పోలీసుల పహారాలో ఇందిరాపార్క్ పరిసరాలు
- జిల్లాల నుంచి రాజధాని వరకు టీజేఏసీ నేతల అరెస్టులు
- మంగళవారం అర్ధరాత్రి దాటాక కోదండరాం ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
- తలుపులు పగులగొట్టి అరెస్టు.. కామాటిపుర స్టేషన్‌కు తరలింపు... ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీ బందోబస్తు
- ఓయూలో ర్యాలీకి విద్యార్థుల యత్నం.. ఉద్రిక్తత
- జిల్లాల్లోనూ ఎక్కడికక్కడ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ భగ్నమైంది. అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జేఏసీ చైర్మన్ కోదండరాం సహా పలువురు నేతలు, విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. జిల్లాల నుంచి రాజధానికి వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టడి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,220 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది.
ఇటు హైదరాబాద్‌లో ఉస్మానియా వర్సిటీ, నిజాం కాలేజీతోపాటు అనేక ప్రాంతాల్లో వివిధ విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరవ్యాప్తంగా 447 మందిని ముందస్తు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. సాయంత్రం వరకు అక్కడే ఉంచి విడిచిపెట్టారు. నాగోల్‌లో సభ నిర్వహణకు హైకోర్టు అనుమతిచ్చినా.. అందుకు నిరాకరిస్తూ టీజేఏసీ మంగళవారం తన పిటిషన్‌ను వాపస్ తీసుకొని, బుధవారం యథాతథంగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు.
కోదండరాం ఇంటి వద్ద ఉద్రిక్తత
తార్నాకలో టీ–జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇంటిని బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు చుట్టుముట్టారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులతో సహా దాదాపు వంద మంది ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు రావడంతో కిటికీలు తెరిచి కోదండరాం వారితో మాట్లాడారు. బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇంత రాత్రి పూట అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని, ఉదయం 6 గంటలకు వస్తానని కోదండరాం సమాధానం ఇచ్చారు. అయితే కొద్దిసేపటికే కోదండరాం ఇంటి తలుపులు పగులకొట్టిన పోలీసులు లోపలకు ప్రవేశించారు. ఆయనతోపాటు దాదాపు 40 మంది జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీడియాను కోదండరాం ఇంటి నుంచి దూరంగా పంపేశారు. దీంతో కోదండరాం తన అరెస్టు వివరాలను ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వెల్లడించారు. కోదండరాం, జేఏసీ కన్వీనర్ కె.రఘును కామాటిపుర పోలీసుస్టేషన్‌కు, మిగిలిన నాయకుల్లో కొందరిని కంచన్‌బాగ్, అంబర్‌పేట, గోషామహల్ తదితర పోలీసుస్టేషన్లకు పోలీసులు తరలించారు. సాయంత్రం 7.10 గంటల సమయంలో కోదండరాంను విడుదల చేశారు. పోలీసుల దాడి నేపథ్యంలో ధ్వంసమైన కోదండరాం ఇంటి తలుపుల్ని ఉదయం 6 గంటల ప్రాంతంలో పోలీసులే బాగు చేయించారు.
పోలీసు గుప్పిట రాజధాని
ర్యాలీ నేపథ్యంలో రాజధానిలోని మూడు కమిషనరేట్లలోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్‌లో ఉన్న సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా వివిధ ప్రాంతాల్లో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అనేక మంది కదలికల్ని గుర్తించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఎక్కడివారిని అక్కడే అరెస్ట్ చేశారు. ఇక ర్యాలీ, సభ నిర్వహిస్తామంటూ జేఏసీ ప్రకటించిన రెండు ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ చుట్టూ భారీ స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున అదనపు బలగాలను మోహరించారు. ఈ రెండు ప్రాంతాలకూ మధ్యన ఉన్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మూడు చోట్లా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలను అరెస్టు చేశారు. ర్యాలీగా ఇందిరాపార్కుకు వచ్చిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల్ని అరెస్టు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు వచ్చిన వారిని వచ్చినట్లే అరెస్ట్ చేశారు. ఇక్కడ జస్టిస్ చంద్రకుమార్, విమలక్క, అడ్వకేట్ జేఏసీ నాయకులు ప్రహ్లాద్, పీడీఎస్‌యూ నాయకులతోపాటు సుమారు 90 మందిని అరెస్ట్ చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో జ్యోతి అనే నిరుద్యోగిని సుందరయ్య పార్కు వద్ద హల్‌చల్ చేసింది. అప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకొనేందుకు యత్నించగా.. ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. జీపులో ఎక్కించి తీసుకువెళ్తుండగా.. చున్నీతో మెడకు గట్టిగా చుట్టి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించింది. పోలీసులు వెంటనే అప్రమత్తమైన అమె ప్రయత్నాన్ని నిలువరించారు.
సచివాలయం భద్రత కట్టుదిట్టం
ర్యాలీ నేపథ్యంలో సచివాలయం చుట్టూ బారికేడ్లు, ముళ్లకంచెలు ముందస్తుగా సిద్ధం చేసుకున్నారు. సచివాలయంలోకి ఎవరు వచ్చినా ఐడీకార్డు ఉంటేనే లోపటికి పంపించారు. ఏ క్షణంలోనైనా ఆందోళనకారులు వచ్చే అవకాశాలున్నాయనే సమాచారంతో పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కెమెరాలలో పర్యవేక్షిస్తూ ప్రధాన గేటు వద్ద ఉన్న సిబ్బందికి సమాచారం అందించారు.
కామాటిపుర ఠాణా వద్ద ఉద్రిక్తత
కోదండరాంను తెల్లవారుజామున అరెస్టు చేసిన పోలీసులు ఏ స్టేషన్‌కు తరలించారనేది గోప్యంగా ఉంచారు. మధ్యాహ్నానికి ఆయన కామాటిపుర ఠాణాలో ఉన్న విషయం బయటకు వచ్చింది. దీంతో విపక్షాలకు చెందిన నేతలు, మాజీ ఎంపీలు ఆయన్ను కలవడానికి ప్రయత్నించారు. పోలీసుస్టేషన్ వద్దకు వచ్చిన మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, నాయకులు రవీంద్ర నాయక్, విజయరామారావు, యూత్ కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌లను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో సాయంత్రం వరకు పలుమార్లు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పోలీసు చర్యల్ని నిరసిస్తూ స్టేషన్ ముందు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కమిషనర్ వద్దకు కోదండరాం సతీమణి
తన భర్తను వెంటనే విడుదల చేయాలంటూ కోదండరాం భార్య సుశీల, న్యాయవాది రచన బుధవారం మధ్యాహ్నం పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలవడానికి యత్నించారు. ఆ సమయంలో ఆయన కార్యాలయంలో లేకపోవడంతో సాధ్యం కాలేదు. సుశీల సాయంత్రం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించగా... అపాయింట్‌మెంట్ లేని కారణంగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రాజ్‌భవన్ ముందు కాస్సేపు నిరసన తెలిపి వెనుదిరిగారు. బుధవారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు కోదండరామ్ ఇంటికి వెళ్లారు. ‘‘ఆయనొక ప్రొఫెసర్.. తీవ్రవాది కాదు.. నక్సలైటు అంతకన్నా కాదు.. అలాంటి వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడి అరెస్టు చేసి పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుతారా’’ అని ప్రశ్నించారు.
జిల్లాల్లో అరెస్టుల పర్వం
పలు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు జేఏసీ నేతలను గృహనిర్భందం చేశారు. కీలక నేతలను ముందుస్తుగా అరెస్ట్ చేసి తరలించారు. పాత జిల్లా ఆదిలాబాద్‌లో 210 మంది, కరీంనగర్‌లో 325, వరంగల్‌లో 330, ఖమ్మంలో 180, నిజామాబాద్‌లో 235, మెదక్‌లో 220, నల్లగొండలో 276, మహబూబ్‌నగర్‌లో 256, రంగారెడ్డి జిల్లాలో 158 మందిని అరెస్ట్ చేసినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
ముందుస్తు చర్యల్లో భాగంగానే..: డీజీపీ అనురాగ్ శర్మ
‘‘హైదరాబాద్‌లో జేఏసీ తలపెట్టిన నిరుద్యోగ జేఏసీ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదు. హైకోర్టు సూచించిన ప్రాంతంలో కాకుండా మరోచోట నిర్వహించడం కుదరదని జేఏసీకి తెలిపాం. అలా కాకుండా ర్యాలీ నిర్వహించి చేస్తామంటే నిబంధనలు ఒప్పుకోవు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగానే కోదండరాంతోపాటు మిగతా జేఏసీ నాయకులను అరెస్ట్ చేశాం’’
అరెస్టుపై హక్కుల సంఘంలో పిటిషన్
కోదండరాం అరెస్టుపై హైకోర్టు న్యాయవాది నవీనా రెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 27 లోపు నివేదిక సమర్పించాలని మానవ హక్కుల సంఘం నగర పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది.