ఓయూలోనే ఓనమాలు...
ఎందరో రాజకీయ పాఠాలు నేర్చింది ఉస్మానియాలోనే..
- ప్రజాజీవితంలో గుబాళించిన ప్రముఖులు
- పీవీ, కేసీఆర్‌ల ప్రస్థానం ఇక్కడ్నుంచే..
సాక్షి, హైదరాబాద్: శత వసంతాల చదువుల తల్లి ఉస్మానియా ఒడిలో ఓనమాలు నేర్చుకున్న ఎందరో రాజకీయ కార్యక్షేత్రంలో ప్రముఖులుగా ఎదిగారు. దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ నరసింహారావు మొదలు.. సీఎంలు.. కేంద్రమంత్రులుగా పనిచేసిన పలువురు నేతలు విశ్వవిద్యాలయంతోపాటు ఓయూ అనుబంధ కళాశాలల్లో చదివారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఓయూ లెజెండ్స్‌పై ప్రత్యేక కథనం..
సంస్కరణల సారథి.. పీవీ..
దక్షిణాది నుంచి దేశ అత్యున్నత పదవి ప్రధాని పీఠాన్ని అధిరోహించిన గొప్ప పరిపాలనాధ్యక్షుడు, సంస్కరణల రథసారథి పాములపర్తి వెంకట నరసింహారావు ఉస్మానియా వర్సిటీలోనే చదివారు. బహు భాషాకోవిదుడిగా, న్యాయవాదిగా, కవిగా, పరిపాలనాదక్షుడిగా, అపర రాజకీయ చాణక్యుడిగా పేరొందిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ 1921, జూన్ 28న కరీంనగర్ జిల్లాలో జన్మించారు. ఆయన ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేసిన కాలంలో భూసంస్కరణలకు నాంది పలికారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కేబినెట్‌లలో సుదీర్ఘ కాలంపాటు మంత్రిగా పనిచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం తో దేశంలోకి బహుళ జాతి కంపెనీలతోపాటు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశ ఆర్థిక వ్యవస్థను గొప్ప మలుపు తిప్పిన చరిత్ర పీవీకే సొంతం. ఆయన ఉస్మానియా ముద్దుబిడ్డ కావడం ఓయూ పూర్వ విద్యార్థులకు గర్వకారణం.
వి.ఎస్.రమాదేవి
కేంద్ర ఎన్నికల సంఘం తొలి మహిళా చీఫ్ కమిషనర్‌గా పనిచేసిన వీఎస్ రమాదేవి ఓయూ పూర్వ విద్యార్థే. 1934 జనవరి 15న జన్మించిన ఆమె.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పీజీ చేశారు.
పి.శివశంకర్
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, గొప్ప పార్లమెంటేరియన్‌గా పనిచేసిన పుంజాల శివశంకర్ కూడా ఓయూ పూర్వ విద్యార్థే. మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిక్కిం, కేరళ గవర్నర్‌గా పనిచేశారు. 1929 ఆగస్టు 10న ఆయన జన్మించారు.
కె.చంద్రశేఖర్‌రావు
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సారథి కేసీఆర్ ఓయూలోనే చదివారు. 1954 ఫిబ్రవరి 17న జన్మించిన ఆయన.. ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్ విభాగంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి ఓయూ పురిటిగడ్డగా నిలిచిన విషయం విదితమే. కేసీఆర్ తన ఉద్యమపథంలో ఏ పిలుపునిచ్చినా ఓయూ విద్యార్థులు కదన రంగంలోకి దూకారు. ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ ఉప సభాపతిగా, రాష్ట్ర మంత్రిగా, యూపీఏ హాయాంలో కేంద్రమంత్రిగా పలు కీలక పదవులు చేపట్టారు.
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి
ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చిట్ట చివరి సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓయూ కామర్స్ విభాగంలో డిగ్రీ, న్యాయశాస్త్రంలో పీజీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ స్పీకర్‌గా, చీఫ్ విప్‌గా పనిచేశారు. ఆయన 1960 సెప్టెంబర్ 13న జన్మించారు.
సూదిని జైపాల్‌రెడ్డి...
కేంద్రమంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, గొప్ప వక్తగా పేరొందిన సూదిని జైపాల్‌రెడ్డి ఓ యూ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పీజీ డిగ్రీతోపాటు జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన పాత్ర పోషించారు. 1942 జనవరి 16న ఆయన జన్మించారు.
మరాఠా సీఎం ఎస్‌బీ చవాన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు, కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎస్.బి.చవాన్ (శంకర్‌రావ్ భావ్‌రావ్ చవాన్)కూడా ఉస్మానియా పూర్వ విద్యార్థే. ఆయన 1920 జూలై 14న జన్మించారు. ఓయూ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. నాలుగుసార్లు మహారాష్ట్ర నుంచి ఎంపీగా గెలుపొందారు.
ధరమ్‌సింగ్ నారాయణ్‌సింగ్
కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ధరమ్‌సింగ్ నారాయణ్ సింగ్ ఓయూలో మాస్టర్స్ డిగ్రీతోపాటు న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1936 డిసెంబర్ 25న జన్మించిన ఆయన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు.
శివరాజ్ విశ్వనాథ్ పాటిల్
గొప్ప పార్లమెంటేరియన్‌గా, కేంద్ర హోంమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన శివరాజ్ పాటిల్ ఓయూ పూర్వ విద్యార్థే. ఆయన ఏడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1935 అక్టోబర్ 12న జన్మించిన ఆయన.. పంజాబ్, చండీగఢ్‌లకు గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశారు. ఓయూ నుంచి ఆయన సైన్స్‌లో డిగ్రీ పొందారు.