Sr.NTR 100th Birth Anniversary: Sakshi Special Story On Sr.NTR Satha Jayanthi, Check Here - Sakshi
Sakshi News home page

Sr.NTR 100th Birth Anniversary: పదే పదే తలచు తెలుగుజాతి

Published Sat, May 28 2022 12:21 AM | Last Updated on Sat, May 28 2022 10:25 AM

NTR Centenary birth anniversary about sakshi special story - Sakshi

ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి.
నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి.
ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె.
పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా!
గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు.
అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు–
రాకుమారిని తెగించి వరించే తోట రాముడు–
అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు–
పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు...
విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు?
వారి ఎదురుచూపు ఫలించింది.
తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది.
ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది.
తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది.
వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు.
ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు.
తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం.

నేడు ఎన్‌టిఆర్‌ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం.
విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్‌.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్‌’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్‌.. క్యాంటిన్‌లో మీరు నాకు ఇవ్వమని అలాట్‌ చేసిన టిఫిన్‌ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు.

సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్‌ అని నిర్దేశించారు. ఎన్‌.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి.
ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్‌.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర.

‘మాయాబజార్‌’ తర్వాత ఎన్‌.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్‌. రెడ్డి. అడ్వర్‌టైజ్‌మెంట్‌ కూడా ఇచ్చారు. బి.ఎన్‌. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి  సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్‌. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్‌. నెరేషన్‌ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది.

రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్‌.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్‌ మూల పడేశారు. ఎన్‌.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు.  500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో.


‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్‌ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్‌ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు సింగింగ్‌ స్టార్స్‌ అయ్యారు.

బెరుకు లేకుండా స్లీవ్‌లెస్‌ జాకెట్‌ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్‌ స్టార్లుగా వెలిగారు. సీహెచ్‌ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్‌ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్‌.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్‌ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్‌ కుమార్, ప్రేమ్‌ నజీర్‌... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్‌.టి.ఆర్‌ చేసినవన్నీ చేయలేదు.

ఎన్‌.టి.ఆర్‌ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్‌స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్‌ ఆనంద్‌ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్‌. దిలీప్‌ కుమార్‌ మాత్రమే ఫోక్‌లోర్, హిస్టారికల్‌ (మొఘల్‌ ఏ ఆజమ్‌) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్‌ కపూర్‌ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్‌ జోకర్‌’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్‌.టి.ఆర్‌ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా.

పిల్లలకు నచ్చాలి ఫస్ట్‌. జేమ్స్‌బాండ్‌ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్‌ వంటి సూపర్‌ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్‌.టి.ఆర్‌తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్‌.టి.ఆర్‌ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం).

చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌ స్టూడియో కోర్టులో టెన్నిస్‌ ఆడుతూ ఉంటే ఎన్‌.టి.ఆర్‌ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్‌’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్‌.టి.ఆర్‌ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్‌’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు.

ఆ కృష్ణబలం ఎన్‌.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్‌.టి.ఆర్‌ని వదల్లేదు. ఎన్‌.టి.ఆర్‌ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్‌ నైట్స్‌ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్‌ గజదొంగ... అరేబియన్‌ నైట్స్‌ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్‌లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్‌ ఆయనే (సూపర్‌ మేన్‌). టార్జాన్‌ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్‌ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్‌.టి.ఆర్‌ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్‌.టి.ఆర్‌.


ఎన్‌.టి.ఆర్‌కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్‌’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్‌ ఆర్ట్స్‌ థియేటర్‌’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా?  ‘డ్రైవర్‌ రాముడు’ వంటి మాస్‌ హిట్‌ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి.

అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్‌ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్‌ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్‌.టి.ఆర్‌ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన.

భారతంలో దుర్యోధనుడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్‌.టి.ఆర్‌ ‘బ్రదర్‌... దుర్యోధనుడికి డ్యూయెట్‌ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్‌ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్‌ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్‌.టి.ఆర్‌ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్‌ ఎదుట పడితే ఒట్టు. ఎన్‌.టి.ఆర్‌ దుర్యోధనునికి డ్యూయెట్‌ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్‌.టి.ఆర్‌కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్‌’ కారణం.

శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్‌’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్‌’కు  మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్‌ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్‌ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్‌.టి.ఆర్‌. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్‌.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్‌.టి.ఆర్‌ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్‌ ఈ డైలాగ్‌.


ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్‌.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్‌.టి.ఆర్‌కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్‌ క్లాస్, ఎలైట్‌ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్‌ చేస్తూ ఎన్‌.టి.ఆర్‌ కొనసాగారు.

తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్‌ ఎన్‌.టి.ఆర్‌ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్‌.టి.ఆర్‌ ‘అక్బర్‌ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్‌.టి.ఆర్‌ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్‌.టి.ఆర్‌ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్‌’ చిన్న రసాలు.. పెద్ద రసాలు.

నిజం చెప్పాలంటే ఎన్‌.టి.ఆర్‌కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్‌.టి.ఆర్‌  తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్‌లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్‌.టి.ఆరే సూట్‌ అయ్యారు. అమితాబ్‌ ‘జంజీర్‌’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్‌’ – ‘యుగంధర్‌’గా, రాజేష్‌ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్‌’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు.

39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో  పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్‌ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్‌.టి.ఆర్‌కు బలం దొరికింది.

కె. రాఘవేంద్రరావు ఎన్‌.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్‌ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’ వంటి భారీ హిట్స్‌ ఇవ్వడం ఎన్‌.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్‌.టి.ఆర్‌ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్‌.టి.ఆర్‌ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది.


కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్‌.టి.ఆర్‌ కెరీర్‌ చూసినా అర్థమవుతుంది. ఎన్‌.టి.ఆర్‌ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్‌ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్‌ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి.

కాని ఈ అపజయాలు చూసిన ఎన్‌.టి.ఆర్‌ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్‌ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్‌.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్‌ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి.

ఎన్‌.టి.ఆర్‌ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్‌.టి.ఆర్‌ అమరుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement