తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ' | Telugu movies of Annapurna Studios | Sakshi
Sakshi News home page

తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ'

Published Thu, Jan 23 2014 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM

తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ'

తెలుగు సినిమాకు 'అన్నపూర్ణ'

అక్కినేని సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమయంలో హైదరాబాద్‌లో ఉన్నది ఒక్క ‘సారథి’ స్టూడియో మాత్రమే. అందులోనూ అరుదుగా షూటింగులు జరుగుతుండేవి. సినీ పరిశ్రమ మొత్తం మద్రాసులోనే ఉండిపోయింది. అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’తోనే హైదరాబాద్‌కు రంగుల కళ వచ్చింది. సినిమాల నిర్మాణమూ ఊపందుకుంది. నిదానంగా భాగ్యనగరం సినీ శోభను సంతరించుకుంది. అసలు తనకు సినిమా భిక్ష పెట్టిన మద్రాసును వదులుకోవాల్సిన పరిస్థితి అక్కినేనికి ఎందుకొచ్చింది? అనే విషయాల్ని విశ్లేషించుకుంటే.. ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తాయి.
 
 అక్కినేని తమిళంలో పాతిక వరకూ సినిమాలు చేశారు. దాదాపు అన్నీ సిల్వర్ జూబ్లీలే. ఈ విజయాలు తమిళ నటులకు కంటికి కునుకు రాకుండా చేశాయి. అక్కినేని మద్రాసుని వదలడానికి ఇది ఓ కారణం. ఇక అక్కినేనికి చదువంటే ప్రాణం. కానీ, పరిస్థితుల కారణంగా నాల్గో తరగతితోనే చదువుకు స్వస్తి పలికారు. తన పిల్లల్ని మాత్రం బాగా చదివించుకోవాలనుకున్నారు. అయితే, మద్రాసులో తెలుగు నేర్పే సౌకర్యం లేదు. అక్కినేనికి మాతృభాషపై మమకారం మెండు. అందుకే పిల్లల చదువుకోసం హైదరాబాద్‌కు మకాం మార్చేయాలనుకున్నారు. మద్రాసు వదలడానికి ఇదొక కారణం.
 
 ఎలాగూ సారథివారి చిత్రాలకు అక్కినేనే హీరో. సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ఉండనే ఉంది. పైగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపొచ్చు.. ఇన్ని రకాలుగా ఆలోచించి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు అక్కినేని. ‘నాతో సినిమాలు తీయాలనుకుంటే... హైదరాబాద్ వచ్చి తీసుకోవచ్చు’ అని స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. దాంతో ఏఎన్నార్‌పై విమర్శలు ఊపందుకున్నాయి. అభిమానించినవారు, ఆరాధించినవారు సైతం మాటల పిడుగుల వర్షం కురిపించారు. పరిశ్రమలో తన ప్రాణమిత్రుడు అనదగ్గ ఎన్టీఆర్ నుంచి నాగిరెడ్డి, చక్రపాణి, నరసరాజు, ఎస్వీరంగారావు... ఇలా అందరూ ఆ క్షణంలో అక్కినేనిని నిందించిన వారే. కానీ అక్కినేని అవేమీ లెక్క చేయలేదు. 1964 నుంచి 1974 వరకూ దాదాపు 60 సినిమాలు కేవలం సారథి స్టూడియోలోనే చేశారు. దాంతో భాగ్యనగరంలో విరివిగా సినిమా ఆఫీసులు వెలిసి, ఇతర నటుల చిత్రాల షూటింగులు కూడా ఊపందుకున్నాయి. అలాంటి సమయంలో అక్కినేనికి గుండెకు సంబంధించిన సమస్య తలెత్తింది. దానికి ఆపరేషన్ నిమిత్తం అమెరికా వెళ్లారు.
 
 స్టూడియో నిర్మాణానికి నాంది..
 అక్కినేని అమెరికాలో ఉన్న సమయంలో కృష్ణ నటించిన ‘దేవదాసు’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దానికి నవయుగ వారు పంపిణీదారులు. ఆ సినిమా ఓ వారంలో విడుదల అవుతోందనగా... అక్కినేని సూచన మేరకు తమ సొంత సంస్థ ‘అన్నపూర్ణ ఫిల్మ్స్’వారు పాత ‘దేవదాసు’ని విడుదల చేశారు. ఈ సినిమా మళ్లీ ప్రభంజనం సృష్టించడం.. కృష్ణ ‘దేవదాసు’ పరాజయం పాలవడం జరిగిపోయింది. దీనిని కృష్ణ స్పోర్టివ్‌గా తీసుకున్నా.. పంపిణీ చేసిన నవయుగవారు మాత్రం తేలిగ్గా తీసుకోలేదు. అక్కినేని సినిమాల షూటింగులకు నెలవైన సారథి స్టూడియోలో నవయుగవారు కూడా భాగస్వాములు. ఆపరేషన్ ముగించుకొని హైదరాబాద్‌కు వచ్చాక అక్కినేని ఒప్పుకున్న చిత్రం ‘మహాకవి క్షేత్రయ్య’కు స్టూడియో అడిగితే... ‘ఇవ్వం.. నష్టాల్లో ఉన్నాం’ అన్నారు. ‘అయితే మాకివ్వండి.. నడుపుకొంటాం’ అంటే.. ‘మీకు ఇవ్వం.. మేం తెరవం’ అనేశారు. ఇది కక్ష సాధింపని అక్కినేనికి అర్థమైపోయింది. అయితే అక్కినేనిది ధర్మాగ్రహం. అది కనిపించే కోపం కాదు. అనుకున్నది సాధించే కోపం. బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ‘మహాకవి క్షేత్రయ్య’ షూటింగ్‌ని ముగించారు.
 
 మనమే ఎందుకు కట్టకూడదు..
 నవయుగవారు చేసిన పనితో.. ‘మనమే ఎందుకు స్టూడియో కట్టకూడదు’ అని అక్కినేనికి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే హైదరాబాద్‌కు వరమైంది. మద్రాసును వదిలినందుకే ఎన్నో విమర్శలు గుప్పించిన సినీజనం.. హైదరాబాద్‌లో స్టూడియో అనగానే.. హేళనగా నవ్వారు. మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సైతం వద్దని వారించారు. కానీ అక్కినేని మొండి  పట్టుదలతో జూబ్లీహిల్స్ కొండల్ని పలుగులతో పగలగొట్టించారు. పలుగుల తాకిడికి బద్దలవుతున్న ఆ రాళ్ల శబ్దాలే.. తెలుగునేలపై తెలుగు సినిమా అభ్యున్నతికి జయకేతనాలయ్యాయి. ఇక చెన్నపట్నంలోని తెలుగు సినిమా భాగ్యనగరం వైపు పరవళ్లు తొక్కింది. జూబ్లీహిల్స్ పక్కన కృష్ణానగర్ తయారై.. వేలాది సినీ కార్మికులకు ఆవాసమైంది. అదీ.. అక్కినేని అంటే.
 
 ముందు చూపుతో..
 జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందక ముందు.. అదంతా దట్టమైనఅడవి, గుట్టలు, రాళ్లతో నిండి ఉండేది. ఆ ప్రాంతంలోనే దార్శనిక దృష్టితో అక్కినేని ‘అన్నపూర్ణ స్టూడియో’ను నిర్మించారు. ఈ స్టూడియో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 1975లో స్థలం కేటాయించింది. 1976 జనవరి 14న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను ప్రారంభించారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు, నిర్మాత రామానాయుడు, అప్పటి అగ్రనటి వాణిశ్రీ ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోకు ఇటీవలే అదనంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా కళాశాల కూడా చేరింది. స్టూడియో రికార్డుల ప్రకారం.. ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 70 లక్షల మంది సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement