Mayabazar
-
రూ.2 లక్షల బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రం.. ‘మాయా బజార్’ రికార్డులెన్నో!
చరిత్ర గాని, పురాణాలు గాని... వీటిలో మనకు ఏమాత్రం నచ్చని విషయాల్ని మనకు నచ్చిన విధంగా ఓ కల్పిత కథను తయారు చేసుకుని ప్రేక్షకుడ్ని ఆనందింపజేయడాన్ని ఆల్టర్నేటివ్ హిస్టరీ అని అంటారు. ఉదాహరణకు హిట్లర్ని ఓ థియేటర్లో బంధించి కాల్చి హతమార్చడం, మహాభారతంలో కౌరవుల కుతంత్రాలను బట్టబయలు చేసి వాళ్లని నవ్వులపాలు చేయడం వంటివి. ఇలాంటి ప్రత్యామ్నాయ చరిత్ర కలిగిన కథలు మన అహాన్ని సంతృప్తిపరుస్తాయి కాబట్టి స్వతహాగానే వాటివైపు ఆకర్షితులవుతాం. సరిగ్గా అలాంటి కోవకు చెందినదే ‘మాయాబజార్’ సినిమా. ఈ చిత్రం లక్ష్యం కూడా అదే.మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా...వ్యాస భారతం ప్రకారం బలరాముడుకి శశిరేఖ అని పిలువబడే కూతురే లేదు. మాయాబజార్ నిజానికి శశిరేఖా పరిణయం అనే పేరుతో మన దగ్గర ప్రసిద్ధిగాంచిన ఓ కల్పిత జానపద కథ. దీని ఆధారంగా ‘మాయాబజార్’కి ముందు, తరువాత అనేక చిత్రాలు రూపొందినా కేవీ రెడ్డి రూపొందించిన ఈ ఒక్క సినిమా మాత్రమే అత్యంత ప్రజాదరణకు నోచుకుంది.‘మాయాబజార్’కు తొలుత చాలా పేర్లనే అనుకున్నారు. సినిమాలో ఘటోత్కచుడు పాత్రను ఎస్వీ రంగారావు చేశారు కాబట్టి ముందుగా ఈ సినిమా పేరును ఘటోత్కచుడు అని పెట్టాలని అనుకున్నారట. తర్వాత శశిరేఖా పరిణయం అని పేరు పెట్టారు. ఆ తర్వాత దానిని మాయాబజార్ అను శశిరేఖా పరిణయంగా మార్చారు. చివరికి విడుదలయ్యే సమయానికి అది ‘మాయాబజార్’గా మిగిలింది. ‘మాయాబజార్’ కథకు ఉన్న లక్ష్యం కేవలం శశిరేఖకు, అభిమన్యుడికి పెళ్లి చెయ్యటం కాదు... కొన్ని కారణాల వల్ల వంచించబడ్డ శశిరేఖ తల్లిదండ్రుల మనసు మార్చటం, కౌరవులను నవ్వులపాలు చేసి, వాళ్లని దండించబడటం ఈ కథలోని అంతిమ లక్ష్యం. కృష్ణుడు బలరాముడికి హితబోధ చేసినా, అభిమన్యుడు లక్ష్మణ కుమారుడితో యుద్ధానికి దిగినా శశిరేఖా పరిణయం సాధ్యమయ్యేది.. కానీ కథకున్న అంతిమ లక్ష్యం సాధ్యపడేది కాదు.చిన్న కథ... బలమైన స్క్రీన్ప్లేనిజానికి ‘మాయాబజార్’ కథ చాలా చిన్నది. అయితే బలమైన స్క్రీన్ ప్లేతో దీనిని రక్తి కట్టించారు దర్శకులు కేవీ రెడ్డి. ప్రథమార్ధం కేవలం నాటకీయత మాత్రమే ఉంటుంది. ఆ నాటకీయ పరిణామాలు ఇప్పటికీ సమకాలీన పరిస్థితుల్లానే అనిపిస్తాయి. అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడటం, ఆ ప్రేమకి తల్లిదండ్రులు అడ్డు చెప్పటం, తల్లి కూతుర్ని కొట్టడం, డబ్బు పోగానే ముఖం చాటేసే చుట్టాలు, తండ్రిని ప్రశ్నించే ధైర్యం లేని కూతురు... వంటివి ఇప్పటికీ ప్రతీ ఇంట్లో కనిపించేవే. ప్రేక్షకుడిని ఈ వాస్తవిక పరిస్థితులు ముందుగా కథతో కనెక్ట్ చేస్తాయి. ప్రథమార్ధమంతా లక్ష్యానికి పూర్తిగా దూరం చేసి, ఇక ఏ రకమైన ఆశ మిగలని స్థితికి తీసుకెళ్లి, ఘటోత్కచుడు ప్రవేశించడంతో వడివడిగా లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తారు. పూర్తి విషాదం తర్వాత వచ్చే ఆనందానికి విలువ ఎక్కువ ఉంటుంది. కౌరవుల్ని ఏమీ చెయ్యలేం అనుకునే మాన సిక స్థితికి ప్రేక్షకుడ్ని తీసుకొచ్చి, తర్వాత వాళ్లని వెర్రివాళ్లని చేసి ఆడుకోవటం వల్ల వచ్చే కిక్కు మామూలుగా ఉండదు.ఎస్వీఆర్ మీదే ప్రమోషన్!66 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకోవడానికి కారణం కెమెరామేన్ మార్కస్ బార్ట్ లీ. గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా టెక్నిక్స్‌తో సృష్టించిన మాయాజాలానికి అప్పట్లో ప్రేక్షకులు నిశ్చేష్ఠు లయ్యారు. నిజంగా మాయ జరుగుతున్నట్టుగానే భావించారట. ముఖ్యంగా వివాహ భోజనంబు పాటలో లడ్డూలన్నీ నోట్లోకి సరాసరి వెళ్ళిపోవడం, ఆహార పాత్రలన్నీ వాటికవే కదలడం.. వంటి సీన్లకు మంత్రముగ్ధులయ్యారు. ఈ సినిమాలోనే ఎన్టీఆర్ మొదటిసారిగా శ్రీకృష్ణుడిగా కనిపించారు. అంతకు ముందు 1954లో వచ్చిన ‘ఇద్దరు పెళ్ళాలు’, 1956లో వచ్చిన ‘సొంతవూరు’ సినిమాల్లో కృష్ణుడిగా కనిపించినప్పటికీ, అవి పూర్తి స్థాయి కృష్ణుడి పాత్రలు కావు. ‘మాయాబజార్’ టైమ్‌లో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మార్కెట్ కన్నా ఎస్వీఆర్ మార్కెట్ ఎక్కువ. జనాల్లో పాపులారిటీ కూడా ఎక్కువే. అందుకే రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్లను ఎస్వీఆర్ పేరు మీదే చేశారట.రెండు లక్షల బడ్జెట్‌తో...‘మాయాబజార్’ను సుమారు రెండు లక్షల బడ్జెట్‌తో నిర్మించారు. అప్పట్లో తెలుగులో వచ్చిన భారీ బడ్జెట్ సినిమా ఇదే. సాధారణంగా 30 వేల బడ్జెట్‌ను మించి సినిమాలు తీయడానికి అప్పట్లో నిర్మాతలు సాహసించేవారు కాదు. కానీ ‘మాయాబజార్’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయా ప్రొడక్షన్స్ ఖర్చుకు వెనకాడలేదు. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కిన తొలి సినిమా కూడా ఇదే. ఆ తరువాత ఈ సినిమాను హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో డబ్ చేశారు. విడుదలైన అన్నిచోట్లా విజయాన్ని అందుకుంది. అంటే ఒక విధంగా ‘మాయాబజార్’ని తొలి పాన్ ఇండియా మూవీ అనొచ్చేమో. అందుకే నాటికైనా నేటికైనా మరెప్పటికైనా ‘మాయాబజార్’ అనేది ఓ గోల్డ్ మెమరీ. – ఇంటూరు హరికృష్ణ -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్‌లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!
వైఎస్సార్ జిల్లా (మైదుకూరు): మాయాబజార్ సినిమాలో ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తాడనేది చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఇత్తడి పాత్రల్లో పాయసాలు, లడ్డూలు, పులిహోర, అప్పలు.. దప్పలాలు కనిపిస్తాయి. భోజనం సంగతి సరే.. అంత పెద్ద వంట పాత్రలు ఎక్కడివి అని ప్రశ్నించుకుంటే.. ఇత్తడి కళాకారులు వాటిని తయారు చేస్తారు. మన రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో అలాంటి ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులున్నారు. వందల ఏళ్ల కిందట నుంచే వనిపెంటలో ఇంటికి కావాల్సిన వంట పాత్రలు, దేవాలయాలకు అవసరమైన దేవతా విగ్రహాలు, గంటలు, గోపుర కలశాలను తయారు చేస్తున్నారు. అప్పట్లో వివాహాల్లో, అన్నదాన కార్యక్రమాల్లో ఇత్తడి పాత్రలు అవసరమయ్యేవి. వీటిని వనిపెంటలోని అన్ని కులాల వారు తయారు చేసేవారు. ఇత్తడి వస్తువులు తయారు చేసే 200 కుటుంబాల వారు అప్పట్లో ఉండేవారు. రానురాను కాలం మారిపోయింది. ఆచార వ్యవహారాలు సన్నగిల్లాయి. ఇత్తడి పాత్రల వాడకం తగ్గిపోయింది. స్టీలు పాత్రల రాకతో ఇత్తడి పాత్రలు అటకెక్కాయి. ఇప్పుడైతే ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. పెళ్లిళ్లలో ప్లాస్టిక్ పళ్లేలు, గ్లాసులు, డెకరేషన్ పువ్వులు కనిపిస్తున్నాయి. ఇత్తడి కళాకారులకు పనితగ్గిపోయింది. కొందరు పొట్టచేతబట్టుకొని వలసలకు వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న కొద్ది మంది కళాకారులు దేవాలయాలకు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు తీసుకొని తయారు చేస్తున్నారు. వైఎస్ చేయూత వనిపెంటలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వనిపెంట ఇత్తడి కళాకారులకు చేయూతనిచ్చారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే 2005లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డిజైనర్లతో వనిపెంట ఇత్తడి కళాకారులకు శిక్షణ ఇప్పించారు. మారుతున్న కాలానికి ప్రజల అభిరుచి మేరకు ఇత్తడి వస్తువులను కొత్తరీతిలో తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వస్తువుల తయారీకి తగిన వసతులుండాలన్న తలంపుతో వైఎస్ వనిపెంటలో ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర జౌళి, హస్తకళల అభివృద్ధి శాఖ నిధులతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో 2008లో మౌలిక వసతుల కేంద్రం నిర్మాణం ప్రారంభమైంది. సుమారు రూ. 60లక్షల వ్యయంతో ఈ కేంద్రం 2012లో పూర్తయింది. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు ఇప్పించమని కళాకారులు కోరినా, అధికారులు అలసత్వంతో ఇప్పటికీ వారికి ఎలాంటి రుణాలు అందలేదు. తయారు చేసిన వస్తువులను లేపాక్షి ఎంపోరియాల ద్వారా విక్రయించుకుందామన్నా వస్తువుల తయారీకి పెట్టుబడి లేక కళాకారులు ఊసురుమంటున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే జీవనోపాధితోపాటు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతి తెస్తామని కళాకారులు అంటున్నారు. ఆశతో ఉన్నాం. ఎప్పటికైనా ఇత్తడి వస్తువులకు గిరాకి పెరిగి తమకు చేతినిండా పని దొరుకుతుందని ఆశతో ఉన్నాం. కొద్ది రోజుల కిందట హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బడిగించల విజయలక్ష్మి గారు మౌలిక వసతుల కేంద్రాన్ని సందర్శించారు. కళాకారులను ప్రోత్సహించే విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ తమ తండ్రి లాగానే ఇత్తడి కళాకారులను ఆదరిస్తారని ఆశిస్తున్నాం. – ఇస్మాయిల్, అధ్యక్షుడు, ఇత్తడి కళాకారుల అభివృద్ధి సంఘం, వనిపెంట, వైఎస్సార్ జిల్లా. ఇత్తడి వృత్తిని వదిలిపెట్టలేకున్నాం.. ఇప్పుడు ఇత్తడి వస్తువులకు గిరాకి లేదు. అయినా మాకు తెలిసిన పని ఇదొక్కటే. అందువల్ల వదిలేయలేకున్నాం. దేవాలయాలు కట్టేవాళ్లు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు ఇస్తే తయారు చేసి ఇస్తున్నాం. ప్రభుత్వం ప్రోత్సహించి పెట్టుబడికి ఆర్థిక సాయం అందిస్తే మళ్లీ ఇత్తడి పరిశ్రమ పుంజు కుంటుంది. – పూల రామసుబ్బయ్య, ఇత్తడి కళాకారుడు, వనిపెంట, వైఎస్సార్ జిల్లా. చదవండి: కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బోటు యజమానులు -
మరోసారి మాయాబజార్ మధురిమా
‘మాయాబజార్’ సినిమా ఒక సినీ వైష్ణవ మాయ. దాన్ని ప్రేక్షకులు కొలుచుకుంటారు. తలుచుకుంటారు. దర్శకులు సింగీతం మళ్లీ దానిని తలుచుకున్నారు. ఆ సినిమాలో సాలూరు వారు అర్ధంతరంగా వదిలేసిన ట్యూన్‌కు తన గొంతుతో మళ్లీ పునర్జీవం ఇచ్చారు. తెలుగువారందరూ విని మురిసిపోతున్న తాజా పాట ఇది. కుశలమా నవ వసంత మధురిమా... గత మూడు నాలుగు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పాట వైరల్‌గా మారింది. అది ఈనాటి పాట కాదు. సరిగా చెప్పాలంటే ఈనాడు పురుడుపోసుకున్న ఆనాటిది. ‘మాయాబజార్’ సినిమాలో వాడకుండా వదిలేసిన ‘కుశలమా’... పాటను, ఆ సినిమాకు దర్శకత్వ శాఖ లో పని చేసిన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మళ్లీ వెలికి తీశారు. అసంపూర్ణంగా ఉన్న పల్లవిని తన మిత్రుడు, గేయకర్త వెన్నెలకంటి ద్వారా పూర్తిగా పాటగా మలిచారు. దానికి బాణీ కట్టి తానే స్వయంగా పాడారు. ఆయన మనమరాలు తోడు గొంతునిచ్చింది. ఇదంతా ఒక వీడియోగా చేసి ఆయన రిలీజ్ చేయడంతో మాయాబజార్ అభిమానులు మురిసిపోతున్నారు. అరవయ్యేళ్ల నాటి పాట: సింగీతం ఈ ప్రయత్నం గురించి సింగీతం ఇలా వివరించారు. ‘మాయాబజార్ కోసం సాలూరి రాజేశ్వరరావు శ్రీకరులు దేవతలు శ్రీరస్తు అనగా, చూపులు కలసిన శుభవేళ, లాహిరి లాహిరి లాహారిలో, నీ కోసమే నే జీవించునది... పాటలు చేసిన తరవాత శశిరేఖ ప్రియదర్శినిలో అభిమన్యుని చూస్తూ పాడే ‘కుశలమా’ అనే పాట. ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా’ అని దాని పల్లవి. సాలూరి రాజేశ్వరరావుగారు అద్భుతంగా స్వరపరిచారు. ఆ తరవాత ఏవో కారణాల వల్ల సాలూరి ఆ సినిమాకి సంగీత దర్శకులుగా చేయలేదు. ఆ పాట రికార్డు కాలేదు. తరవాత ఘంటసాల గారు వచ్చి ఆ సందర్భానికి ‘నీవేనా నను పిలిచినది’ పాటతోబాటు మిగిలిన పాటలూ పూర్తి చేశారు. ఇది జరిగి 60 సంవత్సరాల పైచిలుకు అయ్యింది. ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్‌లో నాకొక జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు అలా వదిలిపెట్టి, ప్రజల్లోకి వెళ్లలేని ఆ పల్లవిని మళ్లీ ఎందుకు రివైవ్ చేయకూడదు అనుకున్నాను. వెన్నెలకంటి గారు ఆ పల్లవి కొనసాగింపు, చరణాలు రాశారు. పాటను నేను ట్యూన్ చేశాను. మ్యూజిక్ నా మిత్రుడు జైపాల్, ఎడిటింగ్ నా మరో మిత్రులు గౌతంరాజు చేశారు. ఇక పాట విషయానికి వస్తే, నాయికపాత్రకు నా మనవరాలు అంజనీ నిఖిల పాడింది. నాయకుని పాత్రకు నేను పాడాను.’ అన్నారు. పింగళి వారికి నివాళి: వెన్నెలకంటి మహానుభావుడు పింగళి గారు రాసిన లైన్‌కి కొనసాగింపు రాయటం నా అదృష్టం. గతంలో సింగీతం గారు తీసిన ‘ఆదిత్య 369’ చిత్రంలో ‘జాణవులే..’ అనే మెలోడీ నాతో రాయించారు. తర్వాత వచ్చిన విజయా పిక్చర్స్ వారి ‘బృందావనం’ చిత్రానికి కూడా సింగీతం గారు సింగిల్ కార్డ్‌గా నా చేత అన్ని పాటలూ రాయించారు. ప్రస్తుతం లోకి వస్తే... నేను పింగళివారికి భక్తుడిని కదా... సింగీతం గారు పింగళిగారు రచించిన ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా కుశలమా’ పల్లవి ఇచ్చి, చరణాలు రాయమన్నారు సింగీతం గారు. పల్లవిలో అబ్బాయి అడిగిన దానికి కొనసాగింపు కోసం కనీసం పది పల్లవులు రాసుకున్నాను. చివరకు ‘కుశలమా కుశలమా కుసుమబాణ చతురిమా కుశలమా’ రాశాక నాకు తృప్తి కలిగింది. పింగళిగారి పాటకు కొనసాగింపు రాసే అవకాశం రావటం చాలా సంతోషం. ఆ నివాళి పరిపుష్టమైనట్లే. – డాక్టర్ వైజయంతి పురాణపండ ‘మాయాబజార్’ సినిమాలో ముందు ‘కుశలమా కుశలమా నవ వసంత మధురిమా’ పాట అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల అది రికార్డ్ కాలేదు. దాని స్థానంలో ‘నీవేనా నను పిలిచినది’ పాట చేశారు. -
హాస్య నటులలో నాన్న హైహై నాయకా
రమణారెడ్డి లేకుండా నాటి సినిమాను ఊహించడమా? మంచిగానో చెడ్డగానో ఆయన ఉండాల్సిందే. మిస్సమను, గుండమ్మ కథను, మాయాబజార్‌ను ఆయన పాత్రలు ఎంత మెరిపించాయి. నెల్లూరు యాసకు సినిమాలో యాక్సెప్టెన్స్ తెచ్చిన నటుడు. ఎవరైనా సన్నగా ఉంటే రమణారెడ్డిలా ఉంటాడు... అనే పోలిక ఇప్పటికీ సాగుతూనే ఉంటుంది. సన్నగా ఉన్నా శక్తిమంతమైన పాత్రలు పోషించారు. ఆయన పెద్ద కుమారుడు ప్రభాకర్ రెడ్డి తండ్రి గురించి చెప్పిన విశేషాలు ఇవి. నాన్నగారికి మేం ఐదుగురు పిల్లలం. ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. నేను ఇంటికి పెద్ద. నా తరవాత చెల్లాయి వసుమతి, స్వర్ణలత, పద్మావతి, తమ్ముడు శ్రీనివాసరెడ్డి. అల్లుళ్లు ముగ్గురూ డాక్టర్లు. ఇద్దరు మెడికల్ డాక్టర్లు, ఒకరు డాక్టరేట్. నేను, తమ్ముడు ఇద్దరం చెన్నైలోనే ఇంజినీరింగ్ చదివాం. నేను బిటెక్ తరవాత ఎంబిఏ పూర్తి చేశాను. ఎల్ అండ్ టి లో పని చేశాను. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. నాన్నగారు 1974లో అల్సర్‌తో బాధపడుతూ కన్ను మూశారు. అదే సంవత్సరం నాన్నగారితోపాటు ఘంటసాల, ఎస్విఆర్ కూడా తుదిశ్వాస విడిచారు. ఆ మరుసటి సంవత్సరం రేలంగి గారు. మా తల్లిగారు సుదర్శనమ్మ 93 ఏళ్లపాటు జీవించి ఇటీవలే అంటే 2018 అక్టోబరులో నాన్నగారిని చేరుకున్నారు. నాకు ఒకర్తే అమ్మాయి. హైదరాబాద్ ఏఎండిలో పనిచేస్తోంది. అల్లుడు కూడా అదే కంపెనీలో పని చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబం.. నెల్లూరు దగ్గర జగదేవిపేట నాన్నగారి జన్మస్థలం. మాది వ్యవసాయ కుటుంబం. తాతగారు నాన్నగారి చిన్నప్పుడే పోవడంతో నాన్న ఇంటర్ తో చదువు ఆపేశారు. చెన్నై వచ్చాక, సోషల్ లైఫ్ బాగా పెరగటంతో మంచి ఇంగ్లీషు నేర్చుకోగలిగారు. నాన్నగారిది మేనరికం. అమ్మగారిది కోవూరు. నాన్నగారికి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ దొరికితే మమ్మల్నందరినీ ఎక్కడికైనా తీసుకువెళ్లేవారు. రిజర్వ్డ్.. స్నేహితులతో బాగా మాట్లాడేవారు. ఇంట్లో మాత్రం చాలా రిజర్వ్డ్గా ఉండేవారు. అప్పుడప్పుడు ప్రివ్యూలకు వెళ్లేవాళ్లం. నాన్నగారు విడిగా, మేమందరం విడిగా వెళ్లేవాళ్లం. అంత రిజర్వ్డ్గా ఉనా, పిల్లలు అడిగినదేదీ కాదనేవారు కాదు. బాగా బిజీగా ఉన్న రోజుల్లో రోజుకి రెండు మూడు షిఫ్టులు పనిచేయటం వల్ల నాన్నగారు ఇంట్లో చాలా తక్కువసేపు ఉండేవారు. అందుకే మాతో ఎక్కువసేపు గడపటానికి అవకాశం ఉండేది కాదు. ఒకసారి నాన్నని చూడటానికి ఎస్.వి. రంగారావు గారు మా ఇంటికి వచ్చారు. నేను ఇద్దరికీ కాఫీ తెచ్చి ఇచ్చాను. ఆయన నా చేతిలో కాఫీ అందుకుంటూ, ‘అబ్బాయి ఏం చేస్తున్నాడు?’ అని నాన్నను అడిగారు. ఆయన వెంటనే చెప్పలేక నా వైపు చూశారు. మా చదువు గురించి ఆలోచించలేనంత బిజీగా ఉండేవారు. చిన్న వయసు – పెద్ద పాత్రలు చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాలు వేయటం సరదా. చదువుకునే రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించారు. ఆ తరవాత సినిమాలలోకి ప్రవేశించారు. నాన్నగారు నటించిన మొదటి సినిమా ‘మానవతి’. శంకర్రెడ్డిగారు నాన్నగారికి మొదటి అవకాశం ఇచ్చారు. ‘చరణదాసి’ లో సూర్యకాంతం గారికి కొడుకు వేషం వేశారు. రేలంగి గారి కంటె నాన్నగారు వయసులో కొద్దిగా చిన్నవారే. కాని ఇంచుమించు అన్ని సినిమాలలోను ఆయనకు తండ్రి, మామగారు పాత్రలే పోషించారు నాన్నగారు. నాన్న సినిమాలు.. సాధారణంగా అందరూ విజయవంతమైన సినిమాలలోని పాత్రలనే గుర్తుపెట్టుకుంటారు. ఫెయిల్ అయినవాటిని మర్చిపోతుంటారు. ‘గంగ గౌరి సంవాదం’ సినిమాలో నాన్నగారు భగ్న ప్రేమికుడు. కృష్ణకుమారి హీరోయిన్. నాన్నగారు చాలా డిఫరెంట్‌గా నటించిన సినిమా అది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అది గుర్తుపెట్టుకోలేకపోయారు. ‘గుండమ్మ కథ’ సినిమాలో నాన్నగారు, రామారావు గారు, సూర్యకాంతం గారు... ఈ ముగ్గురి గురించే మాట్లాడుకునేవారు. అప్పట్లో ఒక సినిమా శతదినోత్సవం జరుపుకుంటే ఘనంగా ఉండేది. జగపతి వారి మొదటి సినిమా ‘అన్నపూర్ణ’ వేడుకలు విజయ గార్డెన్స్‌లో చేశారు. దానికి నాన్నగారు కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. అందరూ ఎదురు వచ్చి తప్పట్లు కొడుతూ వేదిక మీదకు ఘనంగా, సంతోషంగా తీసుకెళ్లారు. పొరపాటు జరిగింది.. నాన్నగారి దగ్గర రాధాకృష్ణమూర్తి అనే ఆయన మేనేజర్‌గా పనిచేసేవారు. ఆయన చాలా నమ్మకస్థుడు. అనుకోకుండా ఒకసారి చిన్న పొరపాటు జరిగింది. ఒకేరోజు మూడు ప్రొడక్షన్స్‌కి కాల్షీట్లు ఇచ్చేశారు. మూడు సినిమాల లోనూ పెద్ద నటులతో కలిసి నటించాలి. దాంతో నాన్న ఇరుకున పడ్డారట. అయినప్పటికీ ఆయనను ఏమీ అనలేదట. నాన్నగారు పోయిన రెండో రోజున ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పారు. ఆయనకు నాన్నగారంటే విపరీతమైన అభిమానం. అల్లు రామలింగయ్య.. ఇంజినీరింగ్ ఎక్కడా ఫెయిల్ అవ్వకుండా చదువుకోవటం వల్ల అందరికీ నేను గుర్తుండిపోయాను. నాన్నగారు పోయిన రెండు సంవత్సరాల తరవాత ఆఫీస్ పని మీద హైదరాబాద్ సరోవర్ హోటల్‌కిlవచ్చాను. అక్కడ అల్లు రామలింగయ్య గారు నన్ను చూసి పలకరించి, నాన్నగారితో ఉన్న అనుబంధం గురించి చాలా సేపు ముచ్చటించారు. చెన్నైలో ఉన్న రోజుల్లో నేను ఆయనను చాలాసార్లు చూశాను. కాని ఎన్నడూ ఒకరితో ఒకరం మాట్లాడుకోలేదు. ఆయన నన్ను గుర్తు పెట్టుకుని, పలకరించార ంటే నేను రమణారెడ్డిగారి అబ్బాయిని కాబట్టే కదా! మెజీషియన్... పాత ‘అక్కచెల్లెళ్లు’ సినిమాలో నాన్నగారిది మెజీషియన్ పాత్ర. దానికోసం నాన్నగారు మ్యాజిక్ నేర్చుకున్నారు. ఆయనకు మ్యాజిక్ అంటే సరదా ఉండటం వల్ల, ఆ తరవాత చాలా ప్రదర్శనలిచ్చారు. అందుకోసం చాలా డబ్బు ఖర్చు చేశారు. సినిమాల వల్ల డబ్బులు సంపాదిస్తే, మ్యాజిక్ వల్ల డబ్బులు పోగొట్టుకున్నారు. 1957 లో నెల్లూరు టౌన్హాల్లో మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. ఆ రోజున ఘంటసాల గారి కచేరీ కూడా ఉంది. ‘ఘంటసాల మ్యూజిక్, రమణారెడ్డి మ్యాజిక్’ అని పబ్లిసిటీ ఇచ్చారు. నాన్నగారు చివరి ప్రదర్శన ఢిల్లీలో జరిగింది. మంచి స్నేహం.. నాన్నను అందరూ ‘రమణయ్యా’ అని ఆప్యాయంగా పిలిచేవారు. ఆ రోజుల్లో స్నేహాలు బావుండేవి. నాన్నగారి స్నేహితులు ఒకాయన ఒక చిత్రంలో నాన్న నటించిన పాత్రకు వచ్చిన పారితోషికం తీసుకుని, ‘దీని గురించి నువ్వు నన్ను అడగకు’ అన్నారు. ఆ డబ్బులతో హైదరాబాద్‌లో ఒక స్థలం కొని, ఆ కాగితాలను, మిగిలిన డబ్బును మా చెల్లాయి పెళ్లి సమయంలో అందచేశారు. ఆ రోజు నాన్న కళ్లలో కనిపించిన ఆనందాన్ని ఇప్పటికీ మరచిపోలేను. అంత మంచి స్నేహాలుండేవి. అదే నంబరు నేటికీ... 1963 దాకా మా ఇంట్లో ఫోన్ లేదు. మా మొట్టమొదటి ఫోన్ నెంబరు 42537 ఇప్పటికీ అదే నెంబరులోని ఆఖరి మూడు డిజిట్లు కంటిన్యూ అవుతున్నాయి. నాన్నగారిది చాలా సింపుల్ లైఫ్. ఇంట్లో తీరికగా ఉన్నప్పుడు ఆంధ్ర క్లబ్‌కి కాని, టి. నగర్ క్లబ్‌కి కాని వెళ్లేవారు. ఆ సమయంలో డ్రైవర్ రాకపోతే నా సైకిల్ మీద వెళ్లిపోయేవారు. అజాత శత్రువు.. 1964 టైమ్‌లో మా పెద్ద నాన్నగారి అబ్బాయి టి. సుబ్బిరామిరెడ్డి (మా నాన్నగారు, వాళ్ల నాన్నగారు అన్నదమ్ములు) కాంట్రాక్ట్‌లు చేస్తున్నారు. నాన్నగారు హైదరాబాద్ వచ్చారని తెలిస్తే, షూటింగ్ చూడటానికి వచ్చేవారు. ఒకసారి నాగార్జున సాగర్ నుంచి సారథి స్టూడియోకి వచ్చి, ‘మా చిన్నాయన రమణారెడ్డిని చూడటానికి వచ్చాను’ అని చెప్పారు. నాన్నగారు ఆయనను అందరికీ పరిచయం చేశారు. సుబ్బిరామిరెడ్డిగారికి సినిమాల పరిచయం అప్పుడే కలిగింది. అలా ఆయనకు సినిమాల మీద మోజు బయలుదేరింది. సినిమాలలో ఎన్నో నెగిటివ్ పాత్రలుæవేసినా, నాన్నని అందరూ గౌరవించేవారు. ప్రేమించేవారు. నాన్నగారికి అజాతశత్రువు అని పేరు. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: సురేశ్ కుమార్ ఎ. అకాల భోజనంతో... చిన్నప్పటి నుంచి నాయనకు అల్సర్లు ఉండేవి. ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అది అప్పుడప్పుడు బాధిస్తుండేది. అప్పట్లో సరైన వైద్యం కూడా లేదు. మూడు షిఫ్టులు పని చేస్తూండటం వల్ల అకాల భోజనంతో, తరచు ఆరోగ్యం దెబ్బ తినేది. 1968లో ఆపరేషన్ చేయించుకున్నారు. నెలరోజులపాటు కాల్షీట్లు తీసుకోలేకపోవటంతో, అవకాశా లు తగ్గిపోయాయి. ఆ తరవాత సినిమాలలో అతిథి పాత్రలలో మాత్రమే నటించారు. అంతకంటె చేయలేకపోయారు. ఆ సమయంలోనే ‘మనసు – మాంగల్యం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలలో పూర్తి స్థాయి పాత్ర చేశారు. 1974లో అల్సర్ తిరగబెట్టింది. ఆపరేషన్ చేసిన నాలుగు నెలలకు ఆయన కన్నుమూశారు. నాన్నగారు పోయేనాటికి నా వయసు 28 సంవత్సరాలు. కుటుంబ బాధ్యత నాదే. అప్పటికి ఒక చెల్లాయికి మాత్రమే వివాహమైంది. -
మాయామాటల బజార్
తెలుగు.. ఇంగ్లిష్ అయిపోతోంది అని ఇంగ్లిష్ పదాలను పలకడానికి.. మట్లాడ్డానికి వీల్లేని తెలుగు పదాలతో సమం చేస్తే సబబా? బాగుంది.. మరి తెలుగు తేనెలూరేదెట్లా? బహు బాగుంది.. మాయాబజార్ ఎన్ని కొత్త తెలుగు పదాలను కనిపెట్టలేదు? పింగళి నాగేంద్రరావు, కేవీ రెడ్డితో కలిసి సృష్టించిన ఆ మాటల మాయలో పడి ఇంకా కొట్టుకుపోతూనే ఉన్నాం! ఆ నిఘంటువు ఆంగ్లపదాలకు తెలుగు సమానార్థకాలను కనిపెట్టే క్లూ ఇస్తుందేమో ..చదువుదాం.. అస్మదీయులకు వ్యతిరేక పదం యుష్మదీయులు. సంస్కృతంలో ఉన్న అస్మత్, యుష్మత్ శబ్దాలకు కొత్త భాష్యం చెప్పారు పింగళి. అరవయ్యేళ్ల కిందటే కొత్త భాషను సినిమాలో పరిచయం చేశారు కె. వి. రెడ్డి, పింగళి నాగేంద్రరావు జంటగా. అచ్చతెలుగు పేర్లతో సినిమాలు వచ్చే రోజుల్లోనే మాయా బజార్ అనే ఉర్దూ పదంతో ఉన్న తెలుగు పౌరాణికాన్ని వెండి తెర మీద మెరిపించి ప్రేక్షకులను మురిపించారు. కొత్త కొత్త పదాలను కనిపెట్టి, ప్రయోగించారు..వాటితో ఆడుకున్నారు. అవి నిజంగా ఉన్న పదాలేమో అన్నంతగా మాటల్లో కలిపేశారు. పింగళి నాగేంద్రరావు సంస్కృతం బాగా అధ్యయనం చేసి, పాణినిని ఔపోసన పట్టి ఉంటారు. అందుకే సంస్కృత వ్యాకరణంలోని ఎన్నో పదాలను, ప్రత్యయాలను తెలుగు చేసేశారు. అస్ మస్ థస్, ఏ భ్యామ్, భ్యస్... అంటూ సంస్కృత ప్రత్యయాల గురించి తెలియనివారికి ఇవి నిజంగా మంత్రాలే అన్నంతగా భాషలో ఇమిడిపోయేలా చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో కాని, ప్రత్యయాలు మాత్రం మంత్రాలుగా వచ్చి కూర్చున్నాయి. కోపధారి.. హైహై నాయకా శ్రీకృష్ణుడు వాసుదేవుడైతే, బలరాముడు మాత్రం తక్కువా! ఆయన్ని బలరారామదేవుని చేశారు మాయాబజార్లో పింగళి. ‘ముక్కోపాని’ కి విరుగుడుగా ‘ముఖస్తుతి’ని కనిపెట్టారు. శరధారి, బాణధారి లాగ ‘కోపధారి’ అంటూ సంకర ప్రయోగం చేశారు. ఘటోత్కచుని అనుయాయుడికి ‘దుందుభి’ అని పేరు పెట్టారు. ఈ సినిమాలోని ‘బహుబాగుంది’ అనే పదప్రయోగాన్ని నలభై సంవత్సరాల తరవాత వచ్చిన ‘భైరవద్వీపం’ అనే సినిమా కూడా వాడుకున్నది. ‘మీరన్నది బాగుంది నేనన్నది బహుబాగుంది’ అంటూ! ఇంగ్లిష్ హాయ్‌ని తెలుగైజ్ చేసి ‘హైహైనాయకా’ అంటూ గొప్పనాయకుడికి జేజేలు పలికించారు. పాండవుల ప్రతాపాలు, దేవగురుడు, కొండాడవలదే, ఘనకీర్తి కొట్టవలదే అంటూ కొంగొత్త పదాలను చెక్కారు. అన్నమయ్యలాగ ‘చిన్నమయ్య’ పేరును సృష్టించారు. ‘శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం... మిత్రులను రక్షించాలి శత్రులను భక్షించాలి’ అంటూ శత్రువు, మిత్రువులలోని ‘వు’ ని లోప సంధి చేశారు. దుషటచతుషటయం మనిషిని పలకరించగానే ‘ఏంటి’ అనడాన్ని ఆంగ్ల ‘వై’ తో ‘వై నాయకా’ అంటూ ఆనాడే టెంగ్లిష్ను భాషించారు. బకాసురుడు, శకటాశురుడు వీళ్లేనా రాక్షసులు, నేనూ ఒక రాక్షసుడిని సృష్టిస్తాను అంటూ ‘‘కుడ్యాసురా’ అనే గోడ రాక్షసుడిని పుట్టించారు. ‘కోర్ కోర్ శరణు కోర్’ అంటూ తెర వెనకాల పలికించిన పద్ధతిని నేటికీ దర్శకులు అనుసరిస్తున్నారు. ‘అసమదీయులు’ అంటే ‘మనవాళ్లు’ అని నాడు మాయాబజార్ చెప్పిన కొత్త అర్థం ఈరోజు రాజకీయాల్లో మనవాళ్లకు ఓ పర్యాయపదంగా ఎలా స్థిరపడిందో వేరే చెప్పాలా? పైగా ‘ఎవడూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?’ అంటూ కొత్త పదాల ప్రయోగాన్ని సమర్థించుకున్నారు కూడా. దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులను కలిపి దుష్టచతుష్టయమని కాక ‘దుషటచతుషటయం’ అని సినిమాలో లంబూజంబూలు విడివిడిగా తప్పుగా పలికిన మాటనూ ‘‘ఆ దుష్టచతుష్టయాన్ని అలాగే చీల్చి విడదీసి విడివిడిగా పొడిపొడి చేసేయాలి’ అని ఘటోత్కచుడి సమయస్ఫూర్తితో సరిచేశారు. ‘తక్షణ కర్తవ్యం’ని ప్రయోగిస్తూనే ‘తక్షణ సమస్య’నూ వదిలారు. తండ్రి పితృపాదులైతే తాతను ‘తాతపాదులు’ చేశారు. అంతేనా లక్ష్మణకుమారుడి నోట ‘సభాపరికి’ అనే మాటను పలికించి దాన్నీ పాపులర్ చేశారు. అం..అః .. ఇం.. ఇః... ఉం..ఉః అచ్చులలో ఆఖరి అక్షరాలు ‘అం అః’ లకు మరో ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘ఇం ఇః ఉం ఉః’లను జన్మకునిచ్చారు. ఎవరైనా జైత్రయాత్రకు వెళ్తారు, తీర్థయాత్రకు వెళ్తారు. కాని ఇందులో ‘యుద్ధయాత్రకు’ బయలుదేరుతారు. ‘ఏనుగులు మింగావా! పర్వతాలు ఫలహారం చేశావా’ అని వృద్ధరూపంలో ఉన్న శ్రీకృష్ణులవారితో కోపంగా సరసపలుకులు ఆడించారు. ‘వంకాయ, బెండకాయ, బూడిద గుమ్మడికాయ’ అనగానే పసుపుతాడు, పలుపుతాడు, పడతాడు గుర్తు రాకమానదు. ‘వహ్వారే అప్పడాలు’, ‘మఝారే అప్పళాలు’ అంటూ తెలుగు వంటకాలకు ఉర్దూ కితాబులిచ్చారు. ‘ఓహోరే అరిసెలుల్ల’, ‘భళీరే లడ్డులందు’ అంటూ కొత్త విశేషణాలతో తీపిని అద్దారు. ఇక కంబళి గింబళి, తల్పం గిల్పం... ఇంటింటా వాడుక పదాలు అయిపోయాయి. కంబళికి అప్పగారు గింబళి, తల్పం కంటె పెద్దది గిల్పం అంటూ ఆ పదాలకు అర్థాలూ చెప్పేశారు. అస్తు అస్తు, ‘గోభ్రాంతి, సమాధి భ్రాంతి’.. ఇలా ఎన్నని గుర్తుపెట్టుకోగలం! ఈ పదాలతో ఒక నిఘంటువునే తయారుచేయొచ్చు. పాదపీడనం తరవాత కరపీడనం చేయించాలి. కాని మాయాబజార్లో పింగళి.. పాణిగ్రహణం బదులుగా పాణిపీడనం చేయించారు. కన్నుల వెన్నెల కాయించారు, మనసున మల్లెలు పూయించారు.ఈ పదాల లాహిరిలో తెలుగు జగమంతా ఊగుతూనే ఉంది.– వైజయంతి పురాణపండ -
ఏ దుస్తులు వేసుకోవాలో అడగాలి: నటుడు
ఆర్టిస్టులకు నిలువుటద్దం మాయాబజార్ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి ఘనంగా మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవం సాక్షి, నాంపల్లి : మాయాబజార్ చిత్రంలోని ఏ సన్నివేశం చూసినా నటించే నటన ఎంతో సహజంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు ఆ అవకాశం లేదని సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో షూటింగ్‌కు వెళ్లాక ఈ రోజు నేను ఎలాంటి దుస్తులు వేసుకోవాలి బాబు అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేదికానీ నెలజీతం కోసం కొన్ని నెలల పాటు రిహార్సల్స్ చేసేవారన్నారు. సాహిత్య సంగీత సమాఖ్య సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో విజయ వారి మాయాబజార్ షష్టిపూర్తి మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాయాబజార్ చిత్ర విశ్లేషకులుగా హాజరైన జయప్రకాష్‌రెడ్డి, రచయిత వెన్నెలకంటి, సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చాయాగ్రాహకులు ఎస్. గోపాల్‌రెడ్డి, నాట్య కళాకారిణి శోభానాయుడు, సినీనటులు తనికెళ్ల భరణి, ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాస్, శాంతా బయోటెక్ అధినేత కెఐ వరప్రసాదరెడ్డి, బి. వెంకటరామరెడ్డి, బి. భారతిరెడ్డి హాజరై విశ్లేషించారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో సహజంగా నటించే సన్నివేశాలు లేవనన్నారు. ప్రతి ఆర్టిస్టుకు మాయాబజార్ చిత్రం ఓ నిలువుటద్దం లాంటిదన్నారు. సావిత్ర శశిరేఖ లాగా నటించడమంత గొప్పది కాదేమో కానీ, ఘటోత్కచునిగా నటించడం మాత్రం చాలా గొప్ప సన్నివేశమన్నారు. ప్రతి పాత్రకు జీవం పోసిన చిత్రం మాయాబజార్ మరువలేనిదిగా నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ హ్యూమర్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో పిబరే హ్యూమరసం కడుపుబ్బా నవ్వించే ఆరోగ్యదాయకమైన సభ్యతతో కూడిన లఘు ప్రహసనాల కార్యక్రమం జరిగింది. -
సురభి‘మాయా’బజార్,పాతాళా భైరవి
-
‘హైదరాబాద్ చిల్డ్రన్స్ ఫెస్టివల్’
-
హహ్హహహ్హహహ్హహా..!
... వివాహభోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు.. ఒహ్హొహ్హొ నాకె ముందు! ఔరౌర గారెలల్ల... అయ్యారె బూరెలిల్ల... ఒహోరే అరిసెలుల్ల... ఇయెల్ల నాకె చెల్ల... పెళ్లి భోజనం ఎలా ఉందో... అధరాన్ని, ఉదరాన్ని మధురంగా ఊదరగొడుతూ పంచేంద్రియాలనూ అదిలించి కదిలిస్తారు ‘మాయాబజార్’ సినిమాలో ఎస్వీ రంగారావు! గారెలు, బూరెలు, అరిసెలేనా? లడ్లు, జిలేబీలు, అప్పడాలు.. పులిహోర దప్పళాలు.. పాయసాలు... ఎన్ని లేవు ఆ లిస్టులో! వాటిల్లో ఉన్నవి కొన్ని, లేనివి కొన్ని కలిపి ఇవాళ మీ చేత లొట్టలు వేయించబోతోంది ‘ఫ్యామిలీ’! వివాహభోజనానికి ఏ మాత్రం తక్కువకాని ఈ దీపావళి భోజనాన్నిహహ్హహహ్హహహ్హహా... అంటూ ఆరగించండి. మీ ఆత్మీయులకు కొసరి కొసరి తినిపించండి. హ్యాపీ దీపావళి! సజ్జప్పాలు లేదా హల్వా పూరీ కావలసినవి: స్టఫింగ్ కోసం... బొంబాయి రవ్వ - కప్పు; పంచదార - కప్పు; నీళ్లు - రెండున్నర కప్పులు; బియ్యప్పిండి - టేబుల్ స్పూను; జీడిపప్పు పలుకులు - పావు కప్పు (చిన్న చిన్న ముక్కలుగా చేయాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు పై భాగం కోసం... మైదా పిండి - కప్పు; ఉప్పు - చిటికెడు; నూనె - అర కప్పు (మైదా పిండి నానబెట్టడానికి); నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారీ: బాణలిలో నెయ్యి వేసి వేడి చేశాక, జీడిపప్పులు వేయించి తీసేయాలి అదే బాణలిలో రవ్వ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాక, వేయించి ఉంచుకున్న రవ్వ, జీడిపప్పు పలుకులు వేసి మిశ్రమం దగ్గరపడే వరకు కలిపి, ఆ తరవాత పంచదార జత చేయాలి బియ్యప్పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, మిశ్రమం చల్లారాక, చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి బాగా కలిపి తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలిపి, అర కప్పు నూనె జత చేసి బాగా కలిపి సుమారు రెండు గంటలు నానబెట్టాలి చేతికి నెయ్యి రాసుకుని నానబెట్టుకున్న మైదాపిండి ముద్ద తీసుకుని, చేతితో చపాతీలా ఒత్తి, అందులో బొంబాయిరవ్వ మిశ్రమం ఉండను ఉంచి, బొబ్బట్టు మాదిరిగా సజ్జప్పం ఒత్తాలి. ఇలా మొత్తం తయారుచేసి పక్కన ఉంచుకోవాలి బాణలిలో నూనె కాగాక ఒక్కో సజ్జప్పం వేసి వేయించి తీసేయాలి ఇవి సుమారు రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి. జిలేబీ కావలసినవి: మైదా పిండి - కప్పు; బేకింగ్ పౌడర్ - అర టీ; స్పూను; పెరుగు - కప్పు; నూనె - వేయించడానికి తగినంత; పంచదార - కప్పు; కుంకుమ పువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - పావు టీస్పూను; మిఠాయి రంగు - రెండు చుక్కలు; రోజ్ వాటర్ - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, పెరుగు వేసి బాగా కలిపి ఒక రోజంతా నాననివ్వాలి మూతకు రంధ్రం ఉన్న మ్యాగీ సీసా వంటి దానిలో ఈ మిశ్రమాన్ని పోయాలి ఒక పాత్రలో పంచదార, నీళ్లు, రోజ్ వాటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార తీగ పాకం వచ్చేవరకు కలిపి దింపాక, ఏలకుల పొడి, కుంకుమ పువ్వు జత చేయాలి బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి (మంట మధ్యస్థంగా ఉండాలి) పిండి ఉన్న సీసాను తీసుకుని జిలే బీ ఆకారం వచ్చేలా నూనెలో తిప్పాలి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి వెంటనే పంచదార పాకంలో వేసి ఐదు నిమిషాలు ఉంచి తీసేయాలి వేడివేడిగా అందించాలి. అప్పడాల కూర మీకు అప్పడాలంటే ఇష్టం ఉంటే, ఈ కూరను కూడా ఇష్టపడతారు. ఈ కూర అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. రాజస్థానీయులు ఎక్కువగా తయారుచేసే ఈ కూరను చాలా త్వరగా తయారుచేసుకోవచ్చు. కావలసినవి: అప్పడాలు - పావు కిలో; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా; నెయ్యి లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు; జీలకర్ర - టీ స్పూను; ఉల్లి తరుగు - పావు కప్పు; అల్లం ముద్ద - టీ స్పూను; వెల్లుల్లి ముద్ద - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; ధనియాల పొడి - 2 టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; ఇంగువ - పావు టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు - 2 టీ స్పూన్లు; చిక్కగా గిలక్కొట్టిన పెరుగు - ఒకటిన్నర కప్పులు; కొత్తిమీర తరుగు - 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: అప్పడాలను నూనెలో వేయించి నాలుగు ముక్కలుగా చేసి పక్కన ఉంచాలి (మైక్రోవేవ్‌లో కూడా చేసుకోవచ్చు) స్టౌ (సన్నని మంట) మీద బాణలి ఉంచి, నెయ్యి లేదా నూనె వేసి, కాగాక జీలకర్ర వేసి వేయించాలి ఉల్లితరుగు వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక, అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంగువ, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా కలపాలి పెరుగు, కప్పుడు వేడి నీళ్లు జత చేయాలి అప్పడం ముక్కలను వేసి జాగ్రత్తగా కలిపి, కొద్దిసేపు ఉడకనిచ్చి దింపే ముందు కొత్తిమీరతో అలంకరించి, అన్నంతో వడ్డించాలి. దప్పళం కావలసినవి: కందిపప్పు - పావు కప్పు; బెల్లం - 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర - చిన్న కట్ట; చింతపండు గుజ్జు - 3 టేబుల్ స్పూన్లు; సాంబారు పొడి - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు; చిలగడదుంప ముక్కలు - అర కప్పు; ఉల్లి తరుగు - అర కప్పు; పచ్చి మిర్చి - 6 (పొడవుగా మధ్యకు చీల్చాలి); మునగకాడ ముక్కలు - కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; దొండకాయ ముక్కలు - పావు కప్పు; అరటికాయ ముక్కలు - పావు కప్పు; తీపి గుమ్మడికాయ ముక్కలు - కప్పు; సొరకాయ ముక్కలు - అర కప్పు; సెనగ పిండి - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; పసుపు - కొద్దిగా; కారం - 2 టీ స్పూన్లు; పోపు కోసం... ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 10; సెనగ పప్పు - టీ స్పూను; మినప్పప్పు - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - కొద్దిగా తయారీ: పప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దించి, చల్లారాక మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ఒక గిన్నెలో తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, పచ్చి మిర్చి, చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించాక, మెత్తగా మెదిపిన పప్పు వేసి బాగా కలిపి, బెల్లం తురుము జత చేయాలి సాంబారు పొడి, కారం వేసి కాసేపు ఉడికించాలి కొద్దిగా నీళ్లలో సెనగ పిండి వేసి ఉండలు లేకుండా కలిపి, ఉడుకుతున్న దప్పళంలో వేసి కలపాలి ఈలోగా పక్కన చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, సెనగపప్పు, మెంతులు, ఇంగువ వేసి వేయించి, మరుగుతున్న దప్పళంలో వేసి బాగా కలిపి కొత్తిమీర, కరివేపాకు వేసి దించేయాలి. పేణీ లడ్డు కావలసినవి: సెనగపిండి - కప్పు; పేణీ - కప్పు; పంచదార - ముప్పావు కప్పు; నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఫ్రూట్ పొడి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: స్టౌ (సన్న మంట) మీద బాణలి ఉంచి సెనగపిండి వేసి పచ్చి వాసన పోయి, బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి దింపి చల్లారనివ్వాలి మిక్సీలో పంచదార, పేణీలు వేసి రవ్వలా చేసి, సెనగపిండి ఉన్న పాత్రలో వేయాలి డ్రైఫ్రూట్ పొడి జత చేయాలి కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ లడ్డూ కట్టాలి. పేణీ పాయసం పాలు వేడి చేసి, బెల్లం పొడి జత చేసి కలిపాక, డ్రై ఫ్రూట్ పొడి జత చేయాలి ఒక పాత్రలో పేణీ వేసి అందులో పాలు బెల్లం మిశ్రమం వేయాలి తేనె వేసి బాగా కలిపి బాగా చల్లారాక అందించాలి. కట్టె పొంగలి కావలసినవి: బియ్యం - ముప్పావు కప్పు; పెసరపప్పు - పావు కప్పు; మిరియాల పొడి - టీ స్పూను; అల్లం తురుము - టీ స్పూను; పచ్చి మిర్చి - 4; జీలకర్ర - టీ స్పూను; జీడిపప్పులు - 10; కరివేపాకు - 2 రెమ్మలు; నెయ్యి - 5 టీ స్పూన్లు; ఇంగువ - చిటికెడు; ఉప్పు - తగినంత తయారీ: బియ్యం, పెసర పప్పులను శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్లు జత చేసి ఉడికించి దించేయాలి పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు చేయాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు వేసి కొద్ది సేపు వేయించాక, జీడిపప్పు పలుకులు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి కొద్దిసేపు వేయించి, అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, ఉప్పు జత చేసి కలియబెట్టాలి చట్నీ, సాంబారులతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. సేకరణ: డా. వైజయంతి -
‘పది’లో పాఠ్యాంశంగా మాయాబజార్
ఘట్కేసర్ టౌన్: సాధారణంగా సినిమాలంటే పిల్లలకు మహా సరదా. అలాంటి సినిమాలనే పాఠ్యాంశాలుగా రూపొందిస్తే.. ఈ ఆలోచన బాగుంది కదూ.. ఆలోచనే కాదు.. ఈ ఏడాది పదో తరగతి కొత్త సిలబస్‌లో దీన్ని అమలు చేశారు కూడా. ఇష్టమైన రీతిలో బోధిస్తే కష్టంగా ఉన్నా ఇష్టంగా చదువుతారన్న సత్యాన్ని నమ్మిన సర్కార్ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగే విధంగా నూతన సిలబస్‌ను అందించింది. తెలుగువారు గర్వించదగ్గ మేటి చిత్రం మాయాబజార్‌ను, మహానటి సావిత్రి జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చింది. ఇక తెలుగు ఉపవాచకంలో రామాయణం బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. అపురూప దృశ్యకావ్యం 1957లో నిర్మించిన మాయాబజార్ చలన చిత్ర గొప్పదనాన్ని ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో వివరించారు. వందేళ్ల సినీ చరిత్రలో మాయాబజార్ కంటే ఉత్తమమైన చిత్రం లేదని ఓ టెలివిజన్ చానల్ నిర్వహించే సర్వేలో వెల్లడైంది. విశ్వవాప్తంగా గుర్తింపు పొందిన తెలుగు చిత్రం కావడం విశేషం. అప్పుడున్న అతి తక్కువ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చిత్రాన్ని ఎంత కళాత్మకంగా రూపొందించారో ఈ పాఠంలో పేర్కొన్నారు. కెమెరా టెక్నిక్స్, ఛాయగ్రహణం, కళ, దర్శకత్వం ఇప్పటికీ అం తుచిక్కకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న చిత్రాన్ని భావితరాలకు అందించేందుకు బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న చిత్రాన్ని ఎంతో శ్రమించి కలర్లోకి మార్చారు. ఈ అపురూప దృశ్య కావ్యాన్ని విద్యార్థులకు తెలియపర్చేలా పాఠంలో చేర్చారు. సావిత్రి జీవిత విశేషాలు తెలుగు చిత్రసీమలో మహానటిగా వెలుగొందిన సావిత్రి జీవిత చరిత్రను సైతం ఇంగ్లిషు పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. సావిత్రి తన ఎనిమిదో ఏటనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది. కొత్తలో నటనకు పనికిరాదన్న ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. పట్టుదలతో అవకాశాలు దక్కిం చుకుని 300 చిత్రాల్లో ఎన్నో వైవిధ్య పాత్రలు పోషించింది. నటనలో గొప్ప కీర్తిని సంపాదించుకుంది. రాష్ట్రపతి అవార్డు సైతం అందుకుంది. ఈ విశేషాలన్నీ పాఠ్యాంశంలో పొందుపర్చారు. ఆకట్టుకునేలా ముద్రణ.. కొత్త పాఠ్యపుస్తకాలను మల్టీకలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా రూపొందించారు. తెలుగు పాఠ్య పుస్తకాన్ని తెలుగు దివ్వెలు-2 పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు ఖండాలను ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిత్వ వికాసం పెంపు, హాస్య చతురత, మానవ సంబంధాలు, ఫిలిం అండ్ ఆర్ట్ థియేటర్, బయోడైవర్సిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథాంశాలతోపాటు పర్యావరణంపై చర్చించారు. జీవశాస్త్రంలో.. జీవశాస్త్రంలో పాఠ్యాంశాలన్నీ చదవడం, చెప్పించడంతోపాటు ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు తదితర అంశాలతోపాటు బోధన, అభ్యసన ప్రక్రియ మరింత మెరుగపడేలా రూపొం దించారు. శిశు వికాస దశలు, మానవ శరీర నిర్మాణం, గుండె నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా పాఠాలు పొందుపర్చారు. సాంఘికశాస్త్రంలో.. సాంఘికశాస్త్రం నాలుగు భాగాలు భూగోళం, చరిత్ర, పౌర, ఆర్థికశాస్త్రంగా ఉండేది. కొత్త సిలబస్‌లో వీటిని ఒక భాగంగా మార్చారు. వనరులు అభివృద్ధి-సమానత ఒక భాగంగా, స మకాలీన ప్రపంచం-భారతదేశం రెండో భాగంగా ఏర్పాటు చేశారు. బజారు, పంచాయతీ, పల్లెసీమల్లోని పొలాలు, వస్తు ప్రదర్శనలు తదితర అంశాలను తెలుసుకునేలా ఈ పుస్తకం ఉంది. విద్యార్థులకు సామాజిక స్పృహ కల్పించడమే కాకుండా వారి మేథోశక్తిని పెంపొందించేందుకు ఈ పుస్తకాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. -
పదో తరగతిలో ‘మాయాబజార్’పాఠం
పదవతరగతి కొత్త సిలబస్‌లో భారతీయ సినిమా విశేషాలను పాఠ్యాంశాలుగా చేర్చడం పలువురిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాయాబజార్ చిత్రం, సినీనటి సావిత్రి జీవిత విశేషాలను ఇంగ్లిషులో పాఠ్యాంశాలుగా పొందుపరిచారు. 2014-15 విద్యా సంవత్సరంలో అమలులోకి రానున్న నూతన సిలబస్‌లో భాగంగా కొత్త పాఠ్యపుస్తకాలను మల్టీకలర్ బొమ్మలతో ఆకర్షణీయంగా రూపొందించారు. తెలుగు పాఠ్యపుస్తకాన్ని ‘తెలుగుదివ్వెలు-2’పేరుతో ముద్రించారు. ఉపవాచకంలో రామాయాణాన్ని పాఠ్యాంశంగా చేర్చారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకు ఆరు కాండలపై ఇందులో వివరించారు. ఇంగ్లిషు పాఠ్యపుస్తకంలో భారతీయ సినిమాలను వివరించారు. వ్యక్తిత్వం పెంపు , హాస్యచతురత, హ్యుమన్ రిలేషన్, ఫిలిం అండ్ థియేటర్, బయోడైవర్శిటీ తదితర అంశాల్లో స్ఫూర్తినిచ్చే కథనాలతో పాటు పర్యావరణంపై కూడా దీనిలో చర్చించారు. జీవశాస్త్రంలో పాఠ్యాంశాన్ని చదవడం, చెప్పించడంతో పాటు ప్రయోగాలు, క్షేత్రపర్యటనలు తదితర అంశాలతో పాటు బోధన - అభ్యసన ప్రక్రియ మరింత మెరుగుపడేలా పాఠ్యాంశాలను రూపొందించారు. శిశువికాసం దశలు, మానవ శరీర నిర్మాణం, గుండె నిర్మాణం తదితర వాటిపై అవగాహన కల్పించే విధంగా పాఠాలను రూపొందించారు. సాంఘికశాస్త్రం గతంలో నాలుగు విభాగాలు భూగోళం, చరిత్ర, పౌర, అర్థశాస్త్రాలుగా ఉండేది. కొత్త సిలబస్‌లో వీటిని ఒకే విభాగంగా మార్చారు. వనరుల అభివృద్ధి -సమానత ఒక భాగంగా, సమకాలీన ప్రపంచం-భారతదేశం రెండోభాగంగా ఏర్పాటు చేశారు. బజారు, పంచాయతీ, పల్లెసీమల్లోని పొలాలు, వస్తు ప్రదర్శనలు తదితర వాటిని తెలుసుకునేలా ఈ పుస్తకం ఉంది. విద్యార్థులు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ పాఠ్యపుస్తకాలు దోహదం చేస్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.