90ల్లో పుట్టిన ఓ పిల్లాడు. కాస్త ఊహ తెలిసొచ్చాక నాన‍్న భుజాలపై కూర్చుని తొలిసారి ఓ సినిమా చూశాడు. ఓ వ్యక్తి డ్యాన్సులు చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. కట్ చేస్తే ఆ పిల్లాడు ఇప్పుడు కుర్రాడు అయ్యాడు. ఆ హీరోకి వయసైపోయింది కానీ యాక్టింగ్, డ్యాన్సుల్లో గ్రేస్ మాత్రం తగ్గలేదు. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎందుకో తడబడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది?
ఆ స్థాయి సినిమాలు ఎక్కడ?
నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని వంక పెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉంటుంది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ నుంచి అత్యధిక రెమ్యునరేషన్ వరకు ఎన్నో విషయాల్లో రికార్డులు సృష్టించారు. దాదాపు అన్ని రకాల జానర్స్ కథల్ని కవర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకప్పుడు చిరంజీవి అంటే మాస్-క్లాస్-ఫ్యామిలీస్ ఇలా అందరినీ ఎంటర్‌టైన్ చేసేవారు. ఇప్పుడు ఆయన రేంజుకి తగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా పడటం లేదనేది సగటు మెగా అభిమాని ఆవేదన.
(ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!)
రీమేక్స్ వల్ల డ్యామేజ్?
'భోళా శంకర్'తో కలిపి చిరంజీవి ఇప్పటివరకు దాదాపు 38 సినిమాలని రీమేక్ చేశారు. ఇదేం అఫీషియల్ నంబర్ కాదు. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి ఏది ఒరిజినల్ స్టోరీ, ఏది రీమేక్ అనేది ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. థియేటర్‌కి వెళ్లి మనస్పూర్తిగా చిరుని ఆయా మూవీస్‌లో చూసి ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు జమానా మారిపోయింది గురూ. రీమేక్స్ అనేవి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంకా చెప్పాలంటే చిరు రీమేక్స్ వల్ల ఆయనకు ప్లస్ కంటే డ్యామేజే ఎక్కువ జరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయం.
నాడీ పట్టుకోలేకపోతున్నారా?
చాలామంది హీరోలు.. అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. చిరు కూడా ఇదే ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఫ్యాన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దెబ్బ పడటం గ్యారంటీ. ఎందుకంటే ఓ మూవీ బాగుంది-బాగోలేదు అని డిసైడ్ చేసిది ఫ్యాన్స్ కాదు నార్మల్ ఆడియెన్స్. వీళ్లకు నచ్చాలంటే ట్రెండ్‌కి తగ్గట్లు డిఫరెంట్ స్టోరీలు చేయాలి. అప్పుడే కలెక్షన్స్‌తోపాటు హిట్ అనే మాట వినబడుతుంది. చిరు.. వీళ్ల నాడీ పట్టుకోనేలా సినిమాలు చేస్తే బెటర్.
(ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?)
ఇంకా అలానే అంటే!
చిరంజీవి వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అయితే తనకు వయసు అయిపోయిందని ఒప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలు వయసు తగ్గ పాత్రలు, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరంజీవి మాత్రం ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్.. ఇంకా కుర్రాడిలా ఉండేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అభిమానులని ఇది నచ్చేయొచ్చేమే గానీ.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోరు అంతే!
అసలైన ఫ్యాన్స్ వాళ్లు
ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకి సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, ఐకాన్‌స్టార్ తెలిసినంత.. మెగాస్టార్ గురించి తెలియదు. ఎందుకంటే 2007 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ అసలైన ఫ్యాన్స్ అంటే ఇప్పటి జనరేషన్‌కి నాన్నల తరం. వాళ్లలో చాలామందికి ఇప్పుడు థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడాలనే ఆసక్తి ఉండట్లేదు. ఇది కూడా రీఎంట్రీలో చిరు సినిమాలపై టాక్ తేడా కొట్టడానికి ఓ కారణం కావొచ్చు. ఇలా పైన చెప్పిన వాటితో పాటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని ఓసారి దృష్టిలో పెట్టుకుని చిరు ఇకపై సినిమాలు చేస్తే బెటర్. లేదంటే మాత్రం అంతే!
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment