సాక్షి, అమరావతి: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో రాజకీయ నాయకులతోపాటే ఉద్యోగ వర్గాలూ తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెంచాయి. ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేముందు అనేక హామీలిచ్చిందని, మనం కూడా ఆ హామీలు నెరవేరతాయన్న ఆశతో ఓట్లేశాం...ఇప్పుడేమో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నాయి. ఉద్యోగం చేస్తున్నామేగానీ కనీస భద్రత లేకుండా పోయింది. మన పరిస్థితి ఈ నాలుగేళ్లలో మరీ దారుణంగా ఉంది. వేతనాలు పైసా పెంచకపోగా, ఉన్న ఉద్యోగానికీ ఇబ్బందులు తప్పలేదు, ఈ పరిస్థితుల్లో కలిసికట్టుగా ఓటు వేస్తేగానీ మనకు న్యాయం జరిగే పరిస్థితి లేదు.. అన్న ఆలోచనకు ఆయా ఉద్యోగులు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలు కీలకం కాబోతున్నాయని, ఏమాత్రం పొరపాటు చేసినా మళ్లీ మనకు అన్యాయం జరిగే అవకాశముందన్న భావనకు వారు వచ్చారు. ఇలాంటి అవకాశం మళ్లీ ఐదేళ్లకుగానీ మనకు రాదని, ఇప్పుడే జాగ్రత్త పడాలని చర్చించుకుంటున్నారు. హామీ ఇచ్చి మోసం చేసినందుకు కసి తీర్చుకోవాలన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు యమునాతీరు కాకుండా ఈ ఏడాది కలసికట్టుగా ఓటు వేద్దామని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి.
జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు
రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు లక్ష మంది వరకూ ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులున్నారు. వీళ్లలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక సంఘాలున్నాయి. ప్రతి జిల్లాలోనూ కార్యవర్గాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఉద్యోగులు జిల్లాలవారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉద్యోగులెవరైనా తెలియని వారుంటే చేర్చుకోవడం, వారికి అవగాహన కల్పించడం, జరిగిన మోసాన్ని వివరించడం వంటివి ప్రధానంగా చర్చిస్తున్నారు. ఉద్యోగులతోపాటు బంధువులు, తెలిసిన వారికి కూడా ప్రచారం నిర్వహించి జరుగుతున్న పరిణామాలను వివరిస్తున్నామని పశ్చిమగోదావరికి చెందిన ఒక కాంట్రాక్టు ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఎలాంటి అసభ్యకర వ్యాఖ్యలు గానీ, మెసేజ్‌లుగానీ పెట్టకుండా ప్రధానంగా మనకు జరిగిన నష్టాన్ని తెలియజెప్పాలని, అధికారపార్టీ హామీ ఏమిచ్చింది, ఏం చేసింది అనే విషయాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాను వేదికగా చేసుకోవాలని ఆయా కార్యవర్గాల్లో నిర్ణయించారు. విధిగా అందరూ ఓటింగ్‌కు రావాలని వాట్సాప్ ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మోసాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి..
- 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా దశలవారీగా కాంట్రాక్టు ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తామన్నారు. కానీ చెయ్యలేదు
- నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని వేసి నాలుగున్నరేళ్లపాటు సమావేశాలు నిర్వహించి చివరకు క్రమబద్ధీకరణ కష్టమని చెప్పేశారు
- 2010కి ముందు రెగ్యులర్ ఉద్యోగులకు లాగే వేతన సవరణ ఉండేది.. ఇప్పుడు దీన్ని తీసేశారు
- కాంట్రాక్టు ఉద్యోగులను కూడా కన్సాలిడేటెడ్ ఉద్యోగులుగా మార్చేశారు
- జీవో నంబర్ 27 ద్వారా ఉన్న డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పీఆర్‌సీ వంటివన్నీ తొలగించారు
- గడిచిన నాలుగున్నరేళ్లలో ఉద్యోగ భద్రత పూర్తిగా లేకుండా పోయింది
Comments
Please login to add a commentAdd a comment