Legendary
-
భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్ కన్నుమూత (ఫొటోలు)
-
దేశానికి అత్యున్నత నేతలను అందించిన ఢిల్లీ
దేశ రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి చేరిన పలువురు నేతలు ఢిల్లీ తమకు రన్ వే అని నిరూపించారు. ఇక్కడి నుంచి గెలిచిన పలువురు నేతలు రాజకీయాల్లో తారాస్థాయికి చేరుకున్నారు. ఢిల్లీలో విజయం సాధించాక తొలిసారిగా లోక్‌సభకు ముగ్గురు నేతలు చేరారు. వీరిని కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవులు వరించాయి. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి, దేశ రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారిలో సుచేతా కృపలానీ పేరు మొదటిగా వినిపిస్తుంది. ఆమె 1952లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. తరువాత ఆమె 1960లో ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికై నాటి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టారు. మూడేళ్ల తరువాత 1963లో ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలో ఇంతటి అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా సుచేతా కృపలానీ నిలిచారు.బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ కూడా తొలిసారిగా 1989లో ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. ఆ తర్వాత దేశానికి ఉప ప్రధానిగా కూడా నియమితులయ్యారు. 1991లో న్యూ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటుడు రాజేష్ ఖన్నాను ఓడించారు. ఈ క్రమంలోనే 1977లో లాల్ కృష్ణ అద్వానీ కేంద్ర మంత్రి కూడా అయ్యారు.బీజేపీ దిగ్గజ నేత, ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్ కూడా ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా లోక్‌సభకు చేరుకున్నారు. 1996లో రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, ఆమె దక్షిణ ఢిల్లీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల తర్వాత ఆమె 13 రోజుల అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. దీని తరువాత ఆమె 1998లో దక్షిణ ఢిల్లీ నుంచి మరోమారు గెలిచారు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఈ సమయంలో సాహిబ్ సింగ్ స్థానంలో బీజేపీ ఆమెను ఢిల్లీ ముఖ్యమంత్రిని చేసింది. 2009-2014 మధ్యకాలంలో ఆమె లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలిగా కూడా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. -
లెజెండరీ బ్రాండ్‌గా జీఆర్టీ
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వరుసగా ఎనిమిదవసారి ప్రతిష్టాత్మక ‘లెజెండరీ బ్రాండ్’ అవార్డును దక్కించుకున్నట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన పేర్కొంది. వినియోగదారులు సంస్థ పట్ల చూపెడుతున్న విశ్వాసమే తమకు ఈ అవార్డును తెచ్చిపెట్టిందని ప్రకటన వివరించింది. జీఎస్టీ తమిళనాడులో వరుసగా ఎనిమిదవసారి, కర్ణాటకసహా తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 4వ సారి టైమ్స్ ఆఫ్ ఇండియా-బిజినెస్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించినట్లు పేర్కొంది. ఐదు దశాబ్దాలపాటు వినియోగదారులకు విశ్వసనీయ, అత్యుత్తమ సేవలు అందించడం సంస్థ పురోగతికి దోహదపడుతున్న అంశమని జీఆర్టీ జ్యువెలర్స్ ఎండీ అనంత పద్మనాభన్ పేర్కొన్నారు. తాము సరైన మార్గంలో పయనిస్తున్నామన్న అంశాన్ని ‘వరుస లెజెండరీ అవార్డు’ నిరూపిస్తోందని మరో ఎండీ జీఆర్ రాధాకృష్ణన్ అన్నారు. -
Jean Luc Godard: సినీ నవ్య పథగామికి సెలవ్!
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’ – నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్ది నవ్య పంథాయే! 1930 డిసెంబర్లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్‌లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్‌గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్‌లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్‌లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు. దర్శకుడిగా గొడార్డ్లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం. నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్ఫట్మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది. రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్‌లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి. సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్‌నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్‌సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం) బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు) – రెంటాల జయదేవ -
కోకిల వెళ్లిపోయింది!
వసంతంలో కోకిల గొంతు సవరించుకుంటుంది. పంచమ శ్రుతిలో తన స్వరమాధుర్యాన్ని జనాలకు అయాచితంగానే పంచిపెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ, వసంత పంచమితో పాటూ ఆ గాన కోకిల వెళ్ళిపోయింది. ఎంత చేటుకాలం ఇది! ఎంత పాడుకాలం ఇది! మాయదారి మహమ్మారి ఇప్పటికే ఎందరెందరినో గద్దలా తన్నుకుపోయింది. మనసులకు మారాకులు వెయ్యనివ్వని ఆశ రాలుకాలం ఇది. కోకిలను పోగొట్టుకున్న అశేష సంగీతాభిమానులకు అకాల బాష్పవర్షాకాలం ఇది. ‘కరోనా‘ కరాళకాలం మొన్నటికి మొన్న మన గానగంధర్వుడిని గల్లంతు చేసింది. అభిమానులు ఆ విషాదం నుంచి తేరుకుంటూ ఉన్నారనేలోగానే, మిగిలి ఉన్న గాన కోకిలనూ ఇప్పుడు తీసుకుపోయింది. వసంత పంచమి మరునాటి ఉదయమే అస్తమించిన గానకోకిల లతామంగేష్కర్ భారతీయ సినీసంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వారిలో ఆమె స్వరఝరిలో తడిసి తరించనివారంటూ ఎవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. స్వభావోక్తి మాత్రమే! ఆమె స్వరప్రస్థానం భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటే సాగింది. ఇన్నేళ్లలోనూ స్వాతంత్య్ర భారతం ఎన్నో ఎగుడుదిగుళ్లను చవిచూసింది గాని, లతా గాత్రం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. వన్నెతరగని ఆమె స్వరమాధుర్యం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కొన్నితరాల శ్రోతలను సేదదీర్చింది, ఊరడించింది, ఉర్రూతలూపి ఓలలాడించింది. లతా పాట ఎల్లలులేని పిల్లతెమ్మెర. ఆమె అభిమానుల్లో దేశాధినేతలు మొదలుకొని అమిత సామాన్యుల వరకు కోట్లమంది ఉన్నారు. లతా పాట గలగలల సెలయేరు. ఆమె అభిమానుల్లో ఉద్దండ పండితులూ ఉన్నారు, పరమ పామరులూ ఉన్నారు. లతా పాట జోలలూపే ఉయ్యాల. ఆమె అభిమానుల్లో పసిపిల్లలూ ఉన్నారు, పండు ముదు సళ్లూ ఉన్నారు. లతా పాట ఒక అమృత« దార. అక్షరాలా ఆబాలగోపాలాన్నీ అలరించిన అద్భుత గానమాధుర్యం ఆమెది. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్ ఒక హిమవత్ శిఖరం. సినీ సంగీత రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక గాయనీగాయకులకు ఆమె ఒక అత్యున్నత ప్రమాణం. ఆమెతో గొంతు కలిపితే చాలు, తమ జన్మ చరితార్థమైనట్లే అనుకునే యువ గాయకులు ఎందరో! ఆమె స్థాయిలో పదోవంతును అందుకోగలిగినా చాలు, తమ కెరీర్‌కు తిరుగుండదని భావించే కొత్తతరం గాయనీమణులు ఎందరో! ఆమె పాటలకు స్వరకల్పన చేసే అవకాశం దొరకడమంటే నవ తరం సంగీత దర్శకులకు అదొక హోదాచిహ్నం! ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరు కోవడం అంత ఆషామాషీ పని కాదు. ఒకసారి చేరుకున్నాక, కడవరకు ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరెంతటి కఠోరదీక్షతో సాధించిన ఘనత అయి ఉండాలి! ఆ ఘనత కారణంగానే దేశంలోని అత్యున్నత సత్కారమైన ‘భారతరత్న’ సహా అసంఖ్యాకమైన అవార్డులు, బిరుదులు, రాజ్యసభ సభ్యత్వం వంటి గౌరవ పదవులు ఆమెను కోరి మరీ వరించాయి. రాజ్యసభలో కొన సాగిన ఆరేళ్లూ రూపాయి వేతనమైనా తీసుకోకుండా సేవలందించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది. పదమూడేళ్ల పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి, ఎవరూ అందుకోలేనంత స్థానానికి చేరుకోవడం దాదాపు ఊహాతీతం. సినిమాను తలపించే లతా జీవితంలో ఇది వాస్తవం. తొలినాళ్లలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూనే, సంగీత సాధన కొనసాగించేది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించే తొలినాళ్లలో ‘పీల గొంతు’ అనే పెదవి విరుపులతో తిరస్కారాలనూ ఎదుర్కొంది. తిరస్కారాలకు చిన్నబుచ్చుకుని అక్కడితోనే ఆగిపోయి ఉంటే, ఆమె లతా అయ్యేదే కాదు. పట్టువదలని దీక్షతో ముందుకు సాగడం వల్లనే ఆమె రుతువులకు అతీతమైన ‘గానకోకిల’ కాగలిగింది. మాతృభాష మరాఠీ, హిందీ పాటలకే పరిమితమై ఉంటే, లతా మంగేష్కర్‌కు ఇంతటి ప్రఖ్యాతి దక్కేది కాదు. ఆమె మన తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడింది. అందుకే, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో సినిమా పాటలు పాడిన గాయనిగా 1974లోనే గిన్నిస్ రికార్డు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. అప్పటికే ఆమె వివిధ భాషల్లో పాతికవేల పైగా పాటలు పాడింది. శతాధిక సంగీత దర్శకుల స్వరకల్పనలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. నాలుగు తరాల గాయకులతో గొంతు కలిపింది. ఐదు చిత్రాలకు సంగీతం అందించడమే కాక, 4 చిత్రాలను నిర్మించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె అందుకోని విజయాల్లేవు. ఆమె గొంతు పలకని భావోద్వేగాలు లేవు. ఆమె గాత్రంలో ఒదగని సంగతులు లేవు. భారతదేశంలో లతా భాషాతీతంగా ప్రతి ఇంటి అభిమాన గాయని. అందుకే, ఆమె మరణవార్త యావత్ దేశాన్ని్న విషాదసాగరంలో ముంచేసింది. ఆమె మరణవార్త వెలువడిన మరునిమిషం నుంచే సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల ప్రవాహం మొదలైంది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ అభిమానులు ఆమె పాటల వీడియోలతో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్య మాలు హోరెత్తిపోవడం మొదలైంది. లతానే ప్రేరణగా తీసుకుని, ఆమె స్ఫూర్తితోనే సినీసంగీత రంగంలోకి అడుగుపెట్టిన సంగీత కళాకారులంతా ఆమె మరణవార్తకు కన్నీరు మున్నీరయిన దృశ్యా లను టీవీల్లో చూసిన అభిమానులూ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీయ సినీ సంగీతరంగంలో ఎందరో గాయనీమణులు ఉన్నా, లతా మంగేష్కర్ది ఒక అత్యున్నత ప్రత్యేకస్థానం. ఇప్పుడది ఖాళీ అయిపోయింది. దానినెవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు! -
భారత ఫుట్‌బాల్ దిగ్గజం పీకే బెనర్జీ అస్తమయం
ప్రదీప్ కుమార్ బెనర్జీ అన్నా... పీకే బెనర్జీ అన్నా... నేటితరంలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ భారత ఫుట్‌బాల్‌కు బాగా తెలుసు. ఎందుకంటే ఆటగాడిగా, కెప్టెన్‌గా, చివరకు కోచ్‌గా ఆయన ఫుట్‌బాల్ క్రీడకు ఐదు దశాబ్దాలకు పైగా విశేష సేవలందించారు. అందుకే కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ మొదలైందే తడవుగా ఈ అవార్డు పొందిన తొలి భారత ఫుట్‌బాలర్‌గా పీకే బెనర్జీ ఘనత వహించారు. ఇంతటి చరిత్ర ఉన్న అలనాటి దిగ్గజానికి భారత సాకర్ సెల్యూట్ చేస్తోంది. న్యూఢిల్లీ: ‘కోల్‌కతా మైదాన్’కు కళ్లు ఉంటే కన్నీరుమున్నీరయ్యేది. తన మట్టిపై ఆటలాడిన అడుగులు ఎంతో ఎత్తుకు ఎదిగి... దిగ్గజంగా అస్తమయం అయితే కారేది కన్నీరేగా! శుక్రవారం అదే జరిగింది. భారత ఫుట్‌బాల్ దిగ్గజం ప్రదీప్ కుమార్ (పీకే) బెనర్జీ కన్నుమూశారు. కొంతకాలంగా న్యూమోనియా, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న 83 ఏళ్ల బెనర్జీ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. 83 ఏళ్ల తన జీవిత కాలంలో 51 ఏళ్లు ఆటకే అంకితమిచ్చారు. తన కెరీర్లో భారత్ తరఫున ఫ్రెండ్లీ తదితర మ్యాచ్‌లు కలుపుకొని ఓవరాల్‌గా 84 మ్యాచ్‌లాడిన ఈ స్ట్రయికర్ 65 గోల్స్ చేశారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 19 గోల్స్ సాధించాడు. సాకర్ క్రేజీ బెంగాల్లో ఆయన ఓ ఫుట్‌బాలర్ మాత్రమే కాదు ‘అంతకుమించి’! సమున్నతమైన వ్యక్తిత్వం మూర్తీభవించిన ఆయనంటే బెంగాలీ వాసులకు ఎనలేని గౌరవం. అందుకే ‘పీకే బెనర్జీ’, ‘ప్రదీప్ దా’గా చిరపరిచితుడైన అలనాటి ఈ దిగ్గజాన్ని ఎంతగానో ఆరాధిస్తారు. స్ట్రయికర్‌గా... సారథిగా... కోచ్‌గా... ఐదు దశాబ్దాలు ఫుట్‌బాల్ కోసమే పరితపించిన ‘బెనర్జీ సాబ్’ లేరనే వార్త బెంగాల్‌నే కాదు... భారత క్రీడాలోకాన్నే శోకసంద్రంలో ముంచింది. భారత ఫుట్‌బాల్‌లో మొనగాడు... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మొయినగురిలో 1936, జూన్ 23న జన్మించిన బెనర్జీ ఏడుగురి సంతానంలో ఒకరు. ఆయన తండ్రి ప్రొవత్ బెనర్జీ చిరుద్యోగి. 1941లో బెనర్జీ కుటుంబం తండ్రి ఉద్యోగరీత్యా జల్పయ్గురికి వెళ్లింది. అనంతరం కోల్‌కతాకు చేరాక... అక్కడి కోల్‌కతా మైదాన్‌లో సరదాగా ఫుట్‌బాల్ ఆడే క్రమంలో ఓనమాలు నేర్చుకున్నారు. తర్వాత 1951లో తొలిసారి సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ ఆడిన పీకే బెనర్జీ తదనంతర కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికై కీలక ఆటగాడిగా ఎదిగారు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో ఆయన సభ్యుడిగా ఉన్న భారత్ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. మరో ఒలింపిక్స్ వచ్చేసరికి రోమ్ (1960) ఈవెంట్లో బెనర్జీ భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఆ విశ్వ క్రీడల్లో పటిష్టమైన ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించడంలో ఆయన గోల్ దోహదం చేసింది. అలాగే వరుసగా మూడు ఆసియా క్రీడల్లో (1958–టోక్యో, 1962–జకార్తా, 1966–బ్యాంకాక్) ఈ స్ట్రయికర్ రాణించారు. 1962 ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం గెలుపొందడంలో బెనర్జీ కీలకపాత్ర పోషించారు. ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణం నెగ్గడం అదే చివరిసారి. క్రీడాకారుడిగా రిటైర య్యాక 1970 నుంచి 1985 వరకు భారత జట్టుకు కోచ్‌గా సేవలందించారు. పీకే కోచింగ్‌లో భారత్ 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గింది. ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టు పతకం సాధించడం అదే చివరిసారి. భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్నాక ఆయన 2003 వరకు మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్, మొహమ్మడన్ స్పోర్టింగ్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్నారు. ‘అర్జున’ విజయం ఆయనతోనే... జాతికి కీర్తిప్రతిష్టలు తెచ్చిన క్రీడాకారుల్ని అవార్డుల తో గుర్తించాలని అప్పటి భారత ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 1961లో ‘అర్జున’ అవార్డులు మొదలయ్యాయి. ఫుట్‌బాల్ క్రీడాంశంలో తొలి అర్జున పొందింది ‘ప్రదీప్ దా’నే! మళ్లీ 1990లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో ఆయనను గౌరవించింది. ఆయన ఆట, శైలీ చూసేందుకు అప్పుడు మనం లేము. ఇప్పుడు చూసేందుకు ఆ కాలంలో వీడియో కవరేజీలు లేవు. ఏమున్నా బ్లాట్ అండ్ వైట్ ఫొటోలే! అందుకే ‘కంటెంట్’ ఉన్నా... కటౌట్‌కు ఎక్కలేకపోయారు. ఈయన సేవల్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా గుర్తించింది. క్రీడాలోకం అశ్రునివాళి... బెనర్జీ సేవల్ని కొనియాడిన భారత క్రీడారంగం ఆయన లేని లోటు పూడ్చలేనిదని నివాళులర్పించింది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ తదితరులు సంతాపం వెలిబుచ్చారు. -
కపిల్ ‘లెజెండరీ ఇన్నింగ్స్’ను మళ్లీ చూడొచ్చు!!
ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్‌ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్‌ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్‌ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్. భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్‌గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా నటిస్తున్న రణ్వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు. -
కళాతపస్వికి జీవిత సాఫల్య పురస్కారం
వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత విష్ణు బొప్పన మూడేళ్లుగా బుల్లితెర అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారి వెండితెర అవార్డులు అందించారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ఈ వేడుక జరిగింది. సీనియర్ దర్శకులు ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ అవార్డు తనకెంతో సంతృప్తి ఇచ్చిందని విశ్వనాథ్ అన్నారు. సీనియర్ నటులు కోట శ్రీనివాసరావుకు లెజెండ్రీ అవార్డును, మరో సీనియర్ నటుడు గిరిబాబుకు ఆల్‌రౌండర్ పురస్కారం అందించారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అవార్డులు ఇచ్చారు. బాల తారల్లో అవార్డు అందుకున్నవారిలో ‘మహానటి’లో చిన్నప్పటి సావిత్రిగా నటించిన రాజేంద్రప్రసాద్ మనవరాలు సాయి తేజస్విని, ‘అప్పూ’ ఫేమ్ డి. సాయి శ్రీవంత్ తదితరులు ఉన్నారు. ఈ వేదికపై పేద కళాకారులకు ఆర్థికసాయం చేశారు. ‘‘ఈ వేడుక విజయవంతం కావడానికి స్పాన్లర్లే కీలకం.. వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు విష్ణు బొప్పన. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఐజీ మాగంటి కాంతారావు, ఐఏఎస్ మాగంటి ఉషారాణి ముఖ్య అతిథులుగా హాజరవగా, నటి జయప్రద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటీనటులు సుమన్, భానుచందర్, సత్యప్రకాష్, ఏడిద శ్రీరామ్, కవిత, ప్రియదర్శి తదితరులు పాల్గొన్నారు.