సోమవారం ఓయూలో ఆందోళనకు దిగిన విద్యార్థులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్ :ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి రణరంగంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మానేరు హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళి మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. విద్యార్థులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో ఆగ్రహించిన పలువురు విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. హాస్టల్‌లోకి వెళ్లి గదుల తలుపులు పగలగొట్టి మరీ విద్యార్థులను చితకబాదారు. 34 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల దాడిలో 17 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక పోలీసుల దుశ్చర్యను నిరసిస్తూ.. విద్యార్థులు సోమవారం ఉదయం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉస్మానియాలో లాఠీచార్జికి నిరసనగా ఏబీవీపీ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.
తలుపులు పగలగొట్టి.. చితకబాది..
ఉద్యోగం రావడం లేదన్న ఆవేదనతో ఆదివారం ఎంఎస్సీ ఫిజిక్స్ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ భగ్గుమంది. మురళి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు మృతదేహాన్ని తరలించేప్రసక్తే లేదంటూ విద్యార్థులు భీష్మించారు. వీసీ రామచంద్రం, పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడినా వారు వెనక్కి తగ్గలేదు. ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో కొందరు పోలీసులు మానేరు హాస్టల్లోకి దూసుకొచ్చారు. మురళి చనిపోయిన స్నానాల గది తలుపులు తెరిచేందుకు యత్నించారు. అడ్డుకున్న ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు. ఆగ్రహించిన కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో.. పోలీసులు మరింతగా రెచ్చిపోయారు. విద్యార్థులు భయంతో గదుల్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నా వదిలిపెట్టలేదు. బలవంతంగా తలుపులను పగలగొట్టి మరీ గదుల్లోకి ప్రవేశించి.. దొరికిన వారిని దొరికినట్టే చితకబాదారు. ఈ ఘటనలో 17 మందికి గాయాలుకాగా, నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పోలీసులు మురళి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు సోమవారం ఉదయం పోస్టుమార్టం చేసి, బంధువులకు అప్పగించారు.
విద్యార్థులకు గాంధీలో వైద్య పరీక్షలు
ఉస్మానియా వర్సిటీలో ఆందోళన చేసిన విద్యార్థులు, పలు పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో కాంగ్రెస్, టీడీపీ నాయకులు అద్దంకి దయాకర్, ప్రతాప్‌రెడ్డిలతో పాటు 24 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక లాఠీచార్జిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు బాబూలాల్‌నాయక్, వినోద్, వంటే ప్రతాప్‌రెడ్డి, పాలడుగు శ్రీనివాస్‌లకు నల్లకుంటలోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. మరోవైపు విద్యార్థులు రాళ్లు రువ్విన ఘటనలో ఓయూ ఎస్సై మోహన్‌రెడ్డి తలకు తీవ్ర గాయమైంది.
కొలువులకై కొట్లాటకు భారీగా వెళ్లిన విద్యార్థులు
కోదండరాం నేతృత్వంలో నిర్వహించిన ‘కొలువుల కొట్లాట’సభకు ఉస్మానియా విద్యార్థులు భారీగా తరలివెళ్లారు. క్యాంపస్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించి, విద్యార్థులు వర్సిటీ దాటకుండా ప్రయత్నించినా... ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. మూడు వేల మంది వరకు విద్యార్థులు సభకు వెళ్లినట్లు సమాచారం.
ఉదయం మళ్లీ ఉద్రిక్తత..
పోలీసుల లాఠీచార్జిపై ఆగ్రహించిన విద్యార్థులు.. సోమవారం ఉదయం ఉస్మానియా క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. ఆర్ట్స్, సైన్స్ కాలేజీలు, లైబ్రరీలు మూతపడ్డాయి. హాస్టళ్లలోని విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా ఎన్‌సీసీ గేటు వైపు బయలుదేరారు. అయితే అప్పటికే వర్సిటీలో భారీగా మోహరించిన పోలీసులు.. ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఆందోళనకారులు ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. ‘సీఎం కేసీఆర్ డౌన్ డౌన్.. పోలీస్ గో బ్యాక్’అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్సిటీ ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బలిదానాల తెలంగాణలో దొరల రాజ్యం
నీళ్లు, నిధులు, ఉద్యోగాలే లక్ష్యంగా తెలంగాణ పోరాటం సాగిందని.. విద్యా ర్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దొరలు రాజ్యమేలుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో.. నిరుద్యోగులు, విద్యార్థులు నిరాశకులోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక విద్యార్థులపై లాఠీచార్జిని ఉస్మానియా వర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ఖండించింది. పోలీసులు హాస్టల్ గదుల్లోకి చొరబడి దాడి చేయడం దారుణమని వ్యాఖ్యానించింది.
పోలీసు పహారా మధ్య మురళి అంత్యక్రియలు
జగదేవ్‌పూర్: ఓయూలో ఆత్మహత్య చేసుకున్న ఎమ్మెస్సీ విద్యార్థి మురళి అంత్యక్రియలు సోమవారం సిద్దిపేట జిల్లా దౌలాపూర్‌లో పోలీసు పహారా మధ్య పూర్తయ్యాయి. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా దౌలాపూర్ నాలుగు వైపులా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు సోమవారం ఉదయం మృతుడి తల్లి లక్ష్మితో ఫోన్‌లో మాట్లాడారు. ‘అమ్మా.. మీ కుటుంబానికి నేనున్నాను.. నేను కూడా నీ కొడుకులాంటి వాడినే. అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకుంటా’అని హామీ ఇచ్చారు. మూడ్రోజుల్లో తానే స్వయంగా ఇంటికి వస్తానని చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment