రాజధాని దిగ్బంధం: కోదండరాం అరెస్ట్
- నిరుద్యోగ ర్యాలీపై ఉక్కుపాదం.. టీజేఏసీ చైర్మన్ అరెస్ట్
- మరో 50 మంది నేతలూ పోలీసుల అదుపులో
- ఖాకీవనంగా నగరం.. రంగంలోకి 12 వేల మందికిపైగా సిబ్బంది
- సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్కు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
- ఉస్మానియా ప్రాంతం అష్టదిగ్బంధం
సాక్షి, హైదరాబాద్: అనుమతివ్వకున్నా నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. ఉద్యమానికి సారధ్యం వహిస్తోన్న జేఏసీ చైర్మన్ కోదండరాంను బుధవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనతోపాటు మరో 50 జేఏసీ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే కోదండరాంను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై స్పష్టత లేకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రొఫెసర్ ఆచూకీపై వెంటనే ప్రకటన చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కీలక నాయకుల అరెస్టుల సమాచారంతో రాజధాని సహా రాష్ట్రమంతటా ఉద్రిక్తత నెలకొన్నట్లయింది. అరెస్టులకు పాల్పడితే ఆయా పోలీస్ స్టేషన్లలోనే శాంతియుతంగా నిరసన తెలుపుతామని జేఏసీ ఇదివరకే ప్రకటించింది.
నిరుద్యోగ ర్యాలీకి ర్యాలీకి అనుమతిలేదని, ఎవరైనాసరే నిషేధాజ్ఞలు మీరితే అరెస్టులు తప్పవని ఈస్ట్‌జోన్ డీసీపీ రవీంద్ర అన్నారు. ర్యాలీ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేశారు. 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరించారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే హైదరాబాద్ పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది.
నగరంలో నిషేధాజ్ఞలు
జేఏసీ పిలుపు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తయిన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వారు గుంపులుగా జన సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక మూడు కమిషనరేట్లలో పోలీసు సిబ్బందికి ‘స్టాండ్ టు’ప్రకటించి అందరూ కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్ గ్యాస్ స్క్వాడ్స్, వాటర్ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు.
పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెంట్రల్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ, సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్–కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. తార్నాకలోని ఆయన ఇంటి తలుపులను బద్దలుకొట్టి మరీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవడంపై జేఏసీ నేతలతో పాటు.. విద్యార్థులు మండిపడుతున్నారు.