
అక్కినేని మహోన్నత నటుడు
బెంగళూరు, న్యూస్‌లైన్ : దివంగత అక్కినేని నాగేశ్వరరావు మహోన్నత నటుడని, ఆయన ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించడమే నిజమైన నివాళి అని మాజీ స్పీకర్, శ్రీనివాసపురం ఎమ్మెల్యే రమేష్‌కుమార్ పేర్కొన్నారు. నగరంలోని తెలుగు విజ్ఞాన సమితి అధ్వర్యంలో శ్రీకృష్ణ దేవారాయ కళా మందిరంలో మంగళవారం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ముఖ్య అతిథిగా హాజరైన రమేష్‌కుమార్ మాట్లాడుతూ నాగేశ్వరరావు చూపిన బాటలో అందరూ నడవాలన్నారు. తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ.రాధకృష్ణరాజు మాట్లాడుతూ అక్కినేనితో తనకు 43 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించే కార్యక్రమాలకు ఆహ్వానం అందితే తప్పకుండా హాజరయ్యేవారన్నారు. మూడు తరాల ప్రెక్షకులను రంజీంప చేసిన మహా నటుడు డాక్టర్ అక్కినేని ఒక్కరే అని అన్నారు.
నటి వీ.సరోజిని దేవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వర రావు మరణంతో తెలుగు పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయిందన్నారు. కన్నడ నటి తార మాట్లాడుతూ మాహ నటుడు అక్కినేని మన ముందు లేక పోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ సజీవంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి జయచంద్రారెడ్డి, కోశాధికారి సి.వి.శ్రీనివాసయ్య, మాజీ అధ్యక్షుడు జెఎస్. రెడ్డి, మాజీ కార్యదర్శి కే.గంగరాజు, బహుభాష నటి హేమాచౌదరి, ఏఆర్.రాజు, కర్ణాటక సినిపరిశ్రమ వాణిజ్య మండలి అధ్యక్షుడు గంగరాజు, బాబునాయుడు, రంగస్వామినాయడు పాల్గొన్నారు.