తెలుగుతెరపై ఆమెకు ప్రత్యామ్నాయం లేదు | No Substitute for Suryakantham on Telugu Screen | Sakshi
Sakshi News home page

తెలుగుతెరపై ఆమెకు ప్రత్యామ్నాయం లేదు

Published Mon, Oct 28 2013 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

తెలుగుతెరపై ఆమెకు ప్రత్యామ్నాయం లేదు

తెలుగుతెరపై ఆమెకు ప్రత్యామ్నాయం లేదు

 సూర్యకాంతం జయంతి
‘సూర్యకాంతం’... తమ పిల్లలకు ఈ పేరు పెట్టాలంటే తల్లిదండ్రులందరూ తటపటాయిస్తారు. అంటే... ఆ పేరు ప్రభావం తెలుగునేలపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ఆడకూతురైనా కాస్త గొంతు పెంచి అరిస్తే చాలు... ‘సూర్యకాంతంరా బాబూ’ అనేస్తాడు తెలుగోడు. రీల్ లైఫ్‌లో పోషించిన పాత్రలు ఇంతటి ప్రభావాన్ని చూపడం అనేది బహుశా... ఒక్క సూర్యకాంతం విషయంలోనే జరిగిందేమో! 
 నిజజీవితంలో కూడా సూర్యకాంతం టపాసుల సూరేకారమే అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ.. అందులో నిజంలేదు. రియల్ లైఫ్‌లో సూర్యకాంతం చూరుకింద కాంత మాత్రమే. కాకినాడ సమీపాన గల వెంకటక్రిష్ణరాయపురంలో సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారామె. మంచితనానికీ అల్లరితనానికీ తెగువకు పసివయసులోనే కేరాఫ్ అడ్రస్ అయ్యారు సూర్యకాంతం.
 
 సైకిళ్లు కొత్తగా అడుగుపెడుతున్న రోజుల్లోనే మగాళ్లకు దీటుగా సైకిళ్లు తొక్కేయడం, ఊళ్లోని మామిడి, జామ, సపోటా చెట్లను దులపరించేయడం, ‘ఏయ్ ఆగక్కడ’ అన్నవాళ్లను వెక్కిరించి మరీ సైకిల్‌పై ఉడాయించడం... ఇలా చిన్నవయసులో సూర్యకాంతం చేసిన ఆగడాలు అన్నీయిన్నీ కావు. ఊళ్లోని బజార్లన్నీ ఒకప్పుడు సూర్యకాంతానివేనట. ఊరిజనం ఆమెకు ‘సైకిల్ రాణి’ అని పేరు కూడా పెట్టేశారట. తర్వాత రోజుల్లో సూర్యకాంతం మహానటిగా ఎదగడానికి ఆ జోరు, ఆ హుషారే కారణమయ్యాయని చెప్పక తప్పదు. 
 ఆడపిల్లలు గడపదాటడమే పెద్ద నేరం అనుకునే రోజుల్లో ‘నేను సినిమాల్లోకి వెళుతున్నాను. నన్ను ఎవరూ వెతకొద్దు’ అని లెటర్ పెట్టి మరీ మద్రాసు రెలైక్కేశారు సూర్యకాంతం. 
 
జెమినీ స్టూడియో ముందు గూర్ఖా అడ్డుకుంటే... వాడికి చిన్న ఝలక్ ఇచ్చి మరీ లోపలికి ప్రవేశించారు. తెలుగుతెరను దశాబ్దాల తరబడి ఏలబోతున్న ఓ వెండితెర సామ్రాజ్ఞిని తాను ఆపానని ఆ క్షణాన బహుశా ఆ గూర్ఖా అనుకొని ఉండడు పాపం. ‘నారదనారది’(1946)లో తొలి అవకాశం దక్కినా... ఆ సినిమా తర్వాత కూడా అలా కనిపించి, ఇలా మాయమయ్యే పాత్రలు చాలానే చేశారామె. సూర్యకాంతం కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా మాత్రం ‘సంసారం’(1950) చిత్రమే. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో రేలంగి తల్లిగా గయ్యాళి పాత్రలో సూర్యకాంతం నటనకు తెలుగునేల ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెరపై ఆ గయ్యాళి తనాన్ని చూసి తిట్టని వారు లేరు. ఆ తిట్లన్నీ ఆ మహానటికి దీవెనలే అయ్యాయి. తెలుగు తెరపై ప్రత్యామ్నాయం లేని నటిగా ఎదగడానికి బాటలు వేశాయి. 
 
 బ్రతుకుదెరువు, చక్రపాణి, దొంగరాముడు, భాగ్యరేఖ, తోడికోడళ్లు, మంచి మనసుకు మంచి రోజులు, మాంగల్యబలం, కలసివుంటే కలదు సుఖం, శభాష్‌రాజా, వాగ్దానం, గుండమ్మకథ, కులగోత్రాలు, రక్తసంబంధం, రాముడు-భీముడు, వెలుగునీడలు, దసరా బుల్లోడు ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకాంతం సృష్టించిన అద్భుతాలు ఎన్నో. సూర్యకాంతంలో ప్రేక్షకులకు నచ్చింది గయ్యాళితనం మాత్రమే కాదు. అ గయ్యాళితనంలో అంతర్లీనంగా దాగున్న అమాయకత్వం. అందుకు గుండమ్మకథ, వెలుగునీడలు, శాంతినివాసం లాంటి సినిమాలే ఉదాహరణ. అలాగే కారుణ్యం అనేది తెలియని కటిక రాకాసి పాత్రల్లో కూడా శభాష్ అనిపించారామె. ‘రక్తసంబంధం’ సినిమాలోని ‘కాంతమ్మ’ పాత్రే అందుకు నిదర్శనం. 
 
‘మాయాబజార్’లో ఘటోత్కచుని తల్లి హిడింబగా ‘అలమలం సుపుత్రా అలమలం’ అంటూ చిత్రమైన శారీరకభాషతో కనిపించే సూర్యకాంతాన్ని ఎవరైనా మరిచిపోగలరా? 
 అభిమానులు కూడా సూర్యకాంతాన్ని దూరం నుంచి చూడ్డమే తప్ప దగ్గరికొచ్చే సాహసం మాత్రం చేసేవారు కాదట. ఓ సారి ఆమె స్వయంగా... ‘రండీ... అలా దూరంగా నిలబడ్డారే’ అన్నారట. ఆ గుంపులో ఉన్న ఓ కుర్రాడు... ‘మీరు ఎడమచేయి విసురుతారేమో అని భయం’ అన్నాట్ట. ‘సినిమాల్లో అంటే... వాళ్లు డబ్బులిస్తున్నారు కాబట్టి విసురుతాను... నువ్వేమిస్తావ్ నాకు’ అన్నారట తనదైన శైలిలో ఎడమచేయి తిప్పుతూ సూర్యకాంతం. అంతే... ఇక అక్కడంతా నవ్వులే నవ్వులు. 
 
 ‘శ్రీమంతుడు’ సినిమా షూటింగ్ జరుగుతోంది. సూర్యకాంతంపై ఓ కీలక సన్నివేశాన్ని తీస్తున్నారు ప్రత్యగాత్మ. పాత్రను సొంతం చేసేసుకొని నటించడం సూర్యకాంతం స్పెషాలిటీ. అందులో భాగంగానే... స్క్రిప్టులో ఉన్న డైలాగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో సొంతంగా అనేస్తున్నారట. ప్రత్యగాత్మ కూడా కట్ చెప్పకుండా... సెలైంట్‌గా ఉండిపోయారట. ఇంతలోనే టక్‌మని ఆపేసి, ‘ఏంటి నాయనా కట్ చెప్పవేం’ అన్నారట సూర్యకాంతం. ‘బాగుంది కదమ్మా... అందుకే...’ అన్నారట ఆయన. ‘అవునా... ఎగస్ట్రా డైలాగులు చెప్పాను కదా.. మరి ఎగస్ట్రా పేమెంటేదైనా ఇప్పిస్తావా’ అన్నారట తడుముకోకుండా. 
 
ఇంకేముంది...  లొకేషన్ మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. 
 సూర్యకాంతం లొకేషన్లో ఉంటే సందడే సందడి. ఇంట్లో వండుకున్న పిండివంటలన్నీ తెచ్చి లొకేషన్లో అందరికీ పెట్టేవారట ఆమె. ఓ రోజు సూర్యకాంతం, ఛాయాదేవి ఇద్దరూ ఇంటిలో వండుకున్న పిండివంటలు తెచ్చుకొని లొకేషన్లో తింటున్నారట. అది చూసిన రేలంగివారు ఓ విధంగా మొహం పెట్టి.. ‘ఏం తింటున్నార్రా బాబూ’ అన్నారట . ‘మేం మా ఇంట్లోవే తింటున్నాం. రీళ్లు తినడంలా...’ అన్నారట ఠపీమని సూర్యకాంతం. అంతే... రేలంగి గతుక్కుమన్నారట. సూర్యకాంతం మనసు చాలా సున్నితం. పాత్రలో భాగంగా చిత్తూరు నాగయ్యగారిని తిట్టాలి. 
 
దర్శకుడు ‘యాక్షన్’ అని కేకపెట్టగానే... తనదైన స్టైల్‌లో నాగయ్యగారిని చెడామడా తిట్టేసి, దర్శకుడు కట్ చెప్పగానే... ఆయన కాళ్లమీద పడి భోరున ఏడ్చారట. ‘పాపిష్టిదాన్ని... అనరాని మాటలన్నాను. క్షమించండి నాన్నగారు..’ అని ఆమె విలపిస్తుంటే... ‘ఊరుకోమ్మా... నన్ను కాదు కదమ్మా నువ్వు తిట్టిందీ.. నా పాత్రను’ అని నాగయ్య ఊరడించారట. సూర్యకాంతం తెరపై కనిపించిన చివరి సినిమా ‘ఎస్పీ పరశురాం’(1994). అదే ఏడాది డిసెంబర్ 18న ఆమె సినీలోకాన్ని వదిలి స్వర్గలోకంలోకి అడుగుపెట్టారు. సూర్యకాంతం ఎప్పుడూ నటించలేదు. బిహేవ్ చేసేవారు. అందుకే ఆమె సహజనటనకు చిరునామా. నేడు ఆ మహానటి జయంతి. తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఆమె తెరపై వెలిగించిన వెలుగు రేఖలు దేదీప్యమానంగా విరాజిల్లుతూనే ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement