సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం అల్లాడుతున్నారు. మూడు నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాలు మాత్రం అందడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 3,650 మంది పనిచేస్తున్నారు.
డాక్టరు స్థాయి మొదలు స్టాఫ్ నర్సులు, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్, ఎల్రక్టీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్స్ తదితర కేడర్ల లో కాంట్రాక్టు ప్రాతిపదికన, ఔట్ సోర్సింగ్ పద్దతుల్లో విధు లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్విసును ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తారు. ఏప్రిల్ నెల నుంచి మార్చి వరకు సర్విసు కాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేస్తేనే నిధులు విడుదల చేస్తారు.
పెండింగ్.. పెండింగ్...
ఈ ఏడాది ఏప్రిల్‌లో వైద్య విధాన పరిషత్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్విసు రెన్యువల్ ప్రతిపాదనలను ఆ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. సాధారణంగా ఈ ప్రక్రియ వారం నుంచి పది రోజుల్లోగా పూర్తి కావాలి. కానీ ఏప్రిల్ నెలలో సమర్పించిన ప్రతిపాదనలకు ఇప్పటికీ ఆమోదం రాలేదు.
ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ ఫైలు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,650 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్విసు రెన్యువల్ కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.
ఏటా ఇదే తంతు...
వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపుల్లో ప్రతి సంవత్సరం తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో వేతనాలు అందడంలో ఆలస్యం అవుతోంది. ఇందుకు ప్రధాన కారణం సర్విసు పునరుద్ధరణే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చొరవ తీసుకోవాలని ఉద్యోగులు మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రాలు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment