనని, తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ తరలిరావడానికి ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. అక్కినేని నేటి యువతకు ఆదర్శప్రాయుడని తెలిపారు. అక్కినేని అభిమానులను తనతో సమానంగా చూసేవారని చెప్పారు. అక్కినేని అమరజీవి అని వడ్డేపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబసభ్యులు సుమంత్, నాగసుశీల, సుశాంత్, సినీ ప్రముఖులు కవిత, గిరిబాబు, చాట్ల శ్రీరాములు, హాస్యనటులు బాబూమోహన్, అలీ, రచయిత జొన్నవిత్తుల వెంకటేశ్వర్రావు పెద్ద సంఖ్యలో పరిశ్రమకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని చిత్రపటానికి సినీ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
అక్కినేనికి నివాళి పల్లవి : టాటా వీడుకోలు... గుడ్ బై ఇంక సెలవు (2) తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా తొలినాటి స్నేహితులారా! చెలరేగే కోరికలారా ॥ చరణం : 1 ప్రియురాలి వలపులకన్నా నులివెచ్చనిదేదీ లేదని (2) నిన్నను నాకు తెలిసింది ఒక చిన్నది నాకు తెలిపింది ఆ... ప్రేమనగరుకే పోతాను పోతాను పోతాను... ఈ కామనగరుకే రాను... ఇక రాను ॥ చరణం : 2 ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనేలేదని లేటుగ తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ... స్నేహనగరుకే పోతాను పోతాను పోతాను... ఈ మోహనగరుకు రాను... ఇక రాను ॥ చరణం : 3 మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని మధుపాత్రకెదలో ఇంక ఏమాత్ర ం చోటులేదని మనసైన పిల్లే చెప్పింది... (2) నా మనసంతా తానై నిండింది (2) నే రాగనగరుకే పోతాను అనురాగనగరుకే పోతాను పోతాను... చిత్రం : బుద్ధిమంతుడు (1969) రచన : ఆరుద్ర సంగీతం : కె.వి.మహదేవన్ గానం : ఘంటసాల -
అక్కినేని అంతిమ యాత్ర
-
ఫిలిం చాంబర్‌కు అక్కినేని పార్థీవదేహం
-
ఫిల్మ్ చాంబర్కి అక్కినేని పార్థివదేహం
హైదరాబాద్ : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పార్థీవ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తున్నారు. భౌతికకాయన్ని తరలిస్తు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అక్కినేని అంతిమ యాత్ర మొదలవుతుంది. జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ మీదగా ఈ యాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుతుంది. అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. రెండో రోజు కూడా అక్కినేనిని కడసారి దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. -
‘అమరజీవి’ అక్కినేనిని మరువలేం
తిరుపతి, న్యూస్‌లైన్ : మహానటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు తిరుపతితో ఎంతో అనుబంధముంది. బుధవారం పొద్దున నిద్ర లేవగానే ఆయన మరణించినట్లు టీవీల్లో చూసి తెలుసుకున్న వారు నిర్ఘాంతపోయారు. తిరుపతి ఫిలిం సొసైటీ కార్యాలయం లో సభ్యులు సమావేశమై అక్కినేని మృతికి సంతాపం ప్రకటించారు. తిరుపతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పలు నాటక, సాం స్కృతిక సంస్థలు అక్కినేని మృతికి సంతాపం ప్రకటించాయి. భాషా బ్రహ్మోత్సవాలకు.. అక్కినేని నాగేశ్వరరావుకు తిరుపతితో మరచిపోలేని అనుబంధం ఉంది. భూమన కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నపుడు 2006లో మహతిలో నిర్వహించిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు సభకు అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. అప్ప ట్లో ఆ మహానటుణ్ణి చూడడానికి తరలివచ్చిన అభిమానులతో మహతి కిక్కిరిసిపోయింది. అదే సమయంలో తెలు గు వికాస వేదిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆ తర్వాత 2007లో జరిగిన తెలుగు భాషా బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి సైతం ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలుగు భాష, సంస్కృతి సంప్రదాయాల గురించి చక్కటి సందేశాన్ని అందచేశారు. అంతకు ముందు 2005లో ఒకసారి తిరుపతిలో జరిగిన తిరుపతి ఫిలిం సొసైటీ రజతోత్సవాలకు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యూరు. ఎస్వీయూలో గోల్డ్ మెడల్ యూనివర్సిటీ క్యాంపస్ : సినీనటులు అక్కినేని నాగేశ్వరరావుకు ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఉంది. ఈయన ఎస్వీ యూనివర్సిటీకి శాశ్వత అకడమిక్ సెనేట్ సభ్యులు. అక్కినేని పేరుతో కామర్స్ విభాగంలో గోల్డ్ మెడల్ నెలకొల్పారు. ఎంకాంలో మొ దటి ర్యాంకు పొందిన విద్యార్థికి ఈ గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు మృతి తెలుగుకళామతల్లికి తీరనిలోటని వీసీ రాజేం ద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఉన్న సినీ నటి అంజలీదేవి మరణించిన వారానికే అక్కినేని మరణించడం బాధాకరమని తెలిపారు. అక్కినేని మృతికి సం తాపం తెలిపినవారిలో విక్రమసింహపురి యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ వి.నారాయణరెడ్డి, కే.రాజారెడ్డి, తిరుపతి మున్సిపల్ మాజీ చైర్మన్ కందాటి శంకరరెడ్డి, మీడియా డీన్ పేటశ్రీ, టెక్నీషియన్ గాంధీబాబు ఉన్నారు. చాలా నిరాడంబరులు తెలుగు భాషా బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు అక్కినేనికి ఫోన్ చేశాం. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి తిరుపతికి రావడానికి అంగీకరించారు. ఎగ్జిగ్యూటివ్ క్లాస్‌లో విమానం టికెట్ బుక్ చేస్తామంటే సున్నితంగా తిరస్కరించారు. గంట సేపు ప్రయాణానికి మామూలు క్లాస్ చాలని చెప్పారు. ఇది ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం. అక్కినేని నాగేశ్వరరావు గొప్ప నటుడే కాదు, గొప్ప మానవతావాది.. ఆయన సంస్కృతి సంప్రదాయాలతో బాటు మానవీయ విలువలను ఎక్కువగా గౌరవించేవారు. ఆయన -సీ. శైలకుమార్, చీఫ్ ఎడిటర్, సప్తగిరి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే తెలుగును అమితంగా అభిమానించే మహానటుడు నాగేశ్వరరావును గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన జీవితం ఆదర్శప్రాయమైనది. తెలుగు సినీ పరిశ్రమ తెలుగుగడ్డపైనే ఉండాలని భావించి చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలి రావడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయమైనది. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు రాష్ట్రానికి తీరని లోటు. రెండు సార్లు తెలుగు భాషా బ్రహ్మోత్సవాల సమాపన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేసిన ప్రసంగాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. - భూమన కరుణాకరరెడ్డి -
తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ'
అక్కినేని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమయంలో హైదరాబాద్‌లో ఉన్నది ఒక్క ‘సారథి’ స్టూడియో మాత్రమే. అందులోనూ అరుదుగా షూటింగులు జరుగుతుండేవి. సినీ పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉండిపోయింది. అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’తోనే హైదరాబాద్‌కు రంగుల కళ వచ్చింది. సినిమాల నిర్మాణమూ ఊపందుకుంది. నిదానంగా భాగ్యనగరం సినీ శోభను సంతరించుకుంది. అసలు తనకు సినిమా భిక్ష పెట్టిన మద్రాసును వదులుకోవాల్సిన పరిస్థితి అక్కినేనికి ఎందుకొచ్చింది? అనే విషయాల్ని విశ్లేషించుకుంటే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి. అక్కినేని తమిళంలో పాతిక వరకూ సినిమాలు చేశారు. దాదాపు అన్నీ సిల్వర్ జూబ్లీలే. ఈ విజయాలు తమిళ నటులకు కంటికి కునుకు రాకుండా చేశాయి. అక్కినేని మద్రాసుని వదలడానికి ఇది ఓ కారణం. ఇక అక్కినేనికి చదువంటే ప్రాణం. కానీ, పరిస్థితుల కారణంగా నాల్గో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. తన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలనుకున్నారు. అయితే, మద్రాసులో తెలుగు నేర్పే సౌకర్యం లేదు. అక్కినేనికి మాతృభాషపై మమకారం మెండు. అందుకే పిల్లల చదువుకోసం హైదరాబాద్‌కు మకాం మార్చేయాలనుకున్నారు. మద్రాసు వదలడానికి ఇదొక కారణం. ఎలాగూ సారథివారి చిత్రాలకు అక్కినేనే హీరో. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ఉండనే ఉంది. పైగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు.. ఇన్ని రకాలుగా ఆలోచించి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు అక్కినేని. ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే... హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చు’ అని స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో ఏఎన్నార్‌పై విమర్శలు ఊపందుకున్నాయి. అభిమానించినవారు, ఆరాధించినవారు సైతం మాటల పిడుగుల వర్షం కురిపించారు. పరిశ్రమలో తన ప్రాణమిత్రుడు అనదగ్గ ఎన్టీఆర్ నుంచి నాగిరెడ్డి, చక్రపాణి, నరసరాజు, ఎస్వీరంగారావు... ఇలా అందరూ ఆ క్షణంలో అక్కినేనిని నిందించిన వారే. కానీ అక్కినేని అవేమీ లెక్క చేయలేదు. 1964 నుంచి 1974 వరకూ దాదాపు 60 సినిమాలు కేవలం సారథి స్టూడియోలోనే చేశారు. దాంతో భాగ్యనగరంలో విరివిగా సినిమా ఆఫీసులు వెలిసి, ఇతర నటుల చిత్రాల షూటింగులు కూడా ఊపందుకున్నాయి. అలాంటి సమయంలో అక్కినేనికి గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. దానికి ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు. స్టూడియో నిర్మాణానికి నాంది.. అక్కినేని అమెరికాలో ఉన్న సమయంలో కృష్ణ నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దానికి నవయుగ వారు పంపిణీదారులు. ఆ సినిమా ఓ వారంలో విడుదల అవుతోందనగా... అక్కినేని సూచన మేరకు తమ సొంత సంస్థ ‘అన్నపూర్ణ ఫిల్మ్స్’వారు పాత ‘దేవదాసు’ని విడుదల చేశారు. ఈ సినిమా మళ్లీ ప్రభంజనం సృష్టించడం.. కృష్ణ ‘దేవదాసు’ పరాజయం పాలవడం జరిగిపోయింది. దీనిని కృష్ణ స్పోర్టివ్‌గా తీసుకున్నా.. పంపిణీ చేసిన నవయుగవారు మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. అక్కినేని సినిమాల షూటింగులకు నెలవైన సారథి స్టూడియోలో నవయుగవారు కూడా భాగస్వాములు. ఆపరేషన్ ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక అక్కినేని ఒప్పుకున్న చిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’కు స్టూడియో అడిగితే... ‘ఇవ్వం.. నష్టాల్లో ఉన్నాం’ అన్నారు. ‘అయితే మాకివ్వండి.. నడుపుకొంటాం’ అంటే.. ‘మీకు ఇవ్వం.. మేం తెరవం’ అనేశారు. ఇది కక్ష సాధింపని అక్కినేనికి అర్థమైపోయింది. అయితే అక్కినేనిది ధర్మాగ్రహం. అది కనిపించే కోపం కాదు. అనుకున్నది సాధించే కోపం. బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌ని ముగించారు. మనమే ఎందుకు కట్టకూడదు.. నవయుగవారు చేసిన పనితో.. ‘మనమే ఎందుకు స్టూడియో కట్టకూడదు’ అని అక్కినేనికి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే హైదరాబాద్‌కు వరమైంది. మద్రాసును వదిలినందుకే ఎన్నో విమర్శలు గుప్పించిన సినీజనం.. హైదరాబాద్‌లో స్టూడియో అనగానే.. హేళనగా నవ్వారు. మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం వద్దని వారించారు. కానీ అక్కినేని మొండి పట్టుదలతో జూబ్లీహిల్స్ కొండల్ని పలుగులతో పగలగొట్టించారు. పలుగుల తాకిడికి బద్దలవుతున్న ఆ రాళ్ల శబ్దాలే.. తెలుగునేలపై తెలుగు సినిమా అభ్యున్నతికి జయకేతనాలయ్యాయి. ఇక చెన్నపట్నంలోని తెలుగు సినిమా భాగ్యనగరం వైపు పరవళ్లు తొక్కింది. జూబ్లీహిల్స్ పక్కన కృష్ణానగర్ తయారై.. వేలాది సినీ కార్మికులకు ఆవాసమైంది. అదీ.. అక్కినేని అంటే. ముందు చూపుతో.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందక ముందు.. అదంతా దట్టమైనఅడవి, గుట్టలు, రాళ్లతో నిండి ఉండేది. ఆ ప్రాంతంలోనే దార్శనిక దృష్టితో అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’ను నిర్మించారు. ఈ స్టూడియో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1975లో స్థలం కేటాయించింది. 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు, నిర్మాత రామానాయుడు, అప్పటి అగ్రనటి వాణిశ్రీ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోకు ఇటీవలే అదనంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా కళాశాల కూడా చేరింది. స్టూడియో రికార్డుల ప్రకారం.. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 70 లక్షల మంది సందర్శించారు. -
‘మనం’తో మన ముందుకు..
సాక్షి, హైదరాబాద్: అభిమానులను దుఖఃసాగరంలో విడిచి వెళ్లిన నటసామ్రాట్.. త్వరలో ‘మనం’ సినిమా ద్వారా మళ్లీ మన ముందుకు రానున్నారు. తన సహజ నటనతో తాను లేని లోటును మరిపించనున్నారు! సుదీర్ఘ నటప్రస్థానం సాగించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరిగా ‘మనం’ అనే సినిమాలో నటించారు. తన కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి అక్కినేని ఈ చిత్రంలో నటించడం విశేషం. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్ ఎంతో మందిని ఆకర్షిస్తోంది. 90 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా మనవడి కాళ్లదగ్గర కూర్చున్న అక్కినేనిని చూసి అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే అక్కినేనికి కేన్సర్ సోకిన విషయం బయటపడింది. చికిత్స తీసుకుంటూనే ఆయన షూటింగ్లో పాల్గొన్నారు. అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో తన గాత్రంలో మార్పు రావచ్చనే సందేహంతో ముందే తన పాత్రకు డబ్బింగ్ కూడా ఇంట్లోనే చెప్పేశారు. ‘మనం’ సినిమాలో తన పాత్రకు సంబంధించిన బాధ్యతలన్నింటినీ పూర్తి చేసేశారు. త్వరలోనే మనం మనముందుకు రానుంది. -
ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా చనిపోవాలని...
ఇన్నర్ వ్యూ పుట్టినరోజు : 1924 సెప్టెంబర్ 20 (శనివారం) జన్మస్థలం : కృష్ణాజిల్లా గుడివాడ సమీపం లోని వెంకట రాఘవాపురం గ్రామం తల్లిదండ్రులు : అక్కినేని పున్నమ్మ, వెంకటరత్నం పేరు వెనుక కథ : నేను పుట్టే ముందు, బిడ్డ చుట్టూ నాగుపాము మూడుసార్లు ప్రదక్షిణ చేసినట్టు మా అమ్మ పున్నమ్మగారికి కల రావడం వల్ల నాగేశ్వరరావు అని పేరు పెట్టారు. విద్యార్హత : ఐదో తరగతి మధ్యలోనే ఆపేశాను. హిందీ మాధ్యమిక పాసయ్యాను.విద్యాభ్యాసం పెదవిరివాడలో జరిగింది. జీవితంలో తొలిసారిగా చేసిన పాత్ర : స్కూల్లో చంద్రమతి పాత్ర చిత్రరంగ ప్రవేశం : 1944 మే 8న ‘ధర్మపత్ని’ సినిమాతో. హీరోగా తొలి చిత్రం : సీతారామ జననం తొలి పారితోషికం : ‘సీతారామ జననం’లో నా పాత్రకు 250 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ‘ధర్మపత్ని’కి నెలకి 25 రూపాయలు ఇచ్చారు. గాయకునిగా తొలి చిత్రం : ‘సీతారామజననం’లో గురుబ్రహ్మ గురుదేవో అనే శ్లోకం తొలి ద్విపాత్రాభినయ చిత్రం : ఇద్దరు మిత్రులు తొలి సంగీత ప్రధాన చిత్రం : జయభేరి తొలి క్రైమ్ చిత్రం : దొంగల్లో దొర తొలి నవలా చిత్రం : దేవదాసు తొలి కలర్ సినిమా : అమరశిల్పి జక్కన్న తొమ్మిది పాత్రలు చేసిన చిత్రం : నవరాత్రి తొలి వాన పాట : ఆత్మబలం (చిటపట చినుకులు పడుతూ ఉంటే) తొలి వృద్ధ పాత్ర : పరదేశి తొలి విదేశీ యాత్ర : సిలోన్ 1952లో తమిళంలో చేసిన చిత్రాలు : 26 వివాహం : 1949 ఫిబ్రవరి 18న అన్నపూర్ణతో షష్టిపూర్తి మహోత్సవం : 1984 సెప్టెంబర్ 20న జరిగింది. అన్నపూర్ణా స్టూడియోస్ శంకుస్థాపన : 1975 ఆగస్ట్ 13న, నా మనవడు చిరంజీవి సుమంత్చే జరిగింది. అన్నపూర్ణా స్టూడియోస్ ప్రారంభం : 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. నటసమ్రాట్ బిరుదు : 1957లో విజయవాడలో బెజవాడ గోపాలరెడ్డి ఇచ్చారు. ముద్దు పేర్లు : ఇంట్లో అంతా నాగేశ్వర్రావ్ అనే పిలిచేవారు. సినీ పరిశ్రమలోని సన్నిహితులు మాత్రం ముద్దుపేర్లతో పిలిచేవారు. పేకేటి శివరామ్ ‘నాగూభాయ్’ అని, సముద్రాల రాఘవాచార్యులు‘నాగు’, నాగయ్య అని, ముదిగొండ లింగమూర్తి ‘చిరంజీవి’ అని, ఘంటసాల బలరామయ్య ‘రాముడు’ అని, శాంతకుమారి ‘అబ్బీ’అని, సావిత్రి ‘హీరోగారు’ అనేవారు. తెలిసిన భాషలు : తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ బాగా ఇష్టమైన పాట : అందమె ఆనందం నా సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమా : బాటసారి అభిమాన పాత్రలు : రామకృష్ణ పరమహంస, యోగి వేమన, అన్నమాచార్య, రామానుజాచార్య అభిమాన తారలు : అశోక్‌కుమార్, నర్గీస్ ఇష్టమైన దుస్తులు : వైట్ అండ్ వైట్ డ్రెస్ ఇష్టపడే వంటకాలు : పులుసు కూరలు ప్లస్ పాయింట్స్ : నా లోపాలు తెలియడమే కాకుండా నా మెరిట్స్ తెలుసుకోవడం మైనస్ పాయింట్స్ : పెద్ద గొంతు కాదు... ఎత్తు లేను... అందగాణ్ణి కాదు... అని అనుకుంటాను మరిచిపోలేని విషాదకర సంఘటన : 1960 మార్చి 19న నా పెద్దకొడుక్కి చికిత్స చేయడానికని వచ్చిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకయ్య తిరిగివెళ్తూ యాక్సిడెంట్లో చనిపోవడం. బాగా ప్రేమించేది : నట జీవితాన్ని ద్వేషించేది : దొంగతనాల్ని, అబద్ధాల్ని జీవిత లక్ష్యం : ఇప్పుడు నాక్కావల్సినవి ఏమీలేవు.ఎవరినీ నొప్పించకుండా శాంతియుతంగా, ఆరోగ్యంగా ఉంటూ చనిపోవాలని ఉంది. మొదట్నుంచీ నాకు సున్నిపిండి వాడే అలవాటు ఉంది. చలిరోజుల్లో చర్మం డ్రై కాకుండా సున్నిపిండి ఉపకరిస్తుంది. సబ్బులు పైపై మెరుగులకే కానీ, సున్నిపిండి వల్ల వంటి మీద మురికి మొత్తం పోతుంది. సున్నిపిండి నలుగు పెట్టుకోవడం కండరాలకు ఎక్సర్సైజ్. అలాగే బకెట్లో నీరు పెట్టుకుని వంగి తీసుకుని పోసుకుంటాను. అది కూడా తెలీకుండా ఒక మంచి ఎక్సర్సైజ్! -
అక్కినేని చిత్రాలు...మేలిమి ముద్రలు
తెలుగు చలనచిత్ర చరిత్రలో లెజెండ్ ఏఎన్నార్. 255 చిత్రాల కథానాయకుడు(‘మనం’ మినహాయించి). వాటిల్లో 25 మేటి భూమికల అభినయ విశేషాలను తెలిపే చిరు ప్రయత్నమిది. భరణీ సంస్థ నిర్మించిన తెలుగు, తమిళ భాషల్లో తొమ్మిది చిత్రాల్లో నటించారు అక్కినేని. చిత్రత్రయం లైలా-మజ్ను, విప్రనారాయణ, బాటసారి తన నట జీవితంలో చిరస్మరణీయమని పలుమార్లు ఆయనే చెప్పారు. 1. లైలా మజ్ను (1949): అక్కినేని హీరోగా నటించిన పదవ చిత్రం. సమ వయస్కురాలైన భానుమతి కాంబినేషన్లో విషాద ఛాయలున్న ఖయస్ నటనలో పరిణతి కోసం, హీరోలో ఉన్న బిడియం పోవటం కోసం వీరిద్దరినీ బీచ్‌లో షికార్లు చేయమని, చనువు ఏర్పడటంతో నటన బాగుంటుందని ప్రోత్సహించారు దర్శకులు రామకృష్ణ. ‘పలుకవే నా ప్రేమ సితార’ అంటూ లైలాతో తిరుగుతూ గీతం పాడినప్పుడు ఎంత హుషారుగా ఉంటాడో, ఆమె మరొకరిని వివాహమాడి ఇరాక్‌కు వెళ్లినప్పుడు ఆమెను జనానా వద్ద చూసి ఖిన్నుడై, ‘జీవన మధు భాండమే పగిలె తునాతునకలై’ అని విషాద భావాలు అంత గొప్పగా పలికించారు. 2. విప్రనారాయణ (1954): ‘తార్కిక భావాలున్న నువ్వు భక్తుడైన విప్రనారాయణ పాత్ర ధరించడమేమి’టని విమర్శించిన దర్శకులు కె.వి.రెడ్డి అంచనాలను తారుమారు చేస్తూ ఆనాటి విప్రనారాయణుడు అక్కినేనే అన్నంత ఘనంగా ఆ పాత్రను పోషించారు. శుశ్రూషలు చేసిన దేవదేవి నయగారాలకు వివశుడై, ‘మధురమధురమీ చల్లని రేయి’ అని ఆనందాన్ని వ్యక్తం చేసిన విప్రనారాయణుడు... తనపై మహారాజు దొంగతనం నేరం మోపినప్పుడు, ఈ శిక్ష తనకు తగినదేనని పశ్చాత్తాపపడినప్పుడు పాత్రలో లీనమైపోయారు. 3. బాటసారి (1961): శరత్చంద్ర బెంగాలీలో రాసిన ‘బడదీది’ ఆధారం. సురేంద్ర జమీందారు బిడ్డ. ఉన్నత చదువులున్నా లోకజ్ఞానం అంతంతే! చిత్రమంతా కలిపి కేవలం రెండు మూడు పేజీల డైలాగులే! అవి కూడా పొడి పొడి మాటలు. తనవల్ల తన ఆరాధ్య దేవత మాధవికి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు ఆవేశం పతాక స్థాయిని చేరి, ఆమె ఒడిలో తలదాల్చి, తన మనసును ఆవిష్కరించి అంతిమ శ్వాస విడిచిన సన్నివేశం అమోఘం. 4. పౌరాణికం - భూకైలాస్ (1958): అక్కినేని పౌరాణికాల్లో ‘భూకైలాస్’లోని నారద పాత్ర యెన్నదగినది. శివభక్తి పరాయణుడైన రావణబ్రహ్మను నిలువరించి, హెచ్చరించి, లోకానికి మేలు చేసే విధంగా రచయిత మలచిన, నారద పాత్రలోని యుక్తి, ఛలోక్తి అన్నిటినీ రసవత్తరంగా తన నటనలో చూపారు. 5. జానపదం- సువర్ణసుందరి (1957): ‘సువర్ణ సుందరి’లోని జయంత్ పాత్ర సాదాసీదా అంటారు అక్కినేని. కానీ ఎన్నో షేడ్స్ ఉన్నాయి. తొలి దశలో అందాల రాకుమారుడు. సువర్ణ సుందరిని దివి నుంచి భువికి రప్పించిన శృంగార నాయకుడు. దుష్ట త్రయానికి (కైలాసం, చాదస్తం, ఉల్లాసం) బుద్ధి చెప్పిన ధీరోదాత్తుడు. అంజలీ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించినప్పుడు అక్కినేనిని బలవంతంగా ఒప్పించారు నిర్మాత. సూపర్ హిట్టయిన ఆ చిత్రం అక్కినేని నట జీవితంలో ఏకైక హిందీ చిత్రంగా నిలిచిపోయింది. 6. జయభేరి (1959): జానపదం అనగానే మంత్రాలు, మాయలు, కత్తియుద్ధాలు అనే నానుడిని పూర్వ పక్షం చేస్తూ సంగీత, సాహిత్యాలతో కూడా జానపదం తీసి రంజింపచేయొచ్చు అని నిరూపించిన చిత్రం ‘జయభేరి’. సంగీత విద్వాంసుడు కాశీనాథ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు అక్కినేని. ‘రసికరాజ తగువారము కామా’ పాట చిత్రీకరణలో, చరణదాసి సంగీత ఆరోహణ అవరోహణ విన్యాసాలకు తగ్గట్టు పెదవుల కదలిక కోసం ఇంటివద్ద అద్దం ముందు నిలబడి రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. 7. చారిత్రకం- అనార్కలి (1955): మొగల్ యువరాజు సలీం సామాన్య నర్తకి అనార్కలిని ప్రేమించి, తండ్రితో యుద్ధానికి తలపడ్డ సన్నివేశాల్లో శృంగారం, ఆవేశం సమపాళ్లలో అభినయించారు. అక్బరు చక్రవర్తి స్వయంగా మరణశిక్ష అమలుపరచటానికి సిద్ధపడ్డ సన్నివేశంలో ‘బలహీనులు కాకండి జహాపనా’ అంటూ సెంటిమెంటుతో తండ్రిని కలవర పరచిన సన్నివేశంలో ఎస్.వి.రంగారావుకు దీటుగా నటించారు అక్కినేని. 8. తెనాలి రామకృష్ణ (1956): చతుర చమత్కార కవి తెనాలి రామకృష్ణుని తన అభినయంతో ఆంధ్ర ప్రేక్షకులకు అందించారు అక్కినేని. తెలివిగా రాజసభలో ప్రవేశించి, క్లిష్టమైన ఏనుగుల పంపకాన్ని యుక్తితో పరిష్కరించటం, కృష్ణసాని ద్వారా రాయలకు కలగబోయే ముప్పును ఆడ వేషంలో పరిష్కరించటం, ‘మేక తోకకు మేక’ అంటూ ముప్పతిప్పలు పెట్టటం, పతాక సన్నివేశంలో తోటమాలి వేషంలో ‘చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా’ అంటూ పాడి చక్రవర్తి బాబరు మెప్పు పొంది రాజ్యాన్ని రక్షించటం - ఈ సన్నివేశాల్లో తెనాలి రామకృష్ణుని సాక్షాత్కరింపజేశారు. 9. మహాకవి కాళిదాసు (1960): అజ్ఞానుడైన కాళునిగా ‘ఛాంగుభళా వెలుగు వెలగరా నాయనా’ అంటూ ఎంత అమాయకంగా నటించారో... దేవి కటాక్షంతో విజ్ఞాన దీపం వెలిగి, శ్యామలా దండకం చదివిన పండితునిగానూ ఓహో అనిపించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘కాళిదాస కౌస్తుభ’ పురస్కారంతో అక్కినేనిని సత్కరించింది. 10. అమరశిల్పి జక్కన (1964): ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో’ అని కీర్తించి, నర్తకి మంజరిని ఆరాధించి, పెళ్లాడి, ఆ తర్వాత మహారాజు ఎదుట నర్తించినందుకు అనుమానించి, దూరంగా వెళ్లిపోయి, కాలం గడిచాక కుమారుడి చేతిలో శిల్పిగా ఓటమినంగీకరించి, చేతులు నరుక్కుని పరితపించిన జక్కనగా ఆ పాత్రకు ప్రాణం పోశారు. 11. చాణక్య-చంద్రగుప్త (1977): ఎన్టీయార్ ఈ చిత్రాన్ని తలపెట్టి, తను చాణక్యుడిగా వెయ్యాలని, అక్కినేని చంద్రగుప్తునిగా నటించాలని తెలుపగా, అక్కినేని తనకు చాణక్యుడు కావాలని పట్టుబట్టారు. మెట్ల మీద నుంచి చాణక్యుని నవనందులు పడదోసినప్పుడు శిగ ముడి విడివడగా, వారి అంతం చూస్తానని శపథం చేసిన సన్నివేశంలో పింగళి రాసిన సంక్లిష్ట సమాసాలను భావస్ఫోరకంగా పలికి అందానికి తగ్గట్టు కళ్లల్లో చండ్ర నిప్పులు కురిపించిన తీరు అపూర్వం. 12. నవలా చిత్ర నాయకుడు- దేవదాసు (1953): భారతీయ భాషల్లో ఓ డజను ‘దేవదాసు’లు రాగా, అగ్రగామిగా నిలిచింది అక్కినేని ‘దేవదాసు’. దేవదాసు పాత్ర పోషణలో మద్యం మత్తుతో కళ్లు మూతపడుతుంటాయి. ఈ ఎఫెక్టు కోసం ఆ సన్నివేశాలను రాత్రి వేళల్లో చిత్రించారు. నాగేశ్వరరావు పెరుగు అన్నంతో సుష్టుగా భోంచేసి షూటింగ్‌కు వెళ్లేవారు. నిద్రమత్తుతో కళ్లు తూగిపోయేవి. మైండ్‌ను కంట్రోల్లో ఉంచుకుని నటించటంతో ఆ సన్నివేశాలు రాణించాయని తెలిపారు అక్కినేని. 13. అర్ధాంగి (1955): ‘స్వయంసిద్ధ’ బెంగాలీ నవలకు తెర రూపం. జమీందారు పెద్దకొడుకు రాఘవేంద్రరావు పెళ్లాం మెడలో తాళి కట్టేటంతటి అమాయకుడు. ఈ సన్నివేశాల్లో అమాయకత్వం... అర్ధాంగి రాధ స్వయంకృషి వల్ల మార్పు చెందాక పెద్దరికం... పాత్రలో వచ్చిన మార్పుల గ్రాఫ్‌కు తగ్గట్టుగా బాలెన్స్డ్గా నటించారు. 14. పూజాఫలం (1964): మునిపల్లెరాజు ‘పూజారి’ నవల ఆధారం. బి.ఎన్.రెడ్డి- అక్కినేని కాంబినేషన్లో ఏకైక చిత్రం. లోకజ్ఞానం లేని కథానాయకుడు మధు. తన జీవితంలోకి ప్రవేశించిన ముగ్గురమ్మాయిలు వాసంతి (జమున), సీత (సావిత్రి), వేశ్య నీలనాగిని (ఎల్.విజయలక్ష్మి). వారివల్ల తన జీవన విధానంలో వచ్చిన మార్పును స్పష్టంగా చూపారు. క్యారెక్టరైజేషన్ అనే దానిని అభినయం ద్వారా నిర్వచించారు. 15. డాక్టర్ చక్రవర్తి (1964): కోడూరి కౌసల్యాదేవి ‘చక్ర భ్రమణం’ నవలకు తెర రూపం. పాఠకుల సూచన మేరకు అన్నపూర్ణ సంస్థ వారు పాత్రధారులను ఎంపిక చేశారు. చక్రవర్తికి పూర్వాశ్రమంలో ప్రేమించిన శ్రీదేవి దూరం కావటం, పెద్దలకిచ్చిన మాట ప్రకారం నిర్మలను పెళ్లాడి అశాంతికి లోనవడం, చనిపోయిన చెల్లెలు సుధను నవలా రచయిత్రి మాధవిలో చూసుకొని మురిసిపోవటం - ఫలితంగా అపార్థాలు; మానసిక సంఘర్షణను సంయమనంతో నటించి నట చక్రవర్తి అనిపించారు. 16. ప్రేమనగర్ (1971): ఇదీ కోడూరి కౌసల్యాదేవి నవలే. ‘అనుభవించు, సుఖించు, తరించు’ అనే ఉమరఖయ్యూం ఫిలాసఫీని నమ్మిన కథానాయకుడు కల్యాణ్. లత రాకతో అతని జీవితం ప్రభావితమౌతుంది. ఒకానొక సందర్భంలో ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాడు. ప్రేమ మందిరాన్ని నిర్మించి, అందులో ప్రేయసిని ప్రతిష్టించి, ఆ ప్రేమ భగ్నమైనప్పుడు ‘ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం’ అని విలపిస్తాడు. ఆత్రేయ రచనతో దృశ్యకావ్యంగా నిలిచింది. 17. విభిన్న భూమికలు- రోజులు మారాయి (1955): అభ్యుదయ భావాలు గల రైతు నాయకుడు వేణు పాత్రలో పల్లెటూరి నుంచి వచ్చిన అక్కినేని సహజంగా ఒదిగిపోయారు. 18. ఇలవేలుపు (1956): దర్శకులు ఎల్.వి.ప్రసాద్, వైద్యం పొందిన ప్రకృతి ఆశ్రమం నేపథ్యంలో రూపొందిన కథ. శేఖర్ ఆశ్రమవాసి అయిన శారదను ప్రేమిస్తాడు. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి తన తండ్రి శారదను పెళ్లాడటం, ప్రేయసిని తల్లిగా చూడాల్సి రావడం, తర్వాత లక్ష్మిని పెళ్లి చేసుకోవటం, భర్తను ఆమె అనుమానించడం, మానసికంగా సంఘర్షణకు లోనైన శేఖర్ పాత్ర అక్కినేనికి అగ్నిపరీక్ష. తట్టుకుని నిలబడ్డారాయన. 19. భార్యాభర్తలు (1961): నెగెటివ్ టచ్ ఉన్న కథానాయకుడి పాత్ర ఆనంద్. అమ్మాయిలతో ఆడీపాడీ... ఆనంద్ కోరి, వెంటాడి, శారదను పెళ్లిచేసుకుంటాడు. తొలిరాత్రి ఆమె నుంచి ఎదురైన ప్రతిఘటనకు బదులుగా ఆమెలో మార్పువచ్చేదాకా వేచి ఉంటాడు. మబ్బులన్నీ తొలగిపోయాక, హత్యానేరంపై జైలుకు వెళ్లి భార్య సహకారంతో బయటపడతాడు. 20. ఇద్దరు మిత్రులు (1961): కథానాయకుని పరంగా తొలి ద్విపాత్రాభినయం. ఆస్తీ అంతస్తూ ఉన్నా శాంతి లేని జమీందారు అజయ్‌బాబు. ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉన్నా పేదరికంతో అల్లాడే విజయబాబు. ఈ రెండు పాత్రల వైవిధ్యాన్ని సున్నితంగా ఆవిష్కరించారు. రాజేశ్వరావు అందించిన సుమధుర సంగీతం ఈ చిత్రానికి అండగా నిలిచింది. 21. మూగమనసులు (1964): ఆదుర్తి అద్భుత సృష్టిగోదావరిపై పడవ నడిపే సరంగు గోపి. అమ్మాయిగారంటి సావిత్రికి గోపీపై ఉన్నది ఆరాధనా? ఆప్యాయతా? ఆకర్షణా? వీటన్నిటనీ కలగలిపిన విలక్షణ భావమా? అక్కినేని, సావిత్రి పోటీపడి తెరపై పండించారు. అందుకే తెలుగువారి సజీవ స్రవంతిలో ‘గోదావరి’లా మిగిలిపోయిందీ చిత్రం. 22. దసరాబుల్లోడు (1971): పులి వేషాలు, నెమలి వేషాలు, బావా మరదళ్ల సరదాలు, సరసాలు, ప్రేయసీ ప్రియుల చేలగట్ల ప్రణయరాగాలు, సెంటిమెంట్లు... ఇవన్నీ కలగలిసిన పల్లెలూరి కుటుంబ కథాచిత్రంలో కీలకమైన గోపీ పాత్ర ద్వారా సగటు ప్రేక్షకుడికి దసరా బుల్లోడు ఎలా ఉంటాడో చూపించారు దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్. 23. ప్రేమాభిషేకం (1981): దేవి ప్రేమను దక్కించుకోవటం కోసం వేశ్య జయంతితో కలిసి నాటకమాడిన రాజేష్, దేవి ప్రేమ సఫలమయ్యాక, క్యాన్సర్ కారణంగా ఆ దేవిని దూరం చేసుకోవటానికి జయంతితో కలిసి మరో నాటకమాడటం - అద్భుతమైన దాసరి రూపకల్పన రాజేష్ పాత్ర. 24. మేఘసందేశం (1982): దాసరి మరో అద్భుత సృష్టి. కవి రవీంద్ర తనలో చైతన్యాన్ని కలిగించిన నర్తకి పద్మకు చేరువై, భార్య పార్వతికి దూరమై, ఆ పద్మ దూరమైనప్పుడు ‘విన్నవించు నా చెలికీ విరహ వేదనా’ అంటూ మేఘాలతో తన బాధలను నివేదించి, తుదకు ఇంటికి వచ్చి తనువు చాలించి ఆత్మ పద్మ వద్దకు చేరడం... భార్యను అన్యాయం చేశానన్న భావన, పద్మ పట్ల అనురక్తి... వీటిని ఆవిష్కరించటం అక్కినేనికే చెల్లింది. 25. సీతారామయ్యగారి మనవరాలు (1991): అరవై ఏడేళ్ల వయసులో అక్కినేనికి లభించిన సహజమైన పాత్ర. కోనసీమ యాస, పల్లెటూరి పెద్దమనిషి - మానవ జీవితంలోని భావోద్వేగాలను హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. తెలుగుతెరపై అక్కినేని నిజంగా నటసమ్రాట్. - ఎస్.వి.రామారావు -
చక్రభ్రమణం బుక్ రివ్యూ
మన నవలలు మగవాళ్ల మతిభ్రమణం పురుషుడు స్త్రీని అనుమానిస్తే స్త్రీ వల్లకాటికెళ్లాలి.స్త్రీ పురుషుణ్ణి అనుమానించినా స్త్రీయే వల్లకాటికెళ్లాలి. రవీంద్ర- పెళ్లికి ముందే మాధవిని శంకించాడు. ఒక్క రవీంద్రనే ఏముంది అతడి తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యులూ... ఎందుకు? మాధవి బిఏ చదువుకుందట. అంత చదువుకున్న అమ్మాయి అందరిలా ఉంటుందా? మాట వింటుందా? మగని ఎదుట తల దించుకుని ఉంటుందా? వంటా వార్పూ చేస్తుందా? పిల్లలకు జోల పాడుతుందా? అంతెందుకు సంప్రదాయబద్ధంగా చీరైనా కట్టుకుంటుందా? బి.ఏ చేస్తే... అదీ ఒక ఆడపిల్ల బి.ఏ చేస్తే ఇన్ని శంకలు చుట్టుముడతాయి. ఆడదానికి చదువే శాపం. చదువొస్తే ఏముంది? లోకం తెలిసిపోదూ. రహస్యాలు తెలిసిపోవూ. భూమీ గాలీ ఆకాశం నీరూ ఆగ్నీ... అన్నీ సమీపానికి వచ్చి తోడు నిలవవూ. సరే. పెళ్లయ్యింది. మాధవి ఏమైనా పిచ్చిదా? ఇన్ని శంకలు తన పట్ల ఉన్నాయని గ్రహించి ఇంట్లో నోరు మూసుకొని అదే ఒక సంపదగా అదే ఒక సంస్కారంగా అదే ఒక వ్యక్తిత్వంగా మసలుతూ ఆఖరుకు వంట మనిషి కూడా లేకుండా గుట్టుగా సంసారం నెట్టుకొని వస్తూ ఉంది. ఉండబట్టలేక అప్పుడప్పుడు ఏవో కథలు రాసుకుంటూ ఉంది. ఇందులో ప్రమాదం ఏమీ లేదు. పోస్ట్‌మేన్ తప్ప మరో పరపురుషుని ప్రమేయమూ ఉండదు. పర్ఫెక్ట్. ఇదంతా చూసి రవీంద్రకు... ఒక్క రవీంద్రకేమిటి సకల పురుషజాతికీ గర్వం. సంతోషం. ఆనందం. ఇలాంటి భార్య ఉంటే నలుగురికీ షో పీస్‌లా చూపించాలని తహతహ. చక్రవర్తి దొరికాడు. డాక్టరు. సంఘంలో పేరుంది. పరపతి ఉంది. కారు ఉంది. తోట కూడా ఉంది. ఇలాంటి వాడి ఎదుట తన భార్యను ప్రెజెంట్ చేయడం ఏ మగాడికైనా సరదా. చూశావా... నీకు డబ్బుంటే ఏంటోయ్... నాకు ఎంత చక్కని భార్య ఉందో చూడు, ఎంత అణకువ కలిగిన భార్య ఉందో చూడు, అన్నీ తెలిసినా అసలేమీ తెలియనట్టుగా ఉండే భార్య ఉంది చూడు అనీ.... ఏదో పైచేయి పీకులాట. చక్రవర్తి వచ్చాడు. మాధవిని చూశాడు. గందరగోళ పడ్డాడు. అతడికి మాధవి చిన్నప్పటి అమ్మలా అనిపించింది. పెరిగి పెద్దయ్యాక ఆదరించి అన్నయ్యా అంటూ వెంట తిరిగిన చెల్లెల్లా అనిపించింది. వయసులోకి వచ్చాక ఆప్యాయంగా ఆరాధించిన తన క్లాస్మేట్ శ్రీదేవిలా అనిపించింది. తనకిష్టమైన మెత్తని స్వభావం మాధవిలో ఉంది. తనకిష్టమైన పాడే గుణం మాధవిలో ఉంది. తనకిష్టమైన వీణానాదం మాధవిలో ఉంది. ఆ మాట, పలకరింపు, నడత, పూలను చూసినా కొమ్మన ఉన్న పూతను చూసినా మబ్బు పట్టి మూసుకున్న నింగిని చూసినా వీచే గాలిని పెదాలతో పలకరించినా ఆమెలోని స్పందనాగుణం, కరుణ, ఆ రసానుభూతి... ఇవన్నీ కలిసి ఆమె ఒక అపురూపమైన సోల్ మేట్‌లా అతడికి కనిపించింది. ఆత్మబంధువు. అయితే అదంతా అర్థంకాక లోకానికి అర్థమయ్యేలా ‘చెల్లెలు’ అనే ముతక పిలుపును తగిలించుకున్నాడుగాని వాస్తవానికి మాధవి అతడి దృష్టిలో వక్షం, కటి ప్రాంతాలకు ఏ విలువా లేని చిన్ననాటి స్నేహితురాలు. కాని ఇది ఎలా చెప్పడం. నలుగురితో కలిసి చదవడమే పాపం అనుకునే ఈ సంఘంలో ఏ వరుసా లేని పరాయి పురుషుడు ఆత్మీయుడిగా ఉండటం, ఉంటానని చెప్పడం ఎలా సాధ్యం? చక్రవర్తి సతమతమవుతున్నాడు. అతడిలో మాధవి పట్ల రేగుతున్న భావాలు అర్థం కాక అతడి భార్య నిర్మల సతమతమవుతోంది. మాధవి, చక్రవర్తుల సాన్నిహిత్యం చూసి ఎంత సులువుగా ఉందామనుకున్నా వీలుగాక రవీంద్రా సతమతమవుతున్నాడు. మలుపు వచ్చింది. హెడ్డాఫీసు నుంచి వైరు అందింది. రవీంద్ర క్యాంప్ వెళ్లాడు. వెళుతూ వెళుతూ మాధవి ఉత్తమనిషి కాకపోవడం వల్ల, పైగా నలతగా ఉంటూన్నందు వల్ల ఆమె పరామర్శ బాధ్యతను చక్రవర్తికి అప్పగించి వెళ్లాడు. అసలే కొత్త స్నేహితురాలు. పైగా మానసికంగా తన కవలసోదరి. పెద్దరికం వహించిన అతడి సంస్కారానికి ఆమె ఒక పసి పాపాయి. అందుకే చక్రవర్తి ముందు వెనుకా చూడకుండా వేళాపాళా లేకుండా ఆమె ఇంటికి రాకపోకలు సాగించాడు. ఆమెతో మాట్లాడుతుంటే సంతోషం. అసలు ఆమెను చూడటం అంటేనే సంతోషం. కాని లోకులకు ఇది వింతగా అనిపించింది. ఒక పురుషుడు... ఒక స్త్రీ. హవ్వ. చక్రవర్తి భార్య అందరి కంటే ముందు మేల్కొని ఏమిటేమిటో ఊహించుకుని రవీంద్రకు దొంగ ఉత్తరం రాసి ఉన్నదంతా వివరించింది. రవీంద్ర నమ్మాడు. కాదు... నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే హటాత్తుగా అర్ధరాత్రి ఊడిపడి వేళగాని వేళలో ఇల్లంతా లైట్లు వేసి మాధవితో తగువుకు సిద్ధమవుతుంటే అదే సమయంలో అటుగా వెళుతున్న చక్రవర్తి ఈ వేళలో దీపాలేమిటి అని కంగారు పడి ఇంట్లోకి వచ్చాడు. అంతే. అపవాదుకు ఆధారం దొరికింది. నింద నిజమై కూచుంది. అనుమానం... అనుమానం... పెనుభూతం. కోరలు సాచింది. బంగారం లాంటి స్నేహం నాశనమయ్యింది. బంగారం లాంటి కాపురం నాశనమయ్యింది. బంగారంలాంటి ఇరు కుటుంబాలు, ఇరు వైపులా వ్యక్తిత్వాలు, ఇరువైపులా ప్రశాంతి. ఆనందం అన్నీ చెల్లాచెదురయ్యి అకాల వడగాడ్పుకు మాడి మసైపోయాయి. నింద మోసినందుకు మాధవి పుట్టింటికి చేరింది. నింద వేసినందుకు నిర్మల కూడా పుట్టిల్లు చేరింది. మగాళ్లు అంతకు మించి చేయలేరు. వాళ్లకు అంతకు మించి చేతగాదు. వాళ్లు ఎవరితోనైనా తిరగొచ్చు. ఎవరితోనైనా కులకొచ్చు. కాని స్త్రీ- అదీ మన ఇంటి స్త్రీ మాత్రం నైతికంగా పైస్థానంలో ఉండాలి. చక్రవర్తి పెళ్లికి ముందు ఒకరిని ప్రేమించి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు. లోకం ఏమనదు. రవీంద్ర పెళ్లాన్ని పుట్టింటికి తరిమేసి వేరొకరిని ఇంట్లోనే ఉంచుకున్నాడు. లోకం ఏమనదు. కాని స్త్రీ మాత్రం కాస్త చదువుకున్నా, బజారుకు వెళుతున్నా, ఆఫీసుల్లో ఉద్యోగాల్లో సాటి ఉద్యోగులతో స్నేహంగా మసులుతున్నా, దూరపు బంధువులతో కాసింత చనువుగా ఉన్నా, ఆఖరుకు పాలవాడి గూర్చి పేపర్ బాయ్ గూర్చి అయ్యయ్యో అన్నా తప్పు... నింద... అనుమానం... శిక్ష. ఈ చక్రం తిరుగుతూనే ఉంది. స్త్రీ వేదనను స్త్రీ స్వేచ్ఛనూ ఇరుసుగా చేసుకున్న పురుషాహంకార చక్రం. స్త్రీలకీ వ్యక్తిత్వాలు ఉంటాయనీ, వారికీ సంస్కారం ఉంటుందనీ, వారికీ ఉచ్ఛం నీచం తెలుసుననీ, వారూ ఎవరికీ తేరగా లేరనీ, వాళ్లూ మగవాళ్లవంటి మనుషులేననీ, పోనీ మగవారి కంటే మెరుగైన మనుషులేననీ, వారిని శరీరాలుగాగాక కన్నూ ముక్కూ మేధా కంఠం ఉన్న మనుషులుగా చూడాలని మగవాళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో. చక్రభ్రమణం ఎలాగో సుఖాంతం అయ్యిందిగాని మగవాళ్ల మతిభ్రమణం మాత్రం అంతం కాలేదు. ఏదైనా చేసి చూద్దాం అనుకునే ప్రతిభ గల అసంఖ్యాక ఆడవారు ఎందరు ఈ తలనొప్పులు పడలేక మౌనంగా మాధవిలా నాలుగ్గోడల మధ్య ఉండిపోతున్నారో. ఈ జీవితమే బాగుందండీ అని అబద్ధాలాడుతున్నారో. దీనికి వెలుతురు ఎప్పుడో. ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి తన పందొమ్మిదో ఏట రాసిన తొలి నవల - చక్రభ్రమణం. అసంఖ్యాక పాఠకులు మెచ్చిన నవల ఇది. దీని కథ, సారమూ ఎలా ఉన్నా తెలుగులో ‘కమర్షియల్ రైటింగ్’కు నాందీ ప్రస్తావన చేసిన తొలి నవలగా పండితులు దీనిని గుర్తిస్తారు. ఈ నవలతో తెలుగులో ‘పాప్యులర్ ఫిక్షన్’ ఊపందుకుని సీరియస్ రైటింగ్ మందగించిందని అన్నవారూ ఉన్నారు. ఇది సినిమావాళ్ల దృష్టిలో పడ్డ తొలి సాంఘిక నవల కావడాన ఆ తర్వాతి నవలలన్నీ అదే దృష్టితో రాయడానికి దారి వేసిందని అనేవారూ ఉన్నారు. ఏమైనా చక్రభ్రమణం సూపర్ హిట్. ఉపకారం తప్ప అపకారం చేయని స్త్రీల సున్నితమైన రచనలకు మార్గం వేసిన నవల ఇది. పైకి తేలిగ్గా చెప్తున్నట్టు కనిపించినా ఇందులోని గాఢమైన అభిలాష మాత్రం పురుష పరివర్తనే. అందుకు సాధనంగా ఎంచుకున్న మాధవి పాత్రకు బహుశా కౌసల్యాదేవి తన సౌందర్యాన్ని, సంస్కారాన్ని, గానాన్ని, రచనాభివేశాన్ని కొంత ఇవ్వడం వల్లనో ఏమో అది సజీవంగా కనిపిస్తుంది. సులభ గంభీరమైన వచనంతో ఎక్కడా పాఠకుణ్ణి జారనివ్వక, పడనివ్వక గిరగిరా తిప్పి చేదు వాస్తవాల రుచి చూపి కాస్త తలతిరిగేలా చేసే నవల ఇది. ఈ భ్రమణం తెలియకపోతే తెలుగు నవలా భ్రమణం అసంపూర్ణం. నవల: చక్రభ్రమణం రచయిత్రి: ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి రచనాకాలం: 1961 తెలుగు నవలల్లో తొలి కమర్షియల్ నవలగా గుర్తింపు పొందింది. సినిమాగా వచ్చిన తొలి సాంఘిక నవల కూడా. ఆ రోజుల్లో దీనికి వచ్చిన పాఠకాదరణ చూసి ఎక్స్‌ప్రెస్ అధినేత గోయెంకా ప్రత్యేకంగా ఒక మనిషి ద్వారా పట్టుచీర, ప్రత్యేక నగదు కౌసల్యాదేవికి పంపారట. ఈమె రాసిన ‘ప్రేమ్‌నగర్’ ఖ్యాతి అందరికీ తెలిసిందే. కౌసల్యాదేవి ఇంటర్వ్యూలుగాని, ఫొటోలుగాని పెద్దగా అందుబాటులో లేవు. ఈ ఫోటో ఆమె సోదరి అచ్యుతరాణి ద్వారా సాక్షికి అందింది. చక్రభ్రమణం మార్కెట్లో లభ్యం. వెల: రూ.60 డాక్టర్ చక్రవర్తి... ‘చక్రభ్రమణం’ 1961లో ఆంధ్రప్రభ వీక్లీ పోటీల్లో మొదటి బహుమతి పొందిన నవల. ఇది బయటకు రావడానికి ముందే సినిమాగా బాగుంటుందని జడ్జీల్లో ఒకరైన త్రిపురనేని గోపీచంద్ అన్నపూర్ణా వారికి సూచించారట. తాత్సారం జరిగింది. ఈలోపు నవల బయటికొచ్చి సూపర్ హిట్ అయ్యింది. నవలా హక్కులు కొనడానికి అన్నపూర్ణ సంస్థ నుంచి దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు, ఆయన అసిస్టెంట్ కె.విశ్వనాథ్ రాజమండ్రి వెళ్లారు. కౌసల్యాదేవి పరదా చాటు నుంచి వారితో మంతనాలు చేస్తూ ఆ ఉత్సాహంలో నా కథను సినిమా స్టయిల్లో చౌకబారు చేయకుండా కొంచెం హుందాగా తీయండి వంటి మాట ఏదో మాట్లాడారట. అంతే. దుక్కిపాటికి కోపం వచ్చేసి- మాకు తెలియదా ఎలా తీయాలో... మా చరిత్ర ఎలాంటిదో తెలియదా అని అందర్ని తీసుకొని లేచి వచ్చేశారు. పెద్ద ఇరకాటం. ఈలోపు కె.విశ్వనాథే కొంచెం చొరవ చూపి ఇరు వర్గాలకు సంధి కుదిరిస్తే ఎట్టకేలకు రైట్స్ చేతులు మారాయి పదివేల రూపాయల పెద్ద మొత్తానికి!