సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి జిల్లాలో రాజకీయం మెల్లమెల్లగా వేడెక్కుతోంది. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగడం అనివార్యం కావడంతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగకపోయినా... వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లోగా జరిగే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా నేతలు ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లూ హైదరాబాద్‌కే పరిమితమైన నాయకులు కూడా స్థానిక కార్డును వాడుకునేందుకు సొంత నియోజకవర్గాలకు తరలుతున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ వాతావరణం ఉమ్మడి జిల్లాలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ భవిష్యత్తుపై ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుం దన్న ఊహాగానాలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి.
జనంలోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేల కార్యాచరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో నిత్యం వార్తల్లో నిలిచిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఛరిష్మాపైనే ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశతో ఉన్నారు. కేసీఆర్ బొమ్మతో గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటికీ, జనంలోకి వెళ్లకపోతే అసలు టిక్కెట్టుకే ఎసరు రావచ్చన్న భయం కొందరు ఎమ్మెల్యేలకు పట్టుకుంది. గతంలో కేసీఆర్ నిర్వహించిన పలు సర్వేల్లో వెనుకంజలో ఉన్నట్లు తేలిన ఎమ్మెల్యేలతో పాటు పలు వివాదాల్లో చిక్కుకున్న వారు సైతం ఇప్పుడు ప్రజల మధ్యలో ఉంటే తప్ప ఫలితం ఉండదన్న అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నియోజకవర్గాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపారు. మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్‌రావు, విఠల్‌రెడ్డి గత కొంత కాలంగా జనంలోనే ఉంటుండగా, మిగతా ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గ ఓటర్లతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి.
‘పొత్తు పొడుపు’తో ఫలితం ఉంటుందా?
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులతో పోటీ చేస్తాయన్న ఉహాగానాలపై కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌పై ప్రజల్లో సానుభూతి ఉండగా, తెలంగాణ వ్యతిరేక పార్టీగా టీడీపీకి ముద్రపడింది. దీనికితోడు గత ఎన్నికల తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ పలు విషయాల్లో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ.. వివిధ వర్గాల సమస్యలపై పోరాటాలు సాగిస్తూ ప్రజల మధ్యన ఉంటోంది. ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకోని పోయింది. టీడీపీ నాయకుల్లో ఎక్కువ మంది అధికార టీఆర్‌ఎస్‌లో చేరగా, కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కలిశారు.
ప్రస్తుతం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ఎక్కడా కూడా టీడీపీకి క్యాడర్ వెతికినా కనిపించదు. ఈ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చునని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక టీడీపీలో మిగిలి ఉన్న అతికొద్ది మంది నాయకులు మాత్రం కాంగ్రెస్‌తో చెలిమి కోసం ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగానైనా తమ ఉనికిని కాపాడుకోవచ్చని వారు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇతర పార్టీలు కూడా ఈ రెండు పార్టీల పొత్తుల గురించి అంతగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే ప్రధాన పోటీదారులుగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముందున్న కాంగ్రెస్..
గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన సింగరేణి ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు కార్మికులు లక్ష్యంగా మంచిర్యాల జిల్లాలో ప్రజల్లోకి వెళ్లాయి. అప్పటి నుంచి అడపాదడపా కార్యక్రమాలతో కాంగ్రెస్ కొన్ని నియోజకవర్గాల్లో మిగతా పక్షాల కన్నా ముందుంది. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు. మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావుకు ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు వివిధ కార్యక్రమాల ద్వారా గట్టి పోటీ ఇస్తున్నారు. చెన్నూరులో ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు పరిస్థితి అదే. ఇక్కడ మాజీ మంత్రి బోడ జనార్ధన్ తనకున్న సంబంధాలతో దూసుకుపోతున్నారు. ఆసిఫాబాద్, బోథ్‌లలో మాజీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, సోయం బాబూరావు ఆదివాసీ ఆందోళనలతో కాంగ్రెస్‌లోనే ప్రముఖ నాయకులుగా ఎదిగారు.
ఈ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో సత్తా చూపాలనే పట్టుదలతో ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నాయకత్వ సమస్య ఉంది. ఉమ్మడి జిల్లాలో బీజేపీ నాయకత్వ సమస్యతోనే కొట్టుమిట్టాడుతోంది. జిల్లాల వారీగా పార్టీ యంత్రాంగాన్ని ముందకు నడిపించే నాయకత్వం కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి పట్టణ ప్రాంతాల్లో బలమున్నప్పటికీ.. నాయకుల్లో నెలకొన్న నైరాశ్యంతో ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఒకటి రెండు సీట్లు తమకు దక్కుతాయేమోనన్న ఆశ మిగిలిన ఒకరిద్దరు నాయకుల్లో ఉంది. కాగా సిర్పూరు నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడు పాల్వాయి హరీష్‌రావు శనివారం బెజ్జూరు మండలంలో వేలాది మందితో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ కాంగ్రెస్ అంతంత మాత్రంగానే తయారైంది.
భయపెడుతున్న టీజేఎస్
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులకు కొంత ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యం లభించడం లేదని భావిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు టీజేఎస్‌పై దృష్టి సారించారు. అలాగే టీఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకే టిక్కెట్టు అని ముఖ్యమంత్రి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న నాయకులు కూడా టీజేఎస్ ద్వారా రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని భావిస్తున్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో ఈ మేరకు నాయకులు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోదండరామ్ పార్టీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించిన తరువాత ఉమ్మడి జిల్లా నుంచి పలువురు అధికార పార్టీ నేతలతో పాటు మరికొందరు తటస్థులు, ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు కూడా టీజేఎస్‌లో చేరి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాలని యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment