మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఓ తమిళ మూవీకి రీమేక్. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఇది ఫలానా మూవీకి రీమేక్ అని మెగా ఫ్యాన్స్‌కి తెలిసింది. దీంతో మాకొద్దీ రీమేక్ అని బుర్ర బాదుకున్నారు. కానీ వాళ్ల మాట ఎవరు వింటారు చెప్పండి. ఎంచక్కా షూటింగ్ పూర్తి చేసి, సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 'భోళా శంకర్' బోల్తా కొట్టింది. చిరు కెరీర్‌లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే రీమేక్స్ చేయొద్దని.. స్వయానా అభిమానులే అంత మొత్తుకుంటున్నా చిరు ఎందుకు రీమేక్స్ చేస్తున్నారు? అసలు ఆయన కెరీర్‌లో ఓవరాల్‌గా ఎన్ని రీమేక్ సినిమాలున్నాయి? అదంత పక్కనబెడితే రీమేక్ అనేది మెగాస్టార్‌కి కలిసొచ్చిందా? ముంచేసిందా అనేది ఇప్పుడు అలా చూసేద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)
రీమేక్స్ ఎన్ని?
శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. 'మెగాస్టార్' ఎందుకయ్యారు? అని ఎవరినైనా అడిగితే.. ఏముంది డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్స్ ఇలా ప్రతిదానిలోనూ బెంచ్ మార్క్ సెట్ చేశారు కదా అని చెబుతారు. చిరు ఇప్పటివరకు 155 సినిమాలు చేస్తే.. అందులో దాదాపు 38కి పైగా చిత్రాలు రీమేక్స్ అని చాలామందికి తెలియదు. ఓర‍్ని ఇన్ని రీమేక్సా అని ఆశ్చర్యపోవద్దు. ఇంతకీ ఆ మూవీస్ ఏంటో తెలుసా?
ఖైదీ కూడా రీమేక్?
చిరు కెరీర్‌ని టర్న్ చేసిన మూవీ అనగానే చాలామంది 'ఖైదీ' అంటారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి తీసిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరు కెరీర్‌కి బ్యాక్ బోన్‌లా మారింది. అయితే ఇది హాలీవుడ్‌లో సిల్వోస్టర్ స్టాలిన్ చేసిన 'ఫస్ట్ బ్లడ్' అనే చిత్రానికి రీమేక్ అట. పూర్తిగా ఉన్నది ఉన్నట్లు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చి తీసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా లిస్టులో చాలా ఉన్నాయి.
(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!)
రీమేక్స్- ఒరిజినల్ సినిమాలు
పున్నమినాగు- హున్నిమేయ రాత్రియల్లి (మలయాళం)
పట్నం వచ్చిన పతివ్రతలు - పట్టణక్కే బంధ పత్‌నియారు (కన్నడ)
అడవి దొంగ - టార్జాన్ (ఇంగ్లీష్)
వేట - ది కౌంట్ ఆఫ్ మొంటో క్రిష్ణో (ఇంగ్లీష్)
ఆరాధన- కవితోరా కవితైగల్ (తమిళం)
పసివాడి ప్రాణం - పూవిన్ను పుతియా పుంతెన్నెల్ (మలయాళం)
ఘరానా మొగుడు - అనురాగ అరాలితు (కన్నడ)
ఎస్పీ పరశురాం - వాల్టర్ వెట్రివేల్ (తమిళం)
హిట్లర్ - హిట్లర్ (మలయాళం)
స్నేహం కోసం - నట్పుక్కగ (తమిళం)
ఠాగూర్ - రమణ (తమిళం)
అంజి - ఇండియానా జోన్స్ (ఇంగ్లీష్)
శంకర్‌దాదా ఎంబీబీఎస్ - మున్నాభాయ్ ఎంబీబీఎస్ (హిందీ)
ఖైదీ నం.150 - కత్తి (తమిళం)
గాడ్‌ఫాదర్ - లూసిఫర్ (మలయాళం)
భోళా శంకర్ - వేదాళం (తమిళం)
పొరపాటు ఎక్కడ?
పైన చెప్పిన సినిమాలన్నీ చిరంజీవి కెరీర్‌లో కాస్త చెప్పుకోదగ్గ రీమేక్స్. వీటితోపాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో రీమేక్స్ హక్కులు కొని తీయడం అనే పద్ధతి ఉండేది కాదు. దీంతో దర్శకులు.. సదరు చిత్రాల్ని స్పూర్తిగా తీసుకుని కాస్త చేర్పులు మార్పులు చేసి తీసేసేవారు. కాబట్టి అది రీమేక్, ఒరిజినల్ అనేది చెప్పడం కష్టం. అప్పట్లో ప్లస్ అయినంతగా ఇప్పుడు చిరుకు రీమేక్స్ అస్సలు కలిసి రావడం లేదు.
రీమేక్స్.. నాట్ ఇంట్రెస్ట్!
ఇప్పటి ప్రేక్షకులు.. ఒరిజినల్ సినిమాలు చూడటానికే కొన్నిసార్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీమేక్స్ అనేసరికి చూడటం కంటే ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రకటన రావడం ఆలస్యం ఒరిజినల్ చూసేసి, రీమేక్‌ని దాంతో పోల్చుతూ విమర్శిస్తున్నారు. రీసెంట్‌గా 'భోళా శంకర్' రిజల్ట్ దీనికి కరెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు.
రీఎంట్రీలో రీమేక్స్
చిరంజీవి.. 'ఖైదీ నం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది తమిళ 'కత్తి'కి రీమేక్. మాస్ కమర్షియల్ అంశాలు ఉండటంతో ఇది మెగాస్టార్‌కి కలిసొచ్చింది. కానీ 'గాడ్ ఫాదర్' (లూసిఫర్), 'భోళా శంకర్' (వేదాళం) చిత్రాలు మాత్రం చిరుకు కలిసి రాలేదు. ఎందుకంటే వాటిని ఆల్రెడీ ఆడియెన్స్ చూసేశారు కాబట్టి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు.. ఆడియెన్స్ టేస్ట్, ట్రెండ్‌కి తగ్గట్లు చిరు మారితే బెటర్. లేదంటే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులే ఎక్కువ!
(ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment