వైఎస్సార్ జిల్లా (మైదుకూరు): మాయాబజార్ సినిమాలో ‘వివాహ భోజనంబు’ అంటూ ఘటోత్కచుడు వివిధ రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తాడనేది చూసే ఉంటారు. పెద్ద పెద్ద ఇత్తడి పాత్రల్లో పాయసాలు, లడ్డూలు, పులిహోర, అప్పలు.. దప్పలాలు కనిపిస్తాయి. భోజనం సంగతి సరే.. అంత పెద్ద వంట పాత్రలు ఎక్కడివి అని ప్రశ్నించుకుంటే.. ఇత్తడి కళాకారులు వాటిని తయారు చేస్తారు. మన రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో అలాంటి ఇత్తడి వస్తువులు తయారు చేసే కళాకారులున్నారు.
వందల ఏళ్ల కిందట నుంచే వనిపెంటలో ఇంటికి కావాల్సిన వంట పాత్రలు, దేవాలయాలకు అవసరమైన దేవతా విగ్రహాలు, గంటలు, గోపుర కలశాలను తయారు చేస్తున్నారు. అప్పట్లో వివాహాల్లో, అన్నదాన కార్యక్రమాల్లో ఇత్తడి పాత్రలు అవసరమయ్యేవి. వీటిని వనిపెంటలోని అన్ని కులాల వారు తయారు చేసేవారు. ఇత్తడి వస్తువులు తయారు చేసే 200 కుటుంబాల వారు అప్పట్లో ఉండేవారు. రానురాను కాలం మారిపోయింది. ఆచార వ్యవహారాలు సన్నగిల్లాయి. ఇత్తడి పాత్రల వాడకం తగ్గిపోయింది.
స్టీలు పాత్రల రాకతో ఇత్తడి పాత్రలు అటకెక్కాయి. ఇప్పుడైతే ప్లాస్టిక్ రాజ్యమేలుతోంది. పెళ్లిళ్లలో ప్లాస్టిక్ పళ్లేలు, గ్లాసులు, డెకరేషన్ పువ్వులు కనిపిస్తున్నాయి. ఇత్తడి కళాకారులకు పనితగ్గిపోయింది. కొందరు పొట్టచేతబట్టుకొని వలసలకు వెళ్లిపోయారు. గ్రామంలో ఉన్న కొద్ది మంది కళాకారులు దేవాలయాలకు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు తీసుకొని తయారు చేస్తున్నారు. వైఎస్ చేయూత వనిపెంటలో దాదాపు కనుమరుగయ్యే పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వనిపెంట ఇత్తడి కళాకారులకు చేయూతనిచ్చారు.
ఆయన ముఖ్యమంత్రి కాగానే 2005లో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ డిజైనర్లతో వనిపెంట ఇత్తడి కళాకారులకు శిక్షణ ఇప్పించారు. మారుతున్న కాలానికి ప్రజల అభిరుచి మేరకు ఇత్తడి వస్తువులను కొత్తరీతిలో తయారు చేయడంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం వస్తువుల తయారీకి తగిన వసతులుండాలన్న తలంపుతో వైఎస్ వనిపెంటలో ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.
కేంద్ర జౌళి, హస్తకళల అభివృద్ధి శాఖ నిధులతో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో 2008లో మౌలిక వసతుల కేంద్రం నిర్మాణం ప్రారంభమైంది. సుమారు రూ. 60లక్షల వ్యయంతో ఈ కేంద్రం 2012లో పూర్తయింది. ముడిసరుకు కొనుగోలుకు రుణాలు ఇప్పించమని కళాకారులు కోరినా, అధికారులు అలసత్వంతో ఇప్పటికీ వారికి ఎలాంటి రుణాలు అందలేదు. తయారు చేసిన వస్తువులను లేపాక్షి ఎంపోరియాల ద్వారా విక్రయించుకుందామన్నా వస్తువుల తయారీకి పెట్టుబడి లేక కళాకారులు ఊసురుమంటున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే జీవనోపాధితోపాటు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతి తెస్తామని కళాకారులు అంటున్నారు. ఆశతో ఉన్నాం. ఎప్పటికైనా ఇత్తడి వస్తువులకు గిరాకి పెరిగి తమకు చేతినిండా పని దొరుకుతుందని ఆశతో ఉన్నాం. కొద్ది రోజుల కిందట హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బడిగించల విజయలక్ష్మి గారు మౌలిక వసతుల కేంద్రాన్ని సందర్శించారు. కళాకారులను ప్రోత్సహించే విషయమై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ తమ తండ్రి లాగానే ఇత్తడి కళాకారులను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
– ఇస్మాయిల్, అధ్యక్షుడు, ఇత్తడి కళాకారుల అభివృద్ధి సంఘం, వనిపెంట, వైఎస్సార్ జిల్లా.
ఇత్తడి వృత్తిని వదిలిపెట్టలేకున్నాం.. ఇప్పుడు ఇత్తడి వస్తువులకు గిరాకి లేదు. అయినా మాకు తెలిసిన పని ఇదొక్కటే. అందువల్ల వదిలేయలేకున్నాం. దేవాలయాలు కట్టేవాళ్లు విగ్రహాలు, కలశాలు ఆర్డర్లు ఇస్తే తయారు చేసి ఇస్తున్నాం. ప్రభుత్వం ప్రోత్సహించి పెట్టుబడికి ఆర్థిక సాయం అందిస్తే మళ్లీ ఇత్తడి పరిశ్రమ పుంజు కుంటుంది.
– పూల రామసుబ్బయ్య, ఇత్తడి కళాకారుడు, వనిపెంట, వైఎస్సార్ జిల్లా.
చదవండి: కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బోటు యజమానులు
Comments
Please login to add a commentAdd a comment