ఈ రెండు కోరికలు తక్క! | Seen is yours title is ours 14-04-2019 | Sakshi
Sakshi News home page

ఈ రెండు కోరికలు తక్క!

Published Sun, Apr 14 2019 3:37 AM | Last Updated on Sun, Apr 14 2019 3:37 AM

Seen is yours title is ours 14-04-2019 - Sakshi

బీయే సుబ్బారావు దర్శకత్వంలో ఎన్‌టీఆర్, సావిత్రి,  కృష్ణంరాజు...నటించిన ఒక పౌరాణిక సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం...

భార్య చేతుల్లో ఉన్నాడు భర్త. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.‘‘నేను ఉండగా నీకే గండం రానివ్వను’’ భర్తకు ధైర్యం చెబుతుంది సావిత్రి.ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు.‘‘ఎవరునువ్వు?’’ రెట్టించి అడిగింది ఆమె.‘‘మృత్యువును’’ అని సమాధానం వచ్చింది.‘‘మృత్యువా? ధర్మరాజా అభివందనం. నీ దివ్యసందర్శనం ప్రసాదించు’’ అని వేడుకుంది సావిత్రి.అదిగో ఆయన దివ్యమంగళరూపం!‘‘ధన్యోస్మి ప్రభూ! ధర్మప్రభూ నీ కర్తవ్య నిర్వాహణకు వచ్చావా?’’ అని అడిగింది సావిత్రి.‘‘అవును తల్లీ’’ అన్నాడు యమధర్మరాజు.‘‘నా పతిప్రాణాలు తీసుకొనిపోక తప్పదా?’’ అని అడిగింది దీనంగా.‘‘తప్పదమ్మా. కాని నవ్వు మహాప్రతివతవు’’ అన్నాడు ఆయన చల్లగా! నీ ఒడిలో ఉన్నంత వరకు నీ పతి ప్రాణాలను తీసుకోలేను. అతనిని భూశయనం చేయించు’’ అన్నాడు యమధర్మరాజు.ఈమాటతో ఆమెలో ఒకింత ఆగ్రహం తొంగి చూసింది...‘‘ధర్మపాలన నీకే కాదు నాకూ ఉన్నది. పతిప్రాణాలను మృత్యువుకు అర్పించుట సతికి ధర్మమా?’’ అని ఆవేశంగా అడిగింది.‘‘ఇందులో మీరు అర్పించినది ఏమియును లేదు. నీ భర్త ఆయుఃకాలం తీరింది.

మృత్యువు ఆవశ్యం. అనివార్యం!’’ గట్టిగా అన్నాడు ధర్మరాజు.‘‘అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరంఏమిటి?’’ అన్నది ఆమె.‘‘నన్ను పరీక్షిస్తున్నావా?’’ గొంతు పెద్దది చేశాడు యమధర్మరాజు.‘‘నా సతీధర్మాన్ని పాటిస్తున్నాను’’ అన్నది ఆమె.‘‘దాహం...దాహం...’’ అంటున్నాడు ఆమె భర్త.‘‘తెస్తాను ప్రభూ’’ అంటూ నీళ్ల కోసం వెళ్లింది సావిత్రి.ఇదే అదునుగా అతడిలోని ప్రాణజ్యోతిని మృత్యుదండంతో లాగాడు యముడు.సావిత్రి వచ్చే సరికి భర్త చనిపోయి ఉన్నాడు. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.ప్రభూ! నన్ను విడిచి వెళ్లిపోయావా? నా పసుపు కుంకుమలను తుడిచి వెళ్లిపోయావా? నా తపస్సు వృథా చేసి వెళ్లిపోయావా? మీరు కట్టిన మాంగల్యాన్ని తెంచివేసి వెళ్లిపోయావా?....యమధర్మరాజు అక్కడినుంచి మాయమయ్యాడు. అతడిని అనుసరిస్తూ ఆకాశమార్గంలోకి వెళ్లింది సావిత్రి.‘ఈ శూన్యం కంటే శూన్యమా నీ హృదయం?నా ధైన్యం కన్నా ఘనమా నీ ధర్మం?’ అని యమధర్మరాజుని ప్రశ్నించింది.‘‘తండ్రీ! నీ బిడ్డ వంటి దానను. నాతో పంతమా. వద్దు తండ్రీ వద్దు! నన్ను కరుణించు. నా పతిని నాకు ప్రసాదించు’’ అని వేడుకుంది.‘‘సావిత్రీ...ఎంత చెప్పినను నీ మొండిపట్టుదల విడువలేకున్నావు. దేవర్షి నిన్ను నాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధురాలిని చేసి పంపినట్టున్నాడు. ఆ ధైర్యంతోనే నన్ను అనుసరిస్తున్నావు. ఏమైనా నీ కోరిక నెరవేరదు. మరలిపో’’ అని మాయమయ్యాడు యమధర్మరాజు. ‘‘ధర్మరాజా! నువ్వు అదృశ్యం కాగలవు కాని అసాధ్యుడవు మాత్రం కాదు. అమృత హృదయుడవు. దయాధర్మ గుణశీలుడవు. నిన్ను నేను విడవను’’ అంటూ యముడిని అనుసరించింది సావిత్రి.

‘‘నిష్ఠుర కాల నియమ నిష్ఠా గరిష్ఠ. ప్రకృతి ధర్మ పరిరక్షణా దక్ష...సకల జీవరాశీ జీవనదాత...అనంత తేజోరాశీభూత....నమోవాకములు...నమోవాకములు’’ అని ప్రార్థించాడు యమదర్మరాజు.‘‘కుమరా, ఏమిటి విశేషం?’’ అడిగాడు సూర్యుడు.‘‘విశేషం కాదు తండ్రీ  వైపరీత్యం! మృత్యువును జయించి మృతుడైన తన భర్తను బతికించుకోవాలనే సంకల్పంతో అతిలోకశక్తిని సాధించి ఒక సామాన్య మానవాంగన సావిత్రి నన్ను వెంటాడి వచ్చుచున్నది. చండప్రచండ మార్తాండ రూపం ధరించి మీరే ఆమె గమనమును అవరోధించవలెను. ధర్మమును కాపాడవలెను’’ అని వేడుకున్నాడు యముడు.‘‘కుమరా! కాలచక్ర క్రమబద్ధుడనైన నాకు అది కర్తవ్యం’’ అని అభయమిచ్చాడు సూర్యభగవానుడు.‘‘ఉజ్వల ఉగ్రరూపాయ దినకర! శుభకర! ధన్మోస్మి’’ అని ఆ భగవానుడిని ప్రార్థిస్తూనే ‘‘ధర్మరాజా! ఆగు ఆగు’’ అంటూ యముడి వెంట వెళ్లింది సావిత్రి.తన వెనకనే వస్తున్న సావిత్రిని చూసి....‘‘ఏమి ఈ సాహసము! సావిత్రి...ఇది రెక్కలకు అందని రిక్కల కూటమి. కోటి సూర్యప్రభాతమైన ఈ ప్రదేశమునకునీవు రాలేవు. ఆ నక్షత్ర కాంతిని భరించే శక్తి మర్త్యులకు లేదు. వెళ్లు...వెనుతిరిగి వెళ్లు’’ ఆదేశించాడు యముడు.‘‘దేవా! నీ దివ్యతేజస్సును వీక్షించిన నా కనులకు ఈ చుక్కలు ఒక లెక్కా!’’ అన్నది సావిత్రి. అంతేకాదు...‘‘నక్షత్రమండలాన్ని అధిష్టించిన తేజోమూర్తులారా, గ్రహములారా, పతి ప్రాణాల కోసం పయనించి వచ్చిన నన్ను అడ్డగించకండి. నా ఆర్తి బాపండి. నాపై జాలి చూపరా, నా సంకల్పబలం వమ్ము కావల్సిందేనా’’ అన్నది.ఆ సమయంలోనే అరుంధతి ప్రత్యక్షమై...‘‘సావిత్రి! సత్యసంకల్పానికి ఎప్పుడూ విఘాతం కలగదమ్మా. తల్లీ! ఏకాగ్రతను మించిన తపస్సు, ఆత్మశక్తిని మించిన శక్తి లేదమ్మా’’ అని ధైర్యం చెప్పింది.‘‘తేజోమూర్తులారా! ఖగోళాల్లారా! క్షణకాలం పాటు మీ పరిభ్రమణ ఆపండి. సావిత్రికి దారి ఇవ్వండి’’ అని సావిత్రికి ఆటంకం లేకుండా చేసింది.

‘‘ఏది ఏమైననూ కోరరాని కోరికలే కోరుతున్నావు. నీ భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వడం ఎంత అసంభవమో, నీ ప్రాణములు తీసుకుపోవుట అంతే అసంభవం. ఈ రెండు కోరికలు తక్క... మరేమన్నా కోరుకో ఇస్తాను’’ అన్నాడు యమధర్మరాజు.‘‘సతికి పతి కన్నా విలువైనది ఏమున్నది?’’ అన్నది ఆమె.‘‘అయితే మీ అత్తమామలకు దృష్టి ఇస్తా...’’ ‘‘మీ అత్తమామలు కోల్పోయిన రాజ్యసంపదలను తిరిగి ఇస్తా....’’ ఇలా  వరాల చిట్టా విప్పుతున్నాడు యమధర్మరాజు.సావిత్రి మాత్రం ఈ వరాలను కాదంది.భర్త ప్రాణాలు మాత్రమే కావాలంది.‘‘ఇవ్వదలచినవి కాదంటావు– ఇవ్వకూడనిది కావాలంటావు. ఏమి నీ మూర్ఖత్వం’’ అని విసుక్కున్నాడు యమధర్మరాజు.‘‘సమవర్తి! ధర్మమార్గాన్ని నమ్ముకున్న నాకు ధర్మమే దారి చూపుతుంది’’ అన్నది సావిత్రి.ఆ మాటల్లో తాను గెలుస్తాననే నమ్మకం ప్రతిధ్వనిస్తుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement