ఓయూ శతాబ్ది ఉత్సవాలకు రండి
- రాష్ట్రపతికి కేసీఆర్ ఆహ్వానం
- ఏడాది పాటు వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
- ఓయూ అభివృద్ధికి రూ.300 కోట్లు ఇవ్వాలని జవదేకర్‌కు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మంగళవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. విశ్వవిద్యాల యాల్లో ఒకటిగా గుర్తింపు పొందడంతోపాటు విద్యా ప్రమాణాల్లో సైతం తనదైన ముద్ర వేసుకున్న ఉస్మానియా వర్సిటీ శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఏప్రిల్ 26 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 25 వరకు ఏడాది పాటు ప్రత్యేక ఉత్సవంగా ఈ వేడుకలను జరపనున్నట్టు తెలిపారు.
రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా తొలి మూడు రోజులు ప్రారంభోత్సవంగా నిర్వహిస్తున్నామని, దానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించి ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రపతిని కలసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి. బి.వినోద్ కుమార్, సీతారాం నాయక్ ఉన్నారు. సీఎం ఆహ్వానంపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, వేడుకలకు హాజరయ్యే అంశంపై త్వరలో సమాచారమిస్తామన్నారని ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియాకు తెలిపారు.
కేంద్రం వివక్ష చూపుతోంది: జితేందర్‌రెడ్డి
వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నప్పటికీ.. కేం ద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందని ఎంపీ జితేందర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి, కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం ఆయన మీడి యాతో మాట్లాడారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన ఎయిమ్స్, ఐఐఎంల ఏర్పా టును కేంద్రం పక్కన పెట్టిందన్నారు. గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించే శకటాల విషయంలోనూ తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చి, రద్దు చేశారని.. ఆ అపాయింట్‌మెంట్‌ను తామే రద్దు చేయించామని బీజేపీ రాష్ట్ర నేతలు చెప్పారని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ చూస్తోంటే రాజకీయ ప్రేరేపిత కారణాలతో కేంద్రం తెలంగాణ ప్రభుత్వంపై వివక్ష చూపుతోందని స్పష్టమవుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే టీఆర్‌ఎస్ పార్లమెంటు సభ్యులెవరూ సభకు హజరు కావడం లేదని.. తానొక్కడినే సభకు హాజరై ఈ విషయంపై స్పష్టత ఇస్తున్నానని చెప్పారు.
రాష్ట్రానికి తిరిగి చేరుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన కేసీఆర్.. రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసి ఉస్మానియా వర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ అయి.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఓయూ అభివృద్ధికి నిధులివ్వండి
రాష్ట్రపతితో భేటీ అనం తరం సీఎం కేసీఆర్ బృందం కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో సమావేశమైంది. ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేడుకల నిర్వహణకు, క్యాం పస్‌లో భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.300 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఇంత మొత్తంలో కాకపోయినా వివిధ విశ్వవిద్యాలయాల శతాబ్ది ఉత్సవాలకు విడుదల చేసిన దానికన్నా ఎక్కువగా నిధులిస్తామని జవదేకర్ హామీ ఇచ్చారు. ఇక త్వరలో హైదరాబాద్‌లో జరిగే అన్ని రాష్ట్రాల వర్సిటీ వైస్ చాన్సలర్ల సదస్సుకు హాజరుకావాల్సిందిగా జవదేకర్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని వివరించారు. అలాగే కొత్త జిల్లాల్లో కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలల ఏర్పాటు, వాటిల్లో 12వ తరగతి వరకు విద్య అందించడానికి కేంద్ర సాయం అందించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు.