
సూర్యకాంతం... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ పేరు చెప్పగానే గయ్యాళి అత్త పాత్రలు చేసిన సూర్యకాంతం గుర్తొస్తారు. వెండితెరపై సూర్యకాంతం చేసిన గయ్యాళి పాత్రలు ఎంత ప్రభావం చూపాయంటే నిజ జీవితంలో ఆవిడ పేరు పెట్టుకునే సాహసం ఎవరూ చేయరు. తాజాగా ‘సూర్యకాంతం’ పేరుతో ఓ సినిమా తెరకెక్కడంతో ఆ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సందీప్ యెర్రం రెడ్డి, సృజన్ యెర్రబాబు, రామ్ నరేష్ నిర్మించారు. మంగళవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా చిత్ర సమర్పకుడు, హీరో, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ ‘సూర్యకాంతం’ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఓ వైపు ప్రేమ చూపిస్తూనే.. మరోవైపు గొడవ పడుతున్న నిహారిక, రాహుల్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘‘రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. పెర్లేనె భెసానియా, శివాజీ రాజా, సుహాసిని, సత్య నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: నిర్వాణ సినిమాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజ్ నిహార్, కెమెరా: హర్జీ ప్రసాద్, సంగీతం: మార్క్ కె.రాబిన్.
Comments
Please login to add a commentAdd a comment