నామినేషన్ దాఖలు చేస్తున్న మాధవ్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం లోక్‌సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే వీఆర్‌ఎస్ కింద తనను రిలీవ్ చేయాలని కోరుతూ గత ఏడాది డిసెంబర్ 28న తాను పెట్టుకున్న దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం వెలువరించకుండా పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ గోరంట్ల మాధవ్ ఏపీఏటీలో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై ఏపీఏటీ విచారణ జరుపుతుండగానే, మాధవ్ వీఆర్‌ఎస్ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ మాధవ్ ట్రిబ్యునల్‌లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గోవిందరాజులు వెంటనే మాధవ్‌ను రిలీవ్ చేయాలని కర్నూలు డీఐజీని ఆదేశించారు. మాధవ్ పెట్టుకున్న వీఆర్‌ఎస్ దరఖాస్తును తిరస్కరిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. వెంటనే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కర్నూలు డీఐజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఆ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేయడం ఇప్పుడు సాధ్యం కాదంది. అయితే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తు ఆమోదం, నామినేషన్ దాఖలుకు వీలుగా సర్వీసు నుంచి అతన్ని రిలీవ్ చేయడం.. ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా, మాధవ్ తరఫున సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
వీఆర్‌ఎస్‌ను ఆమోదించిన డీఐజీ
ట్రిబ్యునల్ చెప్పినా పట్టించుకోని పోలీసు బాసులు హైకోర్టు తాజా తీర్పుతో ఆగమేఘాలపై స్పందించారు. ఎట్టకేలకు డీఐజీ కాంతిరాణ తాతా మాధవ్ వీఆర్‌ఎస్‌ను ఆమోదించారు.
ఎంపీగా గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తా: మాధవ్
హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటానని గోరంట్ల మాధవ్ అన్నారు. సోమవారం ఆయన హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం మాధవ్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీ స్థానాన్ని జగన్‌కు కానుకగా ఇస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment