నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే | Late Actress Suryakantham 95th Birth Anniversary | Sakshi
Sakshi News home page

తలిచెదము నిను తప్పక ఓ అత్తగారూ...

Published Wed, Oct 28 2020 8:37 AM | Last Updated on Wed, Oct 28 2020 8:37 AM

Late Actress Suryakantham 95th Birth Anniversary - Sakshi

ఆమె పెత్తనానికి తల వొంచని కోడలు లేదు. ఆమె దాష్టికానికి బాధలు పడని సవతి కూతురు లేదు. ఆమె నోటికి జడవని భర్త లేడు. ఆమె తగాదాకు బెదిరి పారిపోని ఇరుగింటి పొరుగింటివారు లేరు. అసలు ఆమె పేరు పెట్టుకోవాలంటేనే గడగడలాడే తెలుగువారున్నారు. అయినా ఆమెను ఇష్టపడని వారంటూ లేరు. ఎందుకంటే తెర మీద ఆమె చేసిన చెడ్డలన్నీ మంచికే దారి తీశాయి. కష్టాలు ఎదుర్కొన్నవాడే మనిషి.సూర్యకాంతంను ఎదుర్కొన్నావారే హీరో... హీరోయిన్‌. నేడు ఆమె 95వ జయంతి.

‘గుండమ్మ కథ’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. రచయిత డి.వి.నరసరాజు. సవితి కూతురైన సావిత్రిని కథ ప్రకారం గుండమ్మ బాధలు పెట్టాలి. ‘గుండమ్మ గయ్యాళితనాన్ని ఎస్టాబ్లిష్‌ చేసే సీన్లు రాయమంటారా?’ అని అడిగారు నరసరాజు. ‘ఎందుకండీ దండగ. గుండమ్మగా వేస్తున్నది సూర్యకాంతం. సూర్యకాంతం అంటేనే గయ్యాళి. మళ్లీ ఎస్టాబ్లిష్‌ చేయడం ఎందుకు. ఫిల్మ్‌ వేస్టు’ అన్నారు చక్రపాణి. నిజంగానే సినిమాలో గుండమ్మ సావిత్రిని బాధించే సీన్లు ఉండవు. కాని ప్రేక్షకులు మాత్రం ఆమె సావిత్రిని బాధిస్తున్నదనే మానసికంగా అనుకుంటారు. సూర్యకాంతం సృష్టించుకున్న ఇమేజ్‌ అలాంటిది.

‘శాంతి నివాసం’లో సూర్యకాంతం అత్తగారిలా నానా రాద్ధాంతం చేస్తూ ఉంటుంది. కొడుకైన కాంతారావు, కోడలైన దేవిక గదిలో ఉన్నా సహించలేదు. పైగా కూతురైన బాల సరస్వతిని అత్తారింటికి పంపక అల్లుడైన రేలంగిని కాల్చుకు తింటుంటుంది. రేలంగి పేరు నరసింహాలు. కాని ‘గొడ్డు సింహాలు’ అని పిలుస్తూ అవమానిస్తూ ఉంటుంది. రేలంగి నోరు బాదుకుంటూ మావగారైన చిత్తూరు నాగయ్య దగ్గరకు వెళ్లి ‘చూశారా మావగారు. అత్త నన్ను గొడ్డు సింహాలు అంటోంది’ అని మొరపెట్టుకుంటాడు. దానికి నాగయ్య ఆకాశం వైపు చూస్తూ విభూతి ముఖంతో ‘అంతా ఆ భగవంతుని లీల. నాతో చెప్పుకుంటావేమి నాయనా’ అని జారుకుంటాడు. సూర్యకాంతం ఇంట్లో ఉన్నాక భర్త సాక్షాత్తూ చిత్తూరు నాగయ్య అయినా నిమిత్తమాత్రుడే.

‘మంచి మనసులు’లో లాయరైన ఎస్‌.వి.రంగారావుకు సూర్యకాంతం భార్య. అక్కినేని తనకు పెళ్లయ్యిందని అబద్ధం చెప్పి ఆ ఇంట్లో అద్దెకు దిగుతాడు. ఆ ఇంటి అల్లరి ఆడపిల్లైన సావిత్రి ఇది కనిపెట్టి అక్కినేని భార్యకు కొడుకు పుట్టాడని సరదాకు దొంగ టెలిగ్రాము వచ్చేలా చేస్తుంది. అది చూసి నమ్మిన సూర్యకాంతం మంచి శుభవార్తే కదా అని గుప్పిట్లో చక్కెర పట్టుకుని భర్తయిన ఎస్‌.వి.ఆర్‌తో ‘ఏదీ.. ఒకసారి నోరు తెరవండీ’ అంటుంది. దానికి ఎస్‌.వి.ఆర్‌ జవాబు– ‘నీ ముందు నేనెప్పుడైనా నోరు తెరిచానటే’. ఎస్‌.వి.ఆర్‌ తెర మీద కూడా పులే. కాని భార్య సూర్యకాంతం అయినప్పుడు పిల్లి.

సూర్యకాంతం చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు. ఆమె నటించిన గొప్ప సినిమాలు వచ్చి దాదాపు 50 సంవత్సరాలు. అయినా సరే తెలుగువారు తమ పలుకుబడిలో ఆమె పేరు మరువలేదు. తీసేయలేదు. ఇది మగ ప్రపంచం. వాడు తనకు నచ్చనివి ఎదురుపడితే కొడతాడు, తిడతాడు, అమి తుమి తేల్చుకుంటాడు. కాని స్త్రీ అలా చేయలేదు. తన కోపం, అక్కసు, నిస్సహాయత, అసంతృప్తి అన్నీ ఎదుటివాళ్ల మీద నిరపాయంగా తీర్చుకోవాల్సిందే. దానికి నోటిని ఆయుధంగా చేసుకుంటుంది. తద్వారా గయ్యాళిగా పేరు తెచ్చుకుంటుంది. ఇదొక వ్యక్తిత్వ లక్షణం. మానసిక అవస్థ. ఇలాంటి అవస్థలో ఉన్నవారు గతించిపోరు. వారు ఉన్నంత కాలం ప్రజల మధ్య సూర్యకాంతం అనే పేరు మాసిపోదు. ఎందుకంటే ఆమె ఆ మాత్రకు నిలువెత్తు నమూనాగా నిలిచింది కాబట్టి.

తెలుగువారు తెలుగు సినిమాలు మొదలెట్టినప్పుడు సమాజానికి అనుగుణంగా కుటుంబ కథలే ఎంచుకున్నారు. కుటుంబంలో విలన్‌లకు చోటు లేదు. విధికి తప్ప. ఆ విధి పాత్రను సూర్యకాంతం పోషించింది. కథలు మలుపు తిప్పింది. మంచివారికి పుట్టెడు కష్టాలు వచ్చేలా చేసింది. పరీక్షలు పెట్టింది. చివరికి వాటిలో పాస్‌ చేయించి, తాను చెడ్డ పేరును మూటగట్టుకుని, వారికి మంచి పేరు వచ్చేలా చేసింది. కాకినాడలో బాల్యంలో దూకుడుగా పెరిగిన సూర్యకాంతం ఆ వ్యక్తిత్వాన్నే తన పాత్రలో ప్రవేశపెట్టింది. ‘సంతానం’ (1950) ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా. అందులో 26 ఏళ్ల వయసులో రేలంగికి తల్లిగా నటించి తెర మీద డైలాగులను చెరిగేసిందామె. ఆ తర్వాత ఆగలేదు.

‘మాయాబజార్‌’, ‘తోడి కోడళ్ళు’, ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘వెలుగు నీడలు’, ‘భార్యాభర్తలు’, ‘కలసి ఉంటే కలదు సుఖం’, ‘కులగోత్రాలు’, ‘రక్త సంబంధం’... ఎన్నో. ‘దసరా బుల్లోడు’ సినిమాలో ఆమె పెట్టే కష్టాలకు ఆమెను ఏం చేసినా పాపం లేదన్నంతగా సగటు ప్రేక్షకులు కోపం తెచ్చుకునే స్థాయికి ఆమె పాత్రను రక్తి కట్టించింది. రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, ఎస్‌.వి.రంగారావు వంటి ఉద్దండులు ఆమెకు భర్తగా నటించి కథలను పండించారు. పద్మనాభం ఆమెకు పర్మినెంట్‌ కొడుకు. ఒకే పాత్ర.. కాని ప్రతి సినిమాలో భిన్నంగా పోషించిందామె. ఎడమ చేయి ఆడిస్తూ, విసురుగా డైలాగ్‌ చెప్పే పద్ధతి మరొకరికి రాలేదు. రాబోదు కూడా. ఆమె ఎంతో కపటిగా నటించింది. ఎంతో అమాయకురాలిగా కూడా నటించింది. ఎంతో గయ్యాళిగా కోపం తెప్పించి ఎంతో చాదస్తంతో నవ్వులు కూడా పూయించింది. ఇన్నీ చేసింది ఒక్కతే సూర్యకాంతం.

తెర మీద గయ్యాళిగా ఉన్న సూర్యకాంతం నిజ జీవితంలో స్నేహశీలి. దాత. నటీనటులకు ఆత్మీయురాలు. భక్తురాలు. వారికి ఏదైనా ఆపద వస్తే వారి తరుఫున తాను మొక్కులు మొక్కుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. షూటింగ్‌కి రకరకాల పదార్థాలు వండి తెచ్చి పంచి పెట్టేదామె. మంచి వంటకత్తె. తెలుగునాట వంటల పుస్తకం వెలువరించిన తొలి రచయితల్లో ఆమె ఒకరు. ఆమె చేసిన పులిహోర వంటిది మళ్లీ జీవితంలో ఎరగనని నటుడు గుమ్మడి చెప్పుకున్నారు. సంతానం కలగకపోతే అక్క కొడుకును దత్తత తీసుకుని అతడినే తన కుమారుడిగా చూసుకున్నారు.

చదువుకోవాలని ఎంతో ఉన్నా చదువుకోలేకపోయిన సూర్యకాంతం చివరి రోజుల్లో తిరుపతి మహిళా యూనివర్సిటీ వారు ‘డాక్టరేట్‌’తో సత్కరించడాన్ని ఎంతో గొప్పగా భావించింది. ‘నా పేరు కాంతమ్మ’ అని ఆమె అంటే ఎస్‌.వి.ఆర్‌ ‘సూర్యకాంతమ్మ’ అని అందిస్తాడు ఒక సినిమాలో. ఆ పేరు అలా నిలిచి ఉంది మరి. 1994 డిసెంబర్‌ 18న ఆమె చెన్నైలో కన్నుమూస్తే తెలుగు పరిశ్రమ నుంచి పట్టుమని పదిమంది హాజరయ్యారు. తెర మీద ఎంతో గయ్యాళితనం ప్రదర్శించిన ఆ గొప్ప నటి పట్ల తెలుగు వారు ప్రదర్శించిన సిసలైన గయ్యాళితనం అది.

- కె

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement