ఫ్రెంచ్ సినీ దిగ్గజం గొడార్డ్ (1930 – 2022)
‘‘సంగీతానికి బాబ్ డిలాన్ ఎంతో... సినిమాకు గొడార్డ్ అంత!’’
– నేటి మేటి హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో
అవును... గొడార్డ్ అంతటి సినీ దిగ్గజమే! వెండితెర విప్లవమైన ఫ్రెంచ్ న్యూవేవ్ సినిమా ఉద్యమాన్ని తెచ్చిన ఆరేడుగురు మిత్రబృందంలో అగ్రగామి. సినీ రూపకల్పన సూత్రాలను తిరగరాసిన అనేక చిత్రాలకు తన తొలి సినిమాతోనే బీజం వేసిన పెద్దమనిషి. విమర్శకుడిగా మొదలై దర్శకుడైన సినీ మేధావి. ఈ 91 ఏళ్ళ ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ సినీ దర్శక వరేణ్యుడు విషాదభరిత రీతిలో సెప్టెంబర్ 13న ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆత్మహత్యకు సాయం తీసుకొని అంతిమ ప్రయాణం చేశారు. అవయవాలేవీ పనిచేయనివ్వని అనేక వ్యాధుల పాలైన ఆయనకు స్విట్జర్లాండ్‌లో చట్టబద్ధమైన ఆ రకమైన తుది వీడ్కోలు సాంత్వన చూపింది. అంతేకాదు... ఆ రకమైన ఆత్మహత్య సంగతి అధికారికంగా చెప్పాలనీ ముందే ఆయన మాట తీసు కున్నారు. అలా ఆఖరులోనూ గొడార్డ్‌ది నవ్య పంథాయే!
1930 డిసెంబర్‌లో పుట్టిన గొడార్డ్ 1950లో కొందరితో కలసి ‘గెజెట్ డ్యూసినిమా’ అనే సినిమా పత్రిక స్థాపించి, అనేక వ్యాసాలు రాశారు. 1952 నుంచి ఆ మిత్ర బృందంతో గొంతు కలిపి, న్యూవేవ్ సినిమాకు దన్నుగా విమర్శ వ్యాసాలు వెలువరించారు. మొదట లఘుచిత్రాలు, ఆనక 1959లో తొలి సినిమా తీశారు. దాన్ని ఖండఖండాలుగా కట్ చేయాల్సి వచ్చినప్పుడు, అవసరానికి ఆయన మొదలెట్టినదే ‘జంప్ కట్’ ఎడిటింగ్. ఇవాళ అదే ప్రపంచ సినిమాలో ఓ వ్యవస్థీకృత విధానమైంది.
విమర్శకుడిగా మొదలై దర్శకుడైన ఈ సినీ మేధావి రూటే సెపరేటు. నటీనటులు సహజంగా ప్రవర్తిస్తుంటే, కెమేరా నిరంతరం కదులుతూ పోతుంటే, స్క్రిప్టు అక్కడికక్కడ స్పాట్‌లో మెరుగులు దిద్దుకుంటూ ఉంటే, ఎడిటింగ్‌లో మునుపెరుగని వేగం ఉంటే... అదీ గొడార్డ్ సినిమా. స్టయిలిష్‌గా సాగే తొలి చిత్రం ‘బ్రెత్‌లెస్’తోనే ఇటు విమర్శక లోకాన్నీ, అటు బాక్సాఫీస్ ప్రపంచాన్నీ కళ్ళప్పగించి చూసేలా చేసిన ఘనత ఆయనది. ఆ పైన ‘కంటెప్ట్’ లాంటి గొప్ప చిత్రాలు తీశారు. మలి చిత్రంలో నటించిన డ్యానిష్ మాడల్ అన్నా కరీనాను పెళ్ళాడి, ఆమెతో హిట్ సినిమాలు చేశారు. 1968లో ఫ్రాన్స్‌లో విద్యార్థుల, శ్రామికుల నిరసనకు సంఘీభావంగా నిలబడి కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను రద్దు చేయించారు. ఆ ఏడాదే ఓ మార్క్సిస్ట్ సినీ బృందాన్ని స్థాపించి, సామ్యవాదాన్ని అక్కున చేర్చుకోవడం మరో అధ్యాయం. 1960లలో విరామం లేకుండా వరుసగా సినిమాలు తీసిన గొడార్డ్ 1970లకు వచ్చేసరికి స్విట్జర్లాండ్‌లోని ఓ టీవీ స్టూడియోలో పనిచేస్తూ, కొత్త మీడియమ్ వీడియో వైపు దృష్టి మళ్ళించారు. 1980లలో సినీ రూపకల్పనకు తిరిగొచ్చి, ’94 వరకు అనేక చిత్రాలు తీశారు.
దర్శకుడిగా గొడార్డ్‌లో మూడు దశలు. న్యూవేవ్ గొడార్డ్ (1960–67)గా మొదలైన ఆయన ర్యాడికల్ గొడార్డ్ (1968–72)గా పరిణామం చెంది, 1980ల అనంతరం వీటన్నిటికీ భిన్నమైన దర్శకుడిగా పర్యవసించారు. వస్తువుకూ– శిల్పానికీ, మనసుకూ – మెదడుకూ సమరస మేళవింపు ఆయన సినిమాలు. ఆయన రాజకీయాలు చూపెడతారు. కానీ ప్రబోధాలు చేయరు. సినిమానే శ్వాసించి, జీవించడంతో తెరపై అణువణువునా దర్శనమిస్తారు. ప్రతి సినిమాతో సినీ ప్రేమికుల మతి పోగొడతారు. సినిమాలో కవిత్వాన్నీ, తనదైన తాత్త్వికతనూ నింపేసిన ఆయన, నిర్ణీత పద్ధతిలోనే కథాకథనం సాగాలనే ధోరణినీ మార్చేశారు. స్థల కాలాదులను అటూ ఇటూ కలిపేసిన కథాంశాలతో సినిమాలు తీశారు. ‘కథకు ఆది మధ్యాంతాలు అవసరమే. కానీ, అదే వరుసలో ఉండాల్సిన పని లేద’ని నమ్మారు. దాదాపు 100కు పైగా సినిమాలు తీసినా, ఎప్పటికప్పుడు కొత్తదనం కోసమే పరితపించారు. ఆయన సినిమాల్లో రిలీజ్ కానివి, సగంలో ఆగినవి, నిషేధానికి గురైనవీ అనేకం.
నాలుగేళ్ళ క్రితం 87 ఏళ్ళ వయసులో 2018లోనే గొడార్డ్ తాజా చిత్రం రిలీజైంది. కెరీర్‌లో ఒక దశ తర్వాత ఆలోచనాత్మకత నుంచి అర్థం కాని నైరూప్య నిగూఢత వైపు ఆయన కళాసృష్టి పయనించిందనే విమర్శ లేకపోలేదు. అయితేనేం నేటికీ పాత చలనచిత్ర ఛందోబంధాలను ఛట్‌ఫట్‌మనిపించిన వినిర్మాణ శైలి దర్శకుడంటే ముందు గొడార్డే గుర్తుకొస్తారు. అందుకే, 2011లో గొడార్డ్‌కు గౌరవ ‘ఆస్కార్’ అవార్డిస్తూ ‘సినిమా పట్ల మీ అవ్యాజమైన ప్రేమకు.. నిర్ణీత సూత్రాలపై మీ పోరాటానికి.. నవీన తరహా సినిమాకు మీరు వేసిన బాటకు..’ అంటూ సినీ ప్రపంచం సాహో అంది.
రచయితల్లో జేమ్స్ జాయిస్, రంగస్థల ప్రయోక్తల్లో శామ్యూల్ బెకెట్‌లా సినిమాల్లో గొడార్డ్ కాలాని కన్నా ముందున్న మనిషి. సమకాలికులు అపార్థం చేసుకున్నా, భావి తరాలపై ప్రభావమున్న సృజనశీలి. నవీన మార్గం తొక్కి, ఇతరులు తమ ఆలోచననూ, ఆచరణనూ మార్చుకొనేలా చేసిన ఘనుడు. ఏ రోజు సీన్లు ఆ రోజు సెట్స్‌లో రాస్తూ, చేతిలో పట్టుకొనే చౌకరకం కెమెరాలతో, ఎదురెదురు అపార్ట్‌మెంట్లలో, తెలిసిన బంధుమిత్రులే నటీనటులుగా సినిమా తీస్తూ అద్భుతాలు సృష్టించిన జీనియస్. ఆయన ర్యాడికల్ శైలి ఎందరిలోనే సినీ సృజనకు ఉత్ప్రేరకం. ఆ ప్రభావం అనుపమానం. అది ఎంత గొప్పదంటే... ఆయన సినిమాలు చూస్తూ వచ్చిన హాలీవుడ్ కుర్రకారులో అసంఖ్యాకులు కెమేరా పట్టి, లోబడ్జెట్, స్వతంత్ర చిత్రాలు తీయసాగారు. ఆయన టెక్నిక్‌లే వారి యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీల రూపకల్పనకు తారకమంత్రమయ్యాయి.
సంప్రదాయంపై తిరుగుబాటు చేసి, హాలీవుడ్‌నే ధిక్కరించిన ఓ దర్శకుడిని ఆ హాలీవుడ్డే అలా ఆరాధించడం వింతల్లో కెల్లా వింత. మరెవరికీ దక్కని ఘనత. హాలీవుడ్ దర్శకుడు క్వెంటిన్ టరంటినో పైనా ‘అమితంగా ప్రభావం చూపిన దర్శకుడు’ గొడార్డే! తన గురువు కాని గురువు తీసిన ‘బ్యాండ్ ఆఫ్ అవుట్‌సైడర్స్’ స్ఫూర్తితోనే టరంటినో తన స్వీయ సినీ నిర్మాణ సంస్థకు ‘ఎ బ్యాండ్ ఎపార్ట్’ అని పేరు పెట్టారు. అన్ని వ్యవస్థలనూ ప్రతిఘటించిన గొడార్డ్ తనకు తెలియకుండా తానే ఒక వ్యవస్థ కావడం ఓ విరోధాభాస. ఆయన తన సినిమాల్లో చెప్పిన అంశాలు ముఖ్యమైనవే. కానీ, చెప్పీచెప్పకుండా అంతర్లీనంగా అలా వదిలేసినవి మరీ ముఖ్యమైనవి. ‘ఫోటోగ్రఫీ సత్యం. సినిమా సెకనుకు 24 సార్లు తిరిగే సత్యం. ఎడిట్ చేసిన ప్రతిదీ అసత్యమే’ అనేవారాయన. ఆ సత్యాసత్యాల సంఘర్షణలే ఆయన చిత్రాలు. ఒక్కమాటలో సినిమాను తన సెల్యులాయిడ్ రచనగా మలుచుకున్న అరుదైన దర్శకుడు గొడార్డ్. (క్లిక్ చేయండి: బొమ్మలు చెక్కిన శిల్పం)
బతికుండగానే ఆయనపై ఆయన శైలిలోనే ఒక సినిమా రావడం విశేషం. గొడార్డంటే ఫ్రెంచ్ న్యూవేవ్ అంటాం. కానీ, జాగ్రత్తగా గమనిస్తే 1960ల తర్వాత ప్రపంచం నలుమూలల్లో ప్రతి నవ్యధోరణిలో ఆయన దర్శనమిస్తారు. ఆయన శైలి, సంతకాలు మన బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపిస్తాయి. సినిమా సరిహద్దుల్ని విస్తరించిన గొడార్డ్‌తో ప్రభావితుడైన దర్శకుడు మార్టిన్ స్కొర్సెసే అన్నట్టు ‘‘సినీ రంగంలో అతి గొప్ప ఆధునిక దృశ్యచిత్రకారుడు.’’ చిత్రకళకు ఒక పికాసో. సినిమాకు ఒక గొడార్డ్! రాబోయే తరాలకూ ఆయన, ఆయన సినిమా గుర్తుండిపోయేది అందుకే! (క్లిక్ చేయండి: నడిచే బహు భాషాకోవిదుడు)
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment