తెలుగు జాతి సాంస్కృతిక పునరుజ్జీవనానికి అతి పిన్న వయసులో విశిష్టమైన కృషి చేసిన తొలి కళా తపస్వి దామెర్ల రామారావు. బాల్యం నుంచే చిత్రకళ పట్ల నెలకొన్న గాఢమైన అభినివేశం ఆయన్ని అవిశ్రాంత కళా పిపాసిగా చేసింది. 1897, మార్చి 8న జన్మించిన రామారావు రెండు పదుల వయసు నిండకుండానే ముంబైలోని ‘జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్’లో చేరి చిత్రకళలో నైపుణ్యం సంపాదించారు. రాజమండ్రి కళాశాలకు ప్రిన్సిపాల్‌గా చేసిన ఆంగ్ల రచయిత ఆస్వాల్డ్ కూల్డ్రేకు రామారావు అంటే ఎంతో అభిమానం. అందుకే తాను రాసిన ‘సౌత్ ఇండియన్ అవర్’ అనే గ్రంథాన్ని తెలుగులో గొప్ప రచయితలైన కవికొండల వెంకటరావు, అడివి బాపిరాజులతో బాటుగా దామెర్ల రామారావు గారికి కూడా అంకిత మిచ్చారు.
ప్రఖ్యాత కవి పండితులు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి దామెర్లవారి గురించి ఇలా అన్నారు: ‘జీవముల వోసి, బొమ్మల జేసెనొకడు/బొమ్మలు గీసి జీవమును వోసేనొకడు/ రాముడాతడు, దామెర్ల రాము డితడు/ లేవు కాలావధులు చిత్ర లీలలందు.’ రవీంద్రనాథ్ టాగోర్‌ను కలిసిన పది నిమిషాల్లో విశ్వకవి చిత్రపటాన్ని గీసిచ్చారు. రామారావు ప్రతిభకు ఆశ్చర్యపోయిన టాగోర్ ‘ప్రపంచంలోకెల్లా గొప్ప చిత్రకరుడివి కాగలవు’ అని దీవించారట.
అప్పటి వైస్రాయ్ లార్డ్ రీడింగ్ రామారావు ‘తూర్పు కనుమల్లో గోదావరి’ చిత్రాన్ని చూసి ముగ్ధుడై అప్పటికప్పుడు ఆ చిత్రం కొనేయడమే కాక, ‘స్వదేశీ ఉద్యమం జరుగుతున్న సమయంలో నేను స్వదేశీ చిత్రాన్ని కొంటు న్నాను చూడండి’ అని చమత్కరించారట. అశ్లీలతకు తావులేకుండా భారతీయ మహిళని తొలిసారిగా నగ్నంగా చిత్రించిన రామారావు నవ్యాంధ్ర చిత్రకళా స్థాపకులు. 1922లో రాజమండ్రిలో ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్’ పేరిట చిత్రకళాశాలను స్థాపించారు. అప్పుడే ‘సత్యవాణి’ అనే చిత్రకారిణిని వివాహం చేసుకున్నారు. రామారావు చిత్రాలకు ఆయన భార్య సత్యవాణిగారే ‘మోడల్’గా ఉండేవారు.
స్వదేశంలోనే కాక పారిస్, లండన్, టోరంటో వంటి అంతర్జాతీయ ప్రదర్శనల్లో కూడా రామారావు చిత్రాలు ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు పొందాయ్. ఇంతటి ప్రతిభావంతుడు 28 ఏళ్ళ అతి చిన్న వయసులోనే గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ మశూచి వ్యాధికి గురై 1925, ఫిబ్రవరి 6న అకాల మరణం చెందారు. రామారావు చిత్రించిన ‘సిద్ధార్థ రాగోదయం’, ‘పుష్పాలంకరణ’, ‘నంది పూజ’, ‘గోపికాకృష్ణ’, ‘బావి వద్ద’, ‘అజంత’, ‘ఎల్లోరా’, ‘పట్టిసీమ’, ‘మెయిడ్స్ ఆఫ్ కథియావాడ్’... వంటి అత్యద్భుత కళాఖండాల్ని ఎన్నింటి గురించి చెప్పుకున్నా తక్కువే. రామారావు స్మృతిలో రాజమండ్రిలో చిత్రకళా మందిరాన్ని, శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 1925 లోనే ఆ రెంటినీ సందర్శించిన మహాత్మా గాంధీజీ ఆ చిత్రాలని చూసి ముగ్ధులయ్యారు. ప్రస్తుతం రాజమండ్రిలోని గోదావరి స్టేషన్ వద్ద ఉన్న ‘దామెర్ల రామారావు మెమోరియల్ ఆర్ట్ గ్యాలరీలో ఎన్నో కళాఖండాలు ఉన్నాయి. అవన్నీ తెలుగువారు సంరక్షించు కోవలసిన విశేషమైన కళా సంపదలే.
– గౌరవ్ ‘ సాంస్కృతిక కార్యకర్త
(నేడు దామెర్ల రామారావు శతవర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment