రణరంగంగా ఉస్మానియా
నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపట్టేందుకు విద్యార్థుల యత్నం
ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: టీజేఏసీ పిలుపునిచ్చిన నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఎన్‌సీసీ గేటు ప్రాంతం రణరంగంగా మారింది. ర్యాలీకి ప్రయత్నిస్తున్నవారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్లు రువ్వడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక విద్యార్థి విభాగమైన టీయూవీ రాష్ట్ర అధ్యక్షుడు సందీప్ చమార్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
వర్సిటీని దిగ్బంధించిన పోలీసులు
నిరుద్యోగ నిరసన ర్యాలీని అడ్డుకునే వ్యూహంలో భాగంగా పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఉస్మానియా యూనివర్సిటీని దిగ్భంధించారు. వర్సిటీలోకి వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్సిటీ హాస్టళ్లలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు.. తనిఖీలు నిర్వ హించి పలువురిని అదుపులోకి తీసుకు న్నారు. ఇక బుధవారం మధ్యాహ్నం ఉస్మా నియా వర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి విద్యా ర్థులు ర్యాలీగా బయలుదేరారు. వారిని పోలీసులు ఎన్‌సీసీ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని, ర్యాలీకి అనుమతించాలని విద్యార్థులు కోరినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా.. ఆగ్రహించిన విద్యార్థులు, నిరుద్యోగులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్ట్స్ కాలేజీ, తార్నాక, ఓయూ పోలీస్‌స్టేషన్, ఎన్‌సీసీ గేటు, హాస్టళ్లు ఇలా అన్ని చోట్లా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.
విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం
పోలీసులు ర్యాలీకి అనుమతివ్వకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఉద్యమ వేదిక విద్యార్థి విభాగం అధ్యక్షుడు సందీప్ చమార్ (28) ఆర్ట్స్ కాలేజీ వద్ద ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు ఆయనను అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 309 కింద కేసు నమోదు చేసి, గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఓయూలో అరెస్టులకు నిరసనగా కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన శతాబ్ది ఉత్సవాల స్వాగత ద్వారాన్ని దహనం చేశారు.
నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు
నిరుద్యోగ నిరసన ర్యాలీ, సభలకు అనుమతించకుండా నిర్బంధం విధించడం, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పాటించాలని, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయాలని 34 విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం సభలు, నిరసన ర్యాలీలకు సీమాంధ్ర పాలకులు అనుమతులు ఇచ్చారని.. కానీ పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో నిర్భంధం కొనసాగడం దారుణమని తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్ ధ్వజమెత్తారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ జె.కల్యాణ్, అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, విద్యార్థి జేఏసీ చైర్మన్ వట్టికూటి రామారావుగౌడ్, టీఎస్ జేఏసీ నాయకులు పున్న కైలాష్‌నేత, సాంబశివగౌడ్, కల్వకుర్తి ఆంజనేయులు, అంజియాదవ్, మాలిగ లింగస్వామి, మన్నే క్రిషాంక్, చలగాని దయాకర్, సర్దార్ వినోద్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.