భావోద్వేగాలతో...కబడ్డీ కబడ్డీ
గయ్యాళి తల్లి సూర్యకాంతం
వర్సెస్ సవతి కూతురు సావిత్రి!
గారాబాల చెల్లెలు జమున
వర్సెస్ పనిమనిషి లాంటి సావిత్రి!
రోడ్ రోలర్ లాంటి సూర్యకాంతం
వర్సెస్ ఆర్మీ ట్యాంక్ లాంటి ఛాయాదేవి!
స్మార్ట్ లవర్ బాయ్ అక్కినేని
వర్సెస్ ఇన్నోసెంట్ ప్రేమికుడు ఎన్టీవోడు!
పెళ్లి చెడగొట్టే డర్టీ ఫెలో రమణారెడ్డి
వర్సెస్ కథ నడిపించే పెద్దమనిషి ఎస్వీ రంగారావు!
ఇన్ని ఎమోషన్స్‌తో కబడ్డీ... కబడ్డీ...!
గుండెలను కరిగించే కథ!
పరివర్తన తెచ్చే కథ!
కుటుంబాలను కలిపే కథ!
ఇప్పటికీ నచ్చే కథ!
మళ్లీ చూడండి
రామ్,
ఎడిటర్, ఫీచర్స్
ఒక రాక్షసుడు ఉండేవాడు. బండెడు అన్నం, రోజుకో మనిషి వాడి డైట్. అదీ సరిపోయేది కాదు. నిద్రపట్టక దొర్లేవాడు. అర్ధాకలి మరి! మళ్లీ ఎప్పుడు వేళవుతుందా... ఎప్పుడు బండెడు అన్నం తిందమా అని ఎదురు చూసేవాడు. రోజుకొక మనిషన్నది కూడా ఆ రాక్షసుడి నియమం కాదు. అది మనుషులు పెట్టిన రేషనింగ్. లేకపోతే ఊరి మీద పడి దొరికినవాళ్లని దొరికినట్టు నోట్లో వేసుకుని చప్పరించేస్తాడు కదా. అంత స్టామినా వాడిది.
సూర్యకాంతం నటనలో అంతకు రెండింతల స్టామినా ఉంటుంది. స్టామినా కాదు, రాక్షసత్వం. రోల్ ఏదైనా రోస్ట్ చేసేస్తుంది. కారాలు మిరియాలు అద్దుకుని మరీ కరకర న మిలేస్తుంది. కళ్లమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. అమెక్కాదు. ఆమె దబాయించే మనిషికి. అంతటి మనిషిని ‘గుండమ్మ కథ’లో పస్తులుంచేశారు చక్రపాణి! అందులో సూర్యకాంతం గయ్యాళి. ఈ గయ్యాళి పాత్రను ఆయన షేక్స్‌పియర్ నవల ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత, కన్నడ సినిమా ‘మనె తుంబిద హెణ్ణు’ నుంచి కొంత తీసుకుని శిల్పంలా చెక్కారు. అయితే సావిత్రిపై విసుక్కోవడం, చికాకు పడడం తప్ప సూర్యకాంతంలో వేరే గయ్యాళితనం కనిపించదు గుండమ్మ కథలో. ‘బాబోయ్... గుండమ్మా!’ అని తక్కిన పాత్రలు మాత్రం బెదిరిపోయి పారిపోవడం తప్ప.
ఎన్టీఆర్, ఏఎన్నార్... అప్పటికే సూపర్‌స్టార్లు. ఒకరిని మించిన వారొకరు. ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు. ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. రోల్ ఏదైనా వాళ్లు హీరోల్లానే కనిపించాలి. మరోలా కనిపిస్తే బాక్సులు కాకుండా వేరే ఏవైనా బద్దలైపోతాయి. అలాంటిది.. కథ కోసమే అయినా, కామెడీ కోసమే అయినా ఎన్టీఆర్‌ని పనిమనిషి అంజిగాడిగా, ఏయన్నార్‌ని కొంటె కోణంగిగా చూపించడం పెద్ద సాహసం. పెపైచ్చు సినిమా టైటిల్ కూడా వారిని ఇండికేట్ చేసేలా లేదు. కథా వాళ్లిద్దరి చుట్టూ అల్లింది కాదు. అయినా అంత పెద్ద సాహసాన్ని అలవోకగా చేసేశారు చక్రపాణి-నాగిరెడ్డి... విత్ ది హెల్ప్ ఆఫ్ కమలాకర కామేశ్వరరావు.
గుండమ్మ కథ మొత్తం ఇలాగే ఉంటుంది. వైవిధ్యంగా! రమణారెడ్డి ఉంటాడు. డేంజరస్ విలన్! పెళ్లిళ్లు చెడగొట్టడాన్ని మించిన డేంజరస్ విలనీ ఏముంటుంది చెప్పండి!! కానీ అంత డేంజరస్‌గా అనిపించడు. తెరపై కనిపించినప్పుడల్లా నవ్వించి పోతుంటాడు. పోయి, మళ్లీ నవ్వించడానికే వస్తున్నట్లు ఉంటాడు. ఈ మధ్యలో చేసే పనంతా చేస్తుంటాడు.
ఇక గుండమ్మ సొంత కూతురు జమున పెంకి పిల్ల. సినిమాలో మరీ అంత పెంకితనం ఏమీ కనిపించదు. సవతి కూతురు సావిత్రి తెల్లారకుండానే లేచి ఇంటిపనులు మొదలు పెడితే, ఈ అమ్మాయికి ఎప్పటికో గానీ తెల్లారదు. బారెడు పొద్దెక్కాక ఒళ్లు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి ‘అమ్మా... కాఫీ’ అని అడుగుతుంటుంది. అతి గారాబం. ఇక్కడికి ఈ వైపు క్యారెక్టర్లు అయిపోయాయి. సూర్యకాంతం, సావిత్రి, జమున, కొడుకు హరనాథ్, వాళ్లింటికి వచ్చిపోతుండే రమణారెడ్డి.
అటువైపు ఎస్వీరంగారావు. ఆయన పెద్దకొడుకు ఎన్టీఆర్, చిన్న కొడుకు ఏఎన్నార్. వీళ్లతోపాటు కథ అవసరాన్ని బట్టి ఛాయాదేవి (హరనాథ్ ప్రేమించిన ఎల్.విజయలక్ష్మి మేనత్త), రమణారెడ్డి కొడుకు రాజనాల ఎంట్రీ ఇచ్చి వెళుతుంటారు.
వీళ్లంతా పాత్రకు తగ్గ ఎమోషన్స్‌ని పలికిస్తుంటారు కానీ, ఆ పాత్రల స్వభావాలను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు పదే పదే సినిమాలో కనిపించవు. సూర్యకాంతం ఏమిటో చెప్పడానికి ఆమె ఫేస్‌వ్యాల్యూ ఒక్కటి చాలదా! చక్రపాణి కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి ఆమెను అలా వదిలేశారు సహజసిద్ధంగా. ఆమెను దారిలో పెట్టడానికి అంతే ఫేస్‌వ్యాల్యూ ఉన్న ఛాయాదేవిని బాణంలా వదిలారు. ఇక ఆ తర్వాతి సీన్‌లు ఎలా నడవాలన్నది వాళ్లిద్దరి ఇష్టం. సూర్యకాంతం, ఛాయాదేవి కలిస్తే ఇంకేముందీ.. డెరైక్టర్‌ని కూడా మధ్యలోకి రానివ్వరు. గుండమ్మ కథలోనూ అలాగే జరిగింది. సినిమా హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అయిందంటే మాత్రం ఒక పేరు చెప్పలేం. సినిమా చూడాల్సిందే. గుండమ్మ కథలోని ప్రతి ఆర్టిస్టూ సినిమా చూపించారు. సంప్రదాయ నటనకు భిన్నంగా (ప్రోగ్రెసివ్ అనాలేమో) నటుల చేత యాక్ట్ చేయించి, కథను నడిపించిన చక్రపాణిని కూడా ఇందులోని హిట్ క్యారెక్టర్‌గానే చెప్పుకోవాలి.
కథేమిటి?
సూర్యకాంతం వితంతువు. కూతుళ్లు సావిత్రి, జమున. కొడుకు హరనాథ్. సంపన్న కుటుంబం. ఎస్వీరంగారావుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎన్టీఆర్, చిన్నవాడు ఏఎన్నార్. అది మరీ సంపన్న కుటుంబం. కొడుకులిద్దరికి మంచి సంబంధాల కోసం వెదుకుతుంటాడు ఎస్వీరంగారావు. ఇక్కడ సూర్యకాంతానికీ అదే పని. అయితే సొంత కూతురికి మాత్రమే సంబంధాలు చూస్తుంటుంది. సావిత్రిని ఎవడో తలమాసిన వాడికి ఇచ్చేస్తే సరిపోతుందని ఆమె ఉద్దేశం. ఎస్వీఆర్ గురించి సూర్యకాంతానికి తెలుస్తుంది. మధ్యవర్తిని పంపి జమున విషయం చెప్పిస్తుంది. ఈ సూర్యకాంతం ఎవరో కాదు, చనిపోయిన తన స్నేహితుడి భార్యేనని ఎస్వీఆర్‌కి తెలుస్తుంది.
ఎన్టీఆర్, ఏయన్నార్‌లకు... సావిత్రి, జమునల్ని ఇచ్చి చేస్తే స్నేహితుడి ఆత్మ శాంతిస్తుందని భావిస్తాడు. అలాగే గయ్యాళి సూర్యకాంతంలో, ఆమె పెంకి కూతురు జమునలో మార్పుతేవాలని అనుకుంటాడు. ఆ సంగతిని కొడుకులిద్దరికీ చెప్పి చిన్న నాటకం ఆడమంటాడు. ఎన్టీఆర్ పనిమనిషిలా సూర్యకాంతం ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మొదట ఆమెను బుట్టలో వేసుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత సావిత్రి హృద యాన్ని గెలుచుకుంటాడు.
ఇక ఏఎన్నార్. జమునను వలలో వేసుకుని ఆమె ప్రేమను పొందుతాడు. సంపన్నుడైన ఎస్వీరంగారావు కొడుగ్గానే పరిచయం చేసుకుంటాడు. అలా ఇటు ఎన్టీఆర్, అటు ఏయన్నార్... సూర్యకాంతం కుటుంబానికి బాగా దగ్గరవుతారు. మొదట ఎన్టీఆర్, సావిత్రిల పెళ్లి జరుగుతుంది. తర్వాత చిన్న అవరోధంతో ఏయన్నార్, జమునలు దంపతులవుతారు. అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది. ఎన్టీఆర్ సావిత్రిని తన ఇంటికి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేస్తాడు. ఏయన్నార్ మరోలా సర్‌ప్రైజ్ చేసి (తను ఎస్వీఆర్ కొడుకును కాదన్న అబద్ధంతో) జమునను తనతో పాటు తీసుకెళ్లి అష్టకష్టాలు పడనిచ్చి చివర్లో అసలు విషయం చెప్తాడు. సూర్యకాంతం కూడా ఎస్వీఆర్ ఇంటికి వచ్చేస్తుంది. కథ సుఖాంతం. ఈ మధ్యలో కొన్ని మలుపులు, కొన్ని మెరుపులు...
కథలో బలం ఉన్నప్పుడు పాత్రల స్వభావాలను పట్టిపట్టి ఎలివేట్ చేయల్సిన పనిలేదని నిరూపించిన చిత్రం... గుండమ్మ కథ. నిరూపించిన నిర్మాత చక్రపాణి. మళ్లీ చూడవలసిన సినిమా. మన పిల్లలకూ చూపించవలసిన సినిమా. మోడర్న్ అమ్మలకీ, నాన్నలకీ కథలు రావు. ఏంత రాకున్నా ఒక కథ మాత్రం వారు చెప్పగలరు. అదే... ఏడు చేపల కథ. అందుకే ఆ కథ ప్రతి తరానికీ అందుతోంది. సరిగ్గా అలాంటి కథే గుండమ్మ కథ. మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన కథ.
- సాక్షి ఫ్యామిలీ
కొన్ని విశేషాలు
- ఎన్టీఆర్‌కిది 100వ సినిమా. ఏయన్నార్‌కు 99వ చిత్రం.
- గుండమ్మకథకు మూడేళ్ల ముందు ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో జమునకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఆ మూడేళ్లు వాళ్ల పక్కన జమున నటించలేదు. ఈ సినిమా కోసం నాగిరెడ్డి-చక్రపాణి గట్టిగా జోక్యం చేసుకుని ముగ్గురినీ కలిపారు.
- ఈ సినిమాలో అందరూ బిజీ ఆర్టిస్టులే కావడంతో ఎవరి డేట్స్ దొరికితే వాళ్లతో సీన్లు తీసేశారు. ‘కోలో కోలో యన్న కోలో’ పాటలో ఎన్టీఆర్, సావిత్రి, ఏయన్నార్, జమున కలిసి పాడతారు కదా. నిజానికి షూటింగ్‌లో నలుగురూ కలిసిందే లేదు. ఇద్దరొకసారి, మరో ఇద్దరు ఇంకోసారి పాట పూర్తి చేసి నలుగురూ కలిసి పాడారన్న ఎఫెక్ట్ తీసుకొచ్చారు.
- మరో ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డికి ఈ కథ నచ్చలేదు. హిట్టయిన తర్వాత కూడా ఇది ఎందుకు అంత పెద్ద విజయం సాధించిందో తనకు అర్థం కాలేదని అన్నారట!
లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం
మౌనముగా నీ మనసు పాడిన
కనులు మూసినా నీవాయే...
కోలోకోలోయన్న కోలో నా సామి
ఎంత హాయి ఈ రేయి
వేషము మార్చెను, భాషను మార్చెను
అలిగిన వేళనే చూడాలి
ప్రేమయాత్రలకు బృందావనము