
ఒకప్పుడు రెమ్యునరేషన్ల విషయానికి వస్తే.. కేవలం హీరోలకు ఇచ్చే భారీ పారితోషికాలే చర్చకు వచ్చేవి. ఇప్పటికీ రెమ్యునరేషన్స్ తీసుకునే విషయంలో హీరోలదే పై చేయి ఉన్నప్పటికీ... హీరోయిన్లు, దర్శకులు కూడా వారితో పోటీ పడే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఒకవేళ సినిమాలు ఫ్లాప్ అయితే నిర్మాత, పంపిణీదారులు మాత్రమే నష్టపోతుండగా, భారీ పారితోషికాలు అందుకుంటున్న హీరోలు, దర్శకులు మాత్రం సేఫ్‌గానే ఉంటున్నారు.
ఈ నేపధ్యంలో హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్( Remuneration) కు బదులు లాభాల్లో వాటాలు పొందాలనే చర్చ మొదలైంది.తాజాగా గేమ్ ఛేంజర్ ద్వారా భారీ నష్టాల్ని చవిచూసి, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా కొంత ఉపశమనం పొందిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఈ ఆసక్తికర చర్చకు తెర లేపారు. మలయాళ చిత్రం ఎల్2: ఎంపురాన్ (L2: Empuraan)ను తెలుగు రాష్ట్రాలకు తీసుకువస్తున్న దిల్ రాజు(Dil Raju) ఆ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ... మోహన్‌లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ ల సెన్సేషనల్ చిత్రం ఎల్2: ఎంపురాన్ కోసం తమ రెమ్యునరేషన్‌ను మాఫీ చేశారని, బదులుగా లాభాన్ని పంచుకునే మోడల్‌ను ఎంచుకున్నారని ఆయన వెల్లడించారు.
అలాంటి మోడల్ టాలీవుడ్‌లో కూడా పనిచేయగలదా అని అడిగిన ప్రశ్నకు, దిల్ రాజు స్పందిస్తూ, ‘‘రాజమౌళి తన చిత్రాలకు ముందస్తుగా పారితోషికం వసూలు చేయరనీ, తన సినిమాలకు లాభాలను పంచుకునే పద్ధతిని అనుసరిస్తాడనీ వెల్లడించారు. అదే విధంగా కెజిఎఫ్, సలార్‌ల చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇప్పుడు అదే పంధాలో పని చేస్తున్నాడు. ఈ మోడల్ త్వరలో తెలుగు సినిమాలో మరింత పుంజుకుంటుందని, సాధారణమైన విషయంగా మారుతుంది’’ అంటూ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. తాను మొదట గేమ్ ఛేంజర్ సినిమా సందర్భంగా దీన్ని అమలు చేయాలనే ప్రయత్నం చేశానని, అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, శంకర్, రామ్ చరణ్ లు తమ రెమ్యునరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారనీ వివరించారు.
అయితే, ఈ విధానం టాలీవుడ్‌లో ఓ సంప్రదాయంగా మారడంపై పలువురు నిర్మాతలు, సినీ ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘మన పెద్ద స్టార్లు, దర్శకులు భారీ చెల్లింపులు అడ్వాన్స్‌లకు అలవాటు పడ్డారు, లాభాల భాగస్వామ్య వ్యవస్థను అమలు చేయడం సినిమా లావాదేవీలను కష్టతరం చేస్తుంది. సూపర్‌స్టార్‌లు సినిమాకు75–125 కోట్లు వసూలు చేయడం దర్శకులు రూ.25–50 కోట్లు వసూలు చేయడం వల్ల లాభాలను పంచుకోవడం పనికిరావచ్చు, అయితే నష్టాలు వచ్చినట్లయితే డబ్బును పూర్తిగా వదులుకోవాలనే ఆలోచనను అంగీకరించడం అసంభవం’ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి నమూనా ఆయన వరకూ విజయవంతం అయినప్పటికీ, టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకులు, హీరోలు స్థిరమైన చెల్లింపులను కాదనుకుని విజయంలో భాగస్వామ్య వాటాలకు మారడాన్ని స్వీకరిస్తారా? అనేది సందేహాస్పదమే.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment