రాష్ట్రంలో 1.2 కోట్ల మంది నిరుద్యోగులు
- ఆరేళ్లుగా ఎదురుచూపులే: టీజేఏసీ చైర్మన్ కోదండరాం
- మేం అధికారంలోకి వస్తే భృతి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, యువత గత ఆరేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని వక్తలు పేర్కొన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట తెలంగాణ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ‘మన కొలువుల సాధనకై విద్యార్థి నిరుద్యోగ ధర్మ యుద్ధం’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ వరకు చదివి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు కోటి 20 లక్షల మంది ఉన్నారని పేర్కొన్నారు.
ఇందులో సుమారు 25 లక్షల మంది వరకు సాంకేతిక విద్యను అభ్యసించారన్నారు. దిక్కులేక నిరుద్యోగులు ఉపాధి కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగాన్ని సామాజిక సమస్యగా గుర్తించి ఉద్యోగాల ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేవారు. ఇందుకు మండల స్థాయి నుంచి జేఏసీలుగా ఏర్పడి ప్రజాప్రతినిధులను నిలదీయాలన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడుతూ.. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగం లభించే వరకు ప్రతి నిరుద్యోగికి భృతి కల్పిస్తామన్నారు.