ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయలేం
♦ బడ్జెట్ చర్చకు సమాధానం సందర్భంగా ఆర్థిక మంత్రి వెల్లడి
♦ 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడ్జెట్ మీద జరిగిన చర్చకు శుక్రవారం శాసనసభలో ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. 20 వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే చర్యలు చేపట్టామని, త్వరలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇతర నిధులు ఉండే పీడీ ఖాతాల్లో సొమ్ము వాడుకున్న మాట వాస్తవమేనని అం గీకరించారు. అలా వాడుకోవడం నేరమేమీ కాదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు పీడీ ఖాతాల్లో సొమ్మును వాడుకొని, తర్వాత సర్దుబాటు చేయడం మామూలేనని వివరణ ఇచ్చారు. గత రెండు బడ్జెట్లలో యువతకు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదని అంగీకరించారు. త్వరలో ‘యువజన విధానం’ తీసుకురానున్నామని చెప్పారు. యనమల చెప్పిన ముఖ్య విషయాలు..
► కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా సహకారం అందాల్సి ఉంది. రాబడి ఆశించినంతగా పెరగడం లేదు. అప్పులు చేసైనా స్వర్ణాంధ్రకు బాటలు వేస్తాం. పన్నులు, కేంద్రసాయంతో ప్రభుత్వానికి రాబ డి వస్తుంది. అది సరిపోకపోతే అప్పే దిక్కు.
► 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల్లో అవాస్తవాలున్నాయని ప్రతిపక్షం విమర్శించింది.సవరించిన అంచనాలన్నీ తాత్కాలిక గణాంకాలే. వాస్తవ గణాంకాలు ఆడిట్ తర్వాత వస్తాయి.
► 2016-17లో ప్రణాళికేతర వ్యయం 16 శాతం పెరిగింది. ఈ వ్య యాన్ని 8 శాతం తగ్గించాం.ప్రణాళికా వ్యయం పెరిగిందంటే.. రాష్ట్రం అభివృద్ధి బాటలో ఉందని అర్థం.
►నష్టాల్లో ఉన్న చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకాలు ప్రకటించాం. ఫెర్రోఅల్లాయ్స్, స్పిన్నింగ్, చక్కెర పరిశ్రమలకూ ప్రోత్సాహకాలు ఇచ్చాం.
► పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి యత్నిస్తున్నాం. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్‌రూట్‌కు కేంద్రం అంగీకరిస్తే.. అమరావతి ‘ఆగ్నేయ ఆసియా ముఖద్వారం’గా మారడం ఖాయం.
గాలిలో చేపల ఉత్పత్తి చేయడం లేదు: మంత్రి పుల్లారావు
ఫిషరీస్‌లో 32 శాతం వృద్ధిరేటు సాధించామని తాము చెబుతుంటే, ప్రతిపక్ష సభ్యులు ఎగతాళి చేస్తున్నారని వ్యవసాయ బడ్జెట్‌పై సమాధానం సందర్భంగా ఆ శాఖ మంత్రి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తాము గాల్లో చేపలు ఉత్పత్తి చేయడం లేదన్నారు.
ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేం
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయలేమని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. బడ్జెట్ చర్చపై మంత్రి శుక్రవారం శాసన మండలిలో సమాధానం ఇచ్చారు. దాదాపు 63 వేల మంది ఔట్‌సోర్సింగ్, 16 వేల మంది కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవకాశం లేనందున జీతాలు పెంచే ఆలోచన ఉందన్నారు.