తారలు తరించిన కూడలి | Special Story On Rajahmundry Devi Chowk | Sakshi
Sakshi News home page

తారలు తరించిన కూడలి

Published Sat, Sep 28 2019 5:27 AM | Last Updated on Sat, Sep 28 2019 5:27 AM

Special Story On Rajahmundry Devi Chowk - Sakshi

సినీతారలు దర్శనమిచ్చినప్పుడు అభిమానులు ఎలా తరించి పోతారో.. నవరాత్రులకు రాజమండ్రి దేవీచౌక్‌లోని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు సినీతారలు అలా తరించిపోయేవారట! అంతటి వైభవం ఉన్న ఆ వేడుకలకు ఇప్పటికీ స్థాయి,‘తార’స్థాయీ తగ్గలేదు.

దసరా నవరాత్రులు వస్తున్నాయంటే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న దేవీచౌక్‌ మిలమిలలాడే నక్షత్ర కాంతులతో తళతళలాడుతుంటుంది. భక్తులు ధరించే ఎర్రని వస్త్రాలతో ఆ ఆరుబయలు ప్రాంగణమంతా అరుణవర్ణ శోభితం అవుతుంది. నుదుటన ధరించిన కుంకుమ ప్రతి భక్తుని ముఖాన సూర్యుడు ఉదయించిన భావనను కలిగిస్తుంది. తొమ్మిది రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు రాజమహేంద్రవరం మణిద్వీపంలా భాసిస్తుంది.

ఎనభై ఐదేళ్ల వైభవం!
కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీచౌక్‌ వేడుక. ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేలమంది దర్శించుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 నుంచి (నేటి నుంచి) దేవీ చౌక్‌ సెంటర్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.గోదావరి సాంస్కృతిక వైభవానికి, కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం ఖ్యాతికి ఈ వేడుకలు ఆనవాలుగా నిలుస్తాయి. తెల్లవారే వరకు పౌరాణిక నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు.                                                                                                         

నాడు మూడు లాంతర్ల సెంటర్‌
ఏళ్ల క్రితం దేవీచౌక్‌ను మూడు లాంతర్ల సెంటరు అని పిలిచేవారు. కరెంటు లేని రోజుల్లో వీధి దీపాలుగా ఈ సెంటరులో గుత్తిగా ఉండే మూడు లాంతర్లలో కిరోసిన్‌ పోసి దీపాలు వెలిగించేవారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని అలా పిలిచేవారు. ఆ రోజుల్లో మొట్టమొదటగా దసరా ఉత్సవాలను 200 రూపాయలతో ప్రారంభించారు. 1934లో రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల మల్లికార్జునరావు, మునెయ్య సోదరులు ఉత్సవాల రూపురేఖలను మార్చి వేశారు. ఎలక్ట్రిక్‌ లైట్లు వచ్చాయి. 1963లో కలకత్తా నుంచి పాలరాతితో రూపొందిన బాలాత్రిపురసుందరి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు.

ఆ రోజు నుంచి మూడు లాంతర్ల జంక్షన్‌ దేవీచౌక్‌గా మారిపోయింది. దసరా తొమ్మిది రోజులూ ఇక్కడ  ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను  నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమపూజలు జరుగుతాయి. ఆ తరువాత ప్రారంభమయ్యే పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాల ప్రదర్శనలతో తెల్లవారిపోతుంది. ఒక దశలో మూడు వేదికలను ఏర్పాటు చేసి, ఒక వేదికపై నాటకాలు, రెండో వేదికపై హరికథలు, బుర్రకథలు, మరో వేదిక మీద భోగంమేళం సాగేవని ఆ తరానికి చెందిన పెద్దలు ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఒకే వేదికపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి.                                                                                                                                                               
– వారణాసి సుబ్రహ్మణ్యం,
సాక్షి రాజమహేంద్రవరం కల్చరల్‌
ఫొటోలు : గరగ ప్రసాద్‌   

ఒక్క ఛాన్స్‌ వస్తే చాలు
రాజమండ్రి దేవీ చౌక్‌లో జరిగే దసరా ఉత్సవాలలో కనీసం ఒక్కసారైనా వేషం వేయగలిగితే చాలునని పెద్ద పెద్ద కళాకారులే ఉవ్విళ్లూరేవారు. సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, జి.వరలక్ష్మి, గిరిజ వంటి ఎందరో నటులను ఈ వేదిక మీద సత్కరించారు. దినారాయణరావు–అంజలీదేవి, రాజసులోచన–సి.ఎస్‌.రావు, సావిత్రి–జెమినీగణేశ్‌లను కూడా ఇక్కడ సత్కరించారు. 1969 దసరా ఉత్సవాలలో నాటి మేటినటి రాజసులోచన దేవీచౌక్‌ వేదికపై నాట్యం చేస్తూ పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆమె తిరిగి ఇక్కడకు వచ్చి, మళ్లీ నాట్యం చేశారు. దేవీచౌక్‌ ఉత్సవాలను కళాకారులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారో ఈ సంఘటన చెబుతుంది.

నేటి అర్ధరాత్రి శ్రీకారం
ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించడంతో 86వ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. గత వైభవ దీప్తులకు పరంపరగా ఈ ఉత్సవాలు గోదావరి చరిత్రలో నిలిచిపోనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement