ఓయూలో అలజడి
ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
పోలీసులపై రాళ్ల దాడి.. విద్యార్థుల అరెస్ట్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అలజడి సృష్టించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, ఎంఎస్‌ఎఫ్ (మందకృష్ణ మాదిగ వర్గం) ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయవద్దని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌చేస్తూ గత 15 రోజులుగా నిరాహార దీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ గురువారం వందలాది మంది విద్యార్థులు తార్నాక చౌరస్తాలో ధర్నా చేసేందుకు ర్యాలీ చేపట్టగా, పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో విద్యార్థులకు, పోలీసులకు నడుమ తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలో పోలీసులపైకి విద్యార్థులు రాళ్ళు రువ్వగా, సతీష్ అనే విద్యార్థి తలకు గాయమై రక్తస్రావమైంది. మరింత రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులను తోసివేస్తూ ముందుకొచ్చారు. దీంతో టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌గౌడ్, ఏబీవీపీ నాయకులు కళ్యాణ్, కడియం రాజు, వీరబాబు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మానవతరాయ్, విద్యార్థి జేఏసీ నాయకులు సాంబశివగౌడ్, నరేందర్ సహా తొమ్మిది మందిని అరెస్ట్‌చేసి అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా తార్నాక నుంచి విద్యానగర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది.