శతాబ్ది వేళ..నిధుల గోల | OU pursuing funding problem | Sakshi
Sakshi News home page

శతాబ్ది వేళ..నిధుల గోల

Published Wed, Apr 5 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

శతాబ్ది వేళ..నిధుల గోల

శతాబ్ది వేళ..నిధుల గోల

ఓయూను వెంటాడుతున్న నిధుల సమస్య
కొన్నేళ్లుగా నిలిచిపోయిన నియామకాలు..
కాంట్రాక్టు ఉద్యోగులతో నెట్టుకొస్తున్న అధికారులు...
వందేళ్ల పండుగలోగా సమస్యలు
పరిష్కరించాలని కోరుతున్న ఉద్యోగులు..


తార్నాక: వందేళ్లు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నిధుల కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది.  జాతీయస్థాయిలో  ర్యాంకుల జాబితాలో చోటు సంపాదించుకుంటున్నప్పటికీ వర్సిటీని నిధుల సమస్య  పట్టిపీడిస్తోంది. ఎన్నో ఏళ్లుగా నియామకాలు నిలిచిపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. వర్సిటీకి ప్రభుత్వం ఇచ్చే బ్లాక్‌గ్రాంట్‌ సరిపోక, వర్సిటీ అంతర్గతంగా నిధులను సమకూర్చుకోలేక సతమతమవుతోంది. మరో వైపు ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న వందలాదిమంది  ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్సిటీ వందేళ్ల పండుగ సమయంలోనైనా తమ ఆశలు నెరవేరుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వేతనాలకే సరిపోని ప్రభుత్వ బ్లాక్‌గ్రాంట్లు...
ప్రభుత్వం యూనివర్సిటికీ ఏటా  బ్లాక్‌గ్రాంటుగా ఇచ్చే నిధులు అధ్యాపకులు, ఉద్యోగుల వేతనాలకే సరిపోని పరిస్థితి నెలకొంది. చాలీ చాలని బడ్జెట్‌తో వర్సిటీ అంతర్గత ని«ధులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. యేటా ఉద్యోగులు,అధ్యాపకుల వేతనాలు 20శాతం పెరుగుతుండగా, ప్రభుత్వం అందుకు అనుగుణంగా బ్లాక్‌గ్రాంటును మంజూరు చేయడంలేదు. దీంతో పరీక్షల విభాగం, దూర విద్యా కేంద్రం, సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల ద్వారా వచ్చే నిధులతో గట్టెక్కిస్తున్నారు.ఈ  ఆర్థిక సంవత్సరంలో వర్సిటీ ఉద్యోగులు, అధ్యాపకుల వేతనాలకు రూ.458కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేవలం రూ.269కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంతో ఈ లోటును భర్తీ చేసేందుకు వర్సిటీ నానా తంటాలు పడాల్సి వచ్చింది.

తగ్గుతున్న అంతర్గత నిధులు..
ఏటా ఓయూకు అంతర్గతంగా వచ్చే ఆదాయ వనరులు తగ్గుతున్నాయని పలువురు సీనియర్‌ అధ్యాపకులు పేర్కొంటున్నారు. ఏటా పరీక్షల విభాగం నుంచి వచ్చే ఆదాయంతో పాటు దూర విద్యా కేంద్రం , సెల్ప్‌ఫైనాన్స్‌ కోర్సులతో ఆదాయం లభించేది. అయితే దూరవిద్యా కేంద్రంలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా, వర్సిటీ కొత్తగా ఎలాంటి కోర్సులు, ముఖ్యంగా సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సులు ప్రవేశ పెట్టకపోవడం కూడా ఆదాయం తగ్గుదలకు కారణాలుగా అధ్యాపకులు పేర్కొంటున్నారు.

కాంట్రాక్టు ఉద్యోగులతోనే..
ఓయూలో ఐదేళ్ల క్రితం అధ్యాపక నియామకాలు జరిగినా, 25 ఏళ్లుగా బోధనేత సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. దీంతో వర్సిటీ కాంట్రాక్టు ఉద్యోగులపై ఆధారపడి నడుస్తోంది. వర్సిటీలో సుమారు 1800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తుండగా, దాదాపు 700 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. అయితే వీరికి కనీస వేతన చట్టం అమలు జరగడం లేదు. వేతనాలు, వైద్య , పీఎఫ్‌ సదుపాయాలు కూడా కల్పించడం లేదు. దీనికితోడు పర్మినెంట్‌ ఉద్యోగులకు సైతం హెల్త్‌కార్డులు లేని దుస్థితి నెలకొంది. విద్యార్థుల సంఖ్యకు తగినన్ని హాస్టళ్లు లేకపోగా, ఉన్న వాటిలో సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని పురాతన భవనాలే కావడంతో ఎప్పుడు కూలుతాయోఅనే భయంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

వందేళ్ల పండుగకైనా..వెలుగు వచ్చేనా?
 శతాబ్ది ఉత్సవాల కానుకగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.  ఎన్నో ఏళ్లుగా చాలీ చాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న తమను పర్మినెంట్‌చేయాలని, పీఎఫ్‌ సదుపాయం కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వారు కోరుతున్నారు. కాంట్రాక్టు అధ్యాపకులను పర్మినెంట్‌ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటిని నియమించింది. అయితే ఈ కమిటీ నివేదిక ఇచ్చినా తమను పర్మినెంట్‌ చేస్తారా లేదా అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యలు ఆర్థిక అంశాలతో ముడివడి ఉన్నందున,  వర్సిటీకి నిధుల కేటాయింపుతోనే వీటికి పరిష్కారం లభిస్తుందని పలువురు సీనియర్‌ అధ్యాపకులు పేర్కొంటున్నారు. అయితే  శతాబ్ది ఉత్సవాల్లోగా తమ సమస్యలు తీరుతాయనే నమ్మకం కనిపించడం లేదని ఉద్యోగులు, కాంట్రాక్టు అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని వర్సిటీకి అధిక నిధులు తేవడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement