రాజధాని దిగ్బంధం! | Police are prepared to stop the rally of TJAC | Sakshi
Sakshi News home page

రాజధాని దిగ్బంధం!

Published Wed, Feb 22 2017 2:18 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM

రాజధాని దిగ్బంధం! - Sakshi

రాజధాని దిగ్బంధం!

టీజేఏసీ ర్యాలీని అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు
అడుగడుగునా బలగాల మోహరింపు
రంగంలోకి 12 వేల మందికిపైగా సిబ్బంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్కు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..
ఉస్మానియా ప్రాంతం అష్టదిగ్బంధం


సాక్షి, హైదరాబాద్‌: పోలీసులు అనుమతివ్వకున్నా బుధవారం నిరుద్యోగ ర్యాలీ, సభ నిర్వహించి తీరుతామని టీజేఏసీ ప్రకటించడంతో.. వాటిని ఎలాగైనా అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు, అదనపు బలగాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నగరాన్ని దాదాపు అష్ట దిగ్భంధనం చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే 12 వేలకు పైగా సిబ్బందిని మోహరించనున్నారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు విద్యా సంస్థలు, కోచింగ్‌ సెంటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టిన అధికారులు ఆ ప్రాంతాల్లోనే 3 వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. సికింద్రాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ఇందిరాపార్క్‌ ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నగరంలో నిషేధాజ్ఞలు
జేఏసీ పిలుపు నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలు నిర్వహించకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. నగరవ్యాప్తంగా నిఘా, పెట్రోలింగ్‌ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కీలక ప్రాంతాల్లో ఉన్న ఎత్తయిన భవనాలపై బైనాక్యులర్లతో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. వారు గుంపులుగా జన సంచారాన్ని, ర్యాలీలను గమనించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. ఇక మూడు కమిషనరేట్లలో పోలీసు సిబ్బందికి ‘స్టాండ్‌ టు’ప్రకటించి అందరూ కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. అశ్వక దళాలు, టియర్‌ గ్యాస్‌ స్క్వాడ్స్, వాటర్‌ క్యానన్స్, వజ్ర వాహనాలను అందుబాటులో ఉంచారు.

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
ఇక ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెంట్రల్‌ జోన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ర్యాలీ, సభల్లో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వచ్చే వారిని అడ్డుకోవడానికి హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో దాదాపు 350 వరకు చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. కమాండ్‌–కంట్రోల్‌ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రోడ్లపై కదలికల్ని ఎప్పటికప్పుడు గుర్తించే ఏర్పాట్లు చేస్తున్నారు.

ముందస్తు అరెస్టులు షురూ!
టీజేఏసీ ర్యాలీ, సభలను అడ్డుకోవడంలో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల అధికారులు ముందçస్తు అరెస్టులు కూడా ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, పికెట్ల వద్ద సోదాలు, తనిఖీలు నిర్వహించి.. మంగళవారం రాత్రి కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని ప్రశ్నించి.. తిప్పి పంపుతున్నారు. ఏడో నంబర్‌ జాతీయ రహదారి, శామీర్‌పేట, రాజీవ్‌ రహదారిలతో పాటు ఘట్‌కేసర్‌–వరంగల్, ఎల్బీనగర్‌–విజయవాడ, కూకట్‌పల్లి–ముంబైæ, శంషాబాద్‌–బెంగళూర్, సాగర్, శ్రీశైలం రహదారులపై పికెటింగ్‌ ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు చేపట్టారు.

ర్యాలీలో పాల్గొంటే క్రిమినల్‌ కేసులు: డీసీపీ జోయల్‌
టీజేఏసీ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలకు అనుమతి లేదని... హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున ర్యాలీ, సభలకు ప్రయత్నించినా, వాటిలో పాల్గొన్నా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీ డి.జోయల్‌ డేవిస్‌ హెచ్చరించారు. ర్యాలీలు, సభల్లో పాల్గొనడానికి ఎవరూ రావద్దని స్పష్టం చేశారు. విద్యార్థులతో పాటు వివిధ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న వారు సైతం ర్యాలీ, సభలకు దూరంగా ఉండాలని సూచించారు. నిషేధాజ్ఞలు అతిక్రమిస్తే కేసులతో వారి భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. గతేడాది సెంట్రల్‌ జోన్‌లో దాదాపు వెయ్యి కార్యక్రమాలకు అనుమతిచ్చామని, అంతకంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తుల్ని తిరస్కరించామని... అంతేగాని జేఏసీపై వివక్ష చూపుతున్నారనడం సమంజసం కాదని పేర్కొన్నారు.

ఆ మార్గంలో ప్రయాణించొద్దు: ట్రాఫిక్‌ చీఫ్‌
అనుమతి లేనప్పటికీ కూడా టీజేఏసీ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించవచ్చని ట్రాఫిక్‌ చీఫ్‌ జితేందర్‌ అభిప్రాయపడ్డారు. ఆ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తే ఆస్కారముందని పేర్కొన్నారు. అందువల్ల ఆ మార్గాల్లో వెళ్లకుండా ప్రత్యామ్నాయాలు దారులు ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు. ముఖ్యమైన పనులపై వెళ్లేవారు ముందే బయలుదేరడం మంచిదని పేర్కొన్నారు.

అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోంది: చాడ
సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ తలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేసేం దుకు అన్ని జిల్లాల్లో విద్యార్థులు, యువత, రాజకీయపార్టీల నాయకులను అరెస్ట్‌ చేయడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఖండించారు. ప్రభుత్వ తీరు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని ఒక ప్రకటనలో మండిపడ్డారు.  

జేఏసీ ర్యాలీపై టీఆర్‌ఎస్‌ ఆత్మవంచన: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్‌: జేఏసీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతినివ్వకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆత్మవంచన చేసుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. వేలాది ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా చెబుతున్న ప్రభుత్వ వాదనలో నిజముంటే లక్షలాది నిరుద్యోగులు ఎందుకు ఆగ్రహావేశాల్లో ఉన్నారని ప్రశ్నించారు.  

జేఏసీ నిరసన ర్యాలీకి ఆమ్‌ ఆద్మీ మద్దతు
సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ బుధవారం తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీకి ఆమ్‌ ఆద్మీ పార్టీ తెలంగాణ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి కైనా స్పందించి ర్యాలీకి అనుమతితో పాటు ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆప్‌ కార్యదర్శి సిల్వేరు శ్రీశైలం మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement