టైటిల్ : సూర్యకాంతం
జానర్ : రొమాంటిక్ ఎంటర్‌టైనర్
తారాగణం : నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్, పర్లీన్, శివాజీ రాజా, సుహాసిని తదితరులు
సంగీతం :మార్క్ కె.రాబిన్
దర్శకత్వం : ప్రణీత్ బ్రహ్మాండపల్లి
నిర్మాత : రాజ్ నిహార్
మెగా డాటర్‌గా బుల్లితెరపై సందడి చేసిన నిహారిక కొణిదెల.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు చిత్రంతో తెరకు పరిచయమై.. గతేడాది హ్యాపీ వెడ్డింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అయినా నిహారికకు అనుకున్న విజయం మాత్రం లభించలేదు. తనకు మంచి పేరు తీసుకువచ్చిన ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడితో కలిసి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టేందుకు ‘సూర్యకాంతం’గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిహారిక. మరి ఈ మూవీతో అయినా.. ఇంతకాలం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నిహారికకు మంచి ఫలితాన్ని ఇచ్చిందా? లేదా అనేది ఓ సారి చూద్దాం.
కథ
ఓ విచిత్ర స్వభావం గల అమ్మాయి సూర్యకాంతం(నిహారిక). ప్రేమా పెళ్లిపై అంతగా నమ్మకం లేని కాంతాన్ని అభి ఇష్టపడతాడు. అభిని కూడా కాంతం ఇష్టపడుతుంది. అయితే కాంతం ఎప్పుడు ఎక్కడ ఉంటుందో.. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అలా ఓసారి బయటకి వెళ్లిన కాంతం ఓ ఏడాది పాటు కనపడకుండా వెళ్తుంది. అయితే కాంతం ఎక్కడికి వెళ్లిందో తెలియని అభి పిచ్చివాడిలా.. తన కోసం ఎదురుచూస్తుంటారు. అభికి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. అభికి పూజా(పర్లిన్)తో పెళ్లి ఫిక్స్ అయ్యే సమయానికి కాంతం తిరిగి వస్తుంది. అప్పుడు కాంతం ఏం చేసింది? ఆ పరిస్థితిలో అభి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కాంతం.. పూజాలో అభి ఎవరినీ పెళ్లి చేసుకున్నాడన్నదే మిగతా కథ.
నటీనటులు
సూర్యకాంతం పాత్ర లో నిహారిక బాగానే నటించింది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో.. ఎలా ఉంటుందో తెలియని అమ్మాయి పాత్రలో నిహారిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో హోమ్లీగా కనిపించిన నిహారిక.. ఈ సినిమాలో హీరోను అల్లరి పెట్టే పాత్రలో బాగానే ఆకట్టుకుంది. ఇక అభి పాత్రలో రాహుల్ పర్వలేదనిపించాడు. సెకండ్ హీరోయిన్ అయిన పూజ లుక్స్తో పాటు యాక్టింగ్తోనూ ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో సుహాసిని.. శివాజీ రాజా.. సత్య తమ పరిధి మేరకు పర్వలేదనిపించారు.
విశ్లేషణ
సినిమా ప్రారంభం నుంచి అలా స్లోగా వెళ్తూ.. నిహారిక ఎంటర్ అయ్యే వరకు తెరపై సందడే కనిపించదు. అయితే ఇంత సందడిగా ఉండే కాంతం పాత్రను సెకండ్ హాఫ్లో బోర్ కొట్టించేలా మలిచాడు దర్శకుడు. కాంతం కారెక్టర్ డిజైన్‌లో వచ్చిన లోపమే ఏమో తెలియదు కాని.. ఏదో తెలియని చిరాకు అసహనం పెరిగి పోతూ ఉంటుంది ద్వితీయార్థంలో. ప్రేక్షకుడిని కూడా తికమక పెట్టి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా.. స్లో నెరేషన్‌తో దర్శకుడు తెగ ఇబ్బందిపెట్టేసాడు. సినిమాకి అసలు కథ ఏంటో కూడా అర్థం కాకుండా అలా గడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కాంతం పాత్రతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన డైరెక్టర్ .. సెకండ్ హాఫ్లో దాన్ని మిస్ చేయడమే కాకుండా.. ఆ పాత్ర ఏం చేస్తుందో తెలియకుండా చిరాకు వచ్చేలా చేసాడు. ఇక కథ కథనాలు గురించి వదిలిస్తే.. మార్క్ అందించిన సంగీతం పర్వలేదనిపిస్తుంది. హీరో హీరోయిన్స్ ను అందంగా ప్రెసెంట్ చేసాడు సినిమాటోగ్రాఫర్. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రథమార్థం
నిహారిక నటన
మైనస్ పాయింట్స్
ద్వితీయార్థం
స్లోనెరేషన్
బండ కళ్యాణ్, ఇంటర్‌నెట్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment