కోదండరామ్ విడుదల, ఇంటికి తరలింపు
నిరుద్యోగుల నిరసన ర్యాలీ నేపథ్యంలో అరెస్టు చేసిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు విడుదల చేశారు. కామాటిపురా పోలీసు స్టేషన్‌లో ఉన్న ఆయనను రాత్రి 7 గంటల సమయంలో విడుదల చేసి, తార్నాక ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటికి తరలించారు. ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అందుకు నోటిఫికేషన్లను విడుదల చేయాలన్న డిమాండుతో నిరుద్యోగుల నిరసన ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలని కోదండరామ్ నేతృత్వంలోని జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే నగరంలో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించగా.. కోర్టు సైతం నాగోల్ ప్రాంతంలోని మెట్రో గ్రౌండులో నిర్వహించుకోవాలని తెలిపింది. అయితే.. అక్కడ ఏర్పాట్లు కష్టమని, తాము ఎలాగోలా ర్యాలీ నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు. దాంతో ఆయనను బుధవారం తెల్లవారుజామునే 3 గంటల సమయంలో పోలీసులు అరెస్టు చేసి, కామాటిపుర పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయం దాటిన తర్వాత ఆయనను విడుదల చేసి, అక్కడి నుంచి ఇంటికి తరలించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే అవకాశం తమకు ఇవ్వలేదని ఈ సందర్భంగా కోదండరామ్ అన్నారు. నిరుద్యోగుల ర్యాలీ విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన ఇంటి మీద పడి పోలీసులు తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేశారిన మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పరిష్యారం కోసం తమ కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి(గురువారం) విద్యా సంస్థల బంద్‌కు తమ మద్దతు ఉంటుందని కోదండరామ్ తెలిపారు. గురువారం ఉదయం తన నివాసంలో టీజేఏసీ భేటీ ఉంటుందని, అనంతరం భవిష్యాత్ కార్యాచరణ పై చర్చిస్తామని అన్నారు.