ఉద్యోగాల కోసం ఆందోళన
తార్నాక చౌరస్తాలో రాస్తారోకో, పోలీసుల లాఠీచార్జి
హైదరాబాద్: ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న వారిని విస్మరించి, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఉస్మానియా క్యాంపస్ విద్యార్థులు రెండో రోజు ఆందోళనకు దిగారు. ఓయూ క్యాంపస్‌లోని లేడీస్ హాస్టల్ ఎదుట శుక్రవారం పరిశోధకవిద్యార్థిని కవిత ఆధ్వర్యంలో 20 మంది విద్యార్థినులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వాహనాలను దారి మళ్లించారు. దీంతో ఆందోళన చేస్తున్న విద్యార్థినులకు యూనివర్సిటీ లైబ్రరీలో పోటీ పరీక్షల కోసం చదువుతున్న వారు జతకలిశారు.
వీరంతా సీఎం కేసీఆర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తార్నాక చౌరస్తా వద్దకు వచ్చి రాస్తారోకో చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ, బీఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు రంగంలోకి దిగారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ వాహనదారుడు విద్యార్థులతో గొడవకు దిగాడు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. 18 మంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించి మధ్యాహ్నం విడిచిపెట్టారు.