కోడలిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలి? భర్త నోరు ఎలా మూయించాలి? కూతుర్ని అల్లారు ముద్దుగా ఎలా పెంచుకోవాలి? ఇంటి అల్లుడ్ని ఎలా ఆడుకోవాలి?... ఇవన్నీ తెలుసుకోవాలంటే సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే చాలు. ఇంతకు మించి ఎవరూ గయ్యాళితనాన్ని చూపించలేరేమో అన్నంతగా నటించారామె. అందుకే తమ కూతుళ్లకు ఆమె పేరు పెట్టే సాహసం చేయరు తల్లి దండ్రులు. కానీ వ్యక్తిగతంగా ఆమె మనసు సున్నితం. తనది కాని స్వభావాన్ని వెండితెరపై అద్భుతంగా అభినయించిన ఈ అద్భుత నటి శత జయంతి నేడు (అక్టోబర్ 28) ఆరంభం. ఈ సందర్భంగా సూర్యకాంతంని గుర్తు చేసుకుందాం...
‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’... వెండితెరపై గయ్యాళి అత్తగా విజృంభించిన సూర్యకాంతం నోటి నుంచి వచ్చిన మాటలివి. నటిగా గయ్యాళితనాన్ని కనబర్చిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్కురాలే. నిజానికి కథానాయికగా వెండితెరపై అందంగా, సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కల.
ఆ కల నెరవేర్చుకునే చాన్స్ వచ్చినప్పటికీ, ఒక హీరోయిన్ చేజారిన అవకాశాన్ని తాను అంది పుచ్చుకుని ఆనందపడటానికి ఇష్టపడక... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’ అని తిరస్కరించారు. అది హిందీ సినిమా. అయినా వదులుకున్నారంటే వ్యక్తిగతంగా సూర్యకాంతానిది ఎంత మంచి మనసో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండితెరపై ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా ఆమె డైలాగ్ చెప్పే తీరులో కనిపించిన గయ్యాళితనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా ఎడమ చేయి తిప్పే అలవాటు సూర్యకాంతానికి చిన్నప్పుడే ఉంది. చిన్నారి సూర్యకాంతం బాల్యంలోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు.
సూర్యం... భలే చలాకీ
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న పోన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మలకు జన్మించారు సూర్యకాంతం. మగపిల్లాడి దుస్తులు వేసుకుని, బెత్తం పట్టుకుని భలే చలాకీగా ఉండేదట చిన్నారి సూర్యకాంతం. తల్లిదండ్రులు సూర్యం అని పిలిచేవారట. ‘సూర్యం అటు వెళ్లకు.. బూచీ ఉంది’ అంటే... ఎడమ చేయి ఊపుతూ ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అనేదట సూర్యం. ఆ చేయి కదలిక, మాట తీరు అందర్నీ నవ్వించేవట.
ఇక సినిమాల్లోకి వచ్చాక ఎడమ చేయి తిప్పుతూ సూర్యకాంతం డైలాగులు పలికిన తీరు ఆకట్టుకున్నాయి. ఎడమ చేయి తిప్పడం అనేది చిన్న వయసులోనే ఆమెకు అలవాటైంది. ఆరేళ్ల వయసులోనే పాటలు పాడటం, డ్యాన్స్ నేర్చుకుంది సూర్యం. ఈ చిన్నదాన్ని హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించాయి. కాగా సూర్యంకి ఎనిమిదేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికే ఆమె తోబుట్టువులకు పెళ్లయి, అత్తవారింటికి వెళ్లిపోయారు. సూర్యం, ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఓ డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంత్రపు ప్రభాకర రావు.
నటించాలనే ఆసక్తి ఉన్నా అవకాశం అడగడానికి సూర్యం ఇష్టపడలేదు. అయితే ఓ అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకు చలాకీ సూర్యంని తీసుకున్నారు ప్రభాకర రావు. తల్లి వెంకటరత్నం కూడా కూతురి ప్రతిభకు అడ్డుకట్ట వేయదలచుకోలేదు. అలా ‘సతీ సక్కుబాయి’ నాటకంలో మగపిల్లవాడి వేషం వేసింది సూర్యం. ఆ తర్వాత కూడా అబ్బాయి పాత్రలు చాలానే చేసి, రంగస్థలంపై నిరూపించుకుంది. హనుమాన్ డ్రామా కంపెనీలోని నాటకాల్లోనూ నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులోనూ నాటకాలు వేస్తుండటంతో కూతురితో సహా సూర్యం తల్లి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20. ఇక సినిమాల్లో నటిస్తానంటే తల్లి ఓకే చెప్పేశారు.
హిట్ గయ్యాళి
జెమినీ స్టూడియో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డ్యాన్సర్‌గా అవకాశం ఇచ్చి, నెలకు రూ. 60 జీతం అంటే ఒప్పుకోలేదామె. దాంతో రూ. 75 ఇవ్వడానికి అంగీకరించారు. అయితే కొంత కాలం తర్వాత జెమినీ స్టూడియో నుంచి ఆమె బయటకు వచ్చేశారు. నటిగా సూర్యకాంతం తొలి చిత్రం ‘నారద నారది’ (1946). ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన సూర్యకాంతంకి ‘సౌదామిని’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.
అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోలుకున్నాక ‘సంసారం’ (1950) చిత్రంలో గయ్యాళి అత్త పాత్రకు అవకాశం వస్తే, కాదనుకుండా ఒప్పుకున్నారు సూర్యకాంతం. గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో ఆ తర్వాత కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 40 ఏళ్ల పాటు దాదాపు 700 చిత్రాల్లో నటించారామె.
టైటిల్ రోల్‌లో...
సూర్యకాంతం కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (1962) ముందు ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాళితనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర పేరు వచ్చేట్లు ‘గుండమ్మ కథ’ టైటిల్ పెట్టారు ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ నమ్మకాన్ని నిజం చేశారు సూర్యకాంతం. ఇంకా ఆమె చేసిన చిత్రాల్లో ‘చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, కులగోత్రాలు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు–కొత్తకోడలు, దసరా బుల్లోడు, వియ్యాలవారి కయ్యాలు’ వంటివి ఉన్నాయి. ‘మాయాబజార్’లోని హిడింబి పాత్ర ఒకటి.
వంటల పుస్తక రచయిత
అప్పట్లో సినిమా స్టార్ కనబడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. కానీ, నటిగా గయ్యాళి ముద్రపడ్డ సూర్యకాంతం కనబడితే దగ్గరికి వెళ్లడానికి భయపడేవారట. ఇక షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్లి, యూనిట్‌లో అందరికీ పెట్టడం, లొకేషన్‌లోనే వండటం చేసేవారట సూర్యకాంతం. ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారామె.
నమ్మినవాళ్లే...
సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. అలాగే సులువుగా ఎవర్నీ నమ్మేవారు కాదట. చివరికి కారు పాడైతే, మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ల ముందే బాగు చేయాలట. సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారట. ఎంత తెలివిగలవాళ్లయినా ఎక్కడో చోట బోల్తా పడతారన్నట్లు.. నమ్మినవాళ్లే ఆమెను మోసం చేశారట. సూర్యకాంతం మరణానికి ఆ మానసిక వేదన ఓ కారణం అంటుంటారు. నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్లారామె. వెండితెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాళి అత్త రాలేదు... ఎప్పటికీ రాదు కూడా.
గయ్యాళి అత్తగా తొలి చిత్రం ‘సంసారం’ (1950) ఒప్పుకున్న ఏడాదే మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేరు. అక్క కొడుకు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం. 1978లో చలపతిరావు చనిపోయారు. 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె భౌతికకాయాన్ని సందర్శించడానికి ఓ పది మంది సినీ ప్రముఖులు కూడా వెళ్లలేదు.
సూర్యకాంతం సేవా కార్యక్రమాలు చేశారు. కాకినాడ, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో సత్రాలు ఏర్పాటు చేసి, అనాధలను చేరదీశారట. అలాగే పలువురు వితంతువులకు ఒకే వేదికపై పునర్వివాహాలు చేశారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసేవారు.
‘మంచి మనసులు’లో లాయర్ ఎస్వీ రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి ఆడపిల్ల సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. దాంతో సూర్యకాంతం శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తతో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఆయన ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’ అంటాడు. ఆజానుబాహుడు ఎస్వీఆర్ సైతం తెరపై సూర్యకాంతం ముందు నోరు తెరవ లేదు.
‘గుండమ్మ కథ’ కథారచయిత డీవీ నరసరాజు స్క్రిప్ట్ రాసేటప్పుడు సవితి కూతురు సావిత్రిని గుండమ్మ బాధలు పెట్టాలి కాబట్టి.. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయనా?’ అని నిర్మాత చక్రపాణిని అడిగారు. ‘గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం... సూర్యకాంతం అంటేనే గయ్యాళి. ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారాయన. పని గట్టుకుని సీన్లు రాయకపోయినా గయ్యాళితనాన్ని పండించారు సూర్యకాంతం.
‘శాంతి నివాసం’లో ఇల్లరికం అల్లుడు నర సింహాలు (రేలంగి)ని ‘గొడ్డు సింహాలు’ అంటూ అవమానిస్తుంటుంది అత్త (సూర్యకాంతం). అప్పుడు మామగారి (చిత్తూరు నాగయ్య) దగ్గరికెళ్లి, ‘చూశారా మావగారు.. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు నరసింహాలు. దానికి మామగారు ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. భార్యంటే ఆ భర్తకు అంత భయం.
Comments
Please login to add a commentAdd a comment