ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. కార్మిక చట్టాల ప్రకారం అందాల్సిన లబ్ధికి వారు నోచుకోవడం లేదు. కొందరికైతే ప్రతి నెలా ఐదో తేదీలోపు అందాల్సిన జీతం డబ్బులు నెలలు గడుస్తున్నా అందడంలేదు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం, వీటిని అదుపు చేయడంలో యంత్రాంగం విఫలమవుతుండటంతో చివరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 వేల మంది ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. నిర్దేశించిన పోస్టులో రెగ్యులర్ ఉద్యోగి చేసే అన్ని రకాల పనులను వీరు నిర్వహిస్తారు. పేరుకు బాగానే ఉన్నా.. వేతనాలు, ఇతర సౌకర్యాల విషయంలో అధమమే. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా వీరంతా నియమితులు కావడం.. వేతన చెల్లింపులు నేరుగా ఉద్యోగి ఖాతాకు కాకుండా ఏజెన్సీకి ప్రభుత్వం విడుదల చేయడంతో ప్రభుత్వానికి, ఉద్యోగికి మధ్య అంతరం ఎక్కువగా ఉంటోంది. సమస్యలు వస్తే వాటి పరిష్కారంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడం కూడా ఒక కారణమే..
ఏజెన్సీలతో ఇబ్బందులే..
తాత్కాలిక ఉద్యోగ నియామకాల విషయంలో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉద్యోగంలో చేరే సమయంలో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు సైతం వస్తుండగా.. నెలవారీగా ఇచ్చే వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేయడం, వేతనాల్లో కోతలు విధించడం, ఉద్యోగులకు చేకూరాల్సిన ప్రధాన లబ్ధి ఈఎస్‌ఐ, పీఎఫ్‌ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటంలేదు. మరోవైపు ఏజెన్సీలపై జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఫిర్యాదులిచ్చినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇదివరకు ఔట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగులను టామ్‌కామ్ (తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ) ద్వారా చేపట్టామని, కానీ కాంట్రాక్టు ఉద్యోగుల నిర్వహణ ఇబ్బందులతో ఆ ప్రక్రియను ప్రభుత్వం జిల్లాలకు అప్పగించింది. అయితే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కార్మిక, ఉపాధి కల్పన శాఖకు అజమాయిషీ లేదని ఆ శాఖ సంచాలకుడు కేవై నాయక్ చెబుతున్నారు.
యాదాద్రిలో టీమ్.. కరీంనగర్‌లో వారధి
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిర్వహణ ప్రక్రియ యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాల్లో భిన్నంగా ఉంది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేకంగా టీమ్ (తెలంగాణ ఎంప్లాయీస్ అసిస్టెన్స్ మిషన్) పనిచేస్తుండగా.. కరీంనగర్ జిల్లాలో వారధి అనే సొసైటీ ఉంది. వీటికి ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఇందులో ఉంటారు. ఆయా జిల్లాల పరిధిలో ఏ శాఖకు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు అవసరమైనా.. ఈ సంస్థలు ఎంపిక చేస్తాయి.
ఈ ఉద్యోగాల్లో కూడా మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేస్తున్నామని టీమ్ సంస్థ సభ్య కార్యదర్శి శ్రీనివాసుల వెంకట రంగయ్య చెబుతున్నారు. అలాగే వేతన చెల్లింపులు, పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రక్రియంతా నిర్దేశించిన గడువు నాటికి కచ్చితంగా చెల్లించడమే తమ బాధ్యత అని వారధి సభ్య కార్యదర్శి గాదె ఆంజనేయులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పద్ధతే పాటిస్తే బాగుంటుందని పలువురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అంటున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్‌గా ఉంటూ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఇప్పటికే ఉన్నా.. చాలాచోట్ల ఆ కమిటీలు
యాక్టివ్‌గా లేవని సమాచారం.
ఏపీలో ఇలా...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ సర్వీసుల విషయంలో మరింత ముందుంది. నియామకాల్లో మధ్యవర్తిత్వం లేకుండా పూర్తి పారదర్శకత, వేతన చెల్లింపుల్లో కచ్చితత్వం, ఉద్యోగులకు కలగాల్సిన లబ్ధిని పక్కాగా అందించాలనే లక్ష్యంతో ఆప్కోస్ (ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్) పేరిట ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలను ఈ కార్పొరేషన్ ద్వారా నియమిస్తున్నారు. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment