Centennial
-
గయ్యాళి గుండమ్మకు వందేళ్లు.. నమ్మినవాళ్లే మోసం చేయడంతో..!
కోడలిని ఎన్ని రకాలుగా హింస పెట్టాలి? భర్త నోరు ఎలా మూయించాలి? కూతుర్ని అల్లారు ముద్దుగా ఎలా పెంచుకోవాలి? ఇంటి అల్లుడ్ని ఎలా ఆడుకోవాలి?... ఇవన్నీ తెలుసుకోవాలంటే సూర్యకాంతం చేసిన పాత్రలు చూస్తే చాలు. ఇంతకు మించి ఎవరూ గయ్యాళితనాన్ని చూపించలేరేమో అన్నంతగా నటించారామె. అందుకే తమ కూతుళ్లకు ఆమె పేరు పెట్టే సాహసం చేయరు తల్లి దండ్రులు. కానీ వ్యక్తిగతంగా ఆమె మనసు సున్నితం. తనది కాని స్వభావాన్ని వెండితెరపై అద్భుతంగా అభినయించిన ఈ అద్భుత నటి శత జయంతి నేడు (అక్టోబర్ 28) ఆరంభం. ఈ సందర్భంగా సూర్యకాంతంని గుర్తు చేసుకుందాం... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’... వెండితెరపై గయ్యాళి అత్తగా విజృంభించిన సూర్యకాంతం నోటి నుంచి వచ్చిన మాటలివి. నటిగా గయ్యాళితనాన్ని కనబర్చిన ఆమె వ్యక్తిగా కాస్త సున్నిత మనస్కురాలే. నిజానికి కథానాయికగా వెండితెరపై అందంగా, సున్నితంగా కనిపించాలన్నది సూర్యకాంతం కల. ఆ కల నెరవేర్చుకునే చాన్స్ వచ్చినప్పటికీ, ఒక హీరోయిన్ చేజారిన అవకాశాన్ని తాను అంది పుచ్చుకుని ఆనందపడటానికి ఇష్టపడక... ‘‘ఒకరి బాధతో నాకు సంతోషం దక్కుతుందంటే ఆ సంతోషమే నాకు వద్దు’’ అని తిరస్కరించారు. అది హిందీ సినిమా. అయినా వదులుకున్నారంటే వ్యక్తిగతంగా సూర్యకాంతానిది ఎంత మంచి మనసో అర్థం చేసుకోవచ్చు. ఇక వెండితెరపై ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా ఆమె డైలాగ్ చెప్పే తీరులో కనిపించిన గయ్యాళితనాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇలా ఎడమ చేయి తిప్పే అలవాటు సూర్యకాంతానికి చిన్నప్పుడే ఉంది. చిన్నారి సూర్యకాంతం బాల్యంలోకి వెళితే ఆ విషయాలు తెలుసుకోవచ్చు. సూర్యం... భలే చలాకీ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో 1924 అక్టోబర్ 28న పోన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మలకు జన్మించారు సూర్యకాంతం. మగపిల్లాడి దుస్తులు వేసుకుని, బెత్తం పట్టుకుని భలే చలాకీగా ఉండేదట చిన్నారి సూర్యకాంతం. తల్లిదండ్రులు సూర్యం అని పిలిచేవారట. ‘సూర్యం అటు వెళ్లకు.. బూచీ ఉంది’ అంటే... ఎడమ చేయి ఊపుతూ ‘బూచీ లేదు.. ఏమీ లేదు’ అనేదట సూర్యం. ఆ చేయి కదలిక, మాట తీరు అందర్నీ నవ్వించేవట. ఇక సినిమాల్లోకి వచ్చాక ఎడమ చేయి తిప్పుతూ సూర్యకాంతం డైలాగులు పలికిన తీరు ఆకట్టుకున్నాయి. ఎడమ చేయి తిప్పడం అనేది చిన్న వయసులోనే ఆమెకు అలవాటైంది. ఆరేళ్ల వయసులోనే పాటలు పాడటం, డ్యాన్స్ నేర్చుకుంది సూర్యం. ఈ చిన్నదాన్ని హిందీ సినిమా పోస్టర్లు ఆకర్షించాయి. కాగా సూర్యంకి ఎనిమిదేళ్ల వయసప్పుడు ఆమె తండ్రి చనిపోయారు. అప్పటికే ఆమె తోబుట్టువులకు పెళ్లయి, అత్తవారింటికి వెళ్లిపోయారు. సూర్యం, ఆమె తల్లి మాత్రమే ఉండేవారు. అప్పట్లో కాకినాడలో అందరూ అమ్మాయిలే ఉన్న ఓ డ్రామా కంపెనీని నిర్వహించేవారు బాలాంత్రపు ప్రభాకర రావు. నటించాలనే ఆసక్తి ఉన్నా అవకాశం అడగడానికి సూర్యం ఇష్టపడలేదు. అయితే ఓ అమ్మాయి రాకపోవడంతో ఆ పాత్రకు చలాకీ సూర్యంని తీసుకున్నారు ప్రభాకర రావు. తల్లి వెంకటరత్నం కూడా కూతురి ప్రతిభకు అడ్డుకట్ట వేయదలచుకోలేదు. అలా ‘సతీ సక్కుబాయి’ నాటకంలో మగపిల్లవాడి వేషం వేసింది సూర్యం. ఆ తర్వాత కూడా అబ్బాయి పాత్రలు చాలానే చేసి, రంగస్థలంపై నిరూపించుకుంది. హనుమాన్ డ్రామా కంపెనీలోని నాటకాల్లోనూ నటించింది. ఆ డ్రామా కంపెనీ మద్రాసులోనూ నాటకాలు వేస్తుండటంతో కూతురితో సహా సూర్యం తల్లి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి సూర్యం వయసు 20. ఇక సినిమాల్లో నటిస్తానంటే తల్లి ఓకే చెప్పేశారు. హిట్ గయ్యాళి జెమినీ స్టూడియో ఓ సినిమాలో సూర్యకాంతంకి సైడ్ డ్యాన్సర్‌గా అవకాశం ఇచ్చి, నెలకు రూ. 60 జీతం అంటే ఒప్పుకోలేదామె. దాంతో రూ. 75 ఇవ్వడానికి అంగీకరించారు. అయితే కొంత కాలం తర్వాత జెమినీ స్టూడియో నుంచి ఆమె బయటకు వచ్చేశారు. నటిగా సూర్యకాంతం తొలి చిత్రం ‘నారద నారది’ (1946). ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన సూర్యకాంతంకి ‘సౌదామిని’ చిత్రంలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. అయితే కారు ప్రమాదం వల్ల ముఖానికి గాయం కావడంతో ఆ అవకాశం చేజారింది. కాస్త కోలుకున్నాక ‘సంసారం’ (1950) చిత్రంలో గయ్యాళి అత్త పాత్రకు అవకాశం వస్తే, కాదనుకుండా ఒప్పుకున్నారు సూర్యకాంతం. గయ్యాళి అత్త అంటే సూర్యకాంతమే అన్నంతగా నటించడంతో ఆ తర్వాత కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 40 ఏళ్ల పాటు దాదాపు 700 చిత్రాల్లో నటించారామె. టైటిల్ రోల్లో... సూర్యకాంతం కెరీర్లో చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (1962) ముందు ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి హీరోలు ఉన్నప్పటికీ సూర్యకాంతం వీలైనంత గయ్యాళితనం ప్రదర్శిస్తారనే నమ్మకంతో ఆమె పాత్ర పేరు వచ్చేట్లు ‘గుండమ్మ కథ’ టైటిల్ పెట్టారు ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. ఆ నమ్మకాన్ని నిజం చేశారు సూర్యకాంతం. ఇంకా ఆమె చేసిన చిత్రాల్లో ‘చక్రపాణి, దొంగరాముడు, చిరంజీవులు, తోడికోడళ్లు, అత్తా ఒకింటి కోడలే, ఇల్లరికం, కులగోత్రాలు, దాగుడు మూతలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు–కొత్తకోడలు, దసరా బుల్లోడు, వియ్యాలవారి కయ్యాలు’ వంటివి ఉన్నాయి. ‘మాయాబజార్’లోని హిడింబి పాత్ర ఒకటి. వంటల పుస్తక రచయిత అప్పట్లో సినిమా స్టార్ కనబడితే ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. కానీ, నటిగా గయ్యాళి ముద్రపడ్డ సూర్యకాంతం కనబడితే దగ్గరికి వెళ్లడానికి భయపడేవారట. ఇక షూటింగ్‌కి వెళ్లేటప్పుడు తనతో పాటు తినుబండారాలు తీసుకువెళ్లి, యూనిట్లో అందరికీ పెట్టడం, లొకేషన్లోనే వండటం చేసేవారట సూర్యకాంతం. ఓ వంటల పుస్తకం కూడా వెలువరించారామె. నమ్మినవాళ్లే... సూర్యకాంతం ఆర్థిక లావాదేవీల విషయంలో నిక్కచ్చిగా ఉండేవారట. అలాగే సులువుగా ఎవర్నీ నమ్మేవారు కాదట. చివరికి కారు పాడైతే, మెకానిక్ ఇంటికి వచ్చి తన కళ్ల ముందే బాగు చేయాలట. సెకండ్ హ్యాండ్ కార్లు కొని అమ్మేవారట. ఎంత తెలివిగలవాళ్లయినా ఎక్కడో చోట బోల్తా పడతారన్నట్లు.. నమ్మినవాళ్లే ఆమెను మోసం చేశారట. సూర్యకాంతం మరణానికి ఆ మానసిక వేదన ఓ కారణం అంటుంటారు. నటిగా తన కాంతిని ప్రేక్షకులకు వదిలి వెళ్లారామె. వెండితెరపై ఆమెను రీప్లేస్ చేసే మరో గయ్యాళి అత్త రాలేదు... ఎప్పటికీ రాదు కూడా. గయ్యాళి అత్తగా తొలి చిత్రం ‘సంసారం’ (1950) ఒప్పుకున్న ఏడాదే మద్రాసు హైకోర్టు జడ్జి పెద్దిభొట్ల చలపతిరావుతో సూర్యకాంతం పెళ్లి జరిగింది. వీరికి సంతానం లేరు. అక్క కొడుకు అనంత పద్మనాభ మూర్తిని దత్తత తీసుకున్నారు సూర్యకాంతం. 1978లో చలపతిరావు చనిపోయారు. 1994 డిసెంబర్ 18న సూర్యకాంతం చెన్నైలో కన్నుమూశారు. అయితే ఆమె భౌతికకాయాన్ని సందర్శించడానికి ఓ పది మంది సినీ ప్రముఖులు కూడా వెళ్లలేదు. సూర్యకాంతం సేవా కార్యక్రమాలు చేశారు. కాకినాడ, హైదరాబాద్‌తో పాటు మరికొన్ని నగరాల్లో సత్రాలు ఏర్పాటు చేసి, అనాధలను చేరదీశారట. అలాగే పలువురు వితంతువులకు ఒకే వేదికపై పునర్వివాహాలు చేశారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సహాయం చేసేవారు. ‘మంచి మనసులు’లో లాయర్ ఎస్వీ రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి ఆడపిల్ల సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. దాంతో సూర్యకాంతం శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తతో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఆయన ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’ అంటాడు. ఆజానుబాహుడు ఎస్వీఆర్ సైతం తెరపై సూర్యకాంతం ముందు నోరు తెరవ లేదు. ‘గుండమ్మ కథ’ కథారచయిత డీవీ నరసరాజు స్క్రిప్ట్ రాసేటప్పుడు సవితి కూతురు సావిత్రిని గుండమ్మ బాధలు పెట్టాలి కాబట్టి.. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్ చేసే సీన్లు రాయనా?’ అని నిర్మాత చక్రపాణిని అడిగారు. ‘గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం... సూర్యకాంతం అంటేనే గయ్యాళి. ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు. ఫిల్మ్ వేస్టు’ అన్నారాయన. పని గట్టుకుని సీన్లు రాయకపోయినా గయ్యాళితనాన్ని పండించారు సూర్యకాంతం. ‘శాంతి నివాసం’లో ఇల్లరికం అల్లుడు నర సింహాలు (రేలంగి)ని ‘గొడ్డు సింహాలు’ అంటూ అవమానిస్తుంటుంది అత్త (సూర్యకాంతం). అప్పుడు మామగారి (చిత్తూరు నాగయ్య) దగ్గరికెళ్లి, ‘చూశారా మావగారు.. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు నరసింహాలు. దానికి మామగారు ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. భార్యంటే ఆ భర్తకు అంత భయం. -
శతాబ్ది వేళ..నిధుల గోల
⇒ఓయూను వెంటాడుతున్న నిధుల సమస్య ⇒కొన్నేళ్లుగా నిలిచిపోయిన నియామకాలు.. ⇒కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న అధికారులు... ⇒వందేళ్ల పండుగలోగా సమస్యలు ⇒పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు.. తార్నాక: వందేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిధుల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది. జాతీయస్థాయిలో ర్యాంకుల జాబితాలో చోటు సంపాదించుకుంటున్నప్పటికీ వర్సిటీని నిధుల సమస్య పట్టిపీడిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నియామకాలు నిలిచిపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్ సరిపోక, వర్సిటీ అంతర్గతంగా నిధులను సమకూర్చుకోలేక సతమతమవుతోంది. మరో వైపు ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న వందలాదిమంది ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్సిటీ వందేళ్ల పండుగ సమయంలోనైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలకే సరిపోని ప్రభుత్వ బ్లాక్గ్రాంట్లు... ప్రభుత్వం యూనివర్సిటికీ ఏటా బ్లాక్గ్రాంటుగా ఇచ్చే నిధులు అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకే సరిపోని పరిస్థితి నెలకొంది. చాలీ చాలని బడ్జెట్‌తో వర్సిటీ అంతర్గత ని«ధులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. యేటా ఉద్యోగులు,అధ్యాపకుల వేతనాలు 20శాతం పెరుగుతుండగా, ప్రభుత్వం అందుకు అనుగుణంగా బ్లాక్గ్రాంటును మంజూరు చేయడంలేదు. దీంతో పరీక్షల విభాగం, దూర విద్యా కేంద్రం, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సుల ద్వారా వచ్చే నిధులతో గట్టెక్కిస్తున్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో వర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలకు రూ.458కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.269కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఈ లోటును భర్తీ చేసేందుకు వర్సిటీ నానా తంటాలు పడాల్సి వచ్చింది. తగ్గుతున్న అంతర్గత నిధులు.. ఏటా ఓయూకు అంతర్గతంగా వచ్చే ఆదాయ వనరులు తగ్గుతున్నాయని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా పరీక్షల విభాగం నుంచి వచ్చే ఆదాయంతో పాటు దూర విద్యా కేంద్రం , సెల్ప్‌ఫైనాన్స్ కోర్సులతో ఆదాయం లభించేది. అయితే దూరవిద్యా కేంద్రంలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, వర్సిటీ కొత్తగా ఎలాంటి కోర్సులు, ముఖ్యంగా సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులు ప్రవేశ పెట్టకపోవడం కూడా ఆదాయం తగ్గుదలకు కారణాలుగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతోనే.. ఓయూలో ఐదేళ్ల క్రితం అధ్యాపక నియామకాలు జరిగినా, 25 ఏళ్లుగా బోధనేత సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. దీంతో వర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి నడుస్తోంది. వర్సిటీలో సుమారు 1800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, దాదాపు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతన చట్టం అమలు జరగడం లేదు. వేతనాలు, వైద్య , పీఎఫ్ సదుపాయాలు కూడా కల్పించడం లేదు. దీనికితోడు పర్మినెంట్ ఉద్యోగులకు సైతం హెల్త్‌కార్డులు లేని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోగా, ఉన్న వాటిలో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పురాతన భవనాలే కావడంతో ఎప్పుడు కూలుతాయోఅనే భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. వందేళ్ల పండుగకైనా..వెలుగు వచ్చేనా? శతాబ్ది ఉత్సవాల కానుకగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను పర్మినెంట్‌చేయాలని, పీఎఫ్ సదుపాయం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటిని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇచ్చినా తమను పర్మినెంట్ చేస్తారా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు ఆర్థిక అంశాలతో ముడివడి ఉన్నందున, వర్సిటీకి నిధుల కేటాయింపుతోనే వీటికి పరిష్కారం లభిస్తుందని పలువురు సీనియర్ అధ్యాపకులు పేర్కొంటున్నారు. అయితే శతాబ్ది ఉత్సవాల్లోగా తమ సమస్యలు తీరుతాయనే నమ్మకం కనిపించడం లేదని ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వర్సిటీకి అధిక నిధులు తేవడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. -
ఎమ్ఎఫ్ హుస్సేన్‌కు గూగుల్ పట్టం
న్యూఢిల్లీ: భారతీయ పికాసో, అరుదైన చిత్రకారుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అరుదైన చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ శతజయంతి ఇవ్వాళ.. సెలబ్రిటీ స్టేటస్ అరుదైన తొలి చిత్రకారుడుగా ఎంత పేరు సాధించాడో.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచాడు. స్వయంగా దేశ బహిష్కార శిక్ష విధించుకున్నా.. తుదకంటా.. భారతీయుడిగా ఉంటాననే మాటకు కట్టుబడ్డాడు..ఆయన శత జయంతికి గూగుల్ ఘనంగా నివాళులర్పించింది. భారతీయ లెజెండరీ చిత్రకాడు ఎమ్మ్ ఎఫ్ హుస్సేన్ మహరాష్ట్రలోని పండర్ పూర్ లో సెప్టెంబర్ 17న జన్మించారు. హుస్సేన్ తల్లి అతడు రెండేళ్ల బిడ్డగా ఉన్నప్పుడే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఇండోర్ వెళ్లిపోయాడు. 1935లో హుస్సేన్ ముంబై సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. మొదట్లో సినిమా హోర్డింగ్ లు, పెయింటింగ్ చేసేవాడు. తర్వాత అంచలంచలుగా ఎదిగి.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచాడు. భారత దేశపు ప్రసిద్ద చిత్రకారుల సరసన చేరాడు. ఆయన వేసిన చిత్రాలకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 1973 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ అవార్డుతో సత్కరించింది. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. హైదరాబాద్ తో అనుబంధం ఎమ్ ఎఫ్ హుస్సేన్ కి హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా పోస్టర్లు చిత్రించే రోజుల్లో ఆయన హైదరాబాద్ లోనే ఉండేవారు. తర్వాత కాలంలో కూడా తరచూ హైదరాబాద్ సందర్శించే వారు. ఆయన పేరిట ఇప్పటికీ నగరంలో సినిమా ఘర్ ఉంది. ఆయన చేతి నుంచి జాలువారిన సినిమా పోస్టర్లు, ఆయన ఉపయోగించిన వస్తువులు ఈ ఇంట్లో భద్రపరిచారు. అరుదైన ఘనతలు భారత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న కళాకారుడిగా.. ఎమ్ ఎఫ్ హుస్సేన్ ఖ్యాతి గాంచాడు. అతని కుంచె నుంచి జాలువారిన ఎన్నో కళాఖండాలు కోట్ల రూపాయల ధర పలికాయి. ఆయన చిత్రాల్లో న్యూడ్ గ్నీన్ లీవ్స్ అండ్ బస్ట్ 106 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ 475 కోట్లు. ఇప్పటికీ ఇది ఒక రికార్డు. సినిమాలో... తొలి నాళ్లలో సినిమా పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్.. తర్వాత సినిమా రంగాన్ని వదిలేశారు. అయితే చిత్రకారుడిగా ప్రసిద్ది గాంచిన తర్వాత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, టబులతో సినిమాలు నిర్మించారు. మాధురీ దీక్షిత్ తో చేసిన గజగామిని, టబుతో నిర్మించిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వివాదాలు.. అరుదైన చిత్రకారుడుగా.. సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ జీవితంలో వివాదాలు కూడా చాలా నే ఉన్నాయి. 1990 ప్రాంతంలో ఆయనపై వివాదాల తుఫాన్ రేగింది. హిందూ దేవతా చిత్రాలను అర్థ నగ్నంగా, అసభ్యంగా చిత్రించాడని ఆభియోగాలు నమోదయ్యాయి. 1998లో భజరంగ్ దళ్ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఒక వర్గం మనోభావాలు గాయపడ్డాయన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆస్తులను జప్తు చేసి.. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో హుస్సేన్ తనకు తాను దేశ బహిష్కరణ శిక్ష విధించుకున్నాడు. ఖతార్ దేశం హుస్సేన్ కు పౌర సత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఖతార్ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన హుస్సేన్ తాను ఎప్పటికీ భారతీయుడినే అని..తన జన్మభూమి భారత్ అని ప్రకటించాడు. చివరికి 2011 జూన్ 9న లండన్ లో గుండెపోటుతో పరాయిగడ్డపై తుది స్వాస విడిచాడు. -
‘అయ్యగారి’ ఆకాంక్ష
ఇది డాక్టర్ ఎ.ఎస్.రావు (అయ్యగారి సాంబశివరావు) శతజయంతి సంవ త్సరం. ప్రతిష్టాత్మక ఈసీఐఎల్ రూపకర్త రావుగారే. దేశీయ ఎలక్ట్రానిక్ రంగ మనే కలను సాకారం చేసిన ప్రతిభాశీలి. భారతదేశ ఎలక్ట్రానిక్ రంగం పురోగ మించడానికి అవిశ్రాంతంగా శ్రమించిన కార్యశీలి. హైదరాబాద్ ఆధునికతకు కార కులు ముగ్గురని చెబుతారు. బి.హెచ్.ఇ.ఎల్. స్థాపనకి డా॥కె.ఎల్.రావు; రక్షణ రంగానికి చెందిన డి.ఆర్.డి.ఎల్. వంటి సంస్థలు అందడానికి సూరి భగవంతం, ఇ.సి.ఐ.ఎల్., ఎన్.ఎఫ్.సి. సంస్థలు మనకే దక్కడానికి కారణం ఏఎస్రావుగారు. అయితే తన పేరు కాకుండా హోమి జె బాబాకి ఆ ఘనతను ఆపాదించిన నిగర్వి రావు. హోమీ బాబా తలలో నాలుకలా వ్యవహరించి, మహారాష్ట్ర, తమిళనాడు నాయకుల ఒత్తిడులని అధిగమించి, అన్ని విధాలా హైదరాబాద్ మౌలాలి ప్రాంతం అనుకూలమన్న నివేదికలను రావు రూపొందింపజేశారు. విద్యుత్ ఉత్పాదనపై రావుగారికి స్పష్టమైన అవగాహన ఉంది. ఆ రంగంలో నిష్ణాతుడు నార్ల తాతారావుతో ఆత్మీయత దాని ఫలితమే. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని రావు అప్పుడే ఊహించారు. అణు విద్యుత్ తయారీపై అపోహలను తొలగించి నాణ్యమైన విద్యుత్‌ని అందించాలని చెప్పారు. ఎలాంటి పరిమితులు లేని సౌరశక్తిని ఇందుకోసం వాడొచ్చని సూచించారు. భారత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితితో బాటు పలు అంతర్జాతీయ వేదికలపై మన అణుశాస్త్ర పరిజ్ఞానపు విజ్ఞాన ఖనిలా నిలిచారు. దేశ, విదేశాల పత్రికల్లో వెలువడిన వారి వ్యాసాలు ఇప్పటికీ అణుశాస్త్ర విద్యార్థులకి మార్గదర్శనం చేస్తున్నాయి. నలుపు, తెలుపు టీవీల తయారీ ఈసీఐఎల్‌లో చేపట్టి ఆవైపు మన చూపు మరల్చింది రావుగారే. ఏఎస్ రావునగర్‌లో 1994లో ‘ఇండోట్రానిక్స్’ అనే ఎలక్ట్రానిక్స్ శిక్షణ సంస్థ ప్రారంభోత్సవానికి విచ్చేసినపుడు ఎల్రక్టానిక్ రంగంలో చైనా పోటీని తట్టుకు నేందుకు రావుగారు చేసిన సూచనలు మరువలేనివి. యువత, గృహిణులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా చేపడితే మరింత నాణ్యంగా చౌకగా అందించవచ్చునని చెప్పారు. ఏఎస్ రావు మానవతా దృష్టికి ఇదో మచ్చుతునక. ఈసీఐఎల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఒక నియామకం మీద రావుగారి నిర్ణయాన్ని కోరారు. ఆ ఉద్యో గార్థికి గుండె వ్యాధి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిజానికి ఇలాంటి అభ్యర్థిని తిరస్కరిస్తారు. అయితే అతడిని ఉద్యోగంలోకి తీసుకొమ్మని రావు గారు ఆదేశించారు. అదేమంటే, ఇలాగైనా ఆపదలో ఉన్న వ్యక్తికి మనం సాయ పడిన వారమవుతామని చెప్పారు. నిరాడంబరతకు చిరునామాగా నిలిచే రావుగారు పదవీ విరమణ చేశాక నాచారంలో ఉండేవారు. సందర్శకులను అనుమతించేవారు కాదు. దయచేసి సందర్శకులు రావద్దని బోర్డు పెట్టుకున్నారు. ఉద్యోగ విరమణ తరువాత తానేమీ సహాయం చెయ్యలేని స్థితి కనుకనే ఎవరినీ నిరాశ పరచడం ఇష్టం లేక బోర్డు పెట్టానని అన్నారు. ఎప్పుడూ మూసి ఉండే ఆ ఇంటి గేట్లు మిత్రు లెవరైనా ఫోన్ చేస్తే మాత్రమే తెరుచుకునేవి. చేతి సంచితో ఎప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించేవారు రావుగారు. ఒకసారి కండక్టర్‌తో ఎ.ఎస్. రావునగర్కి టికెట్ కావాలన్నారు. వారే ఎ.ఎస్. రావుగారని తెలిసిన కండక్టర్ ఆయన నిరాడంబరతని అందరికీ చాటాడు. పదవీ విరమణ తరువాత రావుగారు కుమార్తె పెళ్లి ఖర్చులకై నాచారం ఇంటిలో సగభాగం అమ్మేశారు. రావుగారు 2003లో పరమపదించారు. వారి పేరుపై అవార్డులను అంతకు ముందు నుంచే ప్రారంభించి కొనసాగిస్తున్నారు. సుమారు 120 ఎకరాల్లో రూపుదిద్దుకొన్న డాక్టర్ ఎ.ఎస్.రావు నగర్ మౌలాలి ప్రాంతానికి తలమానికం. ఇక్కడ నుంచి వెళ్లి స్థిరపడినవారి పిల్లలు విదేశాల్లో తమ అపార్ట్‌మెంటుల్లో ఎ.ఎస్.రావునగర్ పేరు పెట్టుకుంటూ విశ్వవ్యాప్తం చేస్తు న్నారు. న్యూజెర్సీలో ఒక వీధికి వీరి పేరు పెట్టారు. పద్మశ్రీ, పద్మభూషణ్, భట్నాగర్ పురస్కారం, నాయుడమ్మ బంగారు పతకం, కళాప్రపూర్ణ... ఎన్నెన్నో గౌరవాలు వరించినా చివరివరకు రావుగారిలో అదే వినమ్రత. అదే నిరాడం బరత. అందుకే ఎప్పటికీ రావు ఒక స్ఫూర్తి ప్రదాత. (ఎ.ఎస్.రావు శతజయంతి సందర్భంగా స్మారక తపాలా బిళ్ల విడుదల నేడు) పేరిచర్ల రాజగోపాలరాజు మౌలాలి, హైదరాబాద్ డాక్టర్ ఎ.ఎస్.రావు 1914-2003