ముంబై: భారత క్రికెట్ అభిమానుల మదిలో మరుపురాని ఇన్నింగ్స్.. 1983 నాటి ప్రపంచకప్‌లో జింబాంబ్వేపై అప్పటి టీమిండియా సారథి కపిల్‌దేవ్ చేసిన 175 పరుగుల ‘లెజండరీ ఇన్నింగ్స్’.. నిజానికి ఆ ఇన్నింగ్స్‌ను చాలామంది కళ్లారా వీక్షించలేకపోయారు. అప్పట్లో బీబీసీ సమ్మె చేయడంతో ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయలేదు. అంతేకాదు.. ఈ మ్యాచ్‌ను రికార్డు కూడా చేయలేదు. దీంతో తర్వాత కూడా ఆ ‘లెజండరీ ఇన్నింగ్స్’చూసే భాగ్యం భారతీయులకు దక్కలేదు. అయితే, ఆ ఇన్నింగ్స్‌ను వెండితెరపై పునర్ ఆవిష్కరిస్తున్నామని, కపిల్ నాడు చేసిన 175 పరుగుల వీరోచిత బ్యాటింగ్‌ను తమ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించబోతున్నామంటుంది ‘83’ చిత్ర యూనిట్.
భారత్ గెలిచిన తొలి ప్రపంచకప్ నేపథ్యంతో కపిల్ దేవ్ బయోపిక్‌గా కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘83’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 36 ఏళ్ల క్రితం క్రికెట్ చర్రితలో కపిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారని.. 1983 ప్రపంచ కప్‌లో జింబాంబ్వేపై ఆయన ఆడిన ఇన్నింగ్స్ ఓ అద్భుతమని, ఆ మరిచిపోలేని ఘట్టాన్ని తమ సినిమాలో పునర్ ఆవిష్కరిస్తున్నామని ఈ సినిమాలో కపిల్ దేవ్‌గా నటిస్తున్న రణ్‌వీర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి పాత ఫోటోలను ఆయన పోస్ట్ చేశారు. కపిల్ ‘లెజండరీ ఇన్నింగ్స్’ పై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. బీబీసీ టీవీ సిబ్బంది సమ్మె చేయడం వల్ల నాటి కపిల్ లెజండరీ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను బీబీసీ ప్రసారం చేయలేకపోయిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment